మేరా భారత్ మహాన్

భారత ప్రభుత్వంవారికి,
అయ్యా  ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేయడానికి నాకు నోటమాట కరువౌతోంది. మొన్నీమధ్యనే జరిగిన ముంబాయి పేలుళ్లను మరవకముందే రక్తసిక్త చేతులతో పట్టుబడ్డ కసబ్‌గారు అథిదిగృహం లాంటి జైలులో పట్టుమని ఓ పదికేజీల బరువు పెరగకుండానే మళ్ళి పేలుళ్లు జరిగాయంట!  సంతోషం. నావొళ్లు పులకించిపోయింది. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా భావించే ఉగ్రవాదులకు మన రక్ష్యణా వ్యవస్థ, గూఢచర్య వ్యవస్థ మరీ తిసికట్టుగా తయారైయ్యేట్టు చేసినందుకు మీకు శతకోటి వందనాలు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌ను, రె‌డ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కసబ్‌ను భవిష్యత్తులో పట్టుబడబోయే మరేయితర ఉగ్రవాదినో సిగ్గు-శరం లేకుండా ఉంటూ ఏమి చేయలేని మీ రాజనిరతికి నా జోహార్లు. ఇవాల్టి ఈ పనికి పైలోకంలోని వందలాది ఉన్నికృష్ణన్లు, కామ్టేలు, కర్కరేలు ఆనందభాష్పాలు రాలుస్తుంటారు. మీకు హ్యాట్సాఫ్.


ఏదేమైనా సారూ మనకి ఈసారి కూడా అదృష్టం కలిసిరావాలని కోరుకుందాం. ఏ రాముగాడో, సోమూగాడో సంఘటనా స్థలానికి వెళ్ళేలా చేద్దాం. 
వాడిచేత ఓ బ్రహ్మాండమైన సినిమా తీయిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం పై మనం జరిపే పోరుకు అందరూ మద్దతివ్వాలని కోరుకుందాం. సొల్లు కబుర్లు చెప్పుకోడానికి వీలయ్యే దైపాక్షిక చర్చలకు సానుకూల వాతావరణం కలగాలని కోరుకుందాం. ఎంచక్కా మన మంత్ర్లులు వాళ్ల అనుచరగణం టీవీల్లో, పేపర్లలో దర్జాగా పబ్లిసిటీ ఇప్పించుకోవచ్చు. నా భ్రమగాని ఈ పాటికే మీ మేనిఫెస్టో లోని సగటు మనిషి/ ఆమ్ ఆద్మీ/common man ఈ బాధ్యత తీసుకొని ఉంటాడు. రేప్పోద్దున చూడండి ఏ భయం లేకుండా ముంబాయ్ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తాడు. ఛాయ్ బండ్ల దగ్గర సమోసాలు తింటాడు. ఉగ్రవాదులకు మేము భయపడము అని వార్తా ఛానల్లు ఊదరగొట్టుకునేలా చేస్తాడు. ఆ పేరుతో మనందరం చంకలు గుద్దుకొవచ్చు. ఆ పిచ్చి ఛానళ్లకు అసలు సంగతి తెలీదు, పనికెళ్లకపోతే తిండి దొరక్క చస్తాడు ఆ సగటు మనిషి. దానికన్నా బాంబులు ఉంటాయో ఉండవో అని 
అనుమానపడుతూ, తననుతాను సంబాలించుకుంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. సగటు మనిషికి అలాంటి మహర్ధశ పట్టించిన మీకు ఎన్ని కితాబులిచ్చినా తక్కువే.

కొన్ని రోజులపాటు న్యూస్‌పేపర్లు, టీ.వీ ఛానళ్లు మీమీద బురద జల్లుతాయి. పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, సరిపడ నిధులు  ఇవ్వలేదని. మీరేమి వాటిని చెవికెక్కించుకోవద్దు. పోలీసులను నేతల ఇళ్లదగ్గర, సమావేశాల దగ్గ్రర  కాపలా కుక్కల్లా పెట్టేసుకోండి. ఎదురు మాట్లాడినవాడి పీక నొక్కడానికి వాడండి. ప్రతిపక్షం గతజన్మలో చేసిన అవినీతితి గురించి, తప్పొప్పుల గురించి యేళ్లతరబడి ఉపన్యాసాలు దంచండి. ఎవరైనా ఓ ఇంటిపై దాడిచేస్తే, ఆ ఇంట్లో మగాడు ఏం చేయలేకపోతే వాడికి గాజులు తొడిగి మూల కూర్చోబెడతారు. మీమీద ఉన్న అమితమైన వాత్సల్యం, అభిమానం, ప్రేమ కొద్ది మేమా పనులు ససేమీరా చేయం. దర్జాగా ఏలుకోండి, మమ్మల్ని దోచుకోండి. ఇలాంటి దాడులు జరిగినపుడు ఏవో పదో పరకో ప్రాణాలు పోతాయ్. వెధవది గాల్లో దీపాల్లాంటివి ఆమ్ ఆద్మీ ప్రాణాలు మీరు దేశానికి చేయబోయే విశాల ప్రయోజనాలకంటే ఎక్కువకావు. నిస్సిగ్గుగా ఉండండి. మీరు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం.

మేరా భారత్ మహాన్. మేరా నేతా మహాన్.

PS: అయ్యా ఉగ్రవాదులూ తమరు ఎంతో కష్టనష్టాలొనర్చి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి చిన్నచిన్న బాంబులు పెడుతున్నారు. ఇకపై అంత కష్టం తీసుకోకండి. ఎక్కడ దాడి చేయనున్నారో నేరుగా మా ప్రభుత్వానికే తెలియజేయండి. మీకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒకవేళ పోలీసులో కమేండోలో అనవసర సాహసం చేసి పట్టుకుందనుకోండి మీరు ఈ దేశానికి చేసిన మహత్తర సేవకుగాను మీకు దేశంలో ఎవరికీలేని రక్షణమధ్య రాజమర్యాదలు ఉంటాయి. ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాకపోతే ఒక్క విన్నపం, దేశ రక్షణ అంటే పవిత్రమైన పని అని ప్రాణాలిచ్చైనా దీని సార్వభౌమత్వాన్ని కాపాడాలని సరిహద్దులోని మా వెర్రి సిపాయిలు, పోలీసుల్లో కొందరు అమాయకులు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చే సమయంలో మా గవర్నమెంటువారికి ఆ సిపాయిలను, పోలీసులను కాసేపు తప్పించమని చెప్పండి. పాపం వారు మధనపడకుండా ఉంటారు. ఎప్పటిలాగే మేము మీ రాకకై ఎదురుచూస్తూ, మీ చేతుల్లో ప్రాణాలొదలడానికి సిద్దంగా ఉంటాం

ఇట్లు,
సగటు మనిషి.

Writer లక్షణాలు

 'The Alchemist', 'The Pilgrimage' వంటి ప్రపంచ ప్రసిద్ద నవలలు రాసిన బ్రెజిల్ రచయిత, ఆథ్యాత్మికవేత్త Paulo Coelho తన  పదిహేనవయేట తన తల్లితో తాను పెద్దయ్యాక రచయితను అవ్వాలనుకుంటున్నానని చెప్పాడట. అపుడు వాళ్లమ్మగారు ' మీ అంకుల్ ఓ డాక్టురు, కావాలంటే నువ్వు కూడా ఏ ఇంజనీరో అయ్యి ఖాళీ సమయాల్లో రాయొచ్చు. పైగా అసలు writer (రచయిత/రచయిత్రి) అంటే ఏంటో నీకు ఖచ్చితంగా తెలుసా?'ని  అడిగిందంట. దానికి సమాధానంగా ఖాళీ సమయాల్లో పుస్తకాలు రాసే రచయిత కాకుండా పూర్తిస్థాయి రచయిత కావాలనుకుంటున్నాను అని చెప్పేసి రచయిత అంటే ఎవరు, ఏమిటి అని కొన్నాళ్లపాటు పరిశోధన చేసాడు. వాటిని తన అమ్మగారికి చెప్పేసేసి అటుతరువాత ఎలాగో అలా ప్రసిద్ద రచయిత అయ్యాడనుకోండి. ఐతే తాను రచయిత/రచయిత్రి ల పై జరిపిన పరిశోధనల తాలుకు ముఖ్యవిషయాలను తన పుస్తకం 'Like the Flowing River'  'ముందుమాట'లో చెప్పాడు. అవి మీతో పంచుకుందామని ఈ పోస్టు....

౧)రచయిత అనేవాడు ఎల్లప్పుడు కళ్లజోడు పెట్టుకొని, తల దువ్వుకోకుండా ఉంటాడు.
ఏంటీ...మీకు కళ్లజోడు లేదా, రచయితలం కాలేమూ అంటారా! మరీ ఇలా డీలా పడిపోతే ఎలాగండీ. కావాలంటే అప్పుడప్పుడు రౌడిగారిలా దర్శనమివ్వండి. వీలుపడితే మా నేస్తం అక్క చెప్పినట్టు ఏసీ లో కూడా చలువ కళ్లద్దాలు వేసుకోండి.


౨) రచయిత దాదాపు ఎవరిమీదనో కోపంగానో లేకపోతే బాధపడుతూనో ఉంటాడు. ఏదన్నా మాట్లాడితే బాగా లోతుగా మాట్లాడతాడు. తను ఈమధ్యే ప్రచురించిన పుస్తకాన్ని ఏవగించుకుంటూనే తన తదుపరి పుస్తకం కోసం అమోఘమైన ఆలోచన ఉందని ఫీలవుతుంటాడు.


౩)సమాజం పట్ల తనకు ఓ మహత్తర బాధ్యత ఉన్నదని అది నెరవేర్చడం తన కర్తవ్యమనీ, ఈ నిజాన్ని తన తరం వారెవరూ గ్రహించలేరని, తనను అర్ధం చేసుకోలేరని అనుకుంటాడు. ఒకవేళ అర్ధం చేసుకుంటే తాను మేధావి అనిపించుకొవడం కుదరదనుకుంటాడు.


౪) మామూలు జనం మాట్లాడే భాషను రచయిత వాడడు. సగటు మనిషి ఓ 3000 పదాలు వాడితే రచయిత పదకోశం లోని మిగతా పదాలన్నీ వాడతాడు. ఎందుకంటే తాను సగటు మనిషికాదు.


౫)కేవలం ఇతర రచయితలే తనను అర్ధం చేసుకోగలరు అనుకొంటాడు. అనుకుంటునే మనసులో ఇతర రచయితలను ఏవగించుకుంటాడు,  most complicated book రాసిన రచయితగా పేరుతెచ్చుకొవడానికి పోటిగా ఉన్నారని.


౬) ఎవరినన్నా ఉలిక్కిపడేలా చేయలనుకున్నపుడు 'ఐన్‌స్టీన్ ఒక వెధవ' అనో 'టాల్‌స్టాయ్ ఓ బూర్జువా' అనొ అంటాడు.


౭) ఆడవాళ్లను ఇంప్రెస్ చేయడానికి తాను ఓ రచయితనని చెప్పి అక్కడికక్కడ కంటికి కనిపించిన ఓ కాగితం ముక్కమీదో, రుమాలు మీదో ఓ కవిత రాస్తాడు.


౮)తన మిత్రులదో, ఇతర కవుల/రచయితల పుస్తకాలకు సమీక్ష రాయాల్సొచ్చినపుడు "అసలీయనగారు పుస్తకం చదివారా లేదా?" అనే అనుమానం వచ్చేట్టుగా 'జీవితపు ద్వైదీభానల సమ్మేళనం' వంటి పెద్ద పెద్ద పద ప్రయోగాలు చేస్తాడు.


౯) తమరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు అని అడిగినపుడు ఎవరూ పేరు కూడా వినుండని ఏదో పుస్తకం పెరు చెప్తాడు.





అలా పరిశోసధించేసి వాళ్లమ్మగారికి చెప్తాడు. దానికి ఆవిడేమంది, ఈయనేం చేసారనేది మీరే కనుక్కొండి. మందుమాటలో చెప్పాడు కాబట్టి brief గానే ఉంటుంది. మిగతా పుస్తకమంతా ఆయన వివిధ వార్తపత్రికలలో ప్రచురించిన కథలు, వ్యాసాల సంకలనం. Coelho రచనల్లో చాలామటుకు mysticism ఉంటుంది మానవ జన్మకు ఓ పరమార్ధం ఉందని, పుట్టిన ప్రతి మనిషి అది నెరవేర్చడానికి పునుకొవాలని అందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇలాంటివాటిపై నమ్మకం ఉంది-లేదు అని పక్కనపెడితే కార్యసాధనకు కావాల్సిన బోలెడు విషయాలు ఆయన రచనల్లో వెతుకోవచ్చు.

ఖేల్ ఖతం దుక్నం బంద్

హ్మ్....రెండేళ్ల క్రితం తడబడుతూ భయపడుతూ మొదలైన పయనం, కనీసం నా అనుకోలులో, మూడు కెవ్వులు ఆరు కేకలు కొన్ని నిట్టూర్పులు హర్షాతిరేకాలతో గడచిన సమయం ఈరోజుతో ముగియబోతుంది.......................................It all comes to an end today

***************************************************************************
రెండుచేతుల్తో సామాన్లు పట్టుకొని స్టేషన్ బయటకు వచ్చా.. అక్కడనుండి క్యాంపస్‌కు టాక్స్లిలోనా ఆటోలోనా ఎలా వెళ్ళాలో ఆలోచిద్దామని. ఐతే అక్కడే  కాలేజ్ నుండి కొందరు విద్యార్దులు స్టేషన్‌లొ హెల్ప్ డెస్క్‌లాంటిది ఏర్పాటు చేసారు. అక్కడికక్కడే వచ్చినవారి వివరాలు తీసుకొని 'మీ కోసం బస్సు ఏర్పాటు చేసా'మని చెప్పారు. అదెక్కేసి దారి వెంబడి కనబడుతున్న ఎర్ర భవనాలు చూసి ఎంతైనా కమ్యునిస్టు కంట్రీ కదా అనుకున్నా (బెంగాల్ ఒక రాష్టం కదా కంట్రీ ఎంటి అని ఆ డౌటేంటి మీకు...ఎబ్బే అస్సలు బాలేదు tongue ). క్యాంపస్ చేరే మార్గంలో ఓ రైల్వే ట్రాక్‌వుంది, చుట్టుపక్కల కొన్ని పండ్ల బండ్లు కిరాణా షాపులు కనిపించాయి.... హ్మ్ టౌన్ బాగానేవుంది అనుకునేలోపే కాలేజ్‌లో ఎంటరయ్యాం అని ఎవరో అనడం వినిపించింది. ' ఆ...... రైల్వే ట్రాక్ పక్కనే కాలేజేంది !!' అనే అనుమానం చెబితే కాన్పూర్‌లో కూడా అంతే బాస్, పైగా మనదే బెటర్ ట్రాక్‌కు కొద్దిపాటి దూరంలోవుంది అని పక్కనున్నతను అన్నాడు. ఓహో అలాగా అనుకొని హాస్టల్‌కు చేరుకున్నా. అక్కడ కొంతమంది కొత్త స్నేహితులు కనిపించి స్వాగతం పలికారు. ఆ తరువాతరోజు  రిజిస్టేషన్ సెమినార్‌తో ప్రారంభమైన ఖరగ్‌పూర్ జీవితం మిగిల్చిన ఆనందాలు,నిరాశలు,అనుభూతులు అన్నీ ఇన్నీకాదు. నన్నునాకు కొత్తగా మరింతలోతుగా పరిచయం చేసారు ఇక్కడి స్నేహితులు. 
ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం, ఒక్కో ప్రాంతం, ఇంజనీరింగ్‌లోనివి ఉద్యోగ జీవితంలోనివి ఎన్నో అనుభవాలు. వెరసి ఒక encylopedia లోని విషయాలవంటి వైవిధ్య మనస్తత్వాలు. అటువంటివాళ్లతో గడిపిన కొన్ని క్షణాలు కొన్ని సంఘటనలు ఇక్కడ నెమరువేసుకుంటూ..........................

*) హరిప్రసాద్ చౌరాసియా గారి కచేరి:
నాకా సంగీత జ్ఞానం నిండు సున్నా....ఐనాకాని విశ్వనాథ్ వారివో, పాత సినిమాలో చూస్తున్నపుడో వాటిలో సాంప్రదాయ సంగీతం విన్నపుడు నాకు కూడా ఎంతోకొంత తెలుసనుకొని తెగ ఫీలయిపోయి పరవశించిపోతుంటా. అలాంటిది ఒక సాంకేతిక కళాశాలలో ఇలాంటి సాంప్రదాయ సంగీత కచేరి ఏర్పాటు చేస్తున్నారని తెలిసి, అందుకు ప్రవేశం *ఉచితం* అని తెలిసి ఉబ్బితబ్బిబ్బైయ్యాను. సంగీతపరంగా కచేరిని ఆస్వాదించడమేమోగాని అయన వేణునాదాన్ని అప్పుడపుడు ఆయన చెప్పిన సరదా మాటలు విని చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్దాయన ఈ వయసులో ఇలా ఎలా ఉండగలుగుతున్నారని. మొత్తానికి కార్యక్రమం ఐపోయేపట్టికి నాలో ఒకింత గర్వం ఒక కచేరి విన్నానని.....happy

*) దీపావళి:
దీనిపై ఈ పాటికే ఓ టపా రాసాను, కాలేజిలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అని. ఫొటొలో చూస్తే బాగుంటిగాని అంతబాగా మన కళ్ళరా దర్శనం చేస్కోవాలంటే మాత్రం దిమ్మతిరిగిబొమ్మ కనపడుతుంది. విషయం ఏంటంటే మట్టిదీపాలతో కళాకృతులు తయారుచేసాక ముందుగా వాటిని న్యాయనిర్ణేతలు చూస్తారు. పైకి-కిందకు ముందు-వెనకా ఎగాదిగా చూసేసి మార్కులు వేసుకొని వెళ్ళిపోతారు. చిన్నచిన్న కుందులతో అలంకరణ చేస్తాం కాబట్టి అవి ఎక్కువసేపు ఉండవు అందుకని ఇలా జడ్జిలు వెళ్తారోలేదొ అభిమాన నటుడి సినిమాకు మొదటిరోజు పోటెత్తినట్టు జనాలు ఒకరినొకరు తోస్కుంటూ నెట్టేస్కుంటు లోపలికొచ్చేస్తారు. ఇహ లేడీస్ హాస్టల్ దగ్గర సందడి గూరించి చెప్పక్కర్లేదు winkingbig grin. పే.....ద్ద కాంపిటీషన్ ఉంటుంది వాళ్ల హాస్టల్ గేట్ల దగ్గర. అలా సెక్యూరిటివాడు గేటు తెరవంగానే డ్యామ్ నుండి పొంగిపొర్లే వరదనీటిలా దూసుకెళ్ళిపోతారు.  బతికుంటే  బర్డ్‌వాచింగ్  చేసుకోవచ్చు అనుకునే నాబోటీవాళ్లు (ఇదొక సాపేక్ష సత్యం ) ఒరేయ్ రేపు ఎవడొ ఒకడు LAN లో share  చేస్తాడు అని చెప్పేసి తాపీగా Rangoli లాంటివి చూసేసి బయటపడి ఎవరి హాస్టల్ దగ్గర వాళ్ళు పఠాకులు కాల్చుకుంటాం.

*) సిక్కిం
మొదటి సెమిస్టరు అయ్యాక స్నేహితులు కొందరు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ ఒకటి వెద్దాం అని ప్రతిపాదిస్తే ఇప్పుడు PG చేస్తూ ఎంతమంది వస్తారు ఇలాంటివాటికి అనుకున్నా. పట్టుమని నలుగురం కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయాం. ఆ తరువాత ఫిబ్రవరిలో మా క్లాస్మేట్, గురూజీ ( ఈయన అసలు పేరు అబనీశ్వర్, ఉపాధ్యాయుడు ఓ ముప్ఫై ఉంటాయ్.  మా క్లాస్‌లో అందరికి ఇష్టుడు అభిమానంగా గురూజీ అని పిలుచుకుంటాం) వెంటపడి వెంటపడి టూర్ ఫైనలైజ్ చేసాడు. ఇంజనీరింగ్‌లోనే కులూ-మనాలీ వెళ్ళాను, ఇప్పుడు మళ్ళా అంతగా ఎంజాయ్ చేయగలనా లేదా అనే అనుమానంతోనే నేనుకూడా బయల్దేరా. కాని ఒక్కసారి బెంగాళ్ సరిహద్దులు దాటుకుంటు సిక్కిం ప్రవేశించగానే నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. కొండలు లోయల్తో, పచ్చని సోయగాలతో తనని తాను సింగారించుకున్న ప్రకృతికాంతను చూసి ఈ చదువులు ఉద్యోగాలు గట్రా అన్నీ వదిలేసి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. అక్కడ గమనించిన ఆశ్చ్యర్యకరమైన విషయం ఆడవాళ్లే వ్యాపారలు, ఇంటిసంగతులు చుసుకోవడం.  టీకొట్టు దగ్గర్నుండి హోటళ్లు నడపడందాకా అన్నీ ఆడవాళ్లె చేస్తారట. మొగుడు అనేవాడు ముప్పూటలా తిని తొంగుంటాడు అంతే లేకపోతే టూరిస్టు బండ్లు అవీ గట్రా నడుపుతుంటాడు. మా గురూజిది ఈశాన్య భారతదేశం, ఆయన అప్పుడపుడు చెబుతుండేవాడు వాళ్ల దగ్గర 'కట్నం' అనేది ఉండదని, అడగితే పెళ్లికూతురు చెప్పిచ్చుకొని కొడుతుందని, తక్కిన భారతదేశంలో కట్నం తిసుకుంటారు అని తెలిసి ఆశ్చర్యపడ్డానని. ఏంటి ఇదంతా నిజమే అనుకున్నాగాని అక్కడ ఆడవాళ్ళు చేసే పనులు చూసి నిశ్చయించేసుకున్నా వీళ్లు చెప్పుతీసి కొట్టడంలో తప్పు లేదని.


ఎత్తైన హిమాలయాలు ఆ కొండల్లో మైదాన ప్రాంతాలు, ఊపిరాడటం కష్టంగా ఉన్న ఆ ప్రదేశాల్లో జవాన్లతో కొంచెం సమయం గడపటం, ఇండియాలో ఉన్నామా ఫారిన్‌లో ఉన్నామా అన్నట్టు ఉండే రాజధాని గ్యాంగ్‌టాక్ వీధులు, పసందైన మోమోలు సిక్కింలో గడిపిన ఆ ఏడెనిమిది రోజులు మాత్రం మరపురానివి. గురూజీ లేకపోయుంటే మా టూర్ ఒక ప్రతిపాదనగానే మిగిలిపోయేది.




*)


Yes....... తన పదవీకాలంలో భారతదేశపు అత్యంత ప్రీతిపాత్రుడైన రాష్టపతిగా పేరు తెచ్చుకున్న కలాం గారితోనూ ఒక అనుభవంవుంది. అసలు అలాంటి ఒక వ్యక్తిని కళ్ళారాచూసే అవకాశం వస్తుందని కలలోకూడా అనుకొని వుండను. క్రితం జనవరిలో ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగం చేపట్టింది. విద్యార్దులు ఎక్కడినుండైనా తమ Lab experiments చేసుకోగలిగేలా online ప్రయోగశాలను  తయారుచేసింది. దాన్ని ప్రారంభించడానికి కలాంగారు వచ్చారు. ఆ సంధర్భంగా విద్యార్దులతో కాసేపు మాట్లాడతారని చెప్పారు. ముందుగా రిజష్టర్ చేసుకొన్నాం. తీరా ఆరోజు వచ్చేసరికి స్నేహితులు కొందరు దుప్పటి ముసుగేసుకొని పడుకొని ఉన్నారు. మామూలుగా ఐతే నేనుకూడా అలాగే పడుకునేవాడిని కాని ఆరోజు 'ఒరేయ్ వస్తావా' అని ప్రతొక్కడిని పిలిచి ఆఖరకు 'మీ చావు మీరు సావండెహె, నే పోతున్నా' అని చెప్పి వెళ్ళిపోయా. కార్యక్రమం జరిగే హాల్‌లో ఓ వందమందిమి ఉన్నాం. ఆయన గనక వస్తే ఆయనకు నాకు దూరం ఒక ఐదు ఫీట్లు ఉంటుందేమో.....చాల్రా దేవుడా అనుకున్నా. ఫ్రొఫెసరేమో 'ఆయన సమయం విలువైనది కాబట్టి మీలో కొందరికే ప్రశ్నలడిగే అవకాశం ఇస్తాం, అవి కూడా రాజకీయాలకు సంబంధించినవి కాకుండా చూస్కోండి అన్నారు'. ఆయనను చూడటామే ఎక్కువ ఇంకా ప్రశ్నలు అడగటంకూడానా అని మనసులోనే అనుకొని చెయ్యి మాత్రం పైకెత్తా. ప్చ్ లాభంలా.....ఓ పన్నెండుమంది దగ్గర చిటీలు తిసుకొని ఇకచాలు అన్నారు ప్రొఫెసర్. సర్లే అనుకొని కూర్చున్నా. కాసేపటికి ఆయన వచ్చారు. అంత ముదిమి వయసులోనూ ఆయన చలాకీతనం చూసి ముచ్చటేసింది. యథాప్రకారం మాతో ప్రతిజ్ఞలు
 చేయించుకొన్నాక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు అందరిది ఐపోయింది. ప్రొఫెసరు మా వైపు కూర్చున్నవాళ్లలో  ప్రశ్న అడగబోయేవాళ్ళు అడగండి అన్నారు. సదరు క్యాండిడేట్లు స్పందించడంలేదు. ఇదే అవకాశం అనుకొని లేచి నిల్చున్నా. Yes......, i was about to talk to a prominent personality of India. సౌరవిద్యుత్తు-అణువిద్యుత్తు గురించి ఓ ప్రశ్న అడిగా దానికి ఆయన సమాధానం చెప్పారు. అంతే ఐపోయింది. కాని ఎందుకో ఈసారి కూడా ఒకింత గర్వం, ఆనందం...... happy

 *) క్యాంటిన్

రెండేళ్లపాటు క్లాసులకైనా సరిగా వెళ్ళుండంకాని ఏరోజుకూడా హాస్టల్ క్యాంటీన్ వెళ్లకుండా ఉన్నదిలేదు. ఐదు రూపాయలు దొరికే అల్లం ఛాయ్‌ను సాయంత్రం నుండి రాత్రివరకు నాలుగైదుసార్లు తాగిన రోజులు కూడా ఉన్నాయ్. మొదట్లో వింగ్‌లోని ఐదారుగురం కలిసి వెళ్లేవాళ్ళం....ఆ తరువాత నెమ్మదిగా ఆ సంఖ్య 14-18 కి చేరుకుంది. ఛాయ్ కోసం వచ్చామంటే క్యాంటీన్ దాదా (అన్న) డబ్బా గలగలలాడిపోయేది. ఈ మధ్యనే దాదా ఒక ఫ్రిజ్ కొన్నాడు. మా అనుమానం ( వెర్రి అనుమానమే అనుకోండి) మా బ్యాచ్ ఛాయ్ తాగిన డబ్బులతోనే దాన్ని కొనుంటాడేమో అని !!
ఈ క్యాంటీన్ చలవ వల్ల ఓ మహత్తరమైన వంటకానికి బానిసనైపోయాను. అదే మ్యాగి. అసలు మా క్యాంటిన్ వాడు చేసినట్టుగా ఇంకెవరు చేయరు అని డిసైడ్ అయ్యాను. నా ఈ బానిసత్వం ఎంత ముదురంటే ఛాయ్ కోసం వెళ్ళినపుడు స్నేహితులు నా ఆర్డర్ తీసుకోరన్నమాట. Default గా 'వీడికి మ్యాగి, ఛాయ్' అని అనేసుకుంటారు. నెను చెప్పాల్సిందల్లా ఆ మ్యాగిలో వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలో చెప్పడం :D
కాలేజ్ బయట పూరి గేట్‍లో 'చేదీస్' అని ఒక చిన్న హొటెల్ వుంది. ఉదయం 4:30 కు తెరుస్తాడు. తెరచిన గంటవరకు  మటన్ మ్యాగి చేస్తాడు. అదైతే ఇక బ్రహ్మాండమనే చెప్పాలి. మీరెపుడైనా ఇటొస్తే మా హాస్టల్‌లోగాని, చేదీస్‌లో గాని మ్యాగి తినడం మరచిపోవద్దు.

*)బర్త్‌డే- ఒక భయంకరమైన డే....

ఎవరన్నా పుట్టినరోజులు జరుపుకోవాలంటే, అదీ స్నేహితుల సమక్షంలో జరుపుకుంటే ఆనందపడతారు. కాని యువరానర్ అది అన్నిసార్లు నిజంకాధ్యక్షా. ప్రత్యెకించి హాస్టల్‌లో ఉన్నప్పుడు. పుట్టినరోజు కొసమని రూమ్‌ను అందంగా అలంకరిస్తారు. కరెక్టుగా రాత్రి పన్నెండు గంటలకు కేక్ కట్ చేయిస్తారు. మొహానికి కొంచెం / లేకపోతే మొత్తం కేక్ రాసేస్తారు. ఆ తరువాత ఉంటది నా సామిరంగా.......పుట్టినరోజనికూడా  చూడకుండా సీట్ వాయించేస్తారు, బర్త్‌డే బాంబులు ఇస్తారు. ఆ ఎఫెక్టుకు కనీసం ఒకరోజు కూర్చోడానికి వీలుండదు. అంత పాశవికంగా దాడి చేసాకకూడా వదల్రు. ఆ అర్దరాత్రి వాళ్లను మేపాలి. బర్త్‌డేబాయ్ బేబీది జేబులు ఖాళీ అవాలి. ఇది కేవలం అల్పాహారం లాంటిది. ఇది కాకుండా ధాభాకు ఎక్కువ రెస్టారెంటుకు తక్కువ అన్నట్టుండే మా ఖరగ్‌పూర్ రెస్టారెంట్లలో పార్టి ఇవ్వాలి. ఈ రెండేళ్లలో రెండుసార్లు సీటు వాచిపోయింది. ఎన్నిసార్లు వాయగొట్టడంలో పాలుపంచుకున్నానో సారి...., గుర్తులేదు.

ఇవికాక వేడువేడి చర్చలు, వాదాలు, అందరం కలిసి సినిమాలు చూడటం. సినిమా చూడడానికి కష్టాలు పడటం. ఎన్నో మరెన్నో.....ఇవన్నీ నేటితో ముగిసిపోతున్నాయి. జ్ఞాపకాలుగా మిగిలిపోబొతున్నాయ్........
ఇంటికెళ్ళాక ఇవేమి ఉండవు. క్యాంటిన్ ఛాయ్ ఉండదు, మ్యాగీ ఉండదు......సొల్లు కబుర్లు చెప్పుకోడానికి జనాలుండరు. యే ఖేల్ ఖతం హోగయా హై.

హ్మ్............... కొంచెం సిరియస్గా సాగదీసినట్టూన్నా.....

ఐతే బ్లాగు సుజనులారా, ఈరోజు నేను ఇంటికి బయల్దేరుతున్నా కాబట్టి దార్లో మీ అభిమానం కొద్దీ ఏదో ఒకటి నాకు సమర్పించేసుకోండి. ఇజీనారం వాళ్ళు పూతరేకులు, విజయవాడ వాళ్ళు బిర్యాణి-పలావు, రాజమండ్రి వాళ్ళు బోండాలు, గుంటురువాళ్లు గుంటురు బాంబులు (మిర్చీ బజ్జీలు స్వామి) హైదరాబాదు బ్లాగర్లు నా రాకను పురస్కరించుకొని ఘనంగా స్వాగతాలు సమర్పించేసుకోండి. మీ గూరించి ఎక్కడెక్కడో red inkతో రాసేసి blue ink తో underline చేస్తా.

ShareThis