రైతు సదస్సులో JPగారి ప్రసంగం

సిటి బాబుగా వ్యవసాయం గురించి నాకు తెలిసింది నాస్తి. టీ.విల్లో, దినపత్రికలలో రైతుల సాదక-బాధకాల గురించి విన్నపుడు 'ఓహో అలాగ' అనే బాపతు.....రిజర్వాయర్ నుండి ఖరీఫ్‌/రబీ పంట కోసం నీటిని విడుదల చేయాలని ఎవరనన్నా ఆందోళన చేస్తే అప్పటికి నడుస్తున్న నెలను చూసి  అప్పటికప్పుడు ఖరీఫ్ అంటే ఇప్పుడు వస్తుంది, రబీ అంటే ఈ కాలంలో ఉంటుంది అనే లెక్కలు వేసుకుంటాను. కాబట్టి ఈ టపాలో ప్రస్తావించే విషయాలు నా అభిప్రాయాలు మాత్రమే....అవగాహన లేకూండా మాట్లాడాను అనిపిస్తే  అనిపిస్తే పెద్ద మనసు చేసుకొని సరిదిద్దగలరు.

విజయవాడలో జరిగిన రైతు సదస్సులో జే.పి గారు చేసిన ప్రసంగం ఇక్కడ పెడుతున్నాను. టివి ఛానళ్లు ఇది ప్రసారం  చేసుండరనుకుంటా....వాళ్లకు అంత ఓపిక-తీరిక ఉండవుగా



2వ భాగం



3వ భాగం




ఆ ప్రసంగం విన్నాక నాకు కలిగిన  అభిప్రాయాలు స్థూలంగా ఇవి.

౧)వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయాన్ని బతికించుకోవడానికి పరితపించడం ఏమిటో......!! చూడబోతే తెలుగునేలలో ఉంటూ తెలుగును బ్రతికించుకొవడానికి చేస్తున్న ప్రయత్న ఉదంతంలా ఉంది. మన ఈ ప్రయత్నం చూసి ఆనందించాలో, 'బతికించుకొడానికి' చేస్తున్నాం కాబట్టి బాధపడాలో అర్ధం కావడంలేదు.

౨) వ్యవసాయ రంగం పట్ల రోజురోజుకి తగ్గుతున్న ఆసక్తి- పట్టణాల్లో పుట్టిపెరిగినవాళ్లు ఎలాగు నూటికి 99.9% వ్యవసాయం వైపు వెళ్లరు కాని గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం ఏమిటి!? కారణాలు విశ్లేషిస్తే  నాకు తోచినవి మౌలిక వసతులలేమి, వ్యవసాయన్ని లాభదాయక రంగంగా గుర్తించక నిర్లక్ష్యం చేయడం.

౩)మౌలిక వసతులు:  వ్యవసాయానికి అనుకూలం, రైతు బంధువులం అని చెప్పుకోగానే సరిపోదుగా అది మనుగడ సాగించేందుకు తగిన వనరులను కూడా సమకూర్ఛాలి. పంటకు సరిపడా నీరు, చేతికొచ్చాక  మార్కెట్‌కు తరలించడానికి మెరుగైన రవాణా వ్యవస్థ, నిల్వ చెసుకోడానికి గిడ్డంగులు కావాలి. ఇలా తక్కిన వాటిని వొదిలేసి రుణమాఫీలతో సరిపెట్టేస్తే ఎలా. వ్యవసాయం అనేకాదు ఇవాళ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవలసిన  అవసరం ఉంది. అది రవాణా కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ఆరోగ్య సంబంధితమైనది కావచ్చు , నీటి సదుపాయం కావచ్చు. కావలసింది వీటి అభివృద్ధి....ఇవి అయ్యాక వాటిపై కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చి  ఆర్ధిక రంగాన్ని ఎంత దూరమైనా పరిగెత్తించవచ్చు.

౪)  రైతులే తమ పంటకు ధరను నిర్ణయించుకోవాలి--- ఈ విషయంలో నాకు కొంత విభేదం ఉంది.  ఉత్పత్తిదారుడి చేత  ధర నిర్ణయింపబడిన వస్తువులు మనరోజువారి ఆహారంలో ఉండవు కదా. నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు...పప్పుదినుసుల ధరలపై నియంత్రణ లేకపోతే వాటి ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోతాయి. అలా చేసేదనికన్నా రైతే నేరుగా తన పంటను మార్కెట్‌లో అమ్మేట్టు, మధ్యలో ఉండే దళారీలను కట్టడిచేస్తే బాగుంటుంది.

౫) సుమారు 70%  నూనె సంబంధిత ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నామట. నోరువిప్పితే Energy Sustenance ( శక్తి స్వయంసమృద్ది (?) ) గురించి మాట్లాడే అమాత్యులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించుకోడానికి వీలున్న పామ్‌ఆయిల్, ఇథనాల్‌ను దేశియంగా ఉత్పత్తి  చేయడం గురించి ప్రణాళికలు రూపొందించరేం.....పెట్రోలియం ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించేందుకా. ఇంటర్మీడియట్‌లో ఉన్నపుడు చదువుకున్నా చెరకుపంటనుండి ఇథనాల్‌ను ఉత్పత్తి  చేయొచ్చనీ దాన్ని పెట్రోల్‌తో కలిపివాడితే సంప్రదాయ Fossil Fuel ( తెలుగు పదం ? ) వాడకం తగ్గించవచ్చనీ.....ఇంకా ఆ దిశగా ఏమి చేసినట్టులేదు !!




జేపి గారు తాడేపల్లిగూడెం రైతు సదస్సులో చేసిన ప్రసంగం ఇక్కడ చూడొచ్చు


7999 -> 8000....బ్లాగు పండగ

ఈమధ్య అందరూ మహబాగా మురిసిపోతున్నారు...ఎందుకటా..? వాళ్ల బ్లాగు పుట్టినరోజట. ఓహో అలాగా....బాగు బాగు. మరి పుట్టినరోజన్నాక విషెస్ చెప్తాం కదా...నేను కూడా రాముడు మంచి బాలుడు టైపులో శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్తున్నాను.

ఉన్నట్టుండి ఏమైందో...నా బ్లాగు అలిగి కూర్చుంది. అరే ఇప్పుడేమైందని మూతి ముడుచుకొని కూర్చున్నావ్ ఎందుకు అలిగావ్ అని అడిగా. " అసల్ నీకు బుద్దుందా వయ....బ్లాగుబెట్టి నీ ముచ్చట నిదేగాని నా గురించి ఒక్కరోజైన పట్టించుకుంటివా...సూర్యగ్రహణానికోసారి రాశే నీ ఇంగిలిపీసు బ్లాగుకి ఎప్పుడో బొడ బొచ్చె ఓ వంద మంది వచ్చిండ్రని మస్తు గారాలు బొయినవ్...ధూం ధాం జేశ్నవ్. నేనేమన్న తక్వ జేశ్ననా నీకు. అసల్ ఇయ్యాల గిట్ల నువ్వు ఈ బ్లాగులు రాశే ఓ పదిమందికైన ఎర్కఉన్నవంటె అది నాతోని అయిందికాదు.....? మల్ల నాకేం జేశ్నంవయా నువ్వు? ఓ పుట్టినరోజు లేదు, సదివెటోళ్ళు 'ఈరోజు' ఎక్వ వచ్చిండ్రు అని శెప్పిందిలేదు నేను మాత్రం నువ్వు అన్నట్టల్ల ఆడాలే తాన అంటే తందాన అన్నట్లు.....ఛల్ హట్" అనేసి చేతులు కట్టుకొని కోపంగా నావైపు చూస్తుంది. ఇప్పుడు ఈ కొత్త గోలేంట్రా బాబు, ఉన్న తిప్పలు చాలవన్నట్టు అనుకొని 'ఇంద్రధనస్సు'ని ఎలా శాంతింపజేయాలా, ఏంచేసి బుజ్జగించాలా అని అలోచిస్తూ ఉన్నా....అప్పుడే ఓ అనుకోని సంఘటన జరిగింది.
బ్లాగు హిట్ కౌంటరు 7999 నుండి 8000 చేరుకుంది. ఇది చాలు నా ప్రియమైన బ్లాగుకు నేను అభినందనలు తెలపడానికి.

Congratulations ఇంద్రధనస్సు....

ఈరోజు Renton, Washington DC నుండి Windows 7 లో IE8 నుండి నా బ్లాగును చూసి 8000వ హిట్ ఇచ్చిన రీడర్‌ గారు...మీకు ధన్యవాదాలు :) :)

అలోచించిగా ఆలోచించగా ఇంకో తమాషా సంగతి తట్టింది. ఇన్నేళ్ల (ఛా...ఎన్నో యేళ్ళుగా ఐనట్టు పొజొకటి) బ్లాగు జీవితంలో నేను చూసిన అత్యధిక సున్నాల రికార్డ్ ఇది....అయిదు సున్నాలున్నాయి మరి 8000 లో. 'కళ్ళు గాని దొబ్బాయా...ముడు సున్నాలేగా ఉన్నాయ్' అని లాజిక్కులు లాగొద్దు నా లాజిక్ నాది. నిజంగా అయిదు సున్నాల హిట్ రావాలంటే అంటే లక్ష హిట్లు (మనసులోంచి బ్లాగారాం గాడు : లక్ష హిట్లా...ఏది ఓసారి ఫేస్ టర్నంగ్ ఇచ్చుకోరా నువ్వు....కామెడిలు చేస్తే అతికినట్లుండాల్రా... యెదవ) రాలాలి....నా వల్లయ్యేనా..!!

ఇంకో విష్యం, ఒక సైన్సు మనిషిగా (అంటే non-art field లో ఉన్నవాడిగా స్వామి..) లెక్కలు వేస్తే వచ్చినది...ఇందాక ఐదు సున్నాలున్నాయని అన్నానుకదా...

(0! + 0! +0!)! + (0!+0!) = 8;

(0! +0!)^ (0!+0!+0!)= 8;

(maths బ్యాక్‌గ్రౌండ్ లేనివారి కోసం, 0!=1, 1! =1, 2!=2,3!=6 )

అబ్బో, నాలో కూడా ఓ సంఖ్యా శాస్త్రవేత్త ఉన్నడన్న మాట..గుడ్ గుడ్.





బ్లాగు వార్షికోత్సవాలు జరుపుకునేవారికి అభినందనలు...వారి బ్లాగుకు శుభాకాంక్షలు. Have fun





మరిక సెలవు....

వింటున్నా...

నీ సంతోషాన్ని నాతో పంచుకో
నువ్వు మురిసిపోయేందుకు పసిపాపనై కేరింతలు కొడతా.

నీ బాధను నాతో పంచుకో
అలసిన నీ మనసు సేదదీరేందుకు నా గుండెలనిస్తా.

ఒకవేళ పంచుకున్నాక నే స్పందించకుంటే
తప్పుగా భావించకు నేస్తం.
నేను నిను వింటునేవున్నా- నేను మనఃపూర్తిగా చేయగలిగినదది

***************************************************

ఆంగ్లంలో రాసిన మాతృక

Share with me your happiness
and i will rejoice like a child, gleaming,
to help you remember YOUR moment.

Share with me your grief
and you have my shoulder
to rest your troubled heart.

And one day when you express it
and i don't respond...don't take me bad, O dear,
i am listening to U-the best one i can do.

సంగ్రహణ-అమ్మ భాషకు జేజేలు

http://karlapalem-hanumantharao.blogspot.com/2010/10/blog-post_20.html


http://karlapalem-hanumantharao.blogspot.com/2010/10/blog-post_21.html


హనుమంతరావు గారు అద్భుతంగా రాసారు....కాదు కాదు కళ్ళకుకట్టినట్టు చూపించారు విషయాన్ని.

ఓపిక చేసుకొని చదవండి...వీలైతే సాటి తెలుగువారితో చదివించండి.


ఓ మాట:  సంతకం అంటే మన పేరుకి మనం ఇచ్చుకునే ఒక సంజ్ఞ కదా.....మరి ఆ సంజ్ఞను ఇంగ్లీషులోనే రాయాలని ఎక్కడాలేదు కదా....కాని ఇంతవరకు తెలుగులో సంతకం చేసినవారు ఎంతమంది? అసలు తెలుగులో సంతకం చేయొచ్చు అని బడిలో ఎందుకు చెప్పలేదూ? హ్మ్...ఈ అనుమానం అప్పుడు వచ్చినా బాగుండేది....!!

From home with love...

క్యాప్షను: ఇవి కొంచెం హాట్ గురూ.....


ఏందట్ల జూస్తున్నరు.......ఫొటొ ఏందనా...? ఇయ్యి ఇంటినుండి  ఇయాల్నె ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ల ఒచ్చిన దసరా వంటలు. పైనుండి గడియారం ముల్లు తిరిగే పద్దతిల ( clock wise direction స్వామి) మురుకులు, గర్జలు, అప్పాలు. మరిగ మీతాన ఈటిని ఏమంటరో నాకు తెల్వది (కింద కామెంట్ డబ్భా ఒకటి ఉంటది అన్ల చెప్పుండ్రి ఏమంటరో ) .....కరప్పూసలు అంటే మురుకులు అన్‌కుంటున్న కరెక్టేనా?

ఈటితోని  సున్నుండలు ఒచ్చుండాలిగాని మిస్ ఐనై....కొడకో జర బరువు పెంచు అని అమ్మ నాయ్న సున్నుండలు పంపిస్తా అన్నరుగాని పంపియ్యలే...యాద్ మర్శినట్లున్నరు. వచ్చేంతశేపు ఒకటే భయం ఉండే...ఒచ్చినంక ఇయన్నీ జాతీయం ఐపోతయేమోనని, అంటే హాస్ట్‌ల్‌ల ఉంటున్నంగదా మన సొమ్ము దోస్తుల సొమ్ము అన్నట్టు దోస్తుల సొమ్ము మన సొమ్ము అన్నట్టు. కాని ఆళ్లుగూడ సంచులు సంచులు తెచ్చుకున్నరు.....నయంగాదు, కొన్ని దినాలదాంకనైన ఇవి భద్రంగుంటయ్.....


బరువు అంటే గుర్తొచ్చింది‌...ఇయ్యాల్రేపు మొగోళ్లను, ఆడోళ్లను ఏం అడగొద్దో ఏం అడగాలో సమజైతలేదు. ఒకళ్లేమో " మగాడి హైటు ఆడాళ్ల వెయిటు (బరువు) అడగొద్దు" అంటరు.....ఇంకోళ్లెమో " ఆడోళ్ళ యేజు (వయసు) మగోళ్ల వేజు (సంపాదన) అడగొద్దు" అంటరు. అంటే ఆడోళ్లను హైటు అడగొచ్చు, సంపాదన అడగొచ్చు అనా ? శానా confusing ఐతుందనుకో...అరే తెల్వక అడుగుతా ఆడోళ్లని హైటు ఎందుకు అడుగుతం బై, ఏం అవసరం దాంతోని? ఆళ్లపక్కన నిలబడితే అందాజాగా చెప్పలేమా ఎంత హైటుంటరో !! పోని సంపాదన ఎంత అని అడిగితెనేమో యేడ ఆడ స్త్రీ లేడి మహిళా సంఘాలు దాడి జేస్తయేమోనని భయం......ఇగ నాకు సమజైందేందంటే ఆడోళ్లను ఏం అడగొద్దన్నట్లు....... ఆళ్లు అడిగితె మాత్రం మనం జెప్పాలె :(

ఇగ ఇయ్యాల్రేపు  మొగోళ్ళెమో అడగక పోయినా ’ఇంత బరువు తగ్గిన’, 'అంత బరువు పెరిగిన' అంటున్రు....యేజ్ అడుగుదామంటే ప్రతొక్కడు నెత్తికి రంగేసుకుంటుండాయే.....ఇంగేమడగాలే....

గిట్లనే ఓపాలి కాలేజ్‌ల ఉన్నప్పుడు రక్తదానం జరిగినుండే...ఆ టైంల మా సీనియర్లు ఓతాన కూసొని ముచ్చట బెడుతుంటే ఆళ్ల దగ్గర్కుబోయి అందరు చేశిండ్రుగదా అని అడిగిన....ఆ చేశ్నం అనిచెప్పి ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పిండ్రు. నేనూకొవచ్చుగదా...లే... ఆమెని ’ఎందుకు చేయ్యలే’ అని అడిగిన. ’ఉండాల్సిన బరువు లేను ’అన్నది. కనీసం ఇప్పుడైన నోర్మూసుకోవచ్చుగద నేను...ఉహు...మనకేమో పైన జెప్పిన మాటలు తెల్వవాయే...ఎమ్మటే " ఏం XY కేజీలు గూడలేవా?" అన్న.
బస్, అంతే బై....గప్పుడు ఆ అమ్మాయి, ఆళ్ల ఆడ దోస్తులు ఓ సూపు జూశిండ్రు జూడు ...( మగ సీనియర్లేమో శిన్నగ నవ్వుతుండ్రు)  అబ్బో శెప్పేడ్ది కాదు అది. ’షటప్ ’ అనిగూడ అన్నదిమల్ల.....అప్పడికి వాళ్లు మాకుగుడ్క దోస్తులనుకో అదివేరే  ముచ్చట. ఇదే scene ఇంకెవళ్లతోనన్న ఐతే నా ఇజ్జత్  యేమయ్యేడ్దో!!!!

పని ముచ్చట్ల బడి ఇటువైపు (బ్లాగులు) సూస్తలేను......ఫాలో అయ్యే బ్లాగులు సదివి కామెంట్లను వాయిదాల పద్దతిన ఇచ్చుకుంట...ఉంట మల్ల

జైహింద్‌

TiE ISB connect 2009

http://striders-way.blogspot.com/2010/10/tie-isb-connect-2009.html

జే.పి గారి, నటుడు సిద్ధార్ద్ విడియో తప్పక చూడండి

విజేత
















































 (పెద్దగా చూడడానికి బొమ్మపైన క్లిక్ చేయండి)

కామన్‌వెల్త్‌ క్రీడలు మొదలయ్యేముందు ప్రముఖ మాజి అథ్లెట్ మిల్కాసింగ్ మనవాళ్లు అథ్లెటిక్స్ల్‌లో పతకాలు గెలవలేరు అన్నాడట....దాన్ని పటాపంచలు చేస్తూ‌ డిస్కస్‌త్రోలో మహిళల విభాగంలో మనవాళ్ళు ఏకంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కృష్ణపూనియా(స్వర్ణం), హర్వంత్ కౌర్ (రజతం), సీమా అంటిల్ (కాంస్యం) చేజిక్కించుకున్నారు. కాంస్య పతకం సాధించిన సీమా చివర్లో "ఈ పతకం తప్పక మిల్కాసింగ్‌గారికి చూపించాలి " అన్నది.

మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.

కోర్టులు, తీర్పులు, మన్నూ, మశానం

వివాదాస్పదమైన బాబ్రికేసులో అలహాబాదు హైకోర్టు తన తీర్పును ఇంకో పదిరోజుల్లో వెలువరించనుంది అనగా భారత ప్రభుత్వం తీర్పు వల్ల  అవాంఛనీయ ఘటనలు జరగొచ్చునేమోనని ఊహించి తీర్పు వెలువరించే రెండురోజుల ముందునుండి  ప్రసార మాధ్యమాలలో మసీదు పడగొట్టేప్పడి క్లిప్పింగులు పదే పదే చూపించడంగాని, తీర్పుపై ఊహాగానాలుగాని, రాబోయే తీర్పుపై  చర్చలుగానీ చేయరాదనిమార్గదర్శకాలు జారి చేసింది.సెల్‌ఫోనుల నుండి ఒక వర్గాన్ని ఎంచుకొని SMS పంపించవద్దని కొన్ని చోట్ల పోలీసు శాఖవారుకూడా  సూచించారు.  హ్మ్....జనం బాగోగులు బాగా చూసుకునే మన మీడియా రెండురోజుల ముందునుండి నిషేదించారుగాని అంతకు ముందునుండి కాదు అనే పాయింటు బాగా ఒంటబట్టించుకొని వో....... చర్చలు విశ్లేషణలూ అభిప్రాయ సేకరణ అంటూ పోల్సు వగైరా వగైరా అన్నీ కావాల్సినంత చేశారు. ఇహ ఆ చర్చలు, సేకరణలో వాళ్ల మతలబు ఏంటొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "తీర్పు మీకు అనుకూలంగా రాకుంటే మీరు ఏం చేస్తారు?", " రాముడికి/మసీదుకు ఆ స్థలం ఇవ్వకుంటే మీవాళ్ళు ఏం చేయాలి అంటారు..", "...అంటే ఏరకమైన ఆందోళన చేయాలనుకుంటున్నారు.." ఇలా ఉంటాయి చాలా చర్చలు. దేశప్రజలకు ప్రతి విషయాన్ని తెలియపరచాలని, అంతవరకు తెలియనొడికి కూడా కొత్త కోణాలు చూపించాలని వీళ్లు చేసే ప్రయత్నం చూసి నాకు ఆనందభాష్పాలు టప టపా రాలాయి.

ఈ విశ్లేషణలు బ్లాగులకు కుడా తగులుకున్నాయి....నేను చూసిన కొన్ని బ్లాగుల్లో పోల్స్, గ్రహాలు ఉపగ్రహాలు అంటూ ఊహాగానాలు జరిగాయి. సరే....., ముఖ్యమైన అంశం కాబట్టి, వద్దన్న పని చేయడం మన నైజం కాబట్టి చేశారనుకున్నా. తీర్పు వచ్చింది, ఆషాడభూతులు అనుకున్నట్టు ఏ అవాంఛనీయ ఘటనలు, ప్రదర్శనలు, దాడులు జరగలేదు. చాలామంది మేధావులు (నిజ, కామెడి, కుహనా లాంటి అన్ని విధములవారు) అనుకున్నట్టు   తీర్పు ఏకపక్షంగా కాకుండా రాజీకుదర్చడానికన్నట్టు మధ్యేమార్గంగా స్థలాన్ని మూడుభాగాలుగా పంచింది. దీనివల్ల జనం ఏమి అనుకోలేదు...పాపం మనసోకాల్డ్ నాయకులు, మేధావులే వో ఇబ్బందడిపోయారు. "అసలు నమ్మకాల ఆధారంగా తీర్పులెలా ఇస్తారు?", "ఒకే దగ్గర మందిరం మసీదు ఎలా కడతారు?", " కడితే  గొడవలురాకుండా ఉంటాయా...!", " మామాటే నెగ్గింది...మేమన్నది నిజం అని తేలింది", " వాళ్ళు త్యాగం చేయాలి....మొత్తం మాకు ఇచ్చేయాలి" అని ఏవేవో అన్నారు అంటున్నారు. నాకర్ధం కానిది ఏంటంటే ఏ సినిమాలోనో, కధలోనో హిందూ-ముస్లిములు కలిసున్నారు అని చదివితేనో....నిన్న మొన్నటిదాకా వివాదాస్పద స్థలంలో మందిరం-మసీదు రెండూ కడదాం అని ప్రతిపాదనలొచ్చినపుడు ఇదీ మన భారతీయత అని కాలర్‌ ఎగరేసుకుంటూ చెప్పినోళ్లకు ఇప్పుడెందుకు ఇది మింగుడుపడటంలేదు, హిందూ ముస్లిం భాయి భాయి   అని మనం నిజంగా నమ్ముతున్నామా లేదా అని. ఎవరో ఎందుకు త్యాగం చేయాలి? కలిసి ఉండనివ్వాలి అని నమ్మకాల ఆధారంగా చెబితే ఏం తప్పు ఉంది అందులో? పోనీ నిజంగానే మసీదు మందిరం పక్కపక్కనే ఉంటే ఇబ్బాందనుకుంటున్నారా ? బాబులు...సమస్యాత్మక ప్రాంతం అని అనుకునే మా హైదరాబాదులో, మా ఏరియాలో నాకు తెలిసిన గత పధ్నాలుగేళ్ళుగా మసీదు మందిరం పక్కపక్కనే  ఉన్నా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాము...ఒకసారి  అక్కడకుడా కట్టిచూడండి. తప్పక కలిసుంటారు.


సరైన న్యాయం దక్కలేదని, కొందరిని బుజ్జగించాలని చేస్తున్న ప్రయత్నమని ఇదై ఫీలైపోతున్నవారు రెండుమూడు రోజుల తేడా వ్యవధిలో వచ్చిన ఆయేషా మీరా కేసు తీర్పు గురించి మాట్లాడరెందొకో. ఓ కట్టడంమొక్క చరిత్ర ,తీర్పు భవిష్యత్తూ గట్రా నిశితంగా పరిశీలించేవారు, ఔత్సాహికులు ఆయేషామీరా లాంటి కేసులగురించి మాట్లాదరెందుకో...!!?? ఏం మాట్లాడినా మనల్ని పట్టించుకునేవాడుండనా !!


గమనిక: ఇది లోకం తీరుతెన్నులు తెలియని,  వచ్చిన తీర్పు జనాలబాగుకోరి ఇచ్చినది అని నమ్మే ఒక అజ్ఞాని ఏడుపు. మీకు ఈ ఏడుపులో నిజాయితి, న్యాయం, ధర్మం కనబడితే ఓ గుడ్డముక్క మొహానవేసి వెళ్లండి,తుడుచుకోడానికి పనికొస్తుంది, వీలైతే నాతో కలిసి ఏడవండి. ఏది కనబడక నచ్చకపోతే మీ ఇష్టం.., మీదారిన మీరుపోండి......I don't care.....

ShareThis