తెలుగుబాట

మొన్నటి ఆదివారం రోజున e-తెలుగు వారు 'తెలుగు భాషాదినోత్సవం' సందర్భంగా తెలుగుబాటను నిర్వహించారు. కార్యక్రమం జరిగేది హైదరాబాదులోనే కాబట్టి నేను కూడా పొలోమంటూ వెళ్లాను. అప్పటికి చాలా రోజులనుండి బ్లాగులలో, బజ్జుల్లో, ఫేస్‌బుక్, ఆర్కుట్‌లో కార్యక్రమం గురించి ప్రచారం జరుగుతూ వచ్చింది. కార్యక్రమం ఉదయం 9:00 నుండి మొదలౌతుంది అని తెలుసు, కాని ఇండియన్ టైము ప్రకారం ఓ ఇరవై నిముషాలు ఆలస్యంగా వెళ్లాను :D. అప్పటికి e-తెలుగు సభ్యులు కరపత్రాలు, బ్యానర్లు సిద్దం చేస్తున్నారు. చేరుకోగానే లినక్స్ ప్రేమికులు రెహ్మాను, ప్రవీణ్ ఇళ్ళ పలకరించారు. ఓ స్టిక్కర్ లాంటిది అతికించేసి ఓ పెద్దాయనకు నన్ను అప్పగించేసి రెహ్మాన్ చక్కా వెళ్లిపోయాడు, తన పనిలో నిమగ్నమైపోతూ, అందరిని సమన్వయపరుస్తూ. 'హలో', ' హాయ్', 'గురూ గారు మీరా!!' అనుకున్నాక ఆ పెద్దాయన అంచేత నే చెప్పోచేదేంటంటే అబ్భాయ్ ఇంద ఈ బ్యానర్‌ను ఓ చేత్తో పట్టుకో ఇంకో చివరను నే పట్టుకుంటా అన్నారు. అలగే అనేసి అక్కడికి వచ్చిన రిపోర్టర్లకు సామూహికంగా ఫొజులిచ్చి నడక మొదలుపెట్టాం. 

దారివెంట తెలుగు గురించి నినాదాలు చేస్కుంటూ నడిచాం ఆదివారం కాబట్టి నడక మార్గంలో జన సందోహం ఎక్కువగా లేదు. ఇలాగైతే ప్రయోజనం ఉండదనుకొని సిటిబస్సులు ఎదురవగానే కొంచెం స్వరం పెంచి గట్టిగా అరవడం మొదలుపెట్టా, పాపం మిగతావారు అది 'యువరక్తం', 'ఉత్తేజం' అని అనుకున్నారేమో !! ఐతే మా అందరికంటే చురుగ్గా నడక ఆసాంతం ఓ పెద్దాయన ముందుండి నినాదాలు చేయించారు. ఆయన 'యువభారతి' అనే సాంస్కృతిక సంఘం సభ్యులట. మిగతావారందరం సగం దూరం అయ్యేసరికి డీలా పడిపోతే ఆయన మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. నడక ముగిసిన తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో సభను నిర్వహించారు. సభలో మాట్లాడిన వక్తలపేర్లు ఒకరిద్దరివి తప్ప గుర్తులేదు. అందులో ప్రస్తావించిన విషయాలు స్థూలంగా...
౧)తెలుగు  భాష మనుగడ సాగించాలి అంటే ఆ పనికి ప్రజలే పూనుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వాలను, పాశ్చాత్య పోకడలను నిందించడమో సరికాదు.
౨) భాష వాడుకలో ఉండాలి అంటే ప్రభుత్వాలు, ప్రసార సాధనాల బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండింటికి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది.
ఈ రెండూ కాస్త పరస్పర విరుద్దంగా అనిపించినా సబబుగానే తోచింది.

సభ ముగిసిన తరువాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పెద్దలు పూలమాలలు తొడిగారు. మాలాటి కుర్రవెధవలం ఒకరితో ఒకరం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, ఫొటోలకు ఫోజులిచ్చుకున్నాం. ఇప్పటిదాకా బ్లాగు/బజ్ ద్వారా మాత్రమే తెలిసిన బ్లాగర్లు తెలుగుబాట ద్వారా ప్రత్యక్షంగా కలిసారు. చాలా ఆనందం కలిగింది.









కోతికొమ్మచ్చి:

మొన్నొకరోజు ఓ దగ్గర వెయిట్‌చేస్తూ కూర్చున్నా. నా వెనక ఇద్దరు అమ్మాయిలు,అప్పటివరకు ఒకరికి ఒకరు పరిచయంలేదు, మాట్లాడుకుంటున్నారు.  అబ్బో, ఇంగ్లీష్ లో దడదడలాడించేస్తున్నారు 
" Yeah, Hyd is such a beautiful city. I very much wish to settle here........ etc etc"
"We stay in XYZ area, actually we are going out on a holiday trip this sunday to ABC..."
"so it is gonna be a funday trip :) "
"WoW ! how beautiful "
etc etc

ఇంతలో రెండో అమ్మాయ్ ఫోన్ మోగింది, తను లిఫ్ట్ చేసి " ఆ నాన్నా, పని ఇంకా అవలేదు. మరోగంటసేపు పట్టోచ్చు....."అనేసి పెట్టేసింది. ఓహో అమ్మి తెలుగే! అని మనసులో అనుకుని వారి మాటలు అలాగే వింటున్నా. 
ఇంతలో మొదటి అమ్మాయి ఫోన్ మోగింది, ఆమె లిఫ్ట్ చేసి " ఆ... నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఓ హండ్రెడ్ వెయ్యమను...." అంది. వార్ని ఇద్దరు అమ్మిలు తెలుగేనా అని ఆశ్చర్యపోవడం నావంతైంది.

జై తెలుగు!  జైజై తెలుగమ్మాయిల్స్ !

2 వ్యాఖ్యలు.. :

బులుసు సుబ్రహ్మణ్యం said...

అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే అంటూ రంగు రంగుల గళ్ళచొక్కాలేసుకొని తిరిగే ఆయనని పట్టుకొని 'పెద్దాయన' అనేస్తారా ఎంత ధైర్యం ? ఆయ్ హన్నా.

>>> ఈ రెండూ కాస్త పరస్పర విరుద్దంగా అనిపించినా సబబుగానే తోచింది.
రెండు దహా లు.

ఆ తెలుగమ్మాయలని కూడా తెలుగు బాట పట్టించాల్సింది టాంక్ బండ మీద సరదాగా.

ఇంకో రెండు మహా

..nagarjuna.. said...

>>రంగు రంగుల గళ్ళచొక్కాలేసుకొని తిరిగే

ఓహో వయసు పెరుగిపోతున్నా గళ్ల చొక్కాలేసుకుంటే యువకుకుగానే పరిగణించాలన్నమాట. భలే ఐడియా ఇచ్చారు గురూగారు. ధన్యవాదః

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis