అటెన్షన్ ప్లీజ్, రియల్ వరల్డ్ నుండి బ్లాగ్ వరల్డ్, ఫ్లయిట్ నెంబర్ RB5512 మరి కొద్దిసేపట్లో ల్యాండ్ అవబోతుంది.....
హలో హలో హలో.... బాగున్నారా అందరూ. Very glad to see you all :)
అరె ఏందిది! నా రాకను పురస్కరించుకొని స్వాగత హారతులిచ్చి,
గజమాలలు వేసి, గజారోహణం చేయించి పురవీధులలో ఊరేగిస్తారనుకుంటే ఇంత తక్కువ
జనాలా!? వీకెండును అంతబాగా ఎంజాయ్ చేస్తున్నారా. అబ్బోస్ మీకొక్కరికేనేంది
మాకూవుంది వీకెండు, మేము చేశాం ఎంజాయ్మెంటు. ఇగో ఈ పోస్టు నిండా ఆ సంగతుల్
స్మృతుల్ నింపేస్తాను చదివి ఆనందిద్దురుగాని..
ఉపాద్ఘాతము
అనగా అనగా అనగా... ఒక నెలరోజుల క్రితం
హైదరాబాద్ నగరమందు ఉండెడి ఇద్దరు ఘోటక బ్రహ్మచారులకు సాటి గుంటూరు వైద్య
బ్రహ్మచారి తన అమృతహస్తములతో చేసే వంటలను రుచిచుడ మనసైనది. పరస్పరం
చర్చించుకున్నమీదట ఓ మంచి
శుక్రవారం ( ఈ పదం యొక్క పుట్టుపూర్వోత్తరాల కోసం 'డైరీ'ని, ఇది ఎంత
మంచిదో తెల్సుకునేందుకు 'పాకవేదాన్ని' తిరగేయండి) గుంటూరు బయలుదేరవలెనని ,
ఈ కార్యాచరణకు వ్యతిరేకంగా హరిహరాదులు ఏకమైనను ప్రతిఘటించి వాటిని
విఘటించి (అర్ధం వెతకొద్దు, మాఆఆంచి ఫ్లో లో వచ్చేసింది) వెళ్ళవలెనని
అనుకుంటిరి. ప్రయాణానికి రెండు రోజులనగా ఎర్పాట్లలో నిమగ్నమైన పెద
బ్రహ్మీకి చిన బ్రహ్మీ నుండి కాల్ వచ్చినది. ఏమిటి నాయనా అని
అడగ్గానే అవతలి వైపునుండి ఒకటే ఏడుపు.
"మా
మేనేజరుడు సెలవు ఇవ్వననీ, పాలుగారే పసివాడినని కూడా చూడకుండా నాతో
వెట్టిచాకిరి చేయించుచున్నాడు బాబోయ్. నేను రాలేను వాఆఆఆఆఆఆఆఆఆ"
"ఒస్ అంతేనా, ఈ చరాచర సృష్టిలో ఏ మేనేజరుడు అడిగిన వెంటనే సెలవు ఇస్తాడుగనక
మీవాడిని గూర్చి అంతలా దుఃఖించడానికి. నువ్వే గట్టిగా ప్రయత్నం చేయ్యాలి.
కాదు కూడదు అంటే ఏదో జబ్బు చేసింది టాబ్లెట్లు కొనడానికి గుంటూరు వెళ్ళాలి
అని చెప్పు. అదియునూ కుదరదంటే చెప్పాపెట్టకుండా వచ్చెయ్, తిరిగొచ్చాక కారణం
అడిగితే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పు, చెయ్యడానికి నేను కట్టుకట్టడానికి
డాట్రు ఎంతోకొంత సహాయం చేస్తాం" అని ఉపాయం చెప్పాడు పెద బ్రహ్మీ. భయంవల్ల
అనుకుంటా అంత చెప్పినా పాపం అతను ధైర్యం చేయలేకపోయాడు. సరే ఇతగాడు రాలేడు
కదా తోడుగా మురళీధరుడిని వెంటబెట్టుకు వెళదాం అని యోచించి అతడిని
సంప్రదించాడు, చివరకు అతను కూడా 'నామాలు' పెట్టడంతో విధి బలీయమైనది,ఈమారు
తనకొక్కడికే అమృతపాన యోగమున్నది కాబోలని తలంచి బయలుదేరెను.
అధ్యాయము
తెల్లవారుఝామున
గుంటూరులో బస్సు దిగగానే కౌటిల్య ఫోన్ చేశాడు, "వందేళ్లు డాట్రు. ఇప్పుడే
బస్సు దిగాను నీకు ఫోన్ చేద్దామనుకునే లోపు నువ్వే చేశావ్. ఇప్పుడు ఇక్కడి
నుండి ఎలా రావాల"ని అడిగా.
" నీ ఎదురుగా, చుట్టుపక్కలా ఏదైనా విగ్రహం ఉందా" - అవతలి వైపునుండి ప్రశ్న
"ఆ ఉంది"
"అయితే
కొంచెం బాడి రైట్ టర్నింగ్ ఇచ్చుకొని తిన్నగా ఓ అరకిలోమీటర్ వచ్చెయ్...
ఈసారి మూడు విగ్రహాలుంటాయ్. వాటిని దాటుకుంటూ పదడుగులు
వేస్తే రామాలయం పక్కన ఇంకొక విగ్రహంలా నేను ఉంటాను"
ఈ
విగ్రహాల భాషేంటో అర్ధం కాక కొత్త ఊర్లో తెలీనోళ్లతో ప్రశ్నలు ప్రయోగాలు
ఎందకని ఇచ్చిన డైరెక్షన్స్ ను యాక్షన్ లో పెట్టా. గుడి దగ్గరరికి
చేరుకోగానే డాట్రు హనుమంతుడిలా వచ్చి తన రూంకు తీసుకొనిపోయాడు. ఎప్పుడు
చూసినా వంటలూ పుస్తకాలని అంటువుంటాడు లంకంత కొంప ఉంటుందనుకున్నా. అబ్బే
సింగిల్ రూము! book rack మాత్రం ఉంది "ఇదెంటిది, త్రిబుల్ కిచెన్ +
బెడ్రూం+హాల్ ఊహించుకున్నాను. నిత్యం రుబ్బురోళ్ల చప్పుడుతో, పెనం మీద
ఐటెమ్స్ ఘుమఘుమలతో అలరారుతుందనుకుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. ఇది నీ
రూమేనా"ని అడిగితే హిహ్హిహ్హి అని నవ్వేసి, వంట చేసుకుంటే ఇదే కిచెను,
చేసింది తింటె ఇదే డైనింగ్ రూము, చదువుకుంటుంటే ఇదే హాల్, పడుకుంటే ఇదే
బెడ్రూము అని బ్రహ్మీఙ్ఞాన ఉపదేశం చేసి తను స్నానం పూజ కానిచ్చేలోపు కంప్యూటర్లో మొహం పెట్టి నెట్టింగో కుర్చిలో దేహం పెట్టి రీడింగో చేసుకొమ్మని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
స్నానాలవీ కానిచ్చాక ఆ రోజు అమరావతి
వెళ్ళాలని అనుకున్నాం. బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని "పద కౌటిల్యా..అలా దారిలో
ఎక్కడైనా దోశలో ఇడ్లీలో తిందామ"న్నా. శంకరాభరణంలో శంకర
శాస్ర్తిలా "చారీ..." అని కౌటిల్య అనేసరికి కొంచెం భయపడ్డా. మా ఊరికి వచ్చి
అందునా నా ఇంటికొచ్చి ఎక్కడో బయట తింటానంటావా. వండిపెడదామని సరుకులన్నీ
తీసుకొచ్చా.అలా కూర్చొని ఉండు వేడి వేడిగా దోశలు వేస్తానని చెప్పి
కూర్చొబెట్టాడు. గుంటూరు మిర్చి ఘాటు తగులుతుందేమో అనుకున్నా.....
పోయినసారి వేణు శ్రీకాంత్ గారు వచ్చినపుడు చాలా వాడేసాడంట నాకు కొన్నే
మిగిలాయి
. కౌటిల్య
ప్లేట్లో దోశలు వేస్తుంటే వాటిని
తింటూ జనాలను ఉడికించడానికి ప్లస్సులో పోస్టులు వేసా. తినడం ముగించి
బయలుదేరబోతుండగా శేఖర్ ఫోన్ చేశాడు పది నిముషాల్లో వస్తానని. సరే ముగ్గురం
కలిసి బయల్దేరదాం అనుకొని ఓ గంటసేపు వెయిట్ చేశాం.గంట దాటాక పదినిముషాలకు
శేఖర్ వచ్చాడు. బ్లాగు ఫొటోలో చూసి నాలాగే యువబ్రహ్మీ అనుకున్నా....అమితాబ్
బచ్చన్ హైటుతో ప్రసన్నవదనంతో ఉన్న పెద్ద (అలియాస్ ముదురు) బ్రహ్మీనే!! రావడం రావడమే 'ఎక్కడ ఎక్కడ వంట సామాన్లెక్కడ' అనడగడం మొదలెట్టాడు. ఇతగాడి గురించే కాబోలు డాట్రు ఆ సామాన్లన్నీ మంచం కిందకు సర్దేసాడు ;)
ఈ బాబు గురించి రెండు ముక్కలు చెప్పాలి. చూడడానికి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడిలా కనపడతాడుగాని సైలెంట్ గా పంచులు వేస్తాడు. ఎవడ్రా అన్నాడు అని మనం చుట్టుపక్కల చూస్తే ఇలా అమాయకమైన ఫేస్ ఒకటి కనిపిస్తుంది

ఈ బాబు గురించి రెండు ముక్కలు చెప్పాలి. చూడడానికి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడిలా కనపడతాడుగాని సైలెంట్ గా పంచులు వేస్తాడు. ఎవడ్రా అన్నాడు అని మనం చుట్టుపక్కల చూస్తే ఇలా అమాయకమైన ఫేస్ ఒకటి కనిపిస్తుంది
ఛ... ఇలాంటి ఉత్తముడినా
అనుమానించింది అనుకునేలోపే ఇంకో పంచ్ పడుతుంది. గుంటూర్ లో ఉన్న మూడు
రోజులు పాపం డాట్రు, శేఖర్ పంచ్‌లకు బలైపోయాడు
పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఇక లంచ్ చేసి బయల్దేరదామని లంచ్ కోసం వండడం మొదలు
పెట్టాడు డాట్రు. ఏసీ లో కూర్చోబెట్టి పొయ్యి దగ్గర తను కష్టపడుతుంటే గుండె
తరుక్కుపోయింది. పోని మేమేన్నా సాయం చేయమా అని శేఖర్ అడిగాడు. "బాబు ఈ
ముక్క బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నపుడె అడిగా... ఉహూ, ఇల్లే, నహీ అంటున్నాడు.
అథిది మర్యాదంట. అంతగా సాయం చేయాలనుంటే కమ్మగా మజ్జిగ చేసి ఇస్తాడు. తాగి
పెడదాం" అన్నా. ఉత్తినే ఫార్మాలిటి కోసం అడిగా చారి. నిజంగా చేస్తామా ఏంటి
అన్నట్టు ఏదో వినపడితే తిరిగి చూసా. చెప్పాను కదా.. పైన పెట్టిన ఫేస్
కనిపించింది.

ఏమాటకామాటే డాట్రు పప్పు
చేశాడూ, వేడివేడి అన్నంలో వాళ్లింట్లో చేసిన నెయ్యి వేసుకొని తింటే అనిపించింది...
ఆహా నభూతో నభవిష్యతి. ఈ కాలపు ఆడ స్త్రీలేడిస్ కు వంట నేర్పగల ఏకైక
వ్యక్తి మా డాట్రే అంటే అతిశయోక్తి కాదు (హమ్మయ్య తాంబూలాలిచ్చేశా ఇక....
)
సుష్టుగా తిన్నాక ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నామని గ్రహించి అమరావతి వద్దు
ఆదమరచి నిద్రపోదాం అని డిసైడ్ చేశాం. రాత్రికి వేణుగారు టైటానిక్ సినిమాకు
టికెట్లు బుక్ చేశారు. నడి సముద్రంలో, గాలివానలో టైటానిక్ మునిగిపోవడం చూస్తూ మధ్యమధ్యలో జోకులేసుకుంటూ సినిమా ముగించాం. సమయంలేక వేణు గారితో ఎక్కవ మాట్లాడలేకపోయా.

ఆ తరువాతి రోజు ఉదయమే లేచి నేను డాట్రు అమరావతి వెళ్లి అమరేశ్వరుని దర్శనం
చేసుకున్నాము. గుడి దగ్గర కృష్ణానదిని చుస్తే చాలా
బాధేసింది. నీళ్లన్నీ ఎండిపోయి పిల్ల కాలవలాగా కళావిహీనంగా ఉంది, ఒక రకంగా
హైదరాబాద్‌లో మూసి లాగా ఉంది. గుడినుండి ఆర్కియాలజి మ్యూజియం, పక్కన ఉన్న
పార్క్ వెళ్ళాము. డెవలప్మెంట్ హైదరాబాలోనే కాదు అమరావతిలో కూడా ఉంది అని
పార్క్ లో ఓ జంటను చూసాక తెలిసింది. సాయంత్రం శేఖర్ తో కలిసి విజయవాడ
దుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. వెళ్ళిన మూడు చోట్లా కౌటిల్య చక్కగా
స్తోత్రాలు చదువుతుంటే గుడికి వచ్చినవాళ్ళు, పూజారులు మమ్మల్ని ఒక విధమైన
గౌరవంతో చూసారు, రద్దీగా ఉన్నా వేళ్లెందుకు మాకు దారినిచ్చారు. కౌటిల్య
వల్ల దుర్గమ్మను చాలా దగ్గరగా సుమారు అరగంటపాటు దర్శించుకునే అవకాశం
కలిగింది . ఆ తరువాతి రోజు ఉదయం మంగళగిరి వెళ్ళాము.
మంగళగిరి కొండ ఒక అగ్నిపర్వతమంట....అది
బద్దలవకుండా ఉండేందుకు కొండమీద కొలువున్న నరసింహస్వామి నోట్లో బెల్లం నీరు
పోస్తారు. అగ్నిపర్వతం బద్దలవడం అనే ఓ క్లిష్టమయిన సమస్యను నిత్యం నీరు
పోయడం ద్వారా తీర్చడమనే ఆలోచన ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది.
వైఙ్ఞానికంగా అదొక అద్బుతం. కాని నిత్యం నీరు ఎవరు పోయాలి? ఆ బాధ్యత ఎవరు
తీసుకుంటారు? ఇక్కడే భక్తి అనే అంశాన్ని చేర్చి ప్రజలే ఆ పని చేసేలా మలిచిన మన పూర్వీకులను మెచ్చుకోకుండా ఉండలేకపోయా.
వెంకటగిరి
నుండి గుంటూరు తిరుగుప్రయాణమయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాక 'బ్లాగు
పుస్తకం' పరిచయ సభ కోసం, నేను అటునుంచి అటు ఇంటికి వెళ్ళడం కోసం మళ్ళీ
విజయవాడ వెళ్ళాం. పుస్తక పరిచయ సభకు వెళ్ళే ముందు విజయవాడలో పుస్తకాల
షాపింగ్ చేశాం, సుజాతగారు రెహ్మాను.. వీళ్లందరిని తీసుకొనొస్తే మాకు
కొనుక్కొడానికి ఇంకేమి మిగలవని డాట్రు ప్లాను :) మేము వేళ్లేసరికి సభ
ప్రారంభమయింది. 'ఆది బ్లాగర్' చావా కిరణ్
గారు (ఇలా అనాలి అని కౌటిల్య చెప్పాడుమరి, కారణాలు తెలియవు
ఎప్పటిలాగే నవ్వుతూ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. నేను శేఖర్
బుద్దిమంతుల్లా ఆఖరు వరుసలో కూర్చున్నాము. మేము ఇంత బుద్దిగా ఉన్నా కూడా
రెహ్మాన్‌కు నచ్చలేదేమో సుజాతగారితో ఏదో చెప్పి మా ఇద్దరితో పుస్తకం
ఆవిష్కరింపచేశాడు . అంటే మొత్తంగా మాతోనే కాదు 'షాడో' మధుబాబుగారి లాంటి
పెద్దవారు చేశాక కూడా కొన్ని మిగిలిపోతే ఫొటొలో నిండుగా కనపడడానికి
ఫిల్లర్స్ లా అన్నమాట ;)

అయినా
రచయితల ఆదరం చూస్తే ముచ్చటేస్తుంది. మొన్న హైదరాబాలో సభ చేసినపుడు వెళితే
పుస్తకం బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడేమో ఆవిష్కరణ చేయమన్నారు, రేప్పొద్దున్న
పుస్తకం రాస్తూ నాకు అంకితం ఇచ్చేస్తారేమో అని అనిపిస్తుంది వీళ్ల అభిమానం
చూస్తే. నాలాంటి పెద్దలను గౌరవిస్తుంటే కాదనలేకపోతున్నాను కూడానూ
సభకు విజయవాడ, ఆ చుట్టుపక్క బ్లాగర్లు చాలామంది వస్తారు వారందరిని కలవచ్చు అనుకున్నాను, ప్చ్, 'తెలుగుకళ' పద్మకళగారు ఒక్కరే వచ్చారు.

సభ అయ్యాక మరోసారి పుస్తకాల షాపింగ్ చేసుకొని శేఖర్‌కు సెండాఫ్ ఇచ్చి,
కిరణ్ గారితో చిన్న మిర్చిబజ్జీ పార్టి
చేసుకొని ఆయన/రచయతలు ఇచ్చిన డిన్నర్ స్వీకరించి బస్ స్టేషన్ చేరుకున్నా.
సరిగ్గా అదే సమయానికి మూర్తి అక్కడే ఉన్నాడని తెలిసింది. మేము వచ్చాక
తెలిసిందేంటంటె తను అంతకుముందే బయలుదేరాల్సిందని, కలిసి వెళ్ళొచ్చని తన
టికెట్ కాన్సిల్ చేయించుకున్నాడట. ఏమిటో ఈ బ్లాగానుబంధాలు.
అంతకుముందెన్నడూ ప్రత్యక్ష పరిచయం లేకపోయినా కేవలం బ్లాగ్/ప్లస్సు పరిచయం
ఉన్నందుకు వాళ్లను కలవాలనుకోవడమూ, కలిసాక ఆనందపడటమూ, మొదటిసారి కలిసినా
ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్లలాగా మాట్లాడేసుకోవడమూ.. ఒక్కోసారి ఆశ్చర్యంగా
ఉంటుంది. తన 'పల్లీ పొట్లం' గురించి మాట్లాడుకుంటూ ఇంత చక్కని ఙ్ఞాపకాలను
అందించిన కౌటిల్యకు, వేళ్లేంతవరకు అక్కడే ఉన్న రహ్మానుకు వీడ్కోలు
చెప్పేసి హైదరాబాద్ బయలుదేరాము.
PS:
నువ్వు ఎక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టు బహులేటుగా శేఖర్ కోరిక
మేరకు రాసిన ఈ పోస్ట్ అంతకు ముందు మాట ఇచ్చిన ప్రకారం చాణక్యకు అంకితం.