కాలేజీలొ దీపావళి వేడుకలు, కబుర్లు

ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ లో దసరా తరువాత అంత ప్రతిష్టాత్మకంగా జరిపే పండుగ దీపావళి. ఆ రోజున హాస్టల్స్ అన్నీ మట్టి దీపాలతో తమనితాము అలంకరించుకుంటాయి. 'ILLU' (Illumination కు పొట్టి పేరు) లో భాగంగా విద్యార్ద్రులు తమ తమ హాస్టల్స్‌లో తాము ఎంచుకున్న ఒక విషయాన్ని మట్టిదీపాలతో తీర్చిదిద్దుతారు. మరొక విభాగం 'Rangoli'లో భాగంగా సహజ రంగులను,సున్నం, మట్టి వగైరా వాడి నేలపై అపూర్వ చిత్రాలను అవిష్కరిస్తారు. ఈసారి పండుగ మొదట్లో కొన్ని హాస్టల్స్ ర్యాగింగ్ సంబంధిత విషయాల వల్ల దీపావళిని బహిష్కరిస్తామని చెప్పినా చివరకు అవన్నీ సద్దుమణిగి దీపావళి దిగ్విజయంగా, బ్రహ్మాండంగా జరిగింది.

మా హాస్టల్‌‌కు ILLU లో నాల్గొవ స్థానం లభించింది.


 ILLU కోసం దీపపు కుందులను సిద్దం చేస్తున్న విద్యార్దులు


నా రూమ్

RP (Rajendra Prasad) హాల్ విద్యార్దుల ILLU విడియో



పికాసలో  ILLU మిగతా ఫొటోస్ కోసం  ఇక్కడ నొక్కండి.

రంగోళి  స్లయిడ్ షో...



 Rangoli ఫొటోస్ కోసం ఇక్కడ నొక్కండి


దీపావళికి కొద్దివారాల ముందు కాలేజిలో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘం (TCA) నుండి తెలుగువారి కోసం తెలుగు సాంకేతిక నాటక సంఘం (Telugu Technology Dramatics Society - TTDS) ను నెలకొల్పారు.ఇప్పటికే ఇంగ్లీష్, హింది, బెంగాలి నాటక మండళ్లు ఉన్నాయి.కొత్తగా తెలుగు నాటక సంఘం. సంఘం ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యాతల టెంగ్లీష్ మాటల నడుమ 'నవసమాజం' నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడింది.

అంతా బాగానే ఉంది ఈ 'సాంకేతిక' నాటక మండలి ఏమిటి అని ఆలోచిస్తున్నారా. మరేం లేదు, మా ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ కు ఒక వింత ఆచారం ఉంది. కాలెజిలో కొత్తగా ఏదైనా కట్టడం చేసినా, సంఘాలు-బృందాలు ఏర్పడినా  వాటి పేరుకు ముందు ఒక తొండం (తోకైతే వెనక ఉండాలి, పేరుకు ముందు ఉంటుంది కాబట్టి తొండం అనమాట) లాగా Technology అనేది తగిలిస్తారు. Technology Gymkhana, Technology Swimming pool, Technology market, Technology Dance Society, Technology Literature Society.....ఇలా ప్రతిదానికి తొండం ఉంటుంది. అంతకు మించి 'సాంకేతికం' అన్నంత మాత్రాన ఆ లెవెల్ దృశ్యం ఉండదు.


హ....చెప్పాల్సిన సమాచారం ఐపోయింది ఇక సొంత సోది చెబుతా. ఓ రెండు నెలలుగా గమనిస్తున్నాను, బ్లాగింగుకు దూరంగా ఉన్నప్పుడు కూడా నా లైఫ్‌లోకి 'బ్లాగర్' గాడు చొరబడిపోతున్నాడు. ఏదైనా పని చేస్తున్నప్పుడుగాని, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడుగాని లోపల ఉన్న బ్లాగర్‌గాడు బయటకొచ్చి 'ఈ సీన్ ఈ యాంగిల్‌లో బావుంటుంది', 'ఈ సమయంలో వీడి స్పందన ఇలా ఉంది' లాంటి సలహాలిస్తున్నాడు. అందువల్ల Experience తక్కువ Evaluation ఎక్కువ చేస్తున్నాను.
పైపెచ్చు సెమిస్టరు అయిపోవచ్చింది. ప్రాజెక్టు ప్రజెంటేషను, సెమినారు ఆ తరువాత ప్లేస్‌మెంట్ తంతు  ఉన్నాయి...

కాబట్టి  కొన్నాళ్లు బ్లాగింగుకు సెలవు......పునఃప్రవేశం నూతన సంవత్సరములో చేస్తా...


ఈలోపు ఏవైనా పండుగలు, ఎవరివైనా మనుషులవి/ కెమెరాలవి/కంప్యూటర్లవి/బ్లాగులవి గట్రా పుట్టిన రోజులు/పెళ్ళిరోజులు/వార్షికోత్సవాలు లాంటి శుభదినాలు ఉంటే నా తరఫున ముందస్తు ____________రోజు శుభాకాంక్షలు. ఖాళీలో తత్సంబంధిత రోజును, సందర్భాన్ని పూరించుకోగలరు... happybig grin


చాలా రోజులుగా వినిపిద్దామనుకుంటున్నా మీకు ఈ పాటను...ఇప్పటికి కుదిరింది. 'నేను మీకు తెలుసా' నుండి నాకిష్టమైన ఒక పాట...వెస్టర్న్ బీట్స్‌తో (Scorpion King సినిమా నుండి కాపి కొట్టారులెండి ) పూర్తిగా తెలుగు సాహిత్యం.



మరిక సెలవు. Have fun folks....

రైతు సదస్సులో JPగారి ప్రసంగం

సిటి బాబుగా వ్యవసాయం గురించి నాకు తెలిసింది నాస్తి. టీ.విల్లో, దినపత్రికలలో రైతుల సాదక-బాధకాల గురించి విన్నపుడు 'ఓహో అలాగ' అనే బాపతు.....రిజర్వాయర్ నుండి ఖరీఫ్‌/రబీ పంట కోసం నీటిని విడుదల చేయాలని ఎవరనన్నా ఆందోళన చేస్తే అప్పటికి నడుస్తున్న నెలను చూసి  అప్పటికప్పుడు ఖరీఫ్ అంటే ఇప్పుడు వస్తుంది, రబీ అంటే ఈ కాలంలో ఉంటుంది అనే లెక్కలు వేసుకుంటాను. కాబట్టి ఈ టపాలో ప్రస్తావించే విషయాలు నా అభిప్రాయాలు మాత్రమే....అవగాహన లేకూండా మాట్లాడాను అనిపిస్తే  అనిపిస్తే పెద్ద మనసు చేసుకొని సరిదిద్దగలరు.

విజయవాడలో జరిగిన రైతు సదస్సులో జే.పి గారు చేసిన ప్రసంగం ఇక్కడ పెడుతున్నాను. టివి ఛానళ్లు ఇది ప్రసారం  చేసుండరనుకుంటా....వాళ్లకు అంత ఓపిక-తీరిక ఉండవుగా



2వ భాగం



3వ భాగం




ఆ ప్రసంగం విన్నాక నాకు కలిగిన  అభిప్రాయాలు స్థూలంగా ఇవి.

౧)వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయాన్ని బతికించుకోవడానికి పరితపించడం ఏమిటో......!! చూడబోతే తెలుగునేలలో ఉంటూ తెలుగును బ్రతికించుకొవడానికి చేస్తున్న ప్రయత్న ఉదంతంలా ఉంది. మన ఈ ప్రయత్నం చూసి ఆనందించాలో, 'బతికించుకొడానికి' చేస్తున్నాం కాబట్టి బాధపడాలో అర్ధం కావడంలేదు.

౨) వ్యవసాయ రంగం పట్ల రోజురోజుకి తగ్గుతున్న ఆసక్తి- పట్టణాల్లో పుట్టిపెరిగినవాళ్లు ఎలాగు నూటికి 99.9% వ్యవసాయం వైపు వెళ్లరు కాని గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం ఏమిటి!? కారణాలు విశ్లేషిస్తే  నాకు తోచినవి మౌలిక వసతులలేమి, వ్యవసాయన్ని లాభదాయక రంగంగా గుర్తించక నిర్లక్ష్యం చేయడం.

౩)మౌలిక వసతులు:  వ్యవసాయానికి అనుకూలం, రైతు బంధువులం అని చెప్పుకోగానే సరిపోదుగా అది మనుగడ సాగించేందుకు తగిన వనరులను కూడా సమకూర్ఛాలి. పంటకు సరిపడా నీరు, చేతికొచ్చాక  మార్కెట్‌కు తరలించడానికి మెరుగైన రవాణా వ్యవస్థ, నిల్వ చెసుకోడానికి గిడ్డంగులు కావాలి. ఇలా తక్కిన వాటిని వొదిలేసి రుణమాఫీలతో సరిపెట్టేస్తే ఎలా. వ్యవసాయం అనేకాదు ఇవాళ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవలసిన  అవసరం ఉంది. అది రవాణా కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ఆరోగ్య సంబంధితమైనది కావచ్చు , నీటి సదుపాయం కావచ్చు. కావలసింది వీటి అభివృద్ధి....ఇవి అయ్యాక వాటిపై కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చి  ఆర్ధిక రంగాన్ని ఎంత దూరమైనా పరిగెత్తించవచ్చు.

౪)  రైతులే తమ పంటకు ధరను నిర్ణయించుకోవాలి--- ఈ విషయంలో నాకు కొంత విభేదం ఉంది.  ఉత్పత్తిదారుడి చేత  ధర నిర్ణయింపబడిన వస్తువులు మనరోజువారి ఆహారంలో ఉండవు కదా. నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు...పప్పుదినుసుల ధరలపై నియంత్రణ లేకపోతే వాటి ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోతాయి. అలా చేసేదనికన్నా రైతే నేరుగా తన పంటను మార్కెట్‌లో అమ్మేట్టు, మధ్యలో ఉండే దళారీలను కట్టడిచేస్తే బాగుంటుంది.

౫) సుమారు 70%  నూనె సంబంధిత ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నామట. నోరువిప్పితే Energy Sustenance ( శక్తి స్వయంసమృద్ది (?) ) గురించి మాట్లాడే అమాత్యులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించుకోడానికి వీలున్న పామ్‌ఆయిల్, ఇథనాల్‌ను దేశియంగా ఉత్పత్తి  చేయడం గురించి ప్రణాళికలు రూపొందించరేం.....పెట్రోలియం ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించేందుకా. ఇంటర్మీడియట్‌లో ఉన్నపుడు చదువుకున్నా చెరకుపంటనుండి ఇథనాల్‌ను ఉత్పత్తి  చేయొచ్చనీ దాన్ని పెట్రోల్‌తో కలిపివాడితే సంప్రదాయ Fossil Fuel ( తెలుగు పదం ? ) వాడకం తగ్గించవచ్చనీ.....ఇంకా ఆ దిశగా ఏమి చేసినట్టులేదు !!




జేపి గారు తాడేపల్లిగూడెం రైతు సదస్సులో చేసిన ప్రసంగం ఇక్కడ చూడొచ్చు


7999 -> 8000....బ్లాగు పండగ

ఈమధ్య అందరూ మహబాగా మురిసిపోతున్నారు...ఎందుకటా..? వాళ్ల బ్లాగు పుట్టినరోజట. ఓహో అలాగా....బాగు బాగు. మరి పుట్టినరోజన్నాక విషెస్ చెప్తాం కదా...నేను కూడా రాముడు మంచి బాలుడు టైపులో శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్తున్నాను.

ఉన్నట్టుండి ఏమైందో...నా బ్లాగు అలిగి కూర్చుంది. అరే ఇప్పుడేమైందని మూతి ముడుచుకొని కూర్చున్నావ్ ఎందుకు అలిగావ్ అని అడిగా. " అసల్ నీకు బుద్దుందా వయ....బ్లాగుబెట్టి నీ ముచ్చట నిదేగాని నా గురించి ఒక్కరోజైన పట్టించుకుంటివా...సూర్యగ్రహణానికోసారి రాశే నీ ఇంగిలిపీసు బ్లాగుకి ఎప్పుడో బొడ బొచ్చె ఓ వంద మంది వచ్చిండ్రని మస్తు గారాలు బొయినవ్...ధూం ధాం జేశ్నవ్. నేనేమన్న తక్వ జేశ్ననా నీకు. అసల్ ఇయ్యాల గిట్ల నువ్వు ఈ బ్లాగులు రాశే ఓ పదిమందికైన ఎర్కఉన్నవంటె అది నాతోని అయిందికాదు.....? మల్ల నాకేం జేశ్నంవయా నువ్వు? ఓ పుట్టినరోజు లేదు, సదివెటోళ్ళు 'ఈరోజు' ఎక్వ వచ్చిండ్రు అని శెప్పిందిలేదు నేను మాత్రం నువ్వు అన్నట్టల్ల ఆడాలే తాన అంటే తందాన అన్నట్లు.....ఛల్ హట్" అనేసి చేతులు కట్టుకొని కోపంగా నావైపు చూస్తుంది. ఇప్పుడు ఈ కొత్త గోలేంట్రా బాబు, ఉన్న తిప్పలు చాలవన్నట్టు అనుకొని 'ఇంద్రధనస్సు'ని ఎలా శాంతింపజేయాలా, ఏంచేసి బుజ్జగించాలా అని అలోచిస్తూ ఉన్నా....అప్పుడే ఓ అనుకోని సంఘటన జరిగింది.
బ్లాగు హిట్ కౌంటరు 7999 నుండి 8000 చేరుకుంది. ఇది చాలు నా ప్రియమైన బ్లాగుకు నేను అభినందనలు తెలపడానికి.

Congratulations ఇంద్రధనస్సు....

ఈరోజు Renton, Washington DC నుండి Windows 7 లో IE8 నుండి నా బ్లాగును చూసి 8000వ హిట్ ఇచ్చిన రీడర్‌ గారు...మీకు ధన్యవాదాలు :) :)

అలోచించిగా ఆలోచించగా ఇంకో తమాషా సంగతి తట్టింది. ఇన్నేళ్ల (ఛా...ఎన్నో యేళ్ళుగా ఐనట్టు పొజొకటి) బ్లాగు జీవితంలో నేను చూసిన అత్యధిక సున్నాల రికార్డ్ ఇది....అయిదు సున్నాలున్నాయి మరి 8000 లో. 'కళ్ళు గాని దొబ్బాయా...ముడు సున్నాలేగా ఉన్నాయ్' అని లాజిక్కులు లాగొద్దు నా లాజిక్ నాది. నిజంగా అయిదు సున్నాల హిట్ రావాలంటే అంటే లక్ష హిట్లు (మనసులోంచి బ్లాగారాం గాడు : లక్ష హిట్లా...ఏది ఓసారి ఫేస్ టర్నంగ్ ఇచ్చుకోరా నువ్వు....కామెడిలు చేస్తే అతికినట్లుండాల్రా... యెదవ) రాలాలి....నా వల్లయ్యేనా..!!

ఇంకో విష్యం, ఒక సైన్సు మనిషిగా (అంటే non-art field లో ఉన్నవాడిగా స్వామి..) లెక్కలు వేస్తే వచ్చినది...ఇందాక ఐదు సున్నాలున్నాయని అన్నానుకదా...

(0! + 0! +0!)! + (0!+0!) = 8;

(0! +0!)^ (0!+0!+0!)= 8;

(maths బ్యాక్‌గ్రౌండ్ లేనివారి కోసం, 0!=1, 1! =1, 2!=2,3!=6 )

అబ్బో, నాలో కూడా ఓ సంఖ్యా శాస్త్రవేత్త ఉన్నడన్న మాట..గుడ్ గుడ్.





బ్లాగు వార్షికోత్సవాలు జరుపుకునేవారికి అభినందనలు...వారి బ్లాగుకు శుభాకాంక్షలు. Have fun





మరిక సెలవు....

ShareThis