మేరా భారత్ మహాన్

భారత ప్రభుత్వంవారికి,
అయ్యా  ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేయడానికి నాకు నోటమాట కరువౌతోంది. మొన్నీమధ్యనే జరిగిన ముంబాయి పేలుళ్లను మరవకముందే రక్తసిక్త చేతులతో పట్టుబడ్డ కసబ్‌గారు అథిదిగృహం లాంటి జైలులో పట్టుమని ఓ పదికేజీల బరువు పెరగకుండానే మళ్ళి పేలుళ్లు జరిగాయంట!  సంతోషం. నావొళ్లు పులకించిపోయింది. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా భావించే ఉగ్రవాదులకు మన రక్ష్యణా వ్యవస్థ, గూఢచర్య వ్యవస్థ మరీ తిసికట్టుగా తయారైయ్యేట్టు చేసినందుకు మీకు శతకోటి వందనాలు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌ను, రె‌డ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కసబ్‌ను భవిష్యత్తులో పట్టుబడబోయే మరేయితర ఉగ్రవాదినో సిగ్గు-శరం లేకుండా ఉంటూ ఏమి చేయలేని మీ రాజనిరతికి నా జోహార్లు. ఇవాల్టి ఈ పనికి పైలోకంలోని వందలాది ఉన్నికృష్ణన్లు, కామ్టేలు, కర్కరేలు ఆనందభాష్పాలు రాలుస్తుంటారు. మీకు హ్యాట్సాఫ్.


ఏదేమైనా సారూ మనకి ఈసారి కూడా అదృష్టం కలిసిరావాలని కోరుకుందాం. ఏ రాముగాడో, సోమూగాడో సంఘటనా స్థలానికి వెళ్ళేలా చేద్దాం. 
వాడిచేత ఓ బ్రహ్మాండమైన సినిమా తీయిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం పై మనం జరిపే పోరుకు అందరూ మద్దతివ్వాలని కోరుకుందాం. సొల్లు కబుర్లు చెప్పుకోడానికి వీలయ్యే దైపాక్షిక చర్చలకు సానుకూల వాతావరణం కలగాలని కోరుకుందాం. ఎంచక్కా మన మంత్ర్లులు వాళ్ల అనుచరగణం టీవీల్లో, పేపర్లలో దర్జాగా పబ్లిసిటీ ఇప్పించుకోవచ్చు. నా భ్రమగాని ఈ పాటికే మీ మేనిఫెస్టో లోని సగటు మనిషి/ ఆమ్ ఆద్మీ/common man ఈ బాధ్యత తీసుకొని ఉంటాడు. రేప్పోద్దున చూడండి ఏ భయం లేకుండా ముంబాయ్ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తాడు. ఛాయ్ బండ్ల దగ్గర సమోసాలు తింటాడు. ఉగ్రవాదులకు మేము భయపడము అని వార్తా ఛానల్లు ఊదరగొట్టుకునేలా చేస్తాడు. ఆ పేరుతో మనందరం చంకలు గుద్దుకొవచ్చు. ఆ పిచ్చి ఛానళ్లకు అసలు సంగతి తెలీదు, పనికెళ్లకపోతే తిండి దొరక్క చస్తాడు ఆ సగటు మనిషి. దానికన్నా బాంబులు ఉంటాయో ఉండవో అని 
అనుమానపడుతూ, తననుతాను సంబాలించుకుంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. సగటు మనిషికి అలాంటి మహర్ధశ పట్టించిన మీకు ఎన్ని కితాబులిచ్చినా తక్కువే.

కొన్ని రోజులపాటు న్యూస్‌పేపర్లు, టీ.వీ ఛానళ్లు మీమీద బురద జల్లుతాయి. పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, సరిపడ నిధులు  ఇవ్వలేదని. మీరేమి వాటిని చెవికెక్కించుకోవద్దు. పోలీసులను నేతల ఇళ్లదగ్గర, సమావేశాల దగ్గ్రర  కాపలా కుక్కల్లా పెట్టేసుకోండి. ఎదురు మాట్లాడినవాడి పీక నొక్కడానికి వాడండి. ప్రతిపక్షం గతజన్మలో చేసిన అవినీతితి గురించి, తప్పొప్పుల గురించి యేళ్లతరబడి ఉపన్యాసాలు దంచండి. ఎవరైనా ఓ ఇంటిపై దాడిచేస్తే, ఆ ఇంట్లో మగాడు ఏం చేయలేకపోతే వాడికి గాజులు తొడిగి మూల కూర్చోబెడతారు. మీమీద ఉన్న అమితమైన వాత్సల్యం, అభిమానం, ప్రేమ కొద్ది మేమా పనులు ససేమీరా చేయం. దర్జాగా ఏలుకోండి, మమ్మల్ని దోచుకోండి. ఇలాంటి దాడులు జరిగినపుడు ఏవో పదో పరకో ప్రాణాలు పోతాయ్. వెధవది గాల్లో దీపాల్లాంటివి ఆమ్ ఆద్మీ ప్రాణాలు మీరు దేశానికి చేయబోయే విశాల ప్రయోజనాలకంటే ఎక్కువకావు. నిస్సిగ్గుగా ఉండండి. మీరు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం.

మేరా భారత్ మహాన్. మేరా నేతా మహాన్.

PS: అయ్యా ఉగ్రవాదులూ తమరు ఎంతో కష్టనష్టాలొనర్చి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి చిన్నచిన్న బాంబులు పెడుతున్నారు. ఇకపై అంత కష్టం తీసుకోకండి. ఎక్కడ దాడి చేయనున్నారో నేరుగా మా ప్రభుత్వానికే తెలియజేయండి. మీకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒకవేళ పోలీసులో కమేండోలో అనవసర సాహసం చేసి పట్టుకుందనుకోండి మీరు ఈ దేశానికి చేసిన మహత్తర సేవకుగాను మీకు దేశంలో ఎవరికీలేని రక్షణమధ్య రాజమర్యాదలు ఉంటాయి. ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాకపోతే ఒక్క విన్నపం, దేశ రక్షణ అంటే పవిత్రమైన పని అని ప్రాణాలిచ్చైనా దీని సార్వభౌమత్వాన్ని కాపాడాలని సరిహద్దులోని మా వెర్రి సిపాయిలు, పోలీసుల్లో కొందరు అమాయకులు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చే సమయంలో మా గవర్నమెంటువారికి ఆ సిపాయిలను, పోలీసులను కాసేపు తప్పించమని చెప్పండి. పాపం వారు మధనపడకుండా ఉంటారు. ఎప్పటిలాగే మేము మీ రాకకై ఎదురుచూస్తూ, మీ చేతుల్లో ప్రాణాలొదలడానికి సిద్దంగా ఉంటాం

ఇట్లు,
సగటు మనిషి.

ShareThis