స్వీటు ద్వేషం

టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ స్వీట్ నథింగ్స్ గురించి చెప్పే పోస్ట్ అనుకుంటే మీరు పాలకోవాలో కాలేసినట్టే. మిఠాయులపై నిలువెల్లా సెగలు కక్కుతున్న వేడిలో హాట్ హాట్ పోస్టిది.
"పుత్రా పురుషోత్తమా, ఏమి నాయనా ఈ అకాల క్రోధమేమి, ఈ అకారణ వైరి ఏమి " అని మీకు అనుమానం ఆవేదన కలగవచ్చు అందులో తప్పులేదు. మీరు మిఠాయిలకు దాసులైపోయారు మరి. చిన్నప్పటినుండి అలా మిస్‌గైడ్ చేసారు మిమ్మల్ని. లేకపోతే ఏంటండీ ఏదో పిండిలోనో, పదార్ధంలోనో ఇంత లేకపోతే ఇం........త నెయ్యి వేసి (ఇదిగో ఇక్కడే నాక్కాలేది. ఎవరన్నా వేడివేడి అన్నంలోనో కూరలోనో నెయ్యి వేసుకుంటారు చల్లటివాటిపై వేసుకొని తింటారా !? అహా తింటారాంట. కాని అదేంటొ అర్ధం కాదు ice cold నేతి మిఠాయిలంటే చాలు లొట్టలెయ్యాలంట. వెయ్యకపోతే ఒప్పుకోరంట !) ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కలిపేసి ముద్దచేసి డబ్బాల్లో పెట్టి అమ్మడం అమాయకుల్లా కొనడం. అసలు వేయించిన తినుబండారాలకు ఉండే రుచిలో సగమన్నా ఉంటుందాండీ స్వీట్స్‌కు. మసాల చల్లిన మిర్చీ బజ్జీకు గాని, శనగపప్పు వడలకుగాని, ఉప్పు పచ్చిమర్చి సమేత ఆలు సమోసాలుకు గాని ,   కనీసం అప్పడాలకు సరితూగుతాయాండీ మిఠాయిలు. ఎక్కడా నో మ్యాచ్.


ఈ నిష్టూరమైన సత్యం నాకు చిన్నప్పటినుండి తెలియబట్టి మిఠాయిలకు ఏడంగా ఉండేవాణ్ణి. కాని ఈ సమాజం ఊరుకోదే ఏదో విధంగా లొంగదీసుకోవాలని చూస్తుంది. ఆ కుట్రలో భాగంగానే నా జీవితంలోకి ప్రవేశించింది మైసూర్ పాక్. చిన్నప్పుడు మా ఇంటిదగ్గర్లో ఓ కిరాణా షాపుండేది. ఈ సదరు మైసూర్ పాక్ లు అమ్మేవాడు. పావలాకొకటి. ఇహ మా ఇంట్లో జనం ఎగబడి కొనుక్కునేవాళ్లు. ఓసారలాగే మా అమ్మ ఆ డబ్బా పాక్ కొని తినమని కొంచెం నా చేతికిచ్చింది. దాన్ని బాహ్య స్వరూపాన్ని రకరకాలుగా విశ్లేషించి ఆ కొంచెం లో కుంచెం నోట్లో వేసుకున్నా. ఎబ్బే అస్సలు బాగనిపించలా. అదేమాట అమ్మతో చెబితే 'వద్దంటే మానెయ్, ఇటిచ్చేయ్' అని లాగేసుకుంది, కనీసం నన్ను అభినందించకుండానే! ఇహ అప్పట్లో చుట్టాలింటికి వేళ్ళామో నాకు చచ్చే చావు. వాళ్లేమో మరేమీ దొరకనట్టు ఈ మైసూర్ పాక్ నే పెడతారు. ముందు గొయ్యి వెనక నుయ్యి నా పరిస్థితి. తింటే నాకు పడదు, తినకపోతే వాళ్లకు పడదు.

ఇలా మైసూర్ పాక్ తోనే వేగలేక ఏడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన పుల్లారెడ్డి మిఠాయిలు రంగప్రవేశం చేసాయి జీవితంలోకి. అప్పట్లో దీపావళికి దసరాకి నాన్న పనిచేసేదగ్గర పుల్లారెడ్డీ స్వీట్సో, దద్దూస్ స్వీట్స్ ఇచ్చేవారు. ఓ డబ్బా మొత్తం అన్నమాట అందులో అన్ని రకాలు ఉంటాయ్ లడ్డూలు, కోవాలు, కాజాలు వగైరా వగైరా. ఐతే అందులో మేము 'రబ్బరు స్వీట్' అని పిలుచుకునే ఓ పదార్ధముండేది. పేరుకు తగట్టే దాన్ని తినాలంటే అలా ఓ పావుగంట నములుతూనే ఉండాలి. చూసారా ఎంత అన్యాయమో మిఠాయిలు అని చెప్పి ఇలాంటివి పెడతారా తప్పు కదూ.నేనైతే పడేద్దాం అన్నంతపని చేసేవాణ్ణి. ఇదే మాట నాన్నతో చెబితే 'ఛస్, నువ్వు తినకపోతే ఊకో' అని తిట్టేసేవారు. ఠాట్ ఈ మిఠాయిలతో చస్తే దోస్తీ కుదరదు అని తేలిపోయింది.
నా జీవితంలోని ఇంకో మాయదారి మిఠాయి లడ్డూ. అసలీ లడ్డూని ఎవడు కనిపెట్టాడోగాని వాడు దొరకాలి తొక్కుడులడ్డూ చేసినట్టు తొక్కిపడేస్తా. అరే! లడ్డూ ఇష్టం లేదురా మొర్రో అంటే వినరే. పైగా నేనసలు మనిషినేకాదన్నట్టు, ఫ్రెష్‌గా పంచమహా పాతకాలు చేసినవాడిలా చూస్తారు. బంధువులింటికి వెళ్లినపుడు ఆ పాక్‌ తోపాటు ఈ లడ్డూలు కూడా ఉండేవి. వాళ్లు పెడితే నే వద్దనేవాడిని, వాళ్లదోలా చూస్తే మా అమ్మ వచ్చి 'ఏందొనమ్మ ఏం తినడీపిలగాడు. ఎట్ల జెయ్యాల్నో ఏందో!' అనేది. సెంటీ డవిలాగులు. తరువాత ఇలాగే కొనసాగితే వియ్యాలవారి దగ్గ్రర కయ్యం ఐపోతుందేమోనని అప్పుడపుడూ లడ్డూపారాయణం జరిగేది. ప్రతి అమ్మాయికీ లడ్డూలాంటి భర్త కావాలట! ఆ పోలికేంటో నాకర్ధంకాదు.  వారి కోరికను మన్నించి తిరపతి లడ్డూ మాత్రమే అని ప్రకటించేశా- మావాళ్లు శాంతించారు.  పాపం నా బాధను చూసి ఆ తిరపతి వెంకన్న కూడా ఈ మధ్య లడ్డూ తినడం మానేశాడనుకోండి- అందుకే మునుపటంత బాగుండట్లా-అది వేరే సంగతి.

అసలీ స్వీట్స్  షేపులు కూడా సరిగా ఉండవ్. కావాలంటే ఆ జిలేబిని చూడండి. పైగా గోడమీద పోస్టర్ చూసి చొంగ కార్చుకునేవాడిలా దాన్లోంచి రసం. హైదరాబాద్లో ఉన్నన్నాళ్లు నా సంగతి తెలుసుకాబట్టి ఈ జిలేబీలను తిన్నా తినకున్నా ఏమనేవారుకాదు. ఎప్పుడైతే ఖరగ్‌పూర్ కొచ్చామో, హమ్మనాయ్నోయ్, మొదలయ్యాయి కష్టాలు. క్యాంపస్ లో  Tech-market అనుండేది - చిన్నసైజు షాపింగ్ ఏరియా అన్నమాట. దాంట్లో కొన్ని స్విట్-హాట్ బండ్లు. బజ్జీలు జిలేబీలు చేస్తారు. ఎపుడైనా ఫ్రెండ్స్ తో కలిసి అటువైపు వెళితే మరేం దొరకనట్టు జిలేబీలంటూ లొట్టలేసుకుంటు వెళ్ళెవాళ్లు. పక్కనే వంకాయ్ బజ్జీలనీ, ఆలూ వడలనీ ఎన్నున్నా పట్టించుకోరు. నేనేమో 'నాకొద్దు, ఇష్టంలేదు' అనంటే ముష్టివాడికన్నా హీనంగా చూసేవాళ్లు. అదేదో సినిమాలో వెంకీ చెప్పినట్టు ఆ చూపులో లక్ష బూతులెతుక్కోవచ్చు. కొన్నిరోజులు ప్రతిఘటించి, నీరసించి ఆపైన పాక్షికంగా తెల్లజెండా ఎగరేసా. జిలేబీ వేడిగా ఉంటేనే తింటా అది కూడా మాక్జిమమ్ ఒకటి అని. అప్పటికిగాని నా మీద సెటైర్లు ఆగేవి కావు.
కాని నేనూరుకుంటానా, సిక్కిం ట్రిప్ వెళ్ళినపుడు పరిచయమైందో అద్భుత హాట్ వంటకం. పేరు మోమో. చుసారా పేర్లోనో ఎంతటి టేస్టుందో. వేడి వేడి మోమోను సాస్‌లోనో, వాళ్లిచ్చే పచ్చడితోనో తింటె ఉంటది నా సామిరంగా.....అబ్బో కెవ్వు కేక. కాని ఈ స్వీటు ప్రేమికులకు ఇది నచ్చలేదు. హెందుకు నచ్చుతుంది వొళ్లంతా స్వీటు షుగరు పట్టిందిగా. అప్పుడు వాళ్లన్నారు 'నోనో- మోమో' అని. ఈసారి వాళ్లను వింత చూపు చూడటం నా వంతైంది.

పైగా ఈ స్వీటు బాగోతం ఇప్పుడు బజ్జులకెక్కింది. అబ్జర్వ్ చేస్తూనేవున్నా వారం రోజులనుండి ఒకటే తీపి పోస్టులు. వెన్న కాచిన నెయ్యితో చేసిన మిఠాయిలంట. ఇంటినుంది తెప్పించుకున్న మిఠాయిలంట.... ఠాఠ్! అసలీ పెపెంచకంలో మిఠాయి అనేదే లేకుండా చెయ్యాలి ముందు. అంతవరకూ నే శాంతించ.

ఎంత స్వీటు ద్వేషినైనా నేను మడిసినే, నాకు కళాపోసణుంది, నేనూ జన జీవనస్రవంతిలో భాగమే. పాలకోవాలన్నా, రస్‌మలై అన్నా, గులాబ్ జామ్ అన్నా నాకూ పేమే. అవి తప్ప మిగతా మిఠాయిలన్నీ రూపుమాపాలని ఉక్కు సంకల్పం. రండి నాతో చేయి కలపండి

24 వ్యాఖ్యలు.. :

Sravya V said...

:))

కృష్ణప్రియ said...

నేను సైతం.. కాకపొతే మైసూర్ పాక్ కలుపుకుంటేనే.. మీ ఇష్టం.. :)

రసజ్ఞ said...

హహహ చాలా బాగుందండీ మీ టపా! మరి మా ఊరి స్పెషల్ పూతరేకులో?

ఆత్రేయ said...

విష్ణు ద్వేషి : ఎక్కడరా నీ హరీ, ఎలావుంటాడురా నీ హరీ, అని నిరంతరం హరీ నామ స్మరణ చేసినట్లు మీ టపా ఆద్యంతమూ స్వీటు మయమే. గదతో స్వీట్ బాక్స్ పగల కొట్టి చూడండీ ఏమవుతుందో... !!

బులుసు సుబ్రహ్మణ్యం said...

నేను సైతం స్వీట్ ద్వేషినే. ఏదో పూతరేకులు, బందరు లడ్డూలు, మైసూర్ పాకులు, జిలేబీలు, కాజాలు, కాజు బర్ఫీ, రసమలై ఇత్యాది ఒక వంద పదార్ధాలు తప్ప మిగతా స్వీట్స్ ఏవి ముట్టను.

Rao S Lakkaraju said...

@సుబ్రహ్మణ్యం గారూ నేనూ అంతే. వావ్ ఆ బం ద రు ల డ్డూ లు !

..nagarjuna.. said...

@శ్రావ్యాజీః ఆ నవ్వుకు అర్ధం మీరు స్వీటు పక్షమనా, హాటు పక్షమనా !?
@కృష్ణాజీః మైసూర్ పాక్ ను కూడా కలుపుకోవాలా, మీరు యుద్దం చేయడానికి కాకుండా సంధి కుదర్చడానికి వచ్చినట్టుంది. ఫస్టు లవ్వులా ఫస్ట్ ఎనిమీ కూడా మెమొరబులే. మీరు తోడురానంటే ఏకవీర లెవిల్లో ఏకవైరీ చేసేస్తా :)
@రసజ్ఞగారుః స్ఫెషల్ ఐనా అవి కూడా మిఠాయిలే కదండీ, ఎపుడైనా వాటిని మిర్చి/మిరియాలు వేసో చేస్తే (అప్పుడవి పూతరేకులు అవవుగా) నాకు కబురెట్టండి, మినహాయించేస్తా :D

@ఆత్రేయగారుః అంటే గురూగారు ఈ స్వీటు ద్వేషికి నోట్లో మిఠాయిలు కుక్కి కహాని ఖతం చేస్తారంటారా. ఇకపై బహు జాగురుకతతో ఉండాలి స్మీ!

@బులుసుగారుః పర్లేదు గురూగారు మీరు ఇంకా ఆ తీపి మాయలోనే ఉన్నారు, రోజూ ఈ టపా పారాయణం చేయండి నాలా మారిపోయి నాకు మార్గనిర్దేశం చేద్దురుగాని :)

Anonymous said...

ఏమిటో మరీ మిఠాయిద్వేషులంటే మీతో "కచ్చి" !!

జేబి - JB said...

అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, మినపసున్నుండ, పూర్ణాలు, పరమాన్నం, పప్పుండ/పప్పుచెక్క మొ॥ ఆంధ్ర ప్రత్యేకాలు - ఇవి కూడ మిఠాయిలేనండి. నేతి (అదే డాల్డా)లో పంచదార ముంచి స్వీటుషాపులో పెడితేనే అది స్వీటవ్వాలనిలేదు. :)
పైగా బెల్లం ఆరోగ్యానికి మంచిది.

సిరిసిరిమువ్వ said...

:) నేను కూడా మీ పార్టీనే..అంటే హాట్ పార్టీనే!

..nagarjuna.. said...

@lakkaraju గారు, ఆత్రేయగారు,బులుసుగారు,ఫణిబాబుగారు, జేబిగారు,మువ్వగారుః నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండీ, మీరందరు నా బ్లాగులో ఓ కామెంటు పడేసినందుకు. చాలా చాలా ధన్యవాదాలు :)

@జేబిగారుః ఐతే వాటిని కూడా కలిపేస్తా నా హేటు లిస్టులోకి, బూరెలు తప్ప. చెప్పేదేంటంటే హాటు ఉండగా స్విటు ఏల అని.

@మువ్వగారుః థాంక్స్ అండీ, మద్దతుగా ఒక్కరన్నా దొరక్కపోతారా అని ఎదురుచూస్తున్నా. మీరొచ్చారు చాలు :)

స్నిగ్ధ said...

4E గారు,నాకు నచ్చిన స్వీట్ ఐటెంస్ కొన్ని లిస్టులో ఉన్నాయి..అవి కలిపెయ్యండి..నేను జాయిన్ అయ్యిపోతా...
:)

Unknown said...

మరి ఇంత ద్వేషమా ఈ కారణానికి మీ బ్లాగ్ బాన్ చేయాలి.స్వీట్స్ ప్రేమికులు జిందాబాద్

kiran said...

హిహిహిహిహిహి...నాగార్జున....ముందుగా...same pinch ...
అసలు వీళ్ళకి..బజ్జి లు..వడలు...సమోసా లు..ఎందుకు కనపడవో...!!
నాక jilebi ..జాంగ్రి లను చూస్తే అసలు సహించదు...:P
ఈ మధ్య కాస్త తింటున్నా..!!
ఐనా జిహ్వకో రుచి అంటారు కదా...
వీళ్ళను వదిలేద్దాం..:)

రవికిరణ్ పంచాగ్నుల said...

హేవిటీ..! మైసూర్ పాక్‌ని, జిలేబీలనీ పట్టుకుని ఇల్లా ఏకేస్తారా? అందునా "బాంబే హల్వా" అంటూ ప్రఖ్యాతిగాంచిన దాన్ని పట్టుకుని "రబ్బరు స్వీట్" అంటారా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు నిరసనగా (అప్పుడెప్పుడో ఓ బ్లాగ్మిత్రుడన్నట్టు) ప్రధానమంత్రీ, ముఖ్యమంత్రీ రాజీనామా చెయ్యాలి.. :)

చాతకం said...

సూపరుగా వ్రాసారండి. నా చిన్నప్పటినుంచి చూస్తున్నాను అవే బోరు స్వీట్లు. నాకు మటుకు స్వీటు చేత్తోపట్టుకుంటే చేతికి బంక అంటుకొకూడదు.;)

..nagarjuna.. said...

@స్నిగ్ధాజీః మ్యాటర్ ఇంతవరకూ వచ్చాక కలిపేసుకుంటూ పోతే పార్టి పెట్టి చాప చుట్టేసినట్టౌతుంది. మీరు మంచోళ్లు కాబట్టి బేషరతుగా మాకు మద్దతివ్వండి :)

@శైలబాలగారుః మీరు స్విట్సు, జిందాబాదు గట్రా అన్న కామెంట్ నాకు కనబడటంలేదండి :D

@కిరణ్ః కమాన్, వెంటనే మన పార్టిలో జాయిన్ ఐపో :). ఆలస్యం చేస్తే మనలాటి అమాయక జీవులని పూర్తిగా మార్చేస్తారు వీళ్ళు.

@రవికిరణ్‌గారుః
>>ప్రధానమంత్రీ, ముఖ్యమంత్రీ రాజీనామా చెయ్యాలి<<
మీకు పుణ్యం ఉంటుంది ఆ రాజీనామా పనేదో చేయించండి. నా తరఫున ఓ టన్ను స్విట్లు పంపుతా :D

@చాతకంగారుః సంఘంలోకి స్వాగతం అండీ :)

Ennela said...

ఎం పిలగాడో ఈ పిలగాడు అని అమ్మ బాధ పడుతోంది కదా...నా మాటిని వంద లడ్డూలు 100 పాకులు...బోనస్ గా నీకు నచ్చిన 100 రసమలాయిలు ఆర్దరిచ్చేయ్ ..ఎలాగూ దీపావళి వస్తోందిగా..సరదాగా సెలెబ్రేట్ చేసుకుందాం...అటు అమ్మ ఖుష్.ఇటు మేము కూడా ఖుష్...పార్సిల్ మాత్రం సరాసరి బ్లాగ్లోకానికి పంపించేయ్ సరిపోతుంది.

రాజ్ కుమార్ said...

స్వీట్స్ ని నానా మాటలూ అంటావా??? ఆయ్య్...

నీకు ఒకే ఒక్క విష్యం లో సపోర్ట్ చేస్తా.. "కాజూ బర్ఫీ". నాకు నోట్లో పెట్టుకోగానే జీవితం మీద విరక్తి వచ్చేస్తుందీ. ఇదే మాట అంటే నన్ను వింతజంతువుని చూసినట్టూ చూస్తారు జానాలు. అఫ్కోర్స్ నేను ఇప్పుడు నిన్నూ అదోరకం గా చూస్తున్నా అనుకో..;)(జ.కి)

మిగిలిన స్వీట్లని మాత్రం అనకు.. పాపం చుట్టుకుంటాది ;

పరుచూరి వంశీ కృష్ణ . said...

Nagarjuna , Happy new year :)

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

..nagarjuna.. said...

వంశీ, జయగారు - మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

Country Fellow said...

ఐతే మీది హాటు హోమన్నమాట

..nagarjuna.. said...

@CountryFellow: ఇంత ఆలస్యంగా మీ వ్యాఖ్యను అచ్చువేస్తున్నందుకు మన్నించగలరు (ఇన్ని రోజులకు బ్లాగు తెరిచాను, బద్దకం మరీ ఎక్కౌవౌతున్నట్టు అనిపిస్తుంది ఏవిటో!).

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis