The Greatest Dictator

మానవ సంబంధాలనూ కలిమిలేమిలలో వాటి మార్పులను బంధాల్లోని నైతికత తాత్వికను విశ్లేషిస్తూ బుచ్చిబాబు గారు ’చివరకు మిగిలేది’ అనే చక్కని నవల రాసారు. అందులో కొన్నిచోట్ల వాతావరణం గంభీరంగా తయారౌతున్నపుడు దాన్ని తేలికపరుస్తూ వుంటుంది ’జగన్నాథం’ అనే పాత్ర. కథ-కథాగమనం తో పెద్దగా సంబంధం లేదనుకున్నారోమరి ఈ పాత్రను విశ్లేషించేవాళ్ళు తక్కువ. అయితే నవలా నాయకుడు దయానిధి తో  జగన్నాథం మాట్లాడే ఒక సందర్భం నాకు చాలా ఇష్టం. ప్రస్తుత పోస్ట్ కు లీలామాత్రంగానైనా సంబంధం ఉంటుందని ఇక్కడ రాస్తున్నా. తనకు కావాల్సినవారి క్షేమసమాచారాలు తెల్సుకుంటుండగా దయానిధి జగన్నాథంతో అంటాడు,

ద:"నువ్విలా చిత్రంగా మాట్లాడతావెందుకు? స్వభావమా తెచ్చిపెట్టుకున్నదా ?"
జ:"తెచ్చిపెట్టుకునేది ఏదీలేదు"
"ఎప్పుడేనా నువ్వు నువ్వుగా వుంటావా?"
"నేను నేనుగా వుండే అవసరం, పుస్తకాల్లో మనుషులకి తప్ప మామాలు మనుషులకి రాదు. ఒస్తే వాళ్ళు ఛస్తారు!"
"ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ ఎందుకు మాట్లాడవు ?"
"ఇట్లా మాట్లాడితే ఎవ్వరూ లైక్ చెయ్యరు."
"నీ సంభాషణంతా ఒక్క నటనన్న మాట!"
"అసలు జీవితమే నాటకరంగం; మనం అందరం  పాత్రలం; సంభాషణ నటనెందుకు కాకూడదు ? నటుడు నటించడం మానేసి, తన నిజ స్వరూపం ప్రదర్శించి గొడవలు మొదలుపెడితే, ప్రేక్షకులు ఏం చేస్తారని మీ వూహ ?..."

-- 'ఆకులు రాలడం' అధ్యాయం నుండి.
************************************************

నవ్వడం ఒక వరం, నవ్వలేక పోవడం  రోగం, నవ్వించగలగడం ఒక యోగం అన్నారు. ఈ మాటను కొలమానంగా తీసుకుంటే అతను తన league లో ఉన్నవాళ్ళతో పోల్చినపుడు ఎవరెస్టు శిఖరం  అధిరోహించిన యోగి.

ఇంగ్లీష్ దంపతులు హన్నా చాప్లిన్- స్పెన్సర్ చాప్లిన్‌లకు మొదటి సంతానంగా జన్మించాడు Charles Spencer Chaplin- చార్లీ చాప్లిన్ అంటే ఇంకాస్త సులువుగా గుర్తుపట్టగలరేమో. చార్లెస్ తల్లిదండ్రులిద్దరూ రంగస్థల కళాకారులు,తల్లి గాయని-నటి కాగా తండ్రి స్పెన్సర్ చాప్లిన్ అప్పట్లో పేరున్న నటుడు.చార్లెస్ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా నటనతో పాటు పేదరికాన్నీ పొందాడు. అతను పుట్టాక తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లికి పెద్దకొడుకు-తనకు అన్న అయిన సిడ్నితో పాటు తల్లి సంరక్షణలో పెరిగాడు. కారణాంతరాల వలన తండ్రినుంచి రావాల్సిన భరణం రద్దు అవడంతో చాలా ఏళ్ళు దుర్భర దారిద్ర్యంలో గడిపారు. ఇంగ్లాండ్ కెన్నింగ్‌టన్ రోడ్డు చుట్టుపక్కల ఏమైనా నాటకాలు ఆడితే  వాటిలో హన్నా చిన్నచిన్న పాత్రలు వేస్తూ వెళ్ళదీసుకొచ్చేది, ఐతే అది కుటుంబపోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. పేదరికాన్ని దగ్గరనుంచి చూశాను కాబట్టే దాంట్లోంచి అంతగా హాస్యం పుట్టించగలిగానని తరువాత చెప్పేవాడు చార్లి.  చిన్నపుడు తల్లితో పాటు తనూ నాటకాలకు వెళ్తుండేవాడు కానీ అతని రంగస్థల అరంగేట్రం విచిత్రంగా  జరిగింది. అల్డర్‍షాట్ క్యాంటీన్‌లో హన్నా ప్రదర్శన ఇస్తుండగా ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యం ఎక్కువయి బాధించడంతో ఆమే స్టేజ్ నుండి వెళ్లిపోవాల్సొస్తుంది, ప్రేక్షకుల గోల ను అదుపు చేయడానికి అయిదేళ్ల చాప్లిన్‌ను థియేటర్ మేనేజర్ స్టేజీ మీద వదిలేస్తాడు కొత్తే అయినా తన వయసుకు సజహమైన అమాకత్వంతో ప్రేక్షకులను మెప్పించాడు చార్లీ. కాని ఇక్కడ irony ఏంటంటే చార్లీ మొదటి ప్రదర్శన హన్నా ఆఖరు ప్రదర్శన అదే అవటం. 


హన్నా ఆరోగ్యం చేడిపోయి ఆసుపత్రి పాలవడం,  ఆ తరువాత కొన్నాళ్ళకే తండ్రి కూడా మరణించడంతో చార్లీ దాదాపుగా అనాథ అవుతాడు. ఇక తనను తాను పోషించుకునే పరిస్థితి కాబట్టి తనకు ఇష్టమయిన నాటకాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.స్థానిక నాటకాల కంపెనీలలో చిన్నచిన్న పాత్రలు వేస్తూ తన అసాధారణ ప్రతిభతో ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాడు. యూరప్ అమెరికాలలో పలు ప్రదర్శనలిచ్చాడు. అటు తరువాత హాలివుడ్ స్టుడియో కీస్టోన్ నుంచి పిలుపు రావడంతో అమెరికా వెళ్ళిపోయాడు.

Birth of the 'Tramp':

కీస్టోన్ స్టూడియో వాళ్ళు అప్పట్లో Ford Sterling అనే హాస్య నటుడి స్థానాన్ని భర్తీ చేయడానికి చార్లీతో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా పిలిపించుకున్నారు. స్టూడియో లో చేరనైతే చేరాడుగానీ చాలా రోజులదాకా తనకు ఏ పనీ చెప్పేవారు కాదంట.. నెల జీతం మాత్రం ఇచ్చేవారట. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు కీస్టోన్ భాగస్వామి మ్యాక్ సెన్నెట్ స్టూడియోకు వచ్చి అప్పుడు తీస్తున్న ఒక సినిమాకు కొత్త ఐడియాలు ఏదీ రాకపోవడంతో అక్కడేవున్న చార్లీను చూసి ఏదో ఒకటి చేయమన్నాట్ట. చార్లీ మేకప్ రూం వెళ్ళి అక్కడ కనిపించిన తన సహనటుల కాస్ట్యూములు దొరికినవి దొరికినట్టు వేసుకున్నాడు. వదులు ప్యాంటు, బిగుతు కోటు, పెద్ద బూట్లు, వంకీలు తిరిగిన చేతికర్ర, డర్బీ టోపీ, అంగుళం మీసం తగిలించుకొని బయటకు వచ్చాక అప్పటిదాకా ఉనికిలో లేని ఓ కొత్త మనిషి తానే రూపుదిద్దుకున్నాడని చెప్పాడు. అలా కాకతాళీయంగా ప్రపంచ ప్రసిద్దిపొందిన, ఎందరో గొప్ప గొప్ప నటులు కూడా  అనుకరించిన ’ట్రాంప్’ పుట్టాడు.




ట్రాంప్ పాత్రతో చాప్లిన్ సాధించిన విజయాలు అతడిని ఒక స్టార్ ను చేశాయి.. ప్రొడక్షణ్ కంపెనీలు అతనితో సినిమాలు తీయడానికి క్యూలు కట్టేవి, వేరే ఊర్లకు రైలు ద్వారా ప్రయాణాలు చేయాల్సివస్తే ఎంత గోప్యంగా ఉంచినా అతని రాక తెలిసిపోవడమూ స్టేషన్లు జనాలతో కిటకిటలాడటమూ జరిగేది, గొప్పవాళ్ళతో పరిచయాలూ పెరిగాయి. చిన్నపుడు ఆకలి తీర్చుకోడానికి అన్న సిడ్ని కోటును కుదవ పెట్టే అవసరం నుండి సినిమాకు లక్షల డాలర్లు తీసుకునే స్థాయికి ఎదిగాడు. అయితే ఈనాటికీ చాప్లిన్‌ను గుర్తుపెట్టుకోవడానికి ఇవే కారణం కాదు. గొల్లపూడి వారు చెప్పినట్టు ’ఆకలిని ఆర్టుగా మార్చిన ఘనత’ వల్ల... తన సినిమాల్లో అభినయానికి పెద్దపీట వేసి వాటిలోని పాత్రలలో అమాయకత్వం నుండి అచ్చమైన హాస్యాన్ని పుట్టించి థియేటర్‌కు వచ్చే జనాలను మైమరిపోయేలా చేసినందుకు. చక్కని హాస్యం అమాయకత్వం నుంచి, దగ్గరివారి మధ్య సరసం నుంచి పుడుతుంది ఈ సంగతి చార్లీకి బాగా తెలుసు..దాన్ని వెండితెర పై అద్భుతంగా పండించినవాళ్ళలో చార్లీ మొదటి వరుసలో ఉంటాడు.

నటుడిగా, సెలెబ్రిటిగా ఎన్ని విజయాలు గౌరవాలు అందుకున్నాడో అంతే స్థాయిలో ఇబ్బందులూ పడ్డాడు. ఏ అమెరికాలోనైతే నీరాజనాలు అందుకున్నాడో అదే దేశంలో మనసువిప్పి మాట్లాడడానికి సైతం జంకేవాడు, అదే దేశం ద్వారా వెలివేయబడ్డాడు. సుస్పష్టమైన కారణం నాకూ తెలియరాలేదు కాని రెండవ  ప్రపంచ యుద్ద సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని కోరడానికి, రష్యన్‌‌లతో కలిసి పొరాడాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి మాట్లాడమని ప్రభుత్వమే ఆహ్వానించిన ఓ కార్యక్రమంలో రష్యన్స్ ను సోదరులుగా సంభోదించడం, తాను కాపిటలిస్ట్ సిద్దాంతం పట్ల తటస్థంగా (pro-capitalism కాకపోవడంవల్ల pro-communism అనుకున్నారు(ట)) ఉండటం కారణం అంటాడు చార్లీ. అమెరికా విడిచివెళ్ళాక స్విట్జర్లాండ్ లో మూడవ భార్య ఊనాతో, పిల్లలతో మరణించేదాకా ఉండిపోయాడు.


సాధారణంగా నేటి హాస్యనటులకు సినిమాలలో అంతగా ప్రాధాన్యం ఉండదు, కథతో పెద్దగా సంబంధం ఉండదు... నాయకుడిని స్తోత్రం  చేయడానికో హీరో/విలన్ లేకపోతే వీధినపోయే ఎవవ్వరితోనైనా తన్నులు తినడానికో లేకపోతే సినిమా కథతోనే ప్రేక్షకుడికి విసుగు పుట్టే అవకాశం వస్తుందనుకున్నపుడు హాస్యం జొప్పిస్తారు. చాప్లిన్ అలాక్కాదు హాస్యంతోనే ప్రశ్నించుకునేలా చెయ్యగలడు, నిరంకుశులను విదూషకుడిగా మార్చగలడు బాధను గెలవచ్చు అన్న ధీమా ఇవ్వగలడు హాస్యాన్ని హీరోయిజం కు ఎలివేట్ చేసిన ’తపస్వి’. ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ దురాగతాలకు మిగతావాళ్ళు అవేదన చెందటమో, పిడికిళ్ళు బిగించి ఆవేశం పడటమో చేస్తే చార్లీ మాత్రం తనకే సాధ్యమైన హాస్యంతో హిట్లర్ ను ఓ బఫూన్ లా ప్రపంచం ముందు నిలబెట్టాడు... 'The Great Dictator' ఈ క్లయిమాక్స్ సన్నివేశం అతనిలోని  మానవతావాదానికి చక్కని ఉదాహరణ.అతను క్యాపిటలిస్టు, కమ్యునిస్టు కన్నా ఎత్తులో ఉన్న హ్యూమనిస్టు.





వీడియోకు నా తెలుగు అనువాదం క్లుప్తంగా. చూడడానికి Show/hide బటన్‌‌ను క్లిక్ చేయండి.


Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot.
--చార్లీ
సరిగ్గా ఇలాగే పోలి ఉంటుంది అతని జీవితం. పేదరికం, ఇప్పటి నాగరికత దృష్టి లో కొన్ని దురలవాట్లు, సంపద, కీర్తి, తిరస్కరణ అన్నీ కలబోసి ఉంటాయి. కొండలు లోయలు వంకలు దాటుకుంటూ సాగుతుంది నది ప్రవాహం ఎక్కడో కొండరాళ్ళలో పుట్టే నీటి ధారను చూసినవాడెరగడు అదొక మహా ప్రవాహం కాగలదని, లోయల్లో ఆగాధాల్లో దాని ప్రయాణం చూసి జాలిపడొచ్చు, వంకలు తిరగడం చూసినవాడు తిన్నగా వెళ్లకుండా ఇదేమి వక్రబుద్ది అనుకోవచ్చు.... కాని ఒడ్డున కూర్చొని నదిపై నుండి వీచే పిల్ల తమ్మెరలను అనుభవిస్తూ దాని ప్రయాణం మొత్తం అవలోకనం చేసుకుంటే ఉచ్ఛనీచాలకు మంచి చెడులకు అతీతమైన అందమైన అనుభూతి అది.




ఏప్రిల్ 16 న నా అభిమాన నటుడు చార్లి చాప్లిన్ జయంతి సంధర్భంగా ఓ చిరు నివాళిగా రాసిన ఈ పోస్ట్ సాటివాడిని నవ్వుతూ ఆనందంగా చూడాలనుకునే మనందర్లోని చార్లీలకు అంకితం. Happy Birthday Charile.




***************
Reference: చార్లీ చాప్లిన్ ఆత్మకథ 'My Autobiography' కు అశ్వనీకుమార్ గారి తెలుగు అనువాదం
'నా ఆత్మకథ'
Image Courtesy: Google Image Search

Some web links

చార్లి చాప్లిన్ గురించి గొల్లపూడి మారుతీరావు గారు
http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=29456&Categoryid=11&subcatid=20


చార్లీ సినిమాల గురించి ’నవ తరంగం’ ఆర్టికల్
http://navatarangam.com/2012/07/world-cinema-history8/


*Spoiler Content  పెట్టడానికి  technical guidance అందించిన 'నాతో నేను నా గురించి ' వేణూశ్రీకాంత్ గారికి బ్లాగుముఖంగా కృతజ్ఞతలు.

13 వ్యాఖ్యలు.. :

Karthik said...

మంచి మంచి పుస్తకాలు.. అర్టికల్స్ మాకు ఇలాగె పరిచయం చెస్తుండండీ....

జయ said...

చాలా చాలా బాగుంది నాగార్జునా. చార్లీ చాప్లిన్ ఇష్ట పడని వాళ్ళెవరన్నా ఉంటారా. వీడియో కూడా బాగుంది. ఉండుండి ఓ చార్లీ సినిమా చూసేసామంటే మనలో కూడా ఎంత చేంజ్ వచ్చేస్తుందో కదా. చార్లీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.బుచ్చిబాబు గారి రిఫరెన్స్ కూడా సమయానుకూలంగా ఉంది. గుడ్ అయిడియా.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా కాలం తరువాత బ్లాగులో వ్రాసారు. సంతోషం.
చార్లీ చాప్లిన్ గురించి తెలియని వాళ్ళు తక్కువే. ఆయన గురించి పరిచయం చేసిన తీరు బాగుంది.

ఫోటాన్ said...

హమ్మయ,
ఇన్ని రోజులకి ఇంద్రధనస్సు విరిసింది :)
బాగుంది అబ్బాయ్

వేణూశ్రీకాంత్ said...

పోస్ట్ చాలా బాగుంది నాగార్జునా. చక్కగా రాశారు.

జలతారు వెన్నెల said...

"చక్కని హాస్యం అమాయకత్వం నుంచి, దగ్గరివారి మధ్య సరసం నుంచి పుడుతుంది" so true. ఎన్ని మలుపులో ఇతని జీవితంలో!చాలా బాగుంది నాగార్జున గారు. మీ అనువాదం (video clip) చాలా బాగుంది. ఇంత చక్కని టపా రాసిన మీకు అభినందనలు

..nagarjuna.. said...

@కార్తిక్ (ఎగిసే అలలు) గారు: Thanks for your comment :)

@జయగారు: సినిమా దాకా ఎందుకు అతనిది ఒక చిన్న క్లిప్పింగ్ చూసినా చాలేమో అనిపిస్తుంది నాకు..మాట్లాడకుండానే ఎన్ని రకాల ఎక్స్‌‌ప్రెషన్స్ పలికిస్తాడొ !

@బులుసుగారు: నటుడిగా అందరికీ తెలుసు గురుజీ, ఆయనలోపలి మనిషిని మరోసారి పరిచయం చేద్దామని ఈ పోస్ట్. ధన్యవాదాలు :)

@ఫోటాన్: అవునబ్బా ఎండాకాలంలో ఇంద్రధనస్సు, వింత కదూ! ధన్యవాదః

@వేణూగారూ: మరొకసారి థాంక్యూ :)

@జ.వెన్నెలగారు: Thanks for your compliment :)

Sravya V said...

చాలా బాగా రాసారు నాగార్జున ! బటన్ ఐడియా :-)

శిశిర said...

ఎంత అందంగా కూర్చారూ ఈ టపాని. మీరు రాసిన గంటకే చదివాను. మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదువుతూ ఇప్పుడు ఈ వ్యాఖ్య.

..nagarjuna.. said...

@Sisira ji: మీ కామెంట్ చూశాక నిజంగానే అంత బాగుందేమోనని నా పోస్ట్ ను నేనే చదువుకున్నాను :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.

Thank you Sravya gaaru :)

Unknown said...


బావుందండి నాగార్జున గారు ,

చార్లిస్ చాప్లిన్ గురించి ,మీ బ్లాగు లో పోస్ట్ లు చాలా బాగున్నాయి ....

ధన్యవాదాలు,

http://techwaves4u.blogspot.in/

తెలుగు లో టెక్నికల్ బ్లాగు

Mopuri K Reddy said...

good one :)

..nagarjuna.. said...

@Mopuri: Thanks bud :)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis