మై తెలుగువాలా హై-1

ఎవరేమన్నాగాని
నేన్ తెలుగోడ్ని బై
నేను తెలుగువాడిని
నేను తెలుగోనబ్బా

ఓకె, పాయింట్‌కి వస్తున్నా. గతకొద్ది వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలింగించేవిగా ఉన్నాయి. కలిసుండలేం విడిపోదాం అనొకరు, లేదు సమైక్యంగావుందామని మరొకరు చేస్తున్న ప్రయత్నాలు,ఉద్యమాలు ఒకరిపట్లఒకరికి నష్టం కలిగించేవిగావున్నాయి.తెలంగాణగూరించి ఉద్యమించేవాళ్ళు సీమాంధ్ర నాయకుల వైఖరిపట్ల కాకుండా అక్కడి సామాన్య ప్రజలపట్ల కూడా వ్యతిరేకంగా ప్రవర్తించడం, సమైక్యంఅనేవాళ్ళు కేవలం కలిసుందామని మాత్రమే అని పరిష్కారం చెప్పకపోవడం ఇలాంటివి అసలు విషయాన్ని జఠిలం చేస్తున్నాయనిపిస్తుంది.
ఈ సంఘటనలక్రమంలో నాకు కల్గిన అభిప్రాయాలను, కొన్ని ప్రశ్నలను ఇక్కడ పెడుతున్నాను.

సమైక్యవాదులకు

౧.తెలంగాణావాదులు తమ సమస్యకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం మాత్రమే పరిష్కారం అని నిర్దిష్టంగా చెప్పినప్పుడు, మీ సమస్యల పట్ల అవగాహనా,సానభూతీవున్నాయి అయినా కలిసివుందామంటున్నారు. కలిసివుండి ఆ సమస్యలను ఎలా ఏ విధంగా పరిష్కరిస్తారో ఎందుకు చెప్పలేకపోతున్నారు.

౨.ఉద్యోగాల్లో ప్రాంతాలవారిగా కేటాయింపులకోసం తెచ్చిన GO.610,ముల్కీ నిభందనలు ఎందుకు అమలుకు నోచుకోలేదు. దాని అమలు తెరపైకి వచ్చిన ప్రత్తిసారి జేఏసి ఉద్యమాలు, ఫ్రీజోన్‌ లాంటివి ఎందుకు వస్తాయి. పోనీ 610 GO అమలొ విధానపరమైన నిర్ణయాలు(ఒకవేళ మరొక ప్రాంతానికి నష్టం కలిగేదిగా) తీసుకొనే ఉద్యోగాలు తప్పించి executive level ఉద్యోగాల్లో అయినా అమలైవుంటే KCR లాంటివాళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళా?


౩.హైదరబాదు: ఎంతసేపూ తెలంగాణా కోరుకొనే వాళ్లు చెప్పే అన్నికారణాలను ఖండించడమేకాని సమైక్యాంధ్ర కోసం పసేలేని వాదన వినిపించేవాళ్లను పట్టించుకునేవాడేడి. ఎందుకంటున్నానంటే ‘సమైక్యం’వినిపించేవాళ్లలో హైదరాబాదుని మేం అభివృద్ధి చేశాం, అభివృద్దిలో సింహభాగం పాత్రపోషించాం , తెలంగాణా ఇచ్చేట్లయితే హైదరాబాదుని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలనే వాళ్ళని ఏందుకు ప్రశ్నించరు? అంటే మనకు మద్దతిస్తున్నాడు కాబట్టి వాళ్ళుద్దెశేమైనా ఫరవాలేదనుకుంటున్నారా- అలాగైతే KCR సోనియాను పొగిడినా,తిట్టినా తప్పులేదు, మీ రాతలకి విలువలేదు.

౪.తెలబాను: ఏ లుచ్చాగాడు( seriously, i mean it) మొదలు పేట్టాడోగానీ తెలంగాణా కావాలనుకునేవాళ్ళను మొత్తం ఈ గ్రూపులో కలిపేసారు. ‘తెలబాను ఓ తెలబాను’ అని పాటలొకటి, మళ్ళీ వాటికి ప్రశంసలు. తెలంగాణావాదులేమైనా తాలిబాన్లలాగా అన్ని ప్రాంతాలు తమ అధికారంలోనే ఉండాలనేమైన అన్నారా. విలీనమైన రాష్ర్టం వద్దు తమని తాము పాలించుకునేలా ప్రత్యేక రాష్ర్టం కావాలనే అన్నారుగా, పోనీ ఇప్పటి వరకు ఎరైనా తెలంగాణేతరులకు ప్రాణహాని తలపెట్టారా. ప్రభుత్వ, కొన్నిఅతితక్కువ (అది కూడా అది-ఇది అని చూడని విధ్వంస పరంపరలో) సంఘటనల్లో సామాన్య ప్రజల ఆస్తుల ధ్వంసం జరిగింది. భయాందోళనలు కలిగించినమాట వాస్తవం. అయితే ఒకటి ‘భాగో-జాగో’ అని నాయకులు అన్నప్పుడు పెద్దగా ప్రమాదంగా పరిగణించలేదు, ఖండించడం తప్పిస్తే. బస్సు దహనాలు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పుడు ఒక్క సీమాంధ్ర ప్రజలేకాదు తెలంగాణా ప్రజలు కూడా భయపడ్డారు. ఆమాత్రందానికే ‘తెలబాను’ అనేబిరుదు, దాన్ని వాదుకుంటూ వ్యాసాలు.
ఒకవేళ ఈ పదం మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులు అన్న మాటల తరువాత పుట్టివుంటే,వాళ్ళను ఉద్దేశించి అనివుంటే, అలాఅనడాన్ని ప్రశంశిస్తే అంతగా బాధపడేవాడ్నికాదు. ప్రత్యేకం కావాలన్నందుకే ‘తెలబాను’ పుట్టాడు, దానికి అనుబంధంగా ‘T-ఇడియట్స్’ , దీన్ని విమర్శించే సమైక్యవాది ఒక్కడుండడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొనే సమైక్యరాగం ఏంటో నాకర్థంకావట్లా.

౫.హింస: ప్రత్యేక ఉద్యమంలో ఉమ్మడి ఆస్తి (బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు) ధ్వంసం అవుతున్నాయి, ఇది ద్వేషపూరిత ఉద్యమం తప్పితే నిజమైన ఉద్యమం కాదని చాలా బ్లాగుల్లో అన్నారు. మీతో నేను ఏకీభవిస్తున్నా-విధ్వంసం సరైందికాదని. ఈ హింసని విమర్శించిన వాళ్ళు సమైక్యోద్యమంలో భాగంగా BSNL ఆఫీసుకి, పోలీసు స్టేషన్లకీ నిప్పు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో (SVU అనుకుంటా) labs ధ్వంసం చేసినప్పుడు, ఆయిల్ రిఫైనరీలు ముట్టడించినప్పుడు ఏందుకు నోరు మెదపలేదు. సమైక్యంకోసం చేస్తే అది నిజమైన ప్రబలమైన కోరిక వ్యక్తం చేసినట్లు, తెలంగాణాలొ చేస్తే అది విద్వేషపూరితమైనదా ?

౬.కేసిఆర్: ప్రత్యేక రాష్ర్టం వద్దనుకునేవాళ్ళు విషయం తెలియకపోయినా తెలంగాణావాదానికి వ్యతిరేకంగా మాట్లాడ్డానికి ఓ మాంచి పాయింట్‌. KCRమాత్రమే తెలంగాణా అంటున్నాడంటారు. వాణ్ణి (ఎందుకంటే తెలంగాణాలో తెలంగాణాకొసమే kcrని చాలామంది సమర్థిస్తున్నారుకాని KCRనచ్చికాదు) తిడుతూ మొత్తం తెలంగాణావాదమే లేదంటున్నారు. ప్రత్యేక భావమేవుంటే 2009 ఎన్నికల్లో ఎందుకు ఓట్లు సంపాదించలేదు,గ్రేటర్లో ఎందుకు నిలబడలేదు అని అడిగేవాళ్ళు అసలు 2009 ఎన్నికల్లొ ఎన్ని పార్టీలు తెలంగాణాను తమ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టాయి, ఎన్ని పార్టీల అధినాయకులు తెలంగాణాకి సానుకూలమి చెప్పాయి, 2004 తరువాత కరీంనగర్ ఉపఎన్నికల్లో సదరు KCR ‘తెలంగాణా’అనే ఒకేఒక ఎజెండాతో పోటిచేసినప్పుడు ఎంత మెజార్టీతో గెలిచాడొ ఆ తరువాత మళ్ళి పోటీ చెసినప్పుడు ప్రజలు అతణ్ణి తిరస్కరించారా తెలంగాణా భావాన్ని తిరస్కరించారా అని ఆలోచించరేం?
ఇప్పుడు KCRకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకగణం, యూనియన్లూ,సంఘాలు 2004,2009 ఎన్నికలప్పుడు ఏమయ్యారు? పొత్తుపెట్టుకున్న నాయకులని ఎందుకు నిలదీయలేదు? KCR ప్రవర్తనపైన అతని అంతరంగంపైన మాట్లాడిన సదరు వక్తలు లగడపాటి లాంటి psuedo సమైక్యవాదులగూరించి మాట్లాడరేం?


తెలంగాణావాదులకు
౧. మీరు తెలంగాణా కావాలీ అనేప్రతిసారి ఇంకోప్రాంతపు నాయకుల అధికార వివక్ష గురించి గాకుండా అక్కడి మొత్తం ప్రజలపట్ల వ్యతిరేకంగా ఏందుకు ప్రవర్తిస్తారు. అక్కడి ప్రజలు జీవనోపాది కోసం ఇక్కడికి వచ్చిర్రుగాని వనరులు దోచుకోడంకోసం కాదే, అలావచ్చింది నాయకులు. ఆల్లకు వ్యతిరేకంగా మాట్లాడుండ్రి. గంతేగాని ‘ఆంధ్రవాలా భాగో’, ‘ఆంధ్రోల్లని తరిమిగోడ్తం’ అని ఎవడో అంటె ఏమనరు, తెలంగాణాకు ఎదురు మాట్లాడితే నారాజ్‌ ఐతరు. ఏంది వయా ఇది?

౨. సమజ్‌గాక అడ్గుతున్న ‘ఆంధ్ర బ్యాంక్‌’ అనె పేరువుంటే గది ఆంధ్రోళ్లు పెట్టిందైతదా? దాని ఆఫీసు బర్బాద్‌ చేశిండ్రు. ఏమన్న ధమాక్‌ఉన్న పనేనా. KCR దీన్ని మంచిపనే అంటె సవాల్‌ జేసిన తెంగాణావాదిలేడు. ఏందిబై ఇది.

౩. మొన్న ఉస్మానియాల ‘ సంక్రాంతి పండగకి సొంతూరు పొయ్యేవాళ్ళు మళ్ళి తిరిగి రాకండి’ అన్నరు. గదేమన్న సరైందా? మీ బండ్లకు AP బదులు TG అని పెట్టిండ్రుసరే మంచి పని వేరోళ్లకు నష్టం లేదు. మీ అంతరంగం చెప్పారు. అంతేగాని ఆల్లని రానియ్యం, పారిపోండ్రి అనేదేందివయా...


సశేషం...

ShareThis