సృష్టిరచన దిశగా ఆధునిక విశ్వామిత్రుడు

జీవపరిణామ క్రమంలో మనిషి అవతరించాక అతనికి తన ఉనికి తెలిసినప్పటినుండి ఆ ఉనికి కారణమేంటో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో తనకుతాను వేసుకున్న ఒక్కో ప్రశ్నకు అవాంతరాలను అధిగమిస్తూ జవాబు వెతుక్కుంటూవున్నాడు. ప్రస్తుతం ఆధునిక మానవుడికి అంతుచిక్కకుండావున్న రెండు ముఖ్యమైన ప్రశ్నలు స్థూలంగా...

1. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బ్రహ్మ పదార్ధం ఎక్కడినుండి వచ్చింది ? అది ఎందుకు విస్ఫోటనం చెందింది ?

2. జీవం అనే సంక్లిష్టమైన స్థితికి  కారణం అలౌకికమా లేక కేవలం రసాయనిక చర్యలేనా ?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానాల కోసం తరాలుగా ఎడతెరిపిలేని ప్రయత్నం జరుగుతుంది.  ఇటీవల జరిగిన పరిశోధనల ఫలితంగా శాస్త్రవేత్తలు పైన చెప్పిన రెండవ ప్రశ్నకు సమాధానం రాబట్టి తద్వారా  జీవం ఆవిర్భావానికి తోడ్పడిన కారణాలను విశ్లేషిస్తున్నారు.

అమెరికన్ బయాలాజిస్టు జే.క్రెయిగ్ వెంటర్ తమ పరిశోధనలలో భాగంగా బాక్టీరియా కణంలోకి పరిశోధనాశాలలో రూపొందించిన కృత్రిమ జీనోమ్‌ ను ప్రవేశపెట్టి ఆ కణాన్ని విజయవంతంగా పని చేయించగలిగారు. పరిశోధన ఫలితాలు విశ్లేశించేముందు అసలు ఈ  కణాలు, జీనోమ్ అంటే ఏంటొ ఒకసారి చూద్దాం.

ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలను ఎలాగైతే పేర్చుతామో అలాగే ప్రతి జీవి శరీరము కణాలు అనే ఇటుకలతో నిర్మించబడుతుంది. మానవ శరీరం కోట్లాది కణాలతో శరీరములోని ఒక్కో భాగము ఒక్కో విధమైన కణాలతో నిర్మితమైవుంటుంది. ఇటుకలకు ఎలాగైతే రంగు, ధృఢత్వం లాంటి లక్షణాలుంటాయో కణానికి కూడా అలాంటి లక్షణలుంటాయి - ఆ కణము చేసే పని ఏంటి అని. కణంలోని జీనోమ్ కణం పనితీరుని నియంత్రిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆహారం నుండి శక్తి ఉత్పాదన, ప్రత్యుప్పత్తికి ఇతర జీవక్రియలకు కావలసిన జీవరసాలను తయారుచేసేవి కణాలైతే యే యే కణాలు ఏ పని చేయాలో నిర్దేశించేవి వాటిలోని జీనోమ్ అన్నమాట. మనం అప్పుడప్పుడు DNA అని వింటూ ఉంటాం కదా ఈ జీనోమ్ ఆ DNA అనే కార్బన మూలకానికి సంబంధించినదే.

చిత్రంలో ఎరుపు రంగుతో గుర్తించిన ప్రాంతంలో శక్తి ఉత్పాదన జరుగుతుంది, నీలం రంగుతో గుర్తించబడ్డ ప్రాంతంలో (Nucleus - కణ కేంద్రకం ) DNA వుంటుంది.

ఇప్పుడు విషయానికి వస్తే సదరు శాస్త్రవేత్తలు చేసిందేమిటంటే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసిన జీనోమ్‌ను కణంలో ప్రవేశపెట్టారు. కృత్రిమ  జీనోమ్ ప్రవేశపెట్టినప్పటికి కణం యథాలాగనే పనిచేసింది. కాని ఇక్కడ జీనోమ్ ఒక్కటే కృత్రిమం......తక్కిన కణభాగాలన్నీ బ్యాక్టీరియాలోనే వున్నాయి కాబట్టి దీనిని మనిషి చేసిన 'జీవం' అనలేము. అయితే ఈ  ప్రయోగాన్ని అనుసరించి మరొక శాస్త్రవేత్తల బృందం మొత్తంగా ఒక కృత్రిమ కణాన్నే రూపొందించేందుకు పూనుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు  cell membrane ( కణం యొక్క గోడ) ను తయారు చేయగలిగారు. మిగతా కణభాగాలను అభివృద్ది చేయడానికి ఇంకా కొన్నాళ్ళు పట్టవచ్చు. అటు తరువాత జీనోమ్‌ను ప్రవేశపెట్టి కణానికి ప్రాణం పోయగలగడం లాంఛనమే........

కృత్రిమ కణాన్ని సృష్టిస్తున్నాం మరైతే మనుషులను తక్కిన జీవులను కృత్రిమంగా తయారు చేయవచ్చా ? అనే సందేహం వస్తుంది కదూ.....దానికి సమాధానం 'చేయవచ్చు కాని అనుకున్నంత సులువుకాదు'. ఎందుకంటే ప్రస్తుతం మన కంటికి కనిపించే, చాలావరకు కంటికి కనపడని ప్రాణుల్లో కోట్లాది కణాలుంటాయి. ఒక్కో కణానిది ఒక్కో ప్రత్యేకత పైగా వాటి మధ్య సమన్వయం వుంటుంది. ప్రస్తుత ప్రయోగాలను అనుసరించి అంత సంక్లిష్టత సాధించడం కష్టంతో కూడుకున్నది......మన సమీప భవిష్యత్తులో కుదరకపోవచ్చు.

అయితే........కొన్ని సూక్ష్మక్రిములు వుంటాయి వాటి శరీరంలో ఒకే ఒక కణం వుంటుంది. ఈ ప్రయోగాల ద్వారా అటువంటి ఏకకణ ప్రాణిని  సృష్టించినా చాలు తరాలుగా మనిషిని సమాధానం దొరకని ప్రశ్నకు తెరదించడనికి......తద్వారా 'దేవుడు' అనే భావనను అర్ధం చేసుకోవడానికి. ఆరోజు అసాధ్యం మాత్రం కాదు.

పోస్టులోని చెప్పిన ప్రయోగాల విషయం ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ నొక్కండి

ఆర్టికల్ courtesy : FB link by a friend

బులుసు సుబ్రహ్మణ్యం గారు తన ఈ-మెయిల్‌లో సూచించిన మరికొన్ని ఆర్టికల్స్

Dr. Venter తో BBC వారి ఇంటర్వ్యూ
ది టెలిగ్రాఫ్‌లో ని ఆర్టికల్
నేచర్ న్యూస్‌ వారి ఆర్టికల్

మనసుమాట

పసికందును లాలిస్తున్న
అమ్మ చెబుతుంది విను
మమత ఎంత నిష్కల్మషమో

నిలువెల్లా సోయగంతో అలరారే
ప్రకృతి  చెబుతుంది విను
ప్రాణమెంత అమూల్యమో

కవనము చేసే కవి కలం చెబుతుంది విను
తననుంచి జాలువారే అక్షరమెంతటి సమ్మోహనమో

ఎడబాటుతో రగిలే ప్రియుడి
విరహం చెబుతుంది విను
నెచ్చెలి అధరమెంత మధురమో


నిను కొలువుచేసుకొని ఆరాధించే
నామది చెబుతుంది విను
తనకు నువెంత అపురూపమో


రొబో! రొబో! ఈ సినిమా చాలా ఖరీదు గురూ...

ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ రియల్ లైఫ్ కామెడి ట్రాజెడి థ్రిల్లర్ మూవి. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే  మీ  బ్యాడ్‌ లక్  నేనేమి చేయలేను.

అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు. అందుకు ఎలాగైనా పగ ప్రతీకారం తిర్చుకోవాలని, పోగొట్టుకున్నచోటే వెతుక్కొవాలని తహతహలాడిపోతున్న రోజులు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక రోజు తలైవార్ రజిని సినిమా వస్తుందని తెలిసి మంచి ఛాన్స్ వచ్చిందని మా ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టా..
 "గుడ్, మంచి ఛాన్స్‌ఇది. దీన్ని వదలొద్దు. నువ్వు టికెట్లు బుక్ చెయ్యి. మిగతా స్కెచ్చు తర్వాత రాద్దాం" అన్నారు.
ఏంటి మనందరికి నేను బుక్ చెయ్యాలా....ఎప్పటికైనా  reimbursement అవ్వుద్దారా  అని దీనంగా మొహం పెట్టి నివేదించుకున్నా. ఆ పాషాణ హృదయాలు కరగకపోవడంతోతప్పక  నాతోపటు  ఆరుగురికి బుక్ చేయాల్సొచ్చింది. సినిమా చూడాల్సిన రోజు వచ్చింది.  సైన్యం 14 మందిని  పోగేసుకొని కాలెజ్ నుండి  టాక్సీలో స్టేషన్ చేరుకున్నాం. హౌరాకు ఎక్స్‌ప్రెస్ టికెట్లు తీసుకొని ట్రైన్ కొసం ఎదురు చూస్తున్నాం.
అరగంటైంది ఒక్క ట్రైను రాలా.....
గంటైంది...ఒక్క ఎక్స‌ప్రెస్   ట్రైను రాలా. వచ్చిన లోక్‌ల్ ట్రైన్‌లను మావాళ్లు వదిలేస్తున్నారు మూడు గంటలు అందులో గడపడం ఇష్టం లేక. అసలే చలికాలం కావడంతో ఎండకు ఒళ్లు చివుకు చివుకుమంటుంది. పైగా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒరేయ్  ఇలాగైతే మనం శుభం కార్దు పడే సమయానికి చేరుకుంటామేమోరా...ఎదో ఒక ట్రైను ఎక్కేసి తొందరగా పోదాంరా అన్నాను.
"ఆగు బే...హడావిడి చేస్తావెందుకు. ఎళ్లగానే మనకు రెడ్ కార్పెట్టెసి వెల్కం ఏం చెప్పరు. ఐనా  వెళ్లేది ఫస్ట్ షో కు కదా...కాసేపాగ" న్నాడు బాక్స్ సంతోష్‌గాడు. నోర్మూసుకొని ఉండిపోయాన్నేను. ఇంకో అరగంట అయ్యాక మమ్మల్ని ఉద్దరించడాని అన్నట్లు ఎక్స్‌ప్రెస్ రైలొకటి వచ్చింది. ఖరగ్‌పుర్ నుండి హౌరా మధ్యలో అది ఒక్కసారే ఆగుతుంది... పైగా హౌరా ఆఖరు స్టేష‌న్ కాబట్టి స్లీపర్లో సీట్లు చాలామటుకు ఖాళీగా ఉన్నాయి  సభాశ్ అనుకొని ఎక్కడానికి నిశ్చయించుకున్నాం. అసలే తీసుకున్నది జనర‌ల్ టికెట్లు, అందరం ఒకే బోగీలో ఎక్కితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని మేము నాలుగు గ్రూపులుగా (G1, G2, G3, G4 అనుకోండి) విడిపోయి మూడు బోగీల్లో(B1, B2, B3 అనుకోండి) ఎక్కాం. నేను నాతో ఇంకో ముగ్గురు ( G2)  కలిసి  ఒక బోగీలో(B2) ఉన్నాం. సీట్లు ఖాళీగా ఉండడంతో ముగ్గరం RAC సీట్లో ఇంకొకడు పక్కన లోయర్ బెర్తు సీటులో సెటిలయ్యాం. రైలు కదిలింది...సుమారు గంటన్నర తరువాత అది ఆగాల్సిన స్టాపుకూడా దాటేసింది, ఇక ప్రాబ్లం ఏమి ఉండదనుకొని సొల్లు కబుర్లేవో చెప్పుకుంటున్నాం.

అంతలో మావాడొకడు "అరె మన B1 బోగీలోవున్న నలుగురు G1 గాళ్లు ఏంచేస్తున్నారో చూసొస్తా"నన్నాడు. కాసేపయ్యాక వాడు పరిగెత్తుకుంటా వచ్చి " ఏ...వాళ్లను స్క్వాడ్ పట్టుకున్నాడు. బాబులు ఫైన్ కడుతున్నార"న్నాడు. Waste fellows అనుకొని శంకర్ గురించి, ఐశ్వర్యారాయ్ గురించి etc etc గురించి మా కబుర్లలో మళ్లా మునిగిపోయాం. కాసేపటికి స్క్వాడ్ మా బోగీలొ కనిపించింది. ఎలాగైనా ఫైన్ తప్పించుకోవాలని ఇంటెలిజంట్‌గా ఆలోచించి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసాం. మా నలుగురిలో ఒకడు పక్కన ఉన్న లోయర్ బెర్తులో, ఒకడు అప్ప్ర్‌ర్ బెర్తులో నిద్రపోతున్నట్టు జీవించాలని, మిగతా ఇద్దరు కూర్చున్న RAC సీట్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లలా కటింగ్ ఇచ్చుకుంటూ సెటిల్ అవ్వాలని ప్లాన్. నేనూ మా  రాహుల్‌గాడు RAC సీట్లో కూర్చుండిపోయాం రజినిని మించి నటిస్తూ.  ముగ్గురు స్క్వాడ్స్ ఒక్కొక్కరు మా సీటు దాటుకొని వెళ్ళారు ఒక్కరుకూడా మమ్మల్ని ఏమి అడగలేదు. బ్రిలియంట్ ప్లాన్ వండర్‌ఫుల్‌గా పని చేసిందనుకొని పొంగిపోతున్నాన్నేను....హ్మ్ నాకెంతెలుసు in front crocodile festival అని. అందరికన్నా ఆఖరునవున్న స్క్వాడ్ దగరకొచ్చి 'టికెట్ ప్లీజ్' అన్నాడు. ఇంకేముంది ఖేల్ ఖతం. జేబులో ఉన్న జనరల్ టికెట్టు తీసి చూపించా.
"ఇది జనరల్ టికెట్, స్లీపర్‌లో చెల్లద"న్నాడు
"అంటే..సీట్స్ ఖాళిగా ఉన్నయని ఎక్కాం"
"అలా కుదరదు....ఫైన్ కట్టండి" . " అవునూ టికెట్ నలుగురికి తీసుకున్నావుగా మిగతా ముగ్గురేరి"  అని తన మిగతా స్క్వాడు మిత్రులని పిలుస్తూ అన్నాడు.
యాక్టింగ్‌లో  జీవిస్తున్న ముగ్గురిని తట్టిలేపి స్క్వాడ్‌కు చూపించాను. నలుగురికి ఫైన్ రాస్తున్నారు స్క్వాడ్.
"ఎంత?" ప్లాపయిన సినిమా ప్రొడ్యూసర్ మొహం పెట్టుకొని అడిగాను.
"330"
"ఒహ్..నలుగురికి కలిపి అంతేనా....చాలా చీప్ అయ్యాయి ట్రైన్ జర్నీలు" మా ఫ్రెండ్‌తో అన్నాను.
"ఒక్కొక్కరికి 330 " ఆ గుంపులో ఉన్న ఒకానొక తెలుగు స్క్వాడ్‌ నుండి రిప్లై...

!@#(*%&((%#

"సార్...కొంచెం తగ్గించండి...అసలే స్టూడెంట్స్‌ మేము" దీనంగా వేడుకున్నాం.
"నథింగ్ డూయింగ్" అని వాళ్లు చలాన్లను బరబరా బరికేస్తున్నారు. నలుగురమూ ఆ ఫైన్ కట్టేసి ఎదవ టైమింగ్ అనుకొని సెటిలయ్యాం.
"శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా" బాక్స్ సంతోష్ గాడు సెలవిచ్చాడు. ఆ పాయింటు నాకు financialగా సరిగా అనిపించకపోయినా  logicalగా బావుందనిపించి ఊరుకున్నా.
తాయిలం సమర్పించుకున్నాక G1 గ్రూపు నుండి అనిల్‌గాడు  వచ్చి " ఏరా పర్సులు ఖాళి చేయించుకున్నారా" అని ఒకటైపు చులకనగా ప్రశ్నించాడు.
"లేదురా... మీరు ఫైన్ కట్టడం చూసి మేము ఒక బ్రిలియంట్ ఐడియా వేసి తప్పించుకున్నాం" అని ఈసారి ఇంకెక్కువ జీవించేసి చెప్పాం వాడికి.
"బొంగేం కాదు...మీరు డబ్బులు కడుతుంటే నేను డొర్ దగ్గర నిలుచొని చూస్తూనేవున్నా"
ఆ మాటకు గాలి తీసేసిన ట్యూబులా చల్లబడి మీరెంత కట్టార్రా అని ఆరా తీసాం. ఈసారి వాడు గాలి తీసిన టైరు మొహం పెట్టి " ఫైన్ కట్టండి అన్నప్పుడు డబ్బులు లేవని చెప్పామురా...వాళ్లు మా పర్సులు తీసుకొని అందులో నొట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ల చలానా రాసుకొని మిగిలిన 400 తిరిగిచ్చారు. దరిద్రం ఏంటంటే  వాడు రాకముందు మా దగ్గర 1800 ఉన్నాయో 2000 ఉన్నాయో తెలిసి చావట్లేద"ని ఒక మాదిరి వైరాగ్యపు నవ్వుతో అన్నాడు.

ఈలోపు మా రాహుల్ గాడు B3 బోగీకి వెళ్ళి కొత్త ఇన్‌ఫర్మేషన్‌ మోసుకొచ్చాడు. ఏం జరిగిందిరా అని అడిగితే.." హైలైటమ్మా... G3, G4 (ఈ గ్రూపులో ఇద్దరే ఉన్నారు) ఒకే బోగీలో ఎక్కారు ఒకరు ఈ చివర ఇంకొకళ్ళు అటు చివర కూర్చున్నారు. G3కు మనకులాగే  బొక్క పడింది."
"మరి G4 అయినా సేఫా" ఆత్రంగా అడిగాము.
"ఆళ్లదే ట్విస్టు. వీళ్ళిద్దరు అక్కడ లోయర్ బెర్తులో కూర్చుంటే కరెక్టుగా స్క్వాడ్స్ అందరూ వాళ్ల ఎదురు బెర్తులో రెస్టు తీసుకోవడానికి కూర్చున్నారంట. మనోళ్లు గుమ్మడికాయ దొంగల తరహాలో ఉండటం చూసి వాళ్లక కూడా కోటింగ్ ఇచ్చారు" ఒకింత గర్వంగా చెప్పాడు. ఆ మాట విని ఒకటే నవ్వు.

రైలు హౌరా వచ్చింది. నాలుగు గ్రూపులు ప్లాట్‌ఫాం పై చేరుకొని ఒకళ్ల మొహాలు ఒకరం చూసుకొని 14 మందిమి  అందరం ఏకరీతిన పట్టుబడ్డందుకు (  తుచ్చమైన ఈ ప్రపంచములో దాని పరిభాషలో చెప్పాలంటే వెధవలమైనందుకు )  ఈఈ అని నవ్వుకున్నాం. (స్వగతం: హుం ఇంకా నయం అంతకు ముందురోజు స్నేహితులు ఇంకొందరు ఇదే ట్రైనులో వెళ్ళి ఇలాగే పట్టుబడి మమ్మల్ని ఈ ట్రైను ఎక్కొద్దని చెప్పారని చెప్పానుకాదు). స్టేషను బయటకొచ్చి టాక్సీలు మాట్లాడుకొని సుమారు గంట ప్రయాణం తరువాత సరదు మల్టీప్లెక్స్ ఉన్న మాల్‌కు బయల్దేరాము. థియేటర్ చేరగానే గుర్తొచ్చిందేటంటే పొద్దటినుండి అసలే తినలేదని. మాల్‌లో KFC కనపడగానే అరికాళ్లలో ఉన్న ప్రాణం లేచొచ్చింది. ఇంకేముంది అందరం ఛలో KFC. 
లోపలికెళ్ళాక  ఎవడిక్కావాల్సింది వాడు ఆర్డరిస్తున్నాడు. నాది + నా G2 స్నేహితుల ఆర్డర్ చెప్పడానికి క్యూలో వెయిట్ చేస్తున్నా. పక్క క్యూలో వెరే గ్రూపు మెంబరొకడు " మామా నా కార్డు swipe చేస్తే బిల్లింగ్ అవడంలేదురా...నీ కార్డ్ ఇస్తావా. కాలేజ్‌కెళ్ళాక సెటిల్ చేస్తా"నన్నాడు. ఇప్పుడున్న బొక్కలకు తోడు ఇదొక బొక్కనాకు, వీడెప్పుడు సెటిల్ చేసేనో అని మనసులో అనుకొని " sure మామా నీకన్నా ఎక్కువనారా" అని నవ్వుతూ వాడికి కార్డిచ్చాను. Brunch (breakfast + lunch = brunch ) చేసాక  కౌంటర్లో  టికెట్లు తీసుకొని థియటలోకి వెళ్లాం.

ఇప్పుడోక చిన్న ఇంటర్వెల్....ఈలోపు మీరు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ గట్రా పుచ్చుకొనిరండి. నేను వెయిట్ చేస్తూవుంటా..

**********************************************************************************


అందరం సీట్లలో సెటిలయ్యాం.  హాల్‌లో లైట్లార్పేసారు. రొటీన్ ప్రకటనలు ఐపోయాయి. సినిమా సర్టిఫికెటు డిస్ప్లే అయింది. ధియేటర్లో ఒకటే ఈలలు. గోల గోలగావుంది. టైటిల్లు పడుతున్నాయ్. ఈలలు ఇంకా ఎక్కువయ్యాయి. RAJINI అని  ఒక్కొక్కటే అక్షరాలు పడుతుంటే మాకు థియేటర్లో సౌండ్ సిస్టం  బాలేదనిపిచ్చింది. అదే మన APలో ఐతేనా.. సినిమా టైటిల్ పడుతుంటే DTS హోరులో  హాలు దడదడలాడిపోయేది. ఏం చేస్తాం రజిని సినిమాకు కూడా కాలం కలిసి రాలేదని బాధపడిపోయి సినిమా అలాగే చూసేసాం.


సినిమా అయిపోయింది. మాల్ బయటకు వచ్చాం. చుట్టుపక్కన ఎక్కడా ఆటొలు టాక్సీలు గట్రా కనిపించలా. అక్కడేవున్న సెక్యూరిటీని అడిగితే అది సిటి outskirts కాబట్టి అంత రాత్రిపూట ఆటొలు టాక్సీలు ఉండవన్నాడు. మరెలా అని అనుకుంటుండగా ఓ పది నిముషాలు నడుచుకుంటా వెళ్తే అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడినుండి టాక్స్లీ/ఆటో దొరకొచ్చని సెలవిచ్చాడు. మా ప్రాప్తాన్ని తిట్టుకోడన్నిక్కూడా ఓపికలేక అలా నడుచుకుంటూ  వెళ్తున్నాం. పదినిముషాలు అలా నడుస్తూనేవున్నా  కూడలి ఏదీ కనిపించలేదు. దారిన పోయేవాళ్లని ఒకరిని అడిగితే ఇంకో పది నిముషాలు నడవండి వస్తుంది అన్నారు. అప్పుడు చూడాలి మా స్థితి. (ఇక్కడ డైలాగులేమన్నా expect చేస్తున్నారా ? భలేవారే...ఇంత ట్రాజెడిలో కూడా డైలాగులెందుకు సార్/మేడమ్ ). మొత్తానికి అలా నడిచాక  చౌరస్తా చేరుకొని ఒక అరగంటపాటు దొరికిన ఆటోలను టాక్సీలను వాళ్లు ’మేం రాము’ అంటున్నా ’దాదా చలో, దాదా ఆవో’ అని అడుగుతూనేవున్నాం. చివరకు దయగల ఒక దాదా మా వేడుకోలుకు జాలిపడి ఇంకొక ఆటొను పిలిచి మమ్మల్నందరిని హౌరా చేర్చాడు. అక్కడనుండ ఖరగ్‌పూర్ స్టేషన్, స్టేషన్ నుండి  కాలేజ్ చేరుకునే  సరికి అర్దరాత్రి మూడు అయింది మరియూ  ఒక్కొక్కడికి కేవలం కేవలం రూ. 1000 ఖర్చయింది. ఒకరికొకరం  ’గుడ్‌నైట్’ ’గాడిద గుడ్డు’ చెప్పుకొని మంచం మీద వాలిపోయాం.


మర్నాడు ఉదయం లంచ్ దగ్గర అందరం కూడుకొని గతదినం తాలుకు తీపి సంఘటనలను నెమరు వేసుకుంటున్నాం. అంతలో నిన్న మాతోపాటు రాని నరేష్‌గాడు వచ్చాడు. "ఏరా సినిమా బావుంది కదా...శంకర్ ఎక్సలెంట్‌గా తీసాడు" అని చెప్పాడు. "ఆ...అవున్లే బాగా తీసాడు. ఇంతకీ నువ్వెప్పుడు చూసావు.  DC++ లోనా ( ఇది కాలేజ్‌లో ఉండే ఓ internal కంప్యూటర్  నెట‌వర్క్. సినిమాలు, పాటలు, సాఫ్ట్‌వేర్లు విద్యార్దులు ఇందులో ఇచ్చిపుచ్చుకుంటారు ) ? అని అడిగాన్నేను. " లేద్రా...బాంబే థియేటర్లో మధ్యాహ్నం చూసానురా. నిన్న మధ్యాహ్నం నుండే వేసాడు తెలుగు వెర్షన్‌" అని రిప్లై ఇచ్చాడు. వాడిచ్చిన సమాధానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటారా...... సదరు బాంబే థియేటరు క్యాంపస్‌ నుండి సైకిల్‌పై అరగంట దూరం..... :(


"టికెట్ ఎంతరా" విషణ్ణవదనుడనై అడిగాను వాడిని.
బ్యాక్‌గ్రౌండులో మంద్రంగా సంగీతం వినపడటం మొదలుపెట్టింది నాకు.
"ముప్ఫై రూపాయలు రా" అని చిద్విలాసంగా సెలవిచ్చాడు నరేష్‌గాడు.


హరిమా హరిమా నేనో సింహపు కొదమా, నువ్వో జింకై వస్తే కొమ్మా వదలనులెమ్మా....
పాట ఫుల్‌గా వినపడుతుంది నాకు. అప్పుడు పులి చేతిలో, నిన్న సింహం చేతిలో...ఛీ వెధవది...***********************************************************************************

ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్‌ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః
కావున ప్రజలారా, ఈ కథను విన్నవారు కన్నవారు రైలు ఎక్కేప్పుడు తమ టికెట్టు పరిధిని ఒకటికి పదిసార్లు చూచుకుందురని. సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏ కంపార్టుమెంటు కనపడితే ఆ కంపార్టుమెంటు ఎక్కవద్దనీ. సినిమాకు వెళ్లెముందు పూర్తి అవగాహనతో వెళ్లెదరని. తద్వారా సఖపడెదరనీ  ఖరగ్‌పురాణం ద్వితీయార్థం సినిమా పర్వములో నాగార్జునాచార్యుడు ప్రపచించెను.

ఆఆ సినిమా ఐపోయింది. ఇంకా కూర్చున్నారేంటి. లేవండి లేవండి. వెళ్లేటప్పుడు సినిమా చూసినందుకు డబ్బులు కట్టి వెళ్లండి.


ShareThis