Kgp-Hyd-Mum-Kgp

ఇంటికెళ్లి అయిదు నెలలవుతుంది. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కలవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు ఎటొచ్చి ప్రొఫెసరు ఇంటికెళ్లడానికి ఒప్పుకుంటాడొలేదో అనుకుంటూనే అడిగాం, ఓ పది రోజులకు పర్మిషన్. తరువాత తెలిసిందేంటంటే ఆయన కూడా లీవ్ పెట్టబోతున్నారని. ఏమి నా భాగ్యం అనుకొని పది రోజుల ట్రిప్‌ను నాకు నేనే సర్వసత్తాకంగా  పదిహేను రోజులకు పొడిగించుకొని క్రితం నెల 25న బయల్దేరా. వెళ్లేటపుడు ట్రెయిన్‌లో ఒకటే ఆలోచన- కాలేజీలో అయితే రోజుకి 9-10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా, కరెంటు కట్ అనేదే తెలీదు ఇంటికెళితే కరెంటు కట్ ఉంటుంది, అదేపనిగా కంప్యూటర్ పైన  వా్లిపోతే అమ్మో, నాన్నో తాటతిస్తారు, ఎలా మానేజ్ చేయాలా అని.

అలా అలోచిస్తూ చిస్తూ హైదరాబాదులో అడుగుపెట్టా. ఇంటికి చేరుకునేసరికి మా ఇళ్లు కొత్త పెళ్ళికూతురిలా వెలిగిపోతుంది. నే రావడానికి కొద్దిరోజులముందు ఇంటికి సున్నాలద్దారు అదీ దాదాపు పదేళ్ల తరువాత. ఏదైతే ఏమిగాని మా ఇళ్లు మాత్రం అందంగా తయారైంది నా రాక కోసమే అన్నట్లు


                                                                       

                                              కొత్తసీసాలో పాత సారా   అన్నమాట 



ఇంటికెళ్లినా కాలేజిలో ఒంటబట్టిన అలవాటు పోలా...రాత్రి 3:00 అయినా నిద్రపట్టేది కాదు. అందరూ పడుకున్నాక మేల్కోలేక, పడుకున్నా నిద్రరాక డాబా మీద కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగేవాణ్ణి. ఏ 4:00 కో 5:00 కో నిద్రపోయి మధ్యాహ్నం  పన్నెండు, ఒంటి గంట దాటాక మేల్కోవడం ఇలా ఓ నాలుగు రోజులు నిద్రార్పణం అయ్యాయి. ఎలాగైనా తొందరగా నిద్రపోవాలని అలసట తెప్పించుకోవడానికి రాత్రి 7 దాటాక తెగ నడవడం మొదలుపెట్టా. అలా తిరుగుతున్నప్పుడే కనిపించాయి మా ఏరియాలో కొత్తగా పెట్టిన ఓ నాలుగు banquet halls, ఓ కొత్త ATM center.ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా....ఐతే మీకు మా ఏరియా గురించి చెప్పాలి.

ఓ పక్క నాగార్జున సాగర్ రోడ్డు మరోవైపు విజయవాడ హైవే..., ఈ రెండు రోడ్ల మధ్య ఉంటుంది మా ఏరియ

ఆ సంతోష్‌నగర్ నుండి కర్మన్‌ఘాట్ వరకు మూడు కిలోమీటర్లు, ఈ మూడు కిలోమీటర్ల దూరంలో ఒక్క సాగర్  రోడ్దుమీదే   పద్దెనిమిది ఫంక్షన్‌ హాల్స్ ఉన్నాయి, అటుపక్క ఇన్నర్ రింగ్ రోడ్దు మీద ఓ పది దాకా ఉంటాయి. చిన్నాచితకా అనుకుంటున్నారేమో..peak seasonలో ఈ హాల్స్ బుక్ చేసుకోవాలంటే  లక్ష వరకు ఖర్చవుతుంది. ఇన్ని ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయని ఈ మూడు కిలోమీటర్ల వరకు సాగర్ రోడ్దును అనధికారంగా Gardens Street అంటారు. పెళ్లిళ్ళ సీజన్‌లో ఉంటుంది సామి ట్రాఫిక్ జాము, దరువు.....జజ్జనక జ్జజ్జన జనక జనక. ఇపుడు కొత్తగా పెట్టిన ఆ నాలుగు కలుపుకుంటే మొత్తం 36.
ఇక ATM సంగతికొస్తే నాకు తెలిసి హైదరాబాదులో మరెక్కడా ఇన్ని బ్యాంకుల ATMలు ఒకే దగ్గర ఉండవు. ఇప్పటి వరకు మూడే ఉండేవి ( Andhra bank, SBI, Canara Bank) కొత్తగా HDFC వాడు పెట్టాడు. మీకు తెలిసి హైదరాబాదులో కాని ఇండియాలో మరెక్కడైనా కాని ఇంతకంటే ఎక్కువ ATMs ఒకే దగ్గర ఉన్నట్టు తెలిస్తే చెప్పండి లేకపోతే నేను దీని గురించి లిమ్కా రికార్డుకోసం చూద్దామనుకుంటున్నా---కూసింత రీజినల్ ఫీలింగ్ ;)




ఇంటికొచ్చి స్నేహితులను కలుద్దామనుకుంటే వాళ్లు జాబ్స్‌లో బిజీ బిజీ. పోని శని- ఆదివారాల్లో వీలవుతుందనుకుంటే వాళ్లు బంధువులిళ్లకు వెళ్లడమో , షాపింగ్ అనో దొరకలేదు. ఏం చేసేది లేక మమః అన్నట్టు ఇద్దరిని ప్రత్యక్షంగా కలిసి, మరికొందరిని కలవాలనుకున్నా కుదరక ఫోన్లోనే పలకరించి ఇంకొందరిని అసలు ఏ విధంగా కుడా కలవకుండా ముంబై బయల్దేరా. అక్కడ IIT లో మా ప్రెండొకడున్నాడు వాణ్ణి కలవడానికి.
ముంబై వెళ్లడానికి Rs. 272 ట్రైన్ టికెట్టు దొరక్క తత్కాల్ చేసుకుందామని పొద్దునే 5గంటలకు లేచి రిజర్వేషన్ కౌంటరుకెళ్లా. ఆరోజు నా లక్కు అఘోరించినట్లుందనుకుంటా నా ముందు ఇంకో ముగ్గురు ఉన్నపుడు ఓ వెధవ ఆ రిజర్వేషన్‌ చేసే ఆవిడతో గొడవకు దిగాడు ఆవిడేమో అటు గొడవ పెట్టుకోలేక ఇటు రిజర్వేషన్ చేయలేక ఊరకే తాత్సారం చేసింది. పక్క కౌంటరులో ఒకరిద్దరు ముంబైకే బుక్ చేసుకుంటున్నారు...టికెట్లు టపా టపా పిట్టల్లాగా రాలిపోతున్నాయి,  మా లైనులో ఆ సనుగుడుగాడు వెళ్లడంలేదు, పైగా నా ముందు కాన్సిలేషన్  కోసం ఓ కాండిడేటు. కాస్నిలేషన్ కోసం అంత పొద్దునే లేచి తత్కాల్  లైనులో ఎందుకు నిల్చున్నాడో ఎంత బుర్రగోక్కున్నా అర్థం కాలేదు. బాబు నీది కాన్సిలేషనే కాదా ఓ పది నిముషాలయ్యకైనా చేసుకోవచ్చు మేము బుకింగ్ చేసుకోవాలి పక్కకు తప్పుకోరా నాయనా అన్నా వినలేదు. పర్యవసానమేంటొ మీకు చెప్పనక్కర్లేదనుకుంటా. అక్కడి నుండి ఊసూరుమనుకుంటూ వచ్చి నా బ్యాడ్ లక్‌ను, ఆ సనుగుడు వెధవని, ఆ రిజర్వే‌షనావిడని, ఆ కాన్సిలషన్‌గాడిని తిట్టుకుంటూ 1000 పెట్టి ( సారి 992 మాత్రమే ) RTC బస్సులో బయల్దేరా. బస్సులో రాష్ట్రం అవతల ప్రయాణించడం అదే మొదటిసారి. వచ్చే దారిలొ వాతావరణం చల్ల చల్లగా వుంది అంతకు ముందు రోజు రాత్రి వర్షం పడింది కాబోలు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో ఖండాలా చేరుకున్నాం, ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బస్సు కిటికిల్లొంచి కనిపించిన ఆ లోయల అందం ఎంత వర్ణించినా తక్కువే.

ముంబైలో ఈ నెల 11న దిగాను. ఫ్రెండ్‌ రూంకి వెళ్లాక బ్లాగు లోకం ఎలా ఉందో చూద్దామని ‘మాలిక’ ఓపెన్ చేసా.మంటలు కక్కుతూ పోస్టులు కనపడ్డాయి వాటిలో చలికాచుకోవడమో, చేతులు కాల్చుకోవడమో ఇష్టం లేక (నిజం చెప్పాలంటే భయమేసి) అక్కడున్న నాల్రోజులు ఇంటర్నెట్  వైపే వెళ్లలేదు. ఓ మూడు రోజులు బీచుల వెంబడి తిరిగాము. బీచులు అందునా ముంబై బీచుల వెంట కుర్రాళ్లం మేము  మూడు రోజులు ఎందుకు తిరిగామో మీకు చెప్పక్కర్లేదనుకుంటా ;)  ;)


చివరిరోజు Gateway of India  నుండి ఎలిఫెంటా కేవ్స్‌కు లాంచిలో వెళ్లాము. గంటసేపు ప్రయాణం.  సముద్రంలో ప్రయాణించడం , సముద్రంలో పెద్ద పెద్ద షిప్‌లను, కంటైనర్లను చూడటం అదే మొదటిసారి . వెళ్ళేటపుడు వాతావరణం ప్రశాంతంగవుంది.తీరా ఆ కేవ్స్‌కు వెళితే అక్కడ ఆర్కియాలజి డిపార్టుమెంటు వాళ్ళు పండులొ గుజ్జు తినేసి టెంకలు మిగిల్చారు. అదే మహాప్రసాదమనుకొని తిరుగు ప్రయాణమయ్యాం. అరగంట తరువాత వర్షం మొదలైంది గాలులు ఎక్కువైయ్యాయి. సముద్రంలో అలజడి. మా బోటు అలలకు పైకి కిందకు కదులుతుంది కొంతమంది భయపడుతున్నారు ఏమౌతుందోనని, ఇంకొందరు అలలు లాంచిలోకి వస్తుంటే ఆనందిస్తున్నారు ఆ రెండొ గ్రూపులో నేనుకూడా కలిసిపోయా. బోటు తిరిగి Gateway of India దగ్గరకు వచ్చేసరికి అలలు ఇంకా ఎక్కువయ్యాయి, అప్పుడే మా బోటు ఇంజన్‌లో తాడు చిక్కుకొని ఆగిపోయింది.....

కొంతమందిలో భయం మొదలైంది. పక్కనే ఇంకో బోటు ఉండడంతో మా లాంచి నుండి దానికి తాడు లంగరు వేసి మరొక ఒడ్డువైపు తీసుకెళ్లారు అదే అలలగుండా వెనక్కి వెళుతూ. తీసుకెలుతున్నపుడు మధ్యలో తాడు విడిపోయింది.బోటులో ఉన్నవాళ్లలో మళ్లి కలకలం. బోటులో ఇద్దరు High class ఆడవాళ్లు వాళ్ల పిల్లలతో (మరీ చిన్నవాల్లేం కాదు 16-22  మధ్య ఉంటారు) వచ్చారు. ఇంజన్ ఆగిపోయిన దగ్గరనుండి వాళ్ల పిల్లలు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు ఆ అమ్మలేమో ‘ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, దేవుడిని ప్రార్దించండి, మీ వాళ్లకు ఫోన్లు చేసుకోండి’ అనడం మొదలుపెట్టారు వాళ్ల మాటలకు ఆ పిల్లలు, ఇంకొందరు కూడా భయపడడం మొదలుపెట్టారు.   కుర్ర జంటలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. లాంచిలో ఓ మరాఠి ఫ్యామిలి ఉంది- లొయర్ మిడిల్‌క్లాస్ అనుకుంటా అందులోంచి ఒకాయన ‘మరేం ఫరవాలేదు సముద్రంలో ఇలాంటివి మామూలే, లాంచి వాళ్లు ఇలాంటివి చాలానె చుసుంటారు ఎవరికి ఏం అవదు’ అంటూ సర్దిచెబుతున్నాడు వాళ్ల కుటుంబంలో ఆడవాళ్ళు కూడా ఏమి గాబర పడటం లేదు.

లాంచివాడు ఆ విడిపోయిన తాడును మళ్ళి కట్టి వేరే పనిలో పడ్డారు. నేను, నా స్నేహితుడు లాంచి వాడి దగ్గరకు వెళ్లి ఎటు తీసుకెళుతున్నారో కనుక్కున్నాం...కాసేపట్లో చేరిపోతాము అని పక్కవాల్లకు చెప్పి ఊరుకున్నాం. లాంచిలో ఓ పంజాబీ యువకుడు, కుటుంబంతో వచ్చిన ఓ ముస్లిం యువకుడు  కూడా ఏమి అవదు అది చాలా చిన్న సంఘటన అని ధైర్యం చెబుతున్నారు. ఆ high class ఆడవాళ్లు మాత్రం ఆగటం లేదు. లాంచివాడిని ‘మీ ఓనర్ నెంబరు ఉందా?’, ‘ఇంజన్ ఇంకా ఎందుకు బాగు చేయలేదు’, ఆ మరాఠి ఆయన్ను ‘మీకెలా తెలుసు కాసేపట్లో చేరుకుంటామని?’ అంటూ తను హైరానా పడుతూ మిగతావాళ్లను కూడా హైరానా పెట్టింది. ఆ గోల భరించలే నేను ఆ మరాఠి ఆయన్తో కబుర్లు చెప్పటం మొదలుపెట్టా. Gate way of India నుండి మళ్ళి సుమారు గంట తరువాత  మా లాంచి్ మెజగాన్ డాక్ దగ్గర ఆగింది. అందరం సురక్షితంగా బయటపడ్డాం. కాని ఆ గంటసేపు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోయే సమయం. మనిషిలో ‘చావు’ అనే భయాన్ని, High classలో డాంబికాన్ని, మధ్యతరగతలో ధైర్యాన్ని దగ్గరగా చూసా. అక్కడ భయపడటానికి వాళ్లు high class వాళ్లొ, ధైర్యంగా ఉండటానికి, చెప్పడానికి ఆ మరాఠి అతను మిడిల్‌ క్లాసో అవనవసరం లేదు. కాని సాధారణంగా మనం ఈ తరగతుల గురించి వినే మాటలను ప్రత్యక్షంగా చూడటం నిజంగా ఓ deep impression కలిగిస్తుంది. ఎన్నిసార్లని గనుక ఇటువంటివి ఎదురౌతాయి!!

అక్కడున్నపుడు ‘తాళము వేసితిని గొళ్లెము మరచితిని’ పని చేసా.  IIT mumbai students కు విండోస్7 ఒరిజినల్ వెర్షన్ ఉచితంగా ఇస్తారు అని అంటే ఎగేసుకుంటూ install చేసుకున్నా...తరువాత వెలిగింది బల్బు firefoxలొ బ్లాగు ఫీడులను బుక్‍మార్క్ చేసిన ఫైల్‌ను  బ్యాకప్ చేయడం మరచిపోయానని.....వా :( .
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అప్పుడెపుడో క్రితం సంవత్సరం ఖరగ్‌పూర్ వచ్చేముందు బుక్‌మార్క్ ఫైలుని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసా. కాని అందులో అన్ని ఫీడ్స్ లేవు. గుడ్డిలో మెల్ల, ఆ మాత్రమైనా ఉన్నాయి. నిన్నంతా కూడలి, హారం, జల్లెడ, మాలికలు తిరగేసి మిస్ అయినవాటిలో కొన్ని తిరిగి సంపాదించా....

బొటు విహరం నుండి తిరిగొచ్చా రాత్రి 8 కి జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిరావాలి, వర్షం మొదలౌతుండగా ఆఘమేఘాల మీద ఓ ఆటో పట్టుకొని బయల్దేరాం. తీరా స్టేషను చేరుకొనేసరికి అక్కడ ట్రైను ఎనిమిది గంటలు వాయిదా అని announce చేసారు ఎందుకని వాకబు  చేస్తే రెండు వారాల క్రితం మావోయిస్టులు ట్రైను పేల్చినప్పటినుండి ఉదయం నాలుగింటికి మార్చారంట...మాకు మామూలుగా తిక్కరేగలేదు. అసలే ఆన్‌లైన్‌లో  తత్కాల్‌లో బుక్ చేసుకున్నాం అందులో వాయిదా అని ఏం చెప్పలేదు, పైగా స్టేషను చేరుకునేప్పుడు గొడుగు పోగొట్టుకున్నాం, దానికి తోడు ఉదయం జరిగిన లాంచి సంఘటన....ఒక్కసారిగా పిచ్చిపట్టినట్టు అనిపించింది. అయినా ఆ మావోలకి బలిసి కాకపోతే ఏం దొరకలేదా. ఎవడో చేసినదానికి అమాయకులను చంపేసారు....వీళ్లకు వంతపాడుతూ విప్లవ సంఘాలు..damn these people.

వాయిదా అని తెలిసి ఆ స్టేషనులో ఉండలేక కాంపస్‌కు తిరిగి వెళ్లాం. అర్థరాత్రి రెండుగంటలకు లేచి ఆటో వెతుక్కొని స్టేషన్ వచ్చా. ఎనిమిది గంటలు వాయిదా పడటం, ప్రయాణంలో రైలు  నాలుగు గంటలు ఆలస్యం వెరసి 36 గంటలు రైల్వే వారి సేవలో మునిగిపోయి ఖరగ్‌పూర్‌లో తిరిగివచ్చిపడ్డా.
ఖరగ్‌పూర్‌లో దిగగానే చేసిన మొదటిపని, స్టేషను బయట ఉండే Taaz ధాబాలో ఓ వేడి వేడి చికెన్ బిర్యాని లాగించడం. చూడ్డానికి చిన్న ధాబా లాగుంటుంది కాని ఇక్కడ చేసిన బిర్యానియంత బాగా ఎంటై.....ర్ ఖ‌రగ్‌పూర్‌లో దొరకదు.

పేరులో ’నేముంది’

అసలీ పెపెంచకంలో ఓ మనిషికి చాలా బాగా నచ్చేది ఏంటి? ఎవళ్ల సంగతో ఎందుగ్గాని నామటుకైతే ఎవరికైనా వాళ్ల వాళ్ల పేర్లు నచ్చుతాయి అని అనుకుంటున్నా...అందుకే మరి చిన్నప్పటినుండి వ్యాకరణ భాగాలలో మనకు నచ్చిందేంటయ్యా అంటే నామవాచకం, సర్వనామం ( సర్వనామం అంటే అమృతం సీరియల్లో సర్వర్ సర్వం పేరనుకునేరు...అదికాదు). నా ఈ ఇష్టం ఎంత ముదురంటే పక్కవాడు ఎవరిదన్నా లేక ఏదైన వస్తువు, ప్రదేశం పేరు తప్పుగా పలికితే చాలు నాలో ఠాగూర్ నిద్ర లేస్తాడు. పలికేది నోరు తిరగని అరబ్బు పేరైనా సరే, కరేక్టుగా పలకాల్సిందే. లేకపోతే మెజార్టి జనం పలికినట్టు అనాల్సిందే, అంతవరకు వదిలేవాణ్ణి కాదు. అలాంటిది నాకు, నాతో, నాపట్ల  నా పేరు సరిగా వినడానికి  తిప్పలు పడాల్సివచ్చింది....అదేదో సామెతలొ అందరికి శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడ్డట్టు.

మన పేరు నాగార్జున చారి. స్కూళ్లొ ఉన్నప్పుడు నాగార్జున అనొకడు, చారి అనొకడు ఎవరికి నచ్చిన పార్టు వాడు ఊడగొట్టి పిలిచేవాళ్లు. ఇరగ్గొడితే ఇరగ్గొట్టారు సరిగానే పలుకుతున్నారుకదా అని అనుకున్నా ఇంటర్‌ వచ్చాక తెలిందేంటంటే అది ఇష్టం కాదు convenience అని. ‘నాగార్జున ’ అనే నాలుగు శబ్దాల పదంకన్నా జనాలకు ‘చారి’ అనే రెండ శబ్దాలపేరే  పలకడానికి తేలికనిపించింది. ఇంజనీరింగ్‌లో మా ఇంటర్ ఫ్రెండ్స్ ఉండడంతో పొడుగు పేరు చెప్పించుకుందామనుకున్నా పొట్టి పేరు  పాపులరైపోయింది. ఈ స్టేజిలో వచ్చిన సమస్య స్పెల్లింగుతో....ఇంగ్లీషులొ నా పొట్టి పేరు chary అని ముద్రితమైపోయింది. అలా కాక e-mailsలో, orkut scraps లో, SMS లో char‘i’ అని ఎవరైనా రాస్తే గుండెలు తోడేసినట్టుండేది. ఇదెలాగూ తప్పేట్టు లేదని బ్లాగ్లోకంలో అయినా సరిగా పిలిపించుకుందామని display name ను ‘nagarjuna’ అని ఇంగ్లీషులో ‘చారి’ ని తెలుగులో రాసేసా. అందరు ఇక చచ్చినట్టు సరిగా రాస్తారు, పలుకుతారు అని.  
తరువాత మొదలైంది మొసళ్ల పండగ. నా పోస్టులకు వ్యాఖ్యలు రాసేఫ్ఫుడు, నే రాసిన వ్యాఖ్యలకు జవాబిచ్చేఫ్పుడు, ఇక్కడ కూడా convenience ప్రకారమో ఏమో,  పొట్టి పేరును ఎంచుకున్నారు బ్లాగర్లు. కుంటే కున్నారు మర్యాదకోసమో ఏమో దాని చివర ‘గారు’ అని అలంకారమొకటి నేనేదో పెద్దవాణ్ణైనట్టు!! అదీకాక ‘@ చారి గారు’ అంటుంటే ‘ఢీ’ సినిమాలో బ్రహ్మి గుర్తొచ్చేవాడు. ఇహ ఇలాక్కాదని ఈ రోజే ఆ పొట్టి పేరుని ఏకి పీకి పారేసా.....చూద్దాం ఈ లాజిక్ ఎన్నాళ్లు పని చేస్తుందో..

బెంగాల్‌లో పేరు కష్టాలు ఇంకో ఎత్తు. ఇక్కడ పేరు చివర  చాలామందికి అకారం ధ్వనిస్తుంది ‘బందోపాద్యాయా’, ‘భట్టాచార్యా’,‘ఆచార్యా’ ఇలాగ. కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో కంటి చెకప్ చేయించుకోడానికి డాక్టర్‌ను  కలుద్దామనివెళ్లా అక్కడ రిసెప్సెషన్‌ దగ్గర..
రిసె:  నామ్
నేను: నాగార్జున చారి
రిసె: నాగార్జున్‌ ఆచార్యా ?
నేను: నహి, నాగార్జున చారి...
రెసె: ఓహ్.., నాగార్జునాచార్యా..?
నేను: మనసులో " నీ బెంగాల్ బుద్ది తగలెయ్య".. నహీ భయ్ నాగార్జున చారి
రెసె: అచ్చా...ఠీక్ హై.
వీడిని దాటుకొని డాక్టర్ రూంలో వెళ్లాను
డా: హ్మ్...(రెసెప్షెన్లో ఇచ్చిన చీటీ చూస్తూ) నాగార్జునాచార్యా...what do u do?
నేను: మనసులో " నీ బొంద చేస్తుంటాను. నా పేర్రా.."  బయటకు- ఇట్స్ నాగార్జున చారి సర్... అయామ్ స్టడియింగ్ ఇన్ IIT
డా: హా..నాగార్జున..? ఆంధ్ర?..

కష్టాలు ఇక్కడితోనే ముగిసాయని నేననుకుంటే అవి మా క్లాస్‌రూంలో తిష్ట వేసాయి. మాకు GDR అని ఓ చంఢసాసన ప్రొఫెసరున్నాడు ఆయనతో మాట్లాడాలంటే  చాలామందికి కింద పడిపోయేది.  నేను ఈయన కోర్సు  రెండో సెమిస్టరులో తీసుకున్నా... మిగతా ప్రొఫెసర్లెవరు attendance తీసుకునేవారు కాదు ఏదో అమావాస్యకో పున్నమికో తప్పిస్తే..ఈయన మాత్రం నిష్ఠాగరిష్టుడిలా రోజు ఓ నాలుగైదు పేర్లు అడిగేవాడు...ఆ నాలుగైదుగురిలో నేనొకన్ని. నాపేరును రిజిష్టర్‌లో ఎలా రాసుకున్నాడొకని రోజుకో పేరుతో పిలిచేవాడు. పోపులో కరివేపాకును కలిపినట్టు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అనేవొడు. అందులో కొన్ని ఆణిముత్యాలు
‘నాగార్జు‍న్ ఆచార్యా’- ముందుగానే అలవాటైంది కాబట్టి ఏమనిపించలేదు
‘నాగార్జునాచార్యా’- ఇదికూడా
‘నాగారాజునా’ ఆ.....
‘రాజునా’
‘రాజునా చార్యా’ 
‘నాగారాజునాచార్యా’- వామ్మో....

ప్రొఫెసరిచ్చిన దెబ్బకు క్లాసులో తెలుగు స్నేహితులు తెగ నవ్వుకునేవాళ్లు. ఈయనొక్కడే అనుకుంటే క్లాస్‌లో బెంగాల్ ఫ్రెండొకడు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాడు. ‘చారి’ ని హిందిలో ‘చార్ ఈ’  = 4E గా మార్చేసాడు. తిక్కరేగి  లెఫ్టు రైటు ఇచ్చేసరికి ఆ పేరు ఎక్కువ రోజులు నిలవలేదు.
ప్రొఫెసరేంట్రా బాబు ఇలా వాయొంచేస్తున్నాడు నేనేం పాపం చేసానుకుంటే ఓ రోజు దగ్గరికొచ్చి రిజిష్టర్‌ చూపించి ‘ఈజ్ యువర్ నేమ్ ఎంటర్డ్ కరెక్ట్లి’ అన్నాడు. అందులో చూస్తే naga rajuna chary అని ఏ పార్టుకాపార్టు విరగ్గొట్టి రాసుకున్నాడు. ఇందుకా మహానుభావా ఇన్ని రోజులు ఆడుకున్నావు నాపేరుతో అనుకొని అదికాదు సార్ మధ్యలో gap లేదు అని సరిచేయించుకొన్నా ఇకనుండి విషాదశ్రవణయోగముండదుకొని ఆనందపడుతూ...
మరుసటి రోజు క్లాసులో ఆయన attendance తీసుకోడానికి బయల్దేరాడు. నా పేరు పిలిచే వంతొచ్చింది.
మా క్లాసువాళ్లు... ఓ సెలిబ్రిటి రాకకోసం ఎదురుచూస్తున్నవాళ్లలా
నేను.... కేసు ముగించి రిపోర్టు సమర్పించే CBI వాళ్లకోసం ఎదుర్చూసే మీడియా వాళ్లలాగా
ప్రొఫెసరు.... పెద్ద భయకరమైన వార్త చేప్పెవాడిలా కాసేపు ఆగి
" ద్రొణాచార్యా..."

అంతే....మిగతావాళ్లు పెదాలు మూసుకొని లొలొపల ప్రొఫెసర్‌కు వినపడకుండా తలలు దించుకొని రెండు సెకన్లకోసారి నన్ను చూసుకుంటూ విపరీతంగా నవ్వుకుంటున్నారు, నేనేమో విగత జీవుడులా అలా చూస్తూ ఉండిపోయా. కనీసం రెండు వారాలు పట్టింది మావాళ్లు దీన్ని మర్చిపోడానికి.
ఆ తరువాత సెమిస్టర్ పరీక్షలోచ్చాయ్....మొదటి సంవత్సరమైపోయింది. ఇకనుండి క్లాసులుండవు, ఆయన చేసే ప్రయోగాలుండవు కాస్తంత relaxation....కాని స్నేహితులకు ఆ పేర్లు ఇంకా గుర్తున్నాయి....వెధవలకి

ఋతుపవనాలొచ్చేసాయ్...

ఎట్టకేలకు ప్రళయ భానుడి ప్రకోపాన్ని తగ్గించడానికన్నట్లు చల్లని గాలులని మోసుకుంటూ చిరుజల్లుల సమేతంగా ఋతుపవనాలొచ్చెసాయి మా హైదరాబాదుకి. తొలకరిజల్లుల తాకగానే నేలతల్లి పులకించిపోయి సువాసన సౌరభాలను వెదజల్లింది. ఆ పరిమళం అమోఘం.....


వంగదేశపు ఎండలు తట్టుకోలేక కొన్నిరోజులు ఇంటిదగ్గర గడుపుదామనివస్తే ఇక్కడ ఇంకా దారుణంగా ఉండింది పరిస్థితి. ఏ రోజుకూడా 42కి తగ్గిందిలేదు. ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోదామనుకుంటే మాది గ్రౌండ్‌ఫ్లోర్‌ కట్టడం మాత్రమేనాయె. పగలు సూర్యారవుగారి ప్రత్యక్ష ఎండ బాదుడు, రాత్రుళ్లు పగలు పీల్చుకున్న సెగ వదులుడుతో ఇన్ని రోజులు దిమ్మతరిగిపోయింది. హమ్మయ్య...., చివరకు మేఘాలు తీపి కబురు మోసుకొచ్చాయి.  చిటపటమంటూ చినుకులు మొదలైనాయి.....ఆల్ హ్యాపీసు.

చినుకులు పడుతుంటే కాసేపు అలా తడుద్దామనుకున్నా. అట్లా చేస్తే మా ఇంట్లో వాళ్లు నన్ను ఉతికి ఆరేస్తారని ఆగిపోయా...హ్మ్...ఏం ఫరవాలేదు, నేను మా కాలేజికెల్లి అక్కడ వానలో enjoy చేస్తా. వర్షంలో క్రికేట్టాడాలని మహా కోరిక నాకు, ఇంతవరకు తీరలేదు. ఆ ముచ్చటకూడా తీర్చుకోవాలి. మీరు మాత్రం ఏమాత్రం అవకాశం కలిగినా వర్షంలో తడిసిపోండి.
అలాగని తుఫానువల్లో, అల్పపీడనంవల్లో కురిసే వర్షంలో తడిసేరు.....natural వర్షమైతేనే తడవండి.


ఋతుపవనాగమన శుభాకాంక్షలు
వేడివేడి పకోడీలు ప్రాప్తిరస్తు

ShareThis