కాలేజీలొ దీపావళి వేడుకలు, కబుర్లు

ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ లో దసరా తరువాత అంత ప్రతిష్టాత్మకంగా జరిపే పండుగ దీపావళి. ఆ రోజున హాస్టల్స్ అన్నీ మట్టి దీపాలతో తమనితాము అలంకరించుకుంటాయి. 'ILLU' (Illumination కు పొట్టి పేరు) లో భాగంగా విద్యార్ద్రులు తమ తమ హాస్టల్స్‌లో తాము ఎంచుకున్న ఒక విషయాన్ని మట్టిదీపాలతో తీర్చిదిద్దుతారు. మరొక విభాగం 'Rangoli'లో భాగంగా సహజ రంగులను,సున్నం, మట్టి వగైరా వాడి నేలపై అపూర్వ చిత్రాలను అవిష్కరిస్తారు. ఈసారి పండుగ మొదట్లో కొన్ని హాస్టల్స్ ర్యాగింగ్ సంబంధిత విషయాల వల్ల దీపావళిని బహిష్కరిస్తామని చెప్పినా చివరకు అవన్నీ సద్దుమణిగి దీపావళి దిగ్విజయంగా, బ్రహ్మాండంగా జరిగింది.

మా హాస్టల్‌‌కు ILLU లో నాల్గొవ స్థానం లభించింది.


 ILLU కోసం దీపపు కుందులను సిద్దం చేస్తున్న విద్యార్దులు


నా రూమ్

RP (Rajendra Prasad) హాల్ విద్యార్దుల ILLU విడియోపికాసలో  ILLU మిగతా ఫొటోస్ కోసం  ఇక్కడ నొక్కండి.

రంగోళి  స్లయిడ్ షో... Rangoli ఫొటోస్ కోసం ఇక్కడ నొక్కండి


దీపావళికి కొద్దివారాల ముందు కాలేజిలో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘం (TCA) నుండి తెలుగువారి కోసం తెలుగు సాంకేతిక నాటక సంఘం (Telugu Technology Dramatics Society - TTDS) ను నెలకొల్పారు.ఇప్పటికే ఇంగ్లీష్, హింది, బెంగాలి నాటక మండళ్లు ఉన్నాయి.కొత్తగా తెలుగు నాటక సంఘం. సంఘం ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యాతల టెంగ్లీష్ మాటల నడుమ 'నవసమాజం' నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడింది.

అంతా బాగానే ఉంది ఈ 'సాంకేతిక' నాటక మండలి ఏమిటి అని ఆలోచిస్తున్నారా. మరేం లేదు, మా ఐ.ఐ.టి ఖరగ్‌పూర్ కు ఒక వింత ఆచారం ఉంది. కాలెజిలో కొత్తగా ఏదైనా కట్టడం చేసినా, సంఘాలు-బృందాలు ఏర్పడినా  వాటి పేరుకు ముందు ఒక తొండం (తోకైతే వెనక ఉండాలి, పేరుకు ముందు ఉంటుంది కాబట్టి తొండం అనమాట) లాగా Technology అనేది తగిలిస్తారు. Technology Gymkhana, Technology Swimming pool, Technology market, Technology Dance Society, Technology Literature Society.....ఇలా ప్రతిదానికి తొండం ఉంటుంది. అంతకు మించి 'సాంకేతికం' అన్నంత మాత్రాన ఆ లెవెల్ దృశ్యం ఉండదు.


హ....చెప్పాల్సిన సమాచారం ఐపోయింది ఇక సొంత సోది చెబుతా. ఓ రెండు నెలలుగా గమనిస్తున్నాను, బ్లాగింగుకు దూరంగా ఉన్నప్పుడు కూడా నా లైఫ్‌లోకి 'బ్లాగర్' గాడు చొరబడిపోతున్నాడు. ఏదైనా పని చేస్తున్నప్పుడుగాని, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడుగాని లోపల ఉన్న బ్లాగర్‌గాడు బయటకొచ్చి 'ఈ సీన్ ఈ యాంగిల్‌లో బావుంటుంది', 'ఈ సమయంలో వీడి స్పందన ఇలా ఉంది' లాంటి సలహాలిస్తున్నాడు. అందువల్ల Experience తక్కువ Evaluation ఎక్కువ చేస్తున్నాను.
పైపెచ్చు సెమిస్టరు అయిపోవచ్చింది. ప్రాజెక్టు ప్రజెంటేషను, సెమినారు ఆ తరువాత ప్లేస్‌మెంట్ తంతు  ఉన్నాయి...

కాబట్టి  కొన్నాళ్లు బ్లాగింగుకు సెలవు......పునఃప్రవేశం నూతన సంవత్సరములో చేస్తా...


ఈలోపు ఏవైనా పండుగలు, ఎవరివైనా మనుషులవి/ కెమెరాలవి/కంప్యూటర్లవి/బ్లాగులవి గట్రా పుట్టిన రోజులు/పెళ్ళిరోజులు/వార్షికోత్సవాలు లాంటి శుభదినాలు ఉంటే నా తరఫున ముందస్తు ____________రోజు శుభాకాంక్షలు. ఖాళీలో తత్సంబంధిత రోజును, సందర్భాన్ని పూరించుకోగలరు... happybig grin


చాలా రోజులుగా వినిపిద్దామనుకుంటున్నా మీకు ఈ పాటను...ఇప్పటికి కుదిరింది. 'నేను మీకు తెలుసా' నుండి నాకిష్టమైన ఒక పాట...వెస్టర్న్ బీట్స్‌తో (Scorpion King సినిమా నుండి కాపి కొట్టారులెండి ) పూర్తిగా తెలుగు సాహిత్యం.మరిక సెలవు. Have fun folks....

రైతు సదస్సులో JPగారి ప్రసంగం

సిటి బాబుగా వ్యవసాయం గురించి నాకు తెలిసింది నాస్తి. టీ.విల్లో, దినపత్రికలలో రైతుల సాదక-బాధకాల గురించి విన్నపుడు 'ఓహో అలాగ' అనే బాపతు.....రిజర్వాయర్ నుండి ఖరీఫ్‌/రబీ పంట కోసం నీటిని విడుదల చేయాలని ఎవరనన్నా ఆందోళన చేస్తే అప్పటికి నడుస్తున్న నెలను చూసి  అప్పటికప్పుడు ఖరీఫ్ అంటే ఇప్పుడు వస్తుంది, రబీ అంటే ఈ కాలంలో ఉంటుంది అనే లెక్కలు వేసుకుంటాను. కాబట్టి ఈ టపాలో ప్రస్తావించే విషయాలు నా అభిప్రాయాలు మాత్రమే....అవగాహన లేకూండా మాట్లాడాను అనిపిస్తే  అనిపిస్తే పెద్ద మనసు చేసుకొని సరిదిద్దగలరు.

విజయవాడలో జరిగిన రైతు సదస్సులో జే.పి గారు చేసిన ప్రసంగం ఇక్కడ పెడుతున్నాను. టివి ఛానళ్లు ఇది ప్రసారం  చేసుండరనుకుంటా....వాళ్లకు అంత ఓపిక-తీరిక ఉండవుగా2వ భాగం3వ భాగం
ఆ ప్రసంగం విన్నాక నాకు కలిగిన  అభిప్రాయాలు స్థూలంగా ఇవి.

౧)వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయాన్ని బతికించుకోవడానికి పరితపించడం ఏమిటో......!! చూడబోతే తెలుగునేలలో ఉంటూ తెలుగును బ్రతికించుకొవడానికి చేస్తున్న ప్రయత్న ఉదంతంలా ఉంది. మన ఈ ప్రయత్నం చూసి ఆనందించాలో, 'బతికించుకొడానికి' చేస్తున్నాం కాబట్టి బాధపడాలో అర్ధం కావడంలేదు.

౨) వ్యవసాయ రంగం పట్ల రోజురోజుకి తగ్గుతున్న ఆసక్తి- పట్టణాల్లో పుట్టిపెరిగినవాళ్లు ఎలాగు నూటికి 99.9% వ్యవసాయం వైపు వెళ్లరు కాని గ్రామాల్లో ఉండేవారు కూడా వ్యవసాయాన్ని వదలటం ఏమిటి!? కారణాలు విశ్లేషిస్తే  నాకు తోచినవి మౌలిక వసతులలేమి, వ్యవసాయన్ని లాభదాయక రంగంగా గుర్తించక నిర్లక్ష్యం చేయడం.

౩)మౌలిక వసతులు:  వ్యవసాయానికి అనుకూలం, రైతు బంధువులం అని చెప్పుకోగానే సరిపోదుగా అది మనుగడ సాగించేందుకు తగిన వనరులను కూడా సమకూర్ఛాలి. పంటకు సరిపడా నీరు, చేతికొచ్చాక  మార్కెట్‌కు తరలించడానికి మెరుగైన రవాణా వ్యవస్థ, నిల్వ చెసుకోడానికి గిడ్డంగులు కావాలి. ఇలా తక్కిన వాటిని వొదిలేసి రుణమాఫీలతో సరిపెట్టేస్తే ఎలా. వ్యవసాయం అనేకాదు ఇవాళ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచవలసిన  అవసరం ఉంది. అది రవాణా కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ఆరోగ్య సంబంధితమైనది కావచ్చు , నీటి సదుపాయం కావచ్చు. కావలసింది వీటి అభివృద్ధి....ఇవి అయ్యాక వాటిపై కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చి  ఆర్ధిక రంగాన్ని ఎంత దూరమైనా పరిగెత్తించవచ్చు.

౪)  రైతులే తమ పంటకు ధరను నిర్ణయించుకోవాలి--- ఈ విషయంలో నాకు కొంత విభేదం ఉంది.  ఉత్పత్తిదారుడి చేత  ధర నిర్ణయింపబడిన వస్తువులు మనరోజువారి ఆహారంలో ఉండవు కదా. నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు...పప్పుదినుసుల ధరలపై నియంత్రణ లేకపోతే వాటి ధరలు ఇష్టమొచ్చినట్లు పెరిగిపోతాయి. అలా చేసేదనికన్నా రైతే నేరుగా తన పంటను మార్కెట్‌లో అమ్మేట్టు, మధ్యలో ఉండే దళారీలను కట్టడిచేస్తే బాగుంటుంది.

౫) సుమారు 70%  నూనె సంబంధిత ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నామట. నోరువిప్పితే Energy Sustenance ( శక్తి స్వయంసమృద్ది (?) ) గురించి మాట్లాడే అమాత్యులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించుకోడానికి వీలున్న పామ్‌ఆయిల్, ఇథనాల్‌ను దేశియంగా ఉత్పత్తి  చేయడం గురించి ప్రణాళికలు రూపొందించరేం.....పెట్రోలియం ఆయిల్ కంపెనీలు లాభాలు ఆర్జించేందుకా. ఇంటర్మీడియట్‌లో ఉన్నపుడు చదువుకున్నా చెరకుపంటనుండి ఇథనాల్‌ను ఉత్పత్తి  చేయొచ్చనీ దాన్ని పెట్రోల్‌తో కలిపివాడితే సంప్రదాయ Fossil Fuel ( తెలుగు పదం ? ) వాడకం తగ్గించవచ్చనీ.....ఇంకా ఆ దిశగా ఏమి చేసినట్టులేదు !!
జేపి గారు తాడేపల్లిగూడెం రైతు సదస్సులో చేసిన ప్రసంగం ఇక్కడ చూడొచ్చు


7999 -> 8000....బ్లాగు పండగ

ఈమధ్య అందరూ మహబాగా మురిసిపోతున్నారు...ఎందుకటా..? వాళ్ల బ్లాగు పుట్టినరోజట. ఓహో అలాగా....బాగు బాగు. మరి పుట్టినరోజన్నాక విషెస్ చెప్తాం కదా...నేను కూడా రాముడు మంచి బాలుడు టైపులో శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్తున్నాను.

ఉన్నట్టుండి ఏమైందో...నా బ్లాగు అలిగి కూర్చుంది. అరే ఇప్పుడేమైందని మూతి ముడుచుకొని కూర్చున్నావ్ ఎందుకు అలిగావ్ అని అడిగా. " అసల్ నీకు బుద్దుందా వయ....బ్లాగుబెట్టి నీ ముచ్చట నిదేగాని నా గురించి ఒక్కరోజైన పట్టించుకుంటివా...సూర్యగ్రహణానికోసారి రాశే నీ ఇంగిలిపీసు బ్లాగుకి ఎప్పుడో బొడ బొచ్చె ఓ వంద మంది వచ్చిండ్రని మస్తు గారాలు బొయినవ్...ధూం ధాం జేశ్నవ్. నేనేమన్న తక్వ జేశ్ననా నీకు. అసల్ ఇయ్యాల గిట్ల నువ్వు ఈ బ్లాగులు రాశే ఓ పదిమందికైన ఎర్కఉన్నవంటె అది నాతోని అయిందికాదు.....? మల్ల నాకేం జేశ్నంవయా నువ్వు? ఓ పుట్టినరోజు లేదు, సదివెటోళ్ళు 'ఈరోజు' ఎక్వ వచ్చిండ్రు అని శెప్పిందిలేదు నేను మాత్రం నువ్వు అన్నట్టల్ల ఆడాలే తాన అంటే తందాన అన్నట్లు.....ఛల్ హట్" అనేసి చేతులు కట్టుకొని కోపంగా నావైపు చూస్తుంది. ఇప్పుడు ఈ కొత్త గోలేంట్రా బాబు, ఉన్న తిప్పలు చాలవన్నట్టు అనుకొని 'ఇంద్రధనస్సు'ని ఎలా శాంతింపజేయాలా, ఏంచేసి బుజ్జగించాలా అని అలోచిస్తూ ఉన్నా....అప్పుడే ఓ అనుకోని సంఘటన జరిగింది.
బ్లాగు హిట్ కౌంటరు 7999 నుండి 8000 చేరుకుంది. ఇది చాలు నా ప్రియమైన బ్లాగుకు నేను అభినందనలు తెలపడానికి.

Congratulations ఇంద్రధనస్సు....

ఈరోజు Renton, Washington DC నుండి Windows 7 లో IE8 నుండి నా బ్లాగును చూసి 8000వ హిట్ ఇచ్చిన రీడర్‌ గారు...మీకు ధన్యవాదాలు :) :)

అలోచించిగా ఆలోచించగా ఇంకో తమాషా సంగతి తట్టింది. ఇన్నేళ్ల (ఛా...ఎన్నో యేళ్ళుగా ఐనట్టు పొజొకటి) బ్లాగు జీవితంలో నేను చూసిన అత్యధిక సున్నాల రికార్డ్ ఇది....అయిదు సున్నాలున్నాయి మరి 8000 లో. 'కళ్ళు గాని దొబ్బాయా...ముడు సున్నాలేగా ఉన్నాయ్' అని లాజిక్కులు లాగొద్దు నా లాజిక్ నాది. నిజంగా అయిదు సున్నాల హిట్ రావాలంటే అంటే లక్ష హిట్లు (మనసులోంచి బ్లాగారాం గాడు : లక్ష హిట్లా...ఏది ఓసారి ఫేస్ టర్నంగ్ ఇచ్చుకోరా నువ్వు....కామెడిలు చేస్తే అతికినట్లుండాల్రా... యెదవ) రాలాలి....నా వల్లయ్యేనా..!!

ఇంకో విష్యం, ఒక సైన్సు మనిషిగా (అంటే non-art field లో ఉన్నవాడిగా స్వామి..) లెక్కలు వేస్తే వచ్చినది...ఇందాక ఐదు సున్నాలున్నాయని అన్నానుకదా...

(0! + 0! +0!)! + (0!+0!) = 8;

(0! +0!)^ (0!+0!+0!)= 8;

(maths బ్యాక్‌గ్రౌండ్ లేనివారి కోసం, 0!=1, 1! =1, 2!=2,3!=6 )

అబ్బో, నాలో కూడా ఓ సంఖ్యా శాస్త్రవేత్త ఉన్నడన్న మాట..గుడ్ గుడ్.

బ్లాగు వార్షికోత్సవాలు జరుపుకునేవారికి అభినందనలు...వారి బ్లాగుకు శుభాకాంక్షలు. Have fun

మరిక సెలవు....

వింటున్నా...

నీ సంతోషాన్ని నాతో పంచుకో
నువ్వు మురిసిపోయేందుకు పసిపాపనై కేరింతలు కొడతా.

నీ బాధను నాతో పంచుకో
అలసిన నీ మనసు సేదదీరేందుకు నా గుండెలనిస్తా.

ఒకవేళ పంచుకున్నాక నే స్పందించకుంటే
తప్పుగా భావించకు నేస్తం.
నేను నిను వింటునేవున్నా- నేను మనఃపూర్తిగా చేయగలిగినదది

***************************************************

ఆంగ్లంలో రాసిన మాతృక

Share with me your happiness
and i will rejoice like a child, gleaming,
to help you remember YOUR moment.

Share with me your grief
and you have my shoulder
to rest your troubled heart.

And one day when you express it
and i don't respond...don't take me bad, O dear,
i am listening to U-the best one i can do.

సంగ్రహణ-అమ్మ భాషకు జేజేలు

http://karlapalem-hanumantharao.blogspot.com/2010/10/blog-post_20.html


http://karlapalem-hanumantharao.blogspot.com/2010/10/blog-post_21.html


హనుమంతరావు గారు అద్భుతంగా రాసారు....కాదు కాదు కళ్ళకుకట్టినట్టు చూపించారు విషయాన్ని.

ఓపిక చేసుకొని చదవండి...వీలైతే సాటి తెలుగువారితో చదివించండి.


ఓ మాట:  సంతకం అంటే మన పేరుకి మనం ఇచ్చుకునే ఒక సంజ్ఞ కదా.....మరి ఆ సంజ్ఞను ఇంగ్లీషులోనే రాయాలని ఎక్కడాలేదు కదా....కాని ఇంతవరకు తెలుగులో సంతకం చేసినవారు ఎంతమంది? అసలు తెలుగులో సంతకం చేయొచ్చు అని బడిలో ఎందుకు చెప్పలేదూ? హ్మ్...ఈ అనుమానం అప్పుడు వచ్చినా బాగుండేది....!!

From home with love...

క్యాప్షను: ఇవి కొంచెం హాట్ గురూ.....


ఏందట్ల జూస్తున్నరు.......ఫొటొ ఏందనా...? ఇయ్యి ఇంటినుండి  ఇయాల్నె ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ల ఒచ్చిన దసరా వంటలు. పైనుండి గడియారం ముల్లు తిరిగే పద్దతిల ( clock wise direction స్వామి) మురుకులు, గర్జలు, అప్పాలు. మరిగ మీతాన ఈటిని ఏమంటరో నాకు తెల్వది (కింద కామెంట్ డబ్భా ఒకటి ఉంటది అన్ల చెప్పుండ్రి ఏమంటరో ) .....కరప్పూసలు అంటే మురుకులు అన్‌కుంటున్న కరెక్టేనా?

ఈటితోని  సున్నుండలు ఒచ్చుండాలిగాని మిస్ ఐనై....కొడకో జర బరువు పెంచు అని అమ్మ నాయ్న సున్నుండలు పంపిస్తా అన్నరుగాని పంపియ్యలే...యాద్ మర్శినట్లున్నరు. వచ్చేంతశేపు ఒకటే భయం ఉండే...ఒచ్చినంక ఇయన్నీ జాతీయం ఐపోతయేమోనని, అంటే హాస్ట్‌ల్‌ల ఉంటున్నంగదా మన సొమ్ము దోస్తుల సొమ్ము అన్నట్టు దోస్తుల సొమ్ము మన సొమ్ము అన్నట్టు. కాని ఆళ్లుగూడ సంచులు సంచులు తెచ్చుకున్నరు.....నయంగాదు, కొన్ని దినాలదాంకనైన ఇవి భద్రంగుంటయ్.....


బరువు అంటే గుర్తొచ్చింది‌...ఇయ్యాల్రేపు మొగోళ్లను, ఆడోళ్లను ఏం అడగొద్దో ఏం అడగాలో సమజైతలేదు. ఒకళ్లేమో " మగాడి హైటు ఆడాళ్ల వెయిటు (బరువు) అడగొద్దు" అంటరు.....ఇంకోళ్లెమో " ఆడోళ్ళ యేజు (వయసు) మగోళ్ల వేజు (సంపాదన) అడగొద్దు" అంటరు. అంటే ఆడోళ్లను హైటు అడగొచ్చు, సంపాదన అడగొచ్చు అనా ? శానా confusing ఐతుందనుకో...అరే తెల్వక అడుగుతా ఆడోళ్లని హైటు ఎందుకు అడుగుతం బై, ఏం అవసరం దాంతోని? ఆళ్లపక్కన నిలబడితే అందాజాగా చెప్పలేమా ఎంత హైటుంటరో !! పోని సంపాదన ఎంత అని అడిగితెనేమో యేడ ఆడ స్త్రీ లేడి మహిళా సంఘాలు దాడి జేస్తయేమోనని భయం......ఇగ నాకు సమజైందేందంటే ఆడోళ్లను ఏం అడగొద్దన్నట్లు....... ఆళ్లు అడిగితె మాత్రం మనం జెప్పాలె :(

ఇగ ఇయ్యాల్రేపు  మొగోళ్ళెమో అడగక పోయినా ’ఇంత బరువు తగ్గిన’, 'అంత బరువు పెరిగిన' అంటున్రు....యేజ్ అడుగుదామంటే ప్రతొక్కడు నెత్తికి రంగేసుకుంటుండాయే.....ఇంగేమడగాలే....

గిట్లనే ఓపాలి కాలేజ్‌ల ఉన్నప్పుడు రక్తదానం జరిగినుండే...ఆ టైంల మా సీనియర్లు ఓతాన కూసొని ముచ్చట బెడుతుంటే ఆళ్ల దగ్గర్కుబోయి అందరు చేశిండ్రుగదా అని అడిగిన....ఆ చేశ్నం అనిచెప్పి ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పిండ్రు. నేనూకొవచ్చుగదా...లే... ఆమెని ’ఎందుకు చేయ్యలే’ అని అడిగిన. ’ఉండాల్సిన బరువు లేను ’అన్నది. కనీసం ఇప్పుడైన నోర్మూసుకోవచ్చుగద నేను...ఉహు...మనకేమో పైన జెప్పిన మాటలు తెల్వవాయే...ఎమ్మటే " ఏం XY కేజీలు గూడలేవా?" అన్న.
బస్, అంతే బై....గప్పుడు ఆ అమ్మాయి, ఆళ్ల ఆడ దోస్తులు ఓ సూపు జూశిండ్రు జూడు ...( మగ సీనియర్లేమో శిన్నగ నవ్వుతుండ్రు)  అబ్బో శెప్పేడ్ది కాదు అది. ’షటప్ ’ అనిగూడ అన్నదిమల్ల.....అప్పడికి వాళ్లు మాకుగుడ్క దోస్తులనుకో అదివేరే  ముచ్చట. ఇదే scene ఇంకెవళ్లతోనన్న ఐతే నా ఇజ్జత్  యేమయ్యేడ్దో!!!!

పని ముచ్చట్ల బడి ఇటువైపు (బ్లాగులు) సూస్తలేను......ఫాలో అయ్యే బ్లాగులు సదివి కామెంట్లను వాయిదాల పద్దతిన ఇచ్చుకుంట...ఉంట మల్ల

జైహింద్‌

TiE ISB connect 2009

http://striders-way.blogspot.com/2010/10/tie-isb-connect-2009.html

జే.పి గారి, నటుడు సిద్ధార్ద్ విడియో తప్పక చూడండి

విజేత
 (పెద్దగా చూడడానికి బొమ్మపైన క్లిక్ చేయండి)

కామన్‌వెల్త్‌ క్రీడలు మొదలయ్యేముందు ప్రముఖ మాజి అథ్లెట్ మిల్కాసింగ్ మనవాళ్లు అథ్లెటిక్స్ల్‌లో పతకాలు గెలవలేరు అన్నాడట....దాన్ని పటాపంచలు చేస్తూ‌ డిస్కస్‌త్రోలో మహిళల విభాగంలో మనవాళ్ళు ఏకంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కృష్ణపూనియా(స్వర్ణం), హర్వంత్ కౌర్ (రజతం), సీమా అంటిల్ (కాంస్యం) చేజిక్కించుకున్నారు. కాంస్య పతకం సాధించిన సీమా చివర్లో "ఈ పతకం తప్పక మిల్కాసింగ్‌గారికి చూపించాలి " అన్నది.

మనం కోరుకున్న మార్పులో విజయం అనేది విజయం కోసం మన దృఢచిత్తంలో, పట్టుదలలో ఉంటుంది. ఆ పనిలో మనల్ని ఆదరించే స్నేహహస్తాల వల్ల విజయం వేగవంతమౌతుంది, ఇంకొకళ్లను తక్కువచేయడతోనో, నిందించడంతోనో రాదు.

కోర్టులు, తీర్పులు, మన్నూ, మశానం

వివాదాస్పదమైన బాబ్రికేసులో అలహాబాదు హైకోర్టు తన తీర్పును ఇంకో పదిరోజుల్లో వెలువరించనుంది అనగా భారత ప్రభుత్వం తీర్పు వల్ల  అవాంఛనీయ ఘటనలు జరగొచ్చునేమోనని ఊహించి తీర్పు వెలువరించే రెండురోజుల ముందునుండి  ప్రసార మాధ్యమాలలో మసీదు పడగొట్టేప్పడి క్లిప్పింగులు పదే పదే చూపించడంగాని, తీర్పుపై ఊహాగానాలుగాని, రాబోయే తీర్పుపై  చర్చలుగానీ చేయరాదనిమార్గదర్శకాలు జారి చేసింది.సెల్‌ఫోనుల నుండి ఒక వర్గాన్ని ఎంచుకొని SMS పంపించవద్దని కొన్ని చోట్ల పోలీసు శాఖవారుకూడా  సూచించారు.  హ్మ్....జనం బాగోగులు బాగా చూసుకునే మన మీడియా రెండురోజుల ముందునుండి నిషేదించారుగాని అంతకు ముందునుండి కాదు అనే పాయింటు బాగా ఒంటబట్టించుకొని వో....... చర్చలు విశ్లేషణలూ అభిప్రాయ సేకరణ అంటూ పోల్సు వగైరా వగైరా అన్నీ కావాల్సినంత చేశారు. ఇహ ఆ చర్చలు, సేకరణలో వాళ్ల మతలబు ఏంటొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "తీర్పు మీకు అనుకూలంగా రాకుంటే మీరు ఏం చేస్తారు?", " రాముడికి/మసీదుకు ఆ స్థలం ఇవ్వకుంటే మీవాళ్ళు ఏం చేయాలి అంటారు..", "...అంటే ఏరకమైన ఆందోళన చేయాలనుకుంటున్నారు.." ఇలా ఉంటాయి చాలా చర్చలు. దేశప్రజలకు ప్రతి విషయాన్ని తెలియపరచాలని, అంతవరకు తెలియనొడికి కూడా కొత్త కోణాలు చూపించాలని వీళ్లు చేసే ప్రయత్నం చూసి నాకు ఆనందభాష్పాలు టప టపా రాలాయి.

ఈ విశ్లేషణలు బ్లాగులకు కుడా తగులుకున్నాయి....నేను చూసిన కొన్ని బ్లాగుల్లో పోల్స్, గ్రహాలు ఉపగ్రహాలు అంటూ ఊహాగానాలు జరిగాయి. సరే....., ముఖ్యమైన అంశం కాబట్టి, వద్దన్న పని చేయడం మన నైజం కాబట్టి చేశారనుకున్నా. తీర్పు వచ్చింది, ఆషాడభూతులు అనుకున్నట్టు ఏ అవాంఛనీయ ఘటనలు, ప్రదర్శనలు, దాడులు జరగలేదు. చాలామంది మేధావులు (నిజ, కామెడి, కుహనా లాంటి అన్ని విధములవారు) అనుకున్నట్టు   తీర్పు ఏకపక్షంగా కాకుండా రాజీకుదర్చడానికన్నట్టు మధ్యేమార్గంగా స్థలాన్ని మూడుభాగాలుగా పంచింది. దీనివల్ల జనం ఏమి అనుకోలేదు...పాపం మనసోకాల్డ్ నాయకులు, మేధావులే వో ఇబ్బందడిపోయారు. "అసలు నమ్మకాల ఆధారంగా తీర్పులెలా ఇస్తారు?", "ఒకే దగ్గర మందిరం మసీదు ఎలా కడతారు?", " కడితే  గొడవలురాకుండా ఉంటాయా...!", " మామాటే నెగ్గింది...మేమన్నది నిజం అని తేలింది", " వాళ్ళు త్యాగం చేయాలి....మొత్తం మాకు ఇచ్చేయాలి" అని ఏవేవో అన్నారు అంటున్నారు. నాకర్ధం కానిది ఏంటంటే ఏ సినిమాలోనో, కధలోనో హిందూ-ముస్లిములు కలిసున్నారు అని చదివితేనో....నిన్న మొన్నటిదాకా వివాదాస్పద స్థలంలో మందిరం-మసీదు రెండూ కడదాం అని ప్రతిపాదనలొచ్చినపుడు ఇదీ మన భారతీయత అని కాలర్‌ ఎగరేసుకుంటూ చెప్పినోళ్లకు ఇప్పుడెందుకు ఇది మింగుడుపడటంలేదు, హిందూ ముస్లిం భాయి భాయి   అని మనం నిజంగా నమ్ముతున్నామా లేదా అని. ఎవరో ఎందుకు త్యాగం చేయాలి? కలిసి ఉండనివ్వాలి అని నమ్మకాల ఆధారంగా చెబితే ఏం తప్పు ఉంది అందులో? పోనీ నిజంగానే మసీదు మందిరం పక్కపక్కనే ఉంటే ఇబ్బాందనుకుంటున్నారా ? బాబులు...సమస్యాత్మక ప్రాంతం అని అనుకునే మా హైదరాబాదులో, మా ఏరియాలో నాకు తెలిసిన గత పధ్నాలుగేళ్ళుగా మసీదు మందిరం పక్కపక్కనే  ఉన్నా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాము...ఒకసారి  అక్కడకుడా కట్టిచూడండి. తప్పక కలిసుంటారు.


సరైన న్యాయం దక్కలేదని, కొందరిని బుజ్జగించాలని చేస్తున్న ప్రయత్నమని ఇదై ఫీలైపోతున్నవారు రెండుమూడు రోజుల తేడా వ్యవధిలో వచ్చిన ఆయేషా మీరా కేసు తీర్పు గురించి మాట్లాడరెందొకో. ఓ కట్టడంమొక్క చరిత్ర ,తీర్పు భవిష్యత్తూ గట్రా నిశితంగా పరిశీలించేవారు, ఔత్సాహికులు ఆయేషామీరా లాంటి కేసులగురించి మాట్లాదరెందుకో...!!?? ఏం మాట్లాడినా మనల్ని పట్టించుకునేవాడుండనా !!


గమనిక: ఇది లోకం తీరుతెన్నులు తెలియని,  వచ్చిన తీర్పు జనాలబాగుకోరి ఇచ్చినది అని నమ్మే ఒక అజ్ఞాని ఏడుపు. మీకు ఈ ఏడుపులో నిజాయితి, న్యాయం, ధర్మం కనబడితే ఓ గుడ్డముక్క మొహానవేసి వెళ్లండి,తుడుచుకోడానికి పనికొస్తుంది, వీలైతే నాతో కలిసి ఏడవండి. ఏది కనబడక నచ్చకపోతే మీ ఇష్టం.., మీదారిన మీరుపోండి......I don't care.....

నేటి పరిస్థితి

1) పుట్టుకతో మూగ చెవిటి అయిన విశ్వేశ్వరరావు అనే అభ్యర్ధి PD కోటాలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకుంటే లంచం అడిగిన సంబంధిత శాఖ అధికారులు. సిగ్గుండాలి ఈ నా  ______కులకి. సామన్యుడి దగ్గర చేయిచాస్తారు, అది సరిపోక వైకల్యం ఉన్నవాడు తనకాళ్లమీద తను నిలబడతానంటే అతని దగ్గరకూడా లంచం అడగటం. చూస్తే శవాలమీద చిల్లర ఏరుకునే బాపతులా అనిపిస్తుంది. పైగా ఈ  _____కులకి సంఘాలు, ధర్నాలు......థూ

ధైర్యం చేసిన విశ్వేశ్వరరావు  సదరు అవీనీతాగ్రేసరుడి పేరు బయటపెట్టడానికి  కూడా తయారయి ముఖ్యమంతిని కలిసి తన బాధ చెప్పుకుందామని రాజధాని వస్తే అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా జాప్యం చేసిన సెక్యూరిటి.

2) విశాఖలో ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి......ఈళ్లకి మామూలుగా చెప్తే వినరు. అప్పుడొసారి వరంగల్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తే తప్పుబట్టాను....కాదు అలానే చేయాలి. అలాంటి వెధవలు బ్రతికుండి వేస్ట్, ఇంకొకళ్లనైనా వేధిస్తారు. లేపిపారేయండి వెధవల్ని......

బ్లాగుల్లో దాడులు

తెలుగ బ్లాగులు పచ్చగా పిచ్చ పిచ్చగా ఎవళ్ల పని వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో మళ్ళి దాదులు మొదలయ్యాయి....ఒకప్పుడు దాడికి ప్రతిదాడి కాన్సెఫ్టుతో  ప్రారంభమైనదే  కెలుకుడు బ్లాగర్ల సంఘం (కెబ్లాస). ఈ సంఘం ఆధ్వర్యంలో దాడులు భీకరంగా సాగేవి అప్పుడప్పుడు సంబరాలు కూడా చేసుకునేవారు. ఈ సంఘంలో ఒక సభ్యుడు శరత్ వీలు చూసుకొని తన హిడెన్ ఎజెండా బయటపెట్టాడు. ఊరంతా ఒకదారైతే ఉలికిపిట్టదొక దారని...మిగతా వాళ్లంతా మానవ హక్కులు వంకాయ బీరకాయ అంటే ఈయన LGBT హక్కులు, adult హక్కులు అని వాపోతుండేవాడు...ఈయన నస పట్టలేక జనాలు  ఈయనకో సంఘం గుంపగత్తుగా ఇచ్చేసి పండగా చేసుకో నాయనా అని తేల్చేసారు. ఇక దాన్ని ఆయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకొని ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. పైగా ఉన్న సంఘానికి అనుభంధంగా పిల్ల సంఘాలు....ఆయన లోకంలో ఆయనున్నాడు.  ఐతే  ఈ కెబ్లాసలోంచి మరీ ముఖ్యంగా టపాలు రాసే పనిలోంచి పెళ్లికాని ప్రసాదు ఒకరు వెళ్ళిపోవడంతొ గతకొద్ది కాలంగా దాడులు తగ్గుముఖం పట్టాయి. వెళ్ళిపోయిన సదరు సభ్యుడిలోటును ఈ మధ్య ఓ ఫ్రూఫు‌లు అడిగే అతను భర్తి చేస్తున్నాడు. మాట్టాడితే ఫ్రూఫులు ప్లీజ్, స్టాట్స్ ప్లీజ్ అని దాడి చేయడం ఈయన మార్కు

ఒకవ్యక్తిపై జరిగే దాడులలో ముఖ్యంగా ఈ కెబ్లాసకు అనుభంద సంస్థ ఒకటి, అమెచ్యూర్ బ్లాగర్లు కలిసి పెట్టుకున్న సంఘం ఒకటి ముఖ్యమైనవి. వీళ్లు రాసే మాటల తూటాలకు అప్పట్లో అగ్రిగేటర్లు మహేష్‌బాబు కొట్టకుండానే దిమ్మతిరిగి బ్లాకయ్యెవి :)

 ఐతే దాడి కి ప్రతిదాడి భావంనుండి కాక అభిమానం వల్ల కూడా దాడులు జరిగాయి. ’బావ కళ్ళ్లలో ఆనందం కోసం’లా తమ అభిమాన బ్లాగరు నేస్తం రాసే టపాల్లో ఎప్పటికైనా వంద కామెంట్లు చెయ్యాలనుకొని కామా చూడలనుకొని సిండికేట్‌ అయ్యిన బ్లాగర్లు కొందరు తీరా ఆ భాగ్యం కొత్తగా వచ్చిన బ్లాగరిణి కొట్టేయడంతో పట్టలేని ఆవేశంలో ఆక్రోషంతో  సదరు బ్లాగరిణి బ్లాగులో కామెంట్లదాడి మొదలెట్టారు. యెన్నో వ్యయ ప్రయాసల తరువాత ఆ కొట్టుకోవడానికి భరతవాక్యము, కొత్త స్నేహానికి నాంది వాక్యము జరిగినాయి. అలా పుట్టిందే వబ్లాస (వంద కామెంట్ల సంఘం)...పుట్టిపుట్టంగానే, in fact పిండరూపంలో ఉండగానే, మూడు బ్లాగుల్లో ‘శతక్కోట్టుడు’ చేయడం దీని ప్రత్యేకత. కొన్నాళ్ళకు సభ్యుల  విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, వైవిధ్యం చూపించే బ్లాగర్లను ప్రోత్సహిమ్చాలని  దీన్నే యు.బ్లా.స (యువ బ్లాగర్ల సంఘం) గా మార్పు చేయడం జరిగింది. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది...బ్లాగులోకంలో అపాలజీలు చెప్పే బాధ్యతను ఈ సంఘంలో ఒక బ్లాగరిణి తీసుకోవడం అని జనాలతో చెప్పించుకోవడం . ఇలా చేయడం వల్ల మనల్ని ఎవరూ లెక్కచేయట్లేదు తల్లోయ్ అని సభ్యులే పులి సినిమాలో లా ’అమ్మ తల్లీ...’ అని అందుకుంటున్నారు...... ప్చ్. తను మాత్రం "మీ అభిమానం చుక్కల పద్దతిన కాకుండా లీటర్ల పద్దతిన ఉంది నేనాగలేను ఇప్పుడు" అని అలా పరిగెడుతూనే..................ఉంది. ఎప్పటికి ఆగేనో మరి !!

ఐతే ఓ పెద్ద చెట్టుకింద ఓ చిన్న చెట్టు ఎదగాలంటే మాటలా.......ఎప్పుడో భూమిపుట్టినప్పుడు మొదలైన సంఘాల మద్య్హలో ఇప్పుడో కొత్త సంఘం అనగానే పాతవాళ్ళు షివరింగ్‌ అయ్యారు......ఇంగ దాడి షురు.పనిలేని మంగళి పిల్లతల గొరిగినట్టు మీ సంఘంలో సభ్యులెంత, ఆఫీసెక్కడ, జమా ఖర్చులెంత అని ఈకలూ తోకలూ చూపించమన్నారు.ఈ దాడి చేసిందికూడా ఓ యువ బ్లాగరే కావడం ప్చ్ అహ్ శోచనీయం ... :( ఇందులో అతడితోపాటు కెబ్లాస లక్షణాలను తోసెయ్యలేం :D :(
 ఇది చాలదన్నట్టు తన రాజ్యంలో అన్ని పాత్రలను తానే ఏకపాత్రాభినయం  చేసుకుంటూ, సంతానవతుడయ్యుండి అస్ఖలిత బ్రహ్మచారిని అనే చెప్పుకుంటూ తనుకు తాను కుర్రాడిలా ఫీలయ్యే శరత్‌గారు  నేను కుర్రాన్నెనోచ్ నన్నూ కలుపుకోండి అని వాలిపోయాడు.  మనవాడే  పైగా పరిచయస్తుడే అని దాదాపుగా కలుపుకుందా మనుకునేలోపు  ఈయన గూరించి యుబ్లాసకు అప్పటికి అప్రకటిత సభ్యులొకరు ఉప్పందించారు. కర్ర విరగొద్దు పాము చావాలి అన్న చందంగా  పరిశీలిస్తున్నాం అని చెప్పటం జరిగింది. ఆయనమాత్రం యుబ్లాస సభ్యుడినేనంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.   పెద్దల నుండి నిరాకరణ జరగొచ్చునేమోనని ముందుచూపుతో కొందరిని తమ సంఘానికి సలహాదారులుగా నిమమించుకుంది......ఇక తేలాల్సింది విధివిధానాలు. వీటిపైనే ఇప్పుడు దాడి......హ్మ్. అందుకే ఈ బ్లాగు ముఖంగా కొన్నిటిని నివృత్తి చేయదలచాం

1)మా సంఘంలో ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు ఉండబోరు....అందరూ కార్యవగ్గ సభ్యులే. అందరూ సమానమే.
2) ఒకే విషయం పై నా దృక్కోణం అనీ, పక్కవాడి దృష్టికోణం, లంబకోణం, వక్రకోణం అని చెప్పే సోదితో విసిగిపోయాం బాబు. కాబట్టి యుబ్లాస సభ్యత్వం తీసుకోదలచినవారు వైవిధ్యభరితంగా నసపెట్టకుండా రాయవలెను :)
౩) యుబ్లాస లో గరిష్ట వయసు పరిమితి 32-34 సం. 32 రాగానే క్రియాశీల కార్యవర్గంనుండి తప్పుకుంటారు. 34 దాటినవారు సలహాదారులుగా ఉంటారు......వయసుతో కూడిన అనుభవం వల్ల వచ్చిన మార్గ్దదర్శనం చేయడానికి. వయసుతో సంభంధం లేకుండా మనసు ద్వారా మేం యువకులమే అనేవాళ్ళు బ్లాగులోకంలో చాలామంది ఉన్నారు. సోది పెట్టనంతవరకూ అందరికీ స్వాగతం :)

ఈతరం బ్లాగులో కొత్త్గగా ఒక వ్యక్తిపై దాడి జరుగుతుంది. అతడే బ్లాగు బాబ్జి అనే కాండిడేటు. అడవి యాసతో అందరిని కెలికుతూ పూర్వపు కెబ్లాసను తలపిస్తున్నాడు. ఇతగాడు తనబ్లాగులో తప్పవేరే బ్లాగుల్లో కామెంటకపోవడం, బ్లాగ్లోకంలో కొందరితో (PhD candidates తో) తనకు ఆల్రెడి పరిచయం ఉందని చెప్పడంతో ఇతగాడు వెళ్ళిపోయిన పెళ్ళికాని ప్రసాదేమోనని ప్రశ్నల దాడితో వేధించారు....బ్లాగులోకంలో అంతో ఇంతో తెలిసిన ప్రతి సాల్తీతో అంటగట్టడం మొదలెట్టారు. తిక్కరేగి తాను ఎవరిని కాదు అని  చెప్పి కొద్దిపాటి నమ్మకం కలిగించాడు.

పోతే అతినూతనంగా ప్రారంభమైనదాడి అభం శుభం తెలీని బ్రహ్మచారులపైన. ఒక సీనియర్ బ్లాగర్ మొదలెట్టిన గోడు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు, జోగి జోగి రాసుకొని బూడిద రాల్చినట్టు (నోటిదూల :D)  మొగుడ్స్- పెళ్ళామ్స్ గోలలోంచి పుట్టిందే బ్రహ్మచారుల బ్లాగర్ల సంఘం ( బ్ర బా స ). ఐతే మిగతా నూతన సంఘాలకు ఎదురైనట్టుగానే దీనికి దాడులు ఎదురైనై. పెట్టిన మరుసటి రోజే ఓ సభ్యుడు పెళ్ళి చేసుకోవడం ఊహించని మలుపుకాగా, పెట్టిన కొత్త్లోనే ఇది బ్రహ్మి గూపు అనే టాగు మరో దెబ్బ, అక్కడికి బ్రహ్మచారులంతా సాఫ్ట్‌వేర్‌వాళ్ళె ఐనట్టూ.....మిగిలిన దెబ్బలు కుటుంబరావులు,   సతీ సక్కుబాయిలనుండి ఎదురౌతుంది. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే నిన్నగాక మొన్నటివరకు బ్రహ్మచారి జీవితాన్ని మూడు లైన్లు అరు బీట్లతో గడిపిన ఓ మాజి బ్రహ్మచారి చేయడం. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.........ఐనా బ్రబాస సభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో ఐదేళ్ల తరువాతైనా ఈ హీరోగారు తమ  సహాయం కోరకపోతారా అని. దీనికి తోడు ఇందాక చెప్పిన ఏకఛత్రాధిపత్యం చేసే సదరు సాల్తీ తానుకూడా బ్రహ్మచారినే అంటూ తననీ చేర్చుకోవాలంటూ కామెంట్ల దాడి చేస్తున్నాడు. మేము చూస్తున్నాం కట్టే విరక్కుండ పాము చచ్చేట్లు.........!!అదండీ సంగతి ప్రస్తుత తెల్గూ బ్లాగ్లోకం ముడు గ్రూపులు ఆరు ప్రతి గ్రూపులు చందాన తాన అంటే తందానా అంటూ సాగుతుంది. ఈ పరిణమాం ఎటుపోతుందో మరి.....ఖచ్చితంగా హర్షాతిరేకాలకు కారణమవ్వాలని కోరుకుంటూ అందరికి


య్యాపి Engineer's Day :)


Just for fun........

హలో...!! నవ్వండి సార్

నవ్వటం ఒక భోగం నవ్వలేకపోవటం ఒక రోగం అంట...కాబట్టి నవ్వండి సార్

నవ్వుకో పిచ్చినాయనా నిన్నాపేదెవ్వరు.....ఓ నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమిరాదే ఇప్పుడు.....

ఇగోలు, ఇజాలు, కోపాలు, తాపాలు,రాజికియాలు,రౌడిఇజాలు కాసేపు అలా... పక్కనపడేశి లచ్చనంగా నవ్వేసుకోండి


నవ్వలేకపోవడం రోగం అన్నారుగాని నవ్వడం ఒక అంటువ్యాధి లాంటిది......పక్కనోడికి అంటేస్తదంతేఇంతకీ ఈ పోస్టు ఎందుకు వేసాను...?  ఆ.....గుర్తొచ్చింది నిన్న రాత్రి మీగొట్టం ( YouTube ) నుండి         ‘SP Balu గారితో జయప్రదం’ చూసా.....ఆ ప్రోగ్రాం అని కాదు వేరే ఎక్కడ కార్యక్రం చేసినా బాలుగారు చాలా సరదాగా ఉంటారు. జయప్రదంలోనైతే ఇంకా ఎక్కువ....ఎదో  కాలేజి కుర్రాడిలా మహా సరదాగా కానిచ్చాడు ఇంటర్వ్యూని...ఎప్పుడైనా Fusion music విన్నారా.... i mean శాస్త్రీయ సంగీతం + మోడర్న్ వెస్ట్‌ర్న్ మ్యూజిక్...ఇప్పుడు నేను అదే వింటున్నా. స్వర్గలోకపు అంచులు, ఆనందం అవధులు అని అదేదో అంటారే eggjatlee అక్కడే ఉన్నాను.....ఒహ్ సోది ఎక్కువైంది కదూ, మీరు పనిగానివ్వండిగాంబీర్యం ప్రదర్శించకపోతే మీ పనవ్వదా...ఫరవాలేదు మనసులో నవ్వుకోండి.


పరాజితులా..? అస్సలు ఫరవలేదు. ఇంకోసారి ప్రయత్నించే అవకాశం ఉంటుంది...ఇప్పటికైతే హాయిగా నవ్వేస్కోండి
             


టీచర్:  ఏంటిబాబు.., స్కూల్ అయిపోయాక కూడా ఇక్కడే కూర్చున్నావు. ఇంటికి వెళ్లవా...?

పిల్లాడు: నాకు పదిహేనేళ్ళు వచ్చే వరకు స్కూళ్ళొ ఉండాలని అమ్మ చెప్పింది మరి :(


ఏంటి ఇంకా నవ్వటం లేదా... మీరుగాని  భగ్న ప్రేమికులా ?వో...... సారి.....,మిమ్మల్ని అనవసరంగా  ఇబ్బంది పెట్టాను....మీ పని మీరు కానివ్వండి. నా ఫుల్‌ సపోర్ట్ మీకే.

మిగతావాళ్ళు కామెంట్ల బదులు ఓ నవ్వు పడేసి పోగలరు...మిమ్మల్ని చూసి నేనూ వాతలు పెట్టుకుంటాను


Note: Please let me know about any claim on copyright of the images posted herein. They will dealt with accordingly

అసలేం జరుగుతుంది

ఎప్పుడో బ్లాగులు పుట్టిన కొత్తలో కొన్ని జరక్కూడని పరిణామాలు జరిగాయంట, నాక్కూడా తెలియదు, బ్లాగు సోదరి గారివి బ్లాగు వీక్షణం గారివి పోస్టులు చూసాక కొంచెం అర్థమౌతున్నాయి.....దరిద్రం ఏంటంటే నేను కూడా కొన్నిసార్లు ఏదోఒక వైపు ఉండి కొన్ని కామెంట్లు చేసా supportiveగా. ఆ గొడవకాదుగాని నాక్కొన్ని అనుమాలున్నాయి ఎవరన్నా (నేనడగబోయే వాళ్లు చెప్తే మరీ మంచిది) చెప్పండయ్యా...

1)  గూగుల్‌ బజ్‌లో ఒకరు  ఇంకొకరిని  తిట్టేవాళ్లంట....అందుకోసం బ్లాగులో ఆళ్లను తిడుతున్నారంట.....నాకర్థం కానిది బజ్‌లాంటి ప్రైవేట్‌ అప్లికేషన్‌లో ఒకరినొకరు అనుకుంటే దాన్ని ఓపెన్‌ప్లేస్‌లాంటి  బ్లాగులో ఎందుకు రచ్చచేయడం. శ్రీనుగారిని బ్లాగులో కూడా తిట్టారాన్నారు...కాని బజ్‌ సంగతి బ్లాగులోకెందుకు

2)"If you have issues with it please stay out of it." ఎంతసేపు చదివినా ఎన్నిసార్లు చదివినా నాకెం అర్థం కావట్లేదు ఇది. రాసేవి అభిప్రాయాలు మాత్రమే అని చెప్పేస్తే అలానే రాస్తే ఏ సమస్యలేదు. కాని మహేష్‌గారు రాస్తూ అవి facts అంటారు పూర్తి conviction ఉందంటారు పైపెచ్చు ఆయనది ఓ పబ్లి‌క్ బ్లాగ్...ఎవరైనా చూడవచ్చు.....మరలాంటపుడు stay out of it అంటే ఎలా. ఇప్పుడు నేను రోడ్దు మీదకు వెళ్ళి నాకు తోచింది మాట్లాడతా నచ్చనోళ్ళు పొండేహె అంటే ఎలా ఉంటుంది.....
************************************************************************
ఇక్కడ బ్లాగ్లోకంలో జరుగుతున్న రభసను తొలగించడానికి బ్లాగుసోదరిగారు చేస్తున్న కృషికి అభినందనందనలు.....

సెంచరీ కొట్టాన్రోయ్!!!

యస్‌ సెంచరీ...ఈ సంగతి ఇంత మధురంగా, ఆనందంగా ఉంటుందని అనుకోలెదు. కాని ఇప్పుడు సచిన్‌ ప్లేస్‌లో నేనే ఉండి 200 కొట్టినట్లు, బ్లాగ్‌కు వందలు వందలు కామెంట్ల వచ్చినంత ఆనందం......

సంగతేందంటే  నేను ఇంగ్లీష్‌లో కూడా ఓ బ్లాగు రాస్తన్నా THE ROAD అని‌‍ కాకపోతే అక్కడ అమావాస్యకోసారి పున్నమికోసారి కాకుండా ఏకంగా గ్రహణానికోసారి రాస్తున్నా....పైగా పబ్లిసిటి లేకపోవడమూ, మన రాతలు అంత సూపరేమికాదు కాబట్టి అది దగ్గుతూ ములుగుతూ బ్రతుకుతుంది. అలా ఓ ఏడాది కాలంనుండి వారానికో హిట్టు అన్నట్టు ఉంది దాని పరిస్థితి. మొన్నోసారి ఎందుకో అలా దాని statistics ఎలా ఉన్నాయేమిటని చూస్తే 98 Unique Visitors అని చూపెట్టింది......అహా ఏమి భాగ్యమూ ఏమి అదృష్టమూ అని పొంగిపోయి ఎప్పుడెపుడు వంద చేరుకుంటుందా అని గోతికాడ నక్కలా ఉండిపోయా. ప్రతి అయిదు నిముషాలకోసారి ఆ stats ఓపెన్ చేయడం వంద చేరిందాలేదా అని  చూడటం...ఇలా చేసాన కొన్ని రోజులు. తరువాత నా లక్కు తాటిచెట్టంత హైటెక్కి మాకు కాలేజిలో అతివీర భయంకర Grand Viva ఘట్టం జరగడం, ఆ తరువాత మా జూనియర్లకు ఫ్రేషర్స్‌ ఇవ్వడం కొసం తిరగడం (అవకాశం  వచ్చింది కాబట్టి  చెప్తున్నా మా జూనియర్లు మాత్రం రచ్చ, కేక, మెరుపు, బంగారం....చాలా బాగా చేసుకున్నాం ఫ్రెషర్స్‌ ) జరిగి ఈ stats గోల పట్టించుకోలేదు.
ఇవాళ పొద్దున్న చూస్తే 102 అని చుపెట్టింది.......అలా ఆకాశం, ఆనందం అంచుల దాకా వెళ్ళొచ్చా.


ఈ కొన్ని రోజులూ బ్లాగ్లోకంలో చాలా పోస్టులు పడ్డాయి అవన్నీ తీరిగ్గా చదివి కామెంటాలిప్పుడు....

మా తుఝే సలామ్

మదమెక్కిన పొగరుతో జాతిప్రజలందరను తొత్తులుగా చేసుకొనేందుకు ప్రయత్నించిననాడు తమలో తమకి ఎన్ని భేదాపిప్రాయాలున్నా తామంతా ఒక్కరమే అని, స్వేఛ్చ అనే వెలకట్టలేని సంపదను జాతిజనులకు పంచడానికి ఎందరో వీరులకు, విప్లవకారులకు, మహనీయులకు స్ఫ్హూర్తినిచ్చిన మాతా, తుఝే సలామ్‌రవీంద్రుడు కొరుకున్నట్లుగా..


Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awakeనాకు తెలుసు ఈరోజు దేశంలోని అన్ని పాఠశాలలో చాక్లెట్లు, అవార్డుల నెపంతో పిల్లలను రప్పించి, పోరాడి సాధించిన స్వాతంత్ర్యం గొప్పదనం ఎంతో వాళ్లక చెప్పలేకపోవచ్చునని. రాజకీయ నాయకులు, అవినీతి మన విలువలను భ్రష్టుపట్టిస్తున్నాయని  తెలిసీ తెలియని ఆ పసివాళ్లకు ఉపన్యాసాలిస్తారని. ఎన్నో పత్రికలు, ఆదివారం కనుక, పత్రిక మొదటిపేజీలో తన్మయంలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను పెట్టి లొపలి పేజీల్లొ, వీలైతే ఓ ప్రత్యేక సంచికలో,  సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని మరింత దయనీయంగా చూపిస్తారని. ఎటుపోతుంది ఈ  దేశం అని సాటి మనిషిని కొంత నిరుత్సాహపరచవచ్చునని. వారందరికి నాలోంచి వచ్చిన సమాధానం కాకపోయినా అరువు తెచ్చుకొని చెబుతున్నా

అందరికి స్వాతంత్ర్యదినొత్సవ శుభాకాంక్షలు

ఏకవచన సంబోధన, కొన్ని సందేహాలు

Due thanks to Sharath ji for inspiring me to write first part of this post through his        'గారుకి' గౌరవం

1) బ్లాగు మొదలుపెట్టాక ఊరకే ఉంటామా? ఉండము కదా, తోచింది రాస్తాము . మరి ఆ రాసిందాన్ని దాని మానాన ఉండనిస్తారా..లేదు దారినపోయేవారు చూసి చదివి వ్యాఖ్యానించి వెళ్తారు. అద్గో అక్కడే వచ్చింది సమస్య. నేనేమో ఈ విశాల జీవితంలో క్వార్టర్‌ సెంచరికి కుంచెం  దగ్గరలో ఉన్న పిల్ల మేధావి-వెధవని. మరి ఈ వ్యాఖ్యానించేవాళ్ళు 'గారు' అనేసి మాట్లాడేస్తుంటే మా సెడ్డ ఇబ్బందిగా ఉండేది. బ్లాగు మొదలెట్టిన కొత్తలో అయితె ఈ ఇబ్బంది చెప్పనలవికాదు. అప్పటికి మాలాంటి యంగ్‌ అండ్ డైనమిక్ అండ్ చార్మింగ్ యువతరం సంఖ్య తక్కువ. ఒకరికి ఒకరం ఎరుక లేదాయే, సో పోస్టులకు కామెంటేవాళ్లలో చాలామంది నాకన్నా పెద్దవారు. వాళ్ళుకూడా గారు అని సంబోధిస్తుంటే, ఎప్పుడు అలవాటులెని పిలుపు కదా, అదోలా ఉండేది. మనకేమో సీరియస్‌లో సరదాగా, సరదాలో సీరియస్‌గా ఉండటం అలవాటు..వాళ్ళు అలా మాట్లాడేస్తుంటే వీలు పడదాయే. అలా లాక్కొలేక పీక్కొలేక గడిపేసాను. కొన్ని నెలలయ్యాక నేను కొందరి బ్లాగుల్లో 'బాసు', 'గురు',' బెదరు', 'భాయ్' లాంటివి వాడటం మొదలుపెట్టాను. దానివల్ల వారుకూడా తిరిగి కామెంటేపుడు కాస్త చొరవ తీసుకొని పలకరించేవరు, నేను కొంచెం అనవసరపు సీరెయెస్‌నెస్ మేంటైన్‌ చేయల్సిన తప్పేది.

ఇక ఈ మధ్యన తెలుగు బ్లాగ్లోకంలో కుర్రకారు సంఖ్య కొంచెం ఎక్కువైంది కాబట్టి శరత్‌ భాయ్ బ్లాగులో జ్యోతి గారన్నట్టు అభిమానం మనసులో ఉండాలి ఇలా ఈకలు, తోకలలో ఉండాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి  ఒక అలోచన చేస్తున్నాను. నా  యేజ్‌ గ్రూపు బ్లాగర్లను 'గారు', 'అండి' లతో పిలవను. అంటే మరీ సంబోధ ప్రథమా విభక్తి ఉపయోగించి ఓయి, ఓరా, ఓసి అనకుండా బ్లాగరు పేరుతో పిలవాలనుకుంటున్నా. మిగతా పెద్ద బ్లాగర్లను ముడ్‌ని బట్టి గారు, బాసు...లాంటివి జోడించి పిలుద్దామని. పెద్దబ్లాగర్లు, కుర్రబ్లాగర్లు నా బ్లాగులో వ్యాఖ్యానించేపుడు, నేను పెట్టిన వ్యాఖ్యలకు స్పందించేపడు కూడా తోకలు ఈకలు పెట్టవద్దని మనవి. నామటుకు నన్ను అరెయ్, ఒరెయ్ etc etc పెట్టి పిలవనంతవరుకు ఎలా పిలచినా ఓకే. But i'd prefer non-formal addressing. దీనికి ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదుగాని ఇప్పటికైతే కొందరు మా కుర్రతరం బ్లాగర్లు హరే కృష్ణ, కత పవన్, సాయి ప్రవీణ్, వెంకట కృష్ణ, రామ కృష్ణ.....లాంటి వాళ్లను, కొందరు మహిళా బ్లాగర్లను పెరు పెట్టేసి పలకరించాలనుకుంటున్నా. కాబట్టి బ్లాగు సుజనులారా మీకు నా అవిడియా  బాగుందనిపిస్తే, అఫ్‌కోర్స్ బాలేదనిపించినా, చెప్పండి. And మిగతా కుర్ర బ్లాగర్లు ఎవరైనా ఉంటే ( ఆల్రేడి లిస్టులో ఉన్నవాళ్లతో సహా ),  నేను మీ బ్లాగులో ఎప్పుడైనా వ్యాఖ్యానించి ఉంటే, మీకు నా ఆలొచన నచ్చినట్లైతే మీ అమోదం, అయిష్టం తెలుపగలరు.


2) చాలా రోజులనుండి అనుకుంటున్నా...ఎవరిని అడుగుదామా అని. ఎవరిని ఏ బ్లాగులో అడగాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయా. ఈమధ్యన మా స్నేహితుడిని ఒకణ్ని అడిగితే వాడికీ తెలియదన్నాడు. ఆత్రం అపుకోలేక అడిగేస్తున్నా...రాయల వారి పద్యం ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగేను...’ కు ప్రతిపదార్థం ఎవరికైనా తెలుసా. బ్లాగర్లు  ఎంతోకొంతమందికి తెలిసే ఉంటుంది. దయచేసి నాకు చెప్పండి.

ఇంకొకటి, మనం ఎదైనా పనిని క్రమం తప్పకుండా చేయాలి అని చెప్పడానికి తరచుగా 'తూ.చ' తప్పకుండా అని వాడుతుంటాం. ఇదీ ఒక పదమే అని అనుకొందామంటే దాని మధ్యలో ఒక చుక్క ఉంది. అంటే ఒక పెద్ద పదానికి ఇది abbreviation అయి ఉండవచ్చు. ఆ పెద్ద పదం ఏంటని స్కూల్లో ఉన్నపుడు మా తెలుగు  మాష్టారుని అడిగాను. ఆయన నాకు తెలియదని జవాబిచ్చాడు. అప్పటినుండి ఇది తిరని సందేహంగా మిగిలిపోయింది. దానర్థం ఎంటో తెలిస్తే చెప్పండి.ఇట్లు,
నాగార్జున aka  చారి

మాకి నచ్చట్లేదు హై......

అవును మాకి  హేమి నచ్చట్లేదు ఇది. అరే అసలే తల/బుర్ర సరిగా పనిచేయని,పనిచేసే వాళ్ల మధ్యన ఉంటున్నాం.., కొంచెం తెరిపి కోసం గోడును గాలికి చెబుదాం అని బయటకు (లోపలికి) బయలుదేరితే నాలా చెప్పుకోవడానికి ఆల్రెడి చేరుకున్నోళ్లు గంపెడు. ఒకరు హంసధ్వని రాగంలో పాడుతుంటే మరొకరు హింసధ్వని రాగంలో ఆలపిస్తుంటారు. నేనేమో ఏదో తెలియని నా రాగం అందుకొని గోడు వెళ్లగక్కుతాను. అరుపులు కేకలు మధ్యమధ్యలో వాటంతట అవే దూరుతాయి. ఈ గోడు అటుగాపోయే దారినపోయే సాటి గోడయ్యలకు/గోడమ్మలకు నచ్చితే ‘ఓహ్ అలానా సోదరా’ ,‘భేష్ భేష్’,‘నాదీ గోడు  నీదీ గోడు ఒకటే హై’,‘థూ నీ గోడు చెడ’ అని సవాలక్ష (అంత కాకపోవచ్చు ఓ సవావంద  ఉండొచ్చు ) చాక్లెట్లు, వాతలు ఇచ్చేస్తారు. ఈళ్లెవ్వర్రా అని తరచి చూస్తే అబ్బో....ఆనంధభైరవి,శంకరాభరణం ( ఎక్కువడగొద్దు నాకు తెలిసిన రాగాలు ఇవే) కలిపి గుండేలో....తుల్లోంచి మాట్లాడి ఆడిపాడేవారు కొందరు, ఎండలో మాడిపోతున్న జనాలకు గోడు కాకుండా గోళీషోడా ఇచ్చేవారు కొందరు (దండేసి దణ్ణం పెట్టాలీళ్లకు), అయ్యబాబోయ్ అసలీడేందుకు గోడుతన్నాడ్రా సామి అనుకుంనేంతగా తీవ్ర హింసధ్వని ఆలాపించేది ఇంకొందరు....

ఏదో ఒకటి.., షోడా బాబులు (దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం ?), రాగ-మేళకర్తలు ఉన్నారుగా అని సంతోషిస్తుంటాను. ఇది ఈళ్లకు నచ్చదేమో, అశ దోశ అప్పడం ఆలు అని జంపు జిలానీలుగా తయారైనారు. పోన్లే ఒకరిద్దరే అని ఊరుకుంటుంటే హమ్మా...రోజురోజుకీ ఈ జాగాలో జంపు జిలానీల బ్యాచ్ ఎక్కువైపోతుంది. చెప్పులు లేవని జంపు, ఇళ్లు మారానని జంపు, మొలకలు వచ్చాయని జంపు, చెట్టు విరిగిందని జంపు....టూ మచ్ టూటూ మచ్. అందుకే అసల అస్సలు నచ్చట్లేదు

అప్పుడేపుడొ ఆ గోళీషోడాలమ్మే ఆయన జంపన్నాడు, కొద్దిరోజులకు ఆయన బెదరు కూడా పత్తాలేకుండా పోయాడు. వేరే షోడా బాబులు (మళ్ళి తెలుస్తలేదు, దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం) ఉన్నారు, వస్తున్నారు కాని ఎంతైనా old is gold కదా.... ఈ షోడా సంగతి పక్కన పెడితే మొన్నీమధ్య మంచిగోడులు చెప్పేటాయన ఓసారి నేనూ కూడా జంపోచ్  అని  దాదాపు చాపచుట్టేసేంత పని చేసాడు ఇదేమిటయ్యా మగడా ఏమైనా పద్దతిగా ఉందా నీకు అనేసరికి  కాదు కాదు టెంపరవరీ మౌనవ్రతం అని గమ్మునుండిపోయాడు. కబుర్లు చెప్పే కబుర్లమ్మ చెప్పా పెట్టకండానే వెళ్ళిపోయింది. అపుడు అసలేంత ఫీలయ్యానో వీళ్ళకేం తెలుసు యువరానర్ అధ్యక్ష్యా!!.   ఆ తరువాత లాజిక్కులు, మ్యాజిక్కులు అడిగే ఓ ఆసామి అల్‌విదా అల్‌విదా అని పాట పాడేసి సినిమాలో జ్యొతిలక్ష్మిలా కనిపించి కనపడాకుండా వినిపించి వినపడకుండా తిరుగుతున్నాడు భూతంలాగా(ఈ మాట ఎవరైనా పుసుక్కునెళ్ళి ఆయనకు చెప్పేరు బాబ్బాబు అక్కఅమ్మలు ఆ పని చేయకండి. చెప్పాక గోడడానికి నేను, నేను గోడిన గోడులు రెండు మిగలవు,.ఆయనకో బ్యాచ్ టైపులో జనం ఉన్నారు మరి)...యే డైరెక్టుగానే రావచ్చుగా ఉహూ రారు.... ఊకనే మొండి చేస్తున్నారు నాకు తెలుసు.

ఇపుడు కొత్తగా, జస్ట్ టూ డేస్ బాక్,  బెమ్మాండంగా పాడతారు అని పిలవబడే ఇంకొకరు యెళ్ళిపోయారంటా..నేనైతే ఆ సదరు పాటలు వినలేదు కాని ఎంతైన పాపులర్ పర్సనాలిటీ అంటే పాటలు బానే పాడతారనడంలో నిజం ఉండే ఉంటుంది కాబట్టి జంపు జంపే....చాప చుట్టేస్తానంటే  వాతలు పడతాయనేమో కొత్త పథకం కింద లాంగ్‌లీవులు పెట్టేస్తున్నారు ఉద్యోగులు. అఫ్‌కోర్స్ ఇంకా అమృతధ్వని రాగంలో గోడేవాళ్లున్నారు కాని ఈళ్ళంతా ఇలా వరసపెట్టి జంపేస్తుంటే ఇక్కడ మాగతేంగాను మంచోళ్లందరూ మైనారిటీలో పడిపోతే జోగిజోగి కలిసి బూడిద రాల్చవూఊఊ...దీనికి సమాధానం చెప్పాల్సిందే అని బల్లగుద్ది, అవసరమైతే పక్కవాడి గుండుగిద్ది అడుగుతున్నా ఆనర్ అద్దేచ్చా...

అందుకే ఈ యవ్వారం నాకి హేమి నచ్చట్లేదు హై...మీకీ కూడా నచ్చట్లేదు హై అయితే రండి, ఇక్కడ ఆ గోడు కక్కి, అరుపులు కేకలు పెడదాం

******************************************************************
పోస్ట్‌లో ప్రస్తావించిన బ్లాగరులు, వారి అభిమానులు నేను ఏమైనా దెప్పిపోడిచే విధంగా మాట్లాడాను అని భావిస్తే క్షంతవ్యుడిని. అది నా అభిమతంకాదు. బ్లాగును విరమించడానికి వారి సొంత కారణాలు వారికున్నాయని చెప్పారు. ఎటొచ్చి ఇంతమంది తెలిసిన బ్లాగ్మిత్రులు వారి బ్లాగులు ఇకపై కనపడరు అనే తలపు  పట్టలేక రాసినది, ఇంకెటువంటి భావనా లేదు.    
I wish all of them  good luck in their endeavors and hope they will get back to blogging again soon

అహం

నేను,
నిప్పులు కక్కుతూ భగభగలాడు అగ్నిపర్వత
హృదయం.
భీతావాహ ప్రళయాన రుద్రుడి
త్రినేత్రం

శ్రమను వెచ్చి జీవం పెంచే
భూమిపుత్రుడను,
ఆతడిగా మలచుకున్న పుడమిని.

ధాత్ర్రిని నేను నింగిని నేను

పాపం పుణ్యం,
స్వర్గం నరకం నేను

ఆనందమున బ్రహ్మండమంతటా నిండిన
విశ్వాత్మను,
శోకమున అణువుగా కృంగి నశియించినది నేను

అహం శూన్యోస్మి
అహం బ్రహ్మస్మి
అహం బ్రహ్మస్మి....

చర్మ సౌందర్యం, శరీర సౌష్టవం

పీల్చే గాలి, తినే తిండి,చేసే పనిలో నాణ్యత లోపించి నేటి ఈ ఆధునిక కాలంలొ మనిషికి అందాల్సిన పోషకాలు తగినంత శారీరిక శ్రమ దొరకడం లేదు. ఫలితమే కళా కాంతి లేని చర్మం, మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దపోసినట్టో దాన్ని మొత్తం జుఱ్ఱేసినట్టో ఉండే శరీరాకృతులు...

ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా పద్దతులు, సాధనాలు, ఉత్పత్తులు వచ్చాయి. ఆశకొద్ది జనం వాటిని ఉపయోగిస్తున్నారు. ఐతే అవి మనకు నప్పడమూ, వాటి సైడ్‌ ఎఫెక్టులు, వ్యాయామాలు గట్రా చేయడానికి బద్దకమూ వగైరా వగైరా కారాణాల నేకం వలన satisfactory results అందటం లేదు. ఐనా మహిళామణులు రోజులు నెలల తరబడి బ్యూటి పార్లర్లు, సౌందర్య వికాస ఉత్పత్తులు వాడటం, మగమహారాజులు జిమ్ముల వెంట తిరగడం చేస్తూనే ఉన్నారు. కంపెనీలు, డాక్టర్లు, ఫిజియోలు, బ్యూటి పార్లర్లు, జిమ్ములు డబ్బు దండుకుంటూనే ఉన్నాయ్. మరి దీనికి పరిష్కారం...?

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నిపుణుల, ఇంజనీర్ల ఎన్నో యేళ్ళ  ప్రయోగాలు, మార్పులు చేర్పుల ఫలితంగా ఓ అధ్బుతం ముందుకొచ్చింది. సమస్య ఏదైనా సరే రోజులు నెలలు కాకుండా క్షణాల్లో పరిష్కారం!! డబ్బా మొహాల నుండి చంద్రబింబం లాంటి మోము కావాలన్నా, బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా అన్నింటికి సర్వరోగ నివారణి.
ప్రవేశ పెడుతున్నాంమా ఈ ఉత్పత్తిని వాడిన వారికి అందిన ఫలితాలు, అదికుడా క్షణాల్లొ

చూసారుగా......వాడటంలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు, అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు, పత్యాలు వగైరాలు అసలే లేవు, పగలు సాయంత్రం మాత్రమే లాంటివి అసలే లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తమ్ మీకు అనుకూలమైనట్టుగా.... కాబట్టి ఆలస్యం చేయకుండా నేడే..., ఇప్పుడే వాడండి. మిమ్మల్ని మీరు స్టార్లుగా మార్చుకోండి.

***********************************************************************
ఓ SMS ఆధారంగా.


చేదుపాట

నిన్న రాత్రి తెలిసిన బ్లాగులు కొన్ని తరచి చూస్తూ కృష్ణప్రియ గారు  సమీర్ పైన రాసిన పోస్టునొకటి చూడడం జరిగింది. నిజానికి ఆ పోస్టు ఎప్పుడొ నా ఫీడ్ బర్నర్ లో వచ్చింది కాని టైటిల్‌లో ‘కథ’ అనివుండే సరికి నిజంగా కథ అయివుండవొచ్చని ఇన్ని రోజులు చదవలేదు. కాని నిన్న ఆ పోస్టును చదివిన దగ్గరినుండి నాలో ఎదో దుఃఖం లాంటిది ఏర్పడింది. ఆ సమీర్ ఎవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు అతను గనక ఎదురైతే అతన్ని హత్తుకొని ‘Every thing is all right bro' అని అనాలనిపిస్తుంది. అతణ్ణి గురించి కృష్ణప్రియ గారు చెప్పిన ఓ పేరాను ఇక్కడ చూడండి
ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.
 అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఆ కోపాన్ని అలాగే కొనసాగించే వారు. అతనో కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందినవాడు. పండిట్ల పట్ల కాశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలను తెలిసినవాడు. అతను పై సందర్బంలో కోప్పడడంలో తప్పులేదనిపించింది....అయినా చివరకు తేలికయ్యాడు. మనలో ఎంతమంది అలా చేయగలం ?
పోస్టు మొత్తం చదివాక గుండె బరువెక్కిపోయింది. అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నా...ఆ ఫీలింగ్‌ నుండి బయట పడడానికి పాటలు వినడం, వేరె బ్లాగులు ఓపెన్ చేయడం, నా బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు చూడడం మొదలుపెట్టా...ఉహూ అస్సలు వీలవలేదు. ఎదో తెలియని బాధ.  అదే సమయంలో అంతకు ముందురోజు చూసిన వజ్రాల తవ్వకాలలో నలిగిపోతున్న ఆఫ్ర్రీకా ప్రజలమీద తీసిన బ్లడ్ డైమండ్ సినిమా, నా తెలంగాణాలోంచి మిగతావారిని తరిమేయాలని కేసిఆర్ చేస్తున్న చర్యలు, అప్పుడేపుడొ చేతన్ భగత్ three mistakes of my life  పుస్తకంలో ఒక కాశ్మిరీ పండిట్ పాత్ర గుర్తుకొచ్చాయి. అప్పటిదాకా మనస్సులో ఉన్న బాధ ఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి.

అసలు మన దేశంలో ఉన్నవారి గురించి మనకేం తెలుసు. కాశ్మీర్‌లో ప్రజలు పడే బాధలు, ఈశాన్య భారతంలో సైనికుల అకృత్యాలు, విప్లవం పేరుతొ మావోయిస్టులు శాంతి పేరుతో పోలీసులు-ప్రభుత్వాలు చేస్తున్న దురాగతాలు , తిండిలేక నిర్లక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్న జనం మనకేం తెలుసు (నేనేమి మినహాయింపు కాదు). బండేసుకు తిరగడానికి తక్కువ ధరలో పెట్రోలు, మాట్లాడటానికి చేతిలో సెల్లు, వీకెండ్స్ ఆనందంగా గడపడానికి పార్కులు పబ్బులు ఉన్నాయని సంబరపడుతున్నాం. రెండంకెల జీడిపి ని తలుచుకొని మురిసిపోతున్నాం. నాణేనికి మరోవైపు ఇంత చీకటి ఉన్నాకూడా. అన్నీ బాగుండాలి, నాకో idealistic ప్రపంచం కావాలని కాదు, కాని ఇన్నేళ్లుగా సమస్య అలాగే ఉన్నా స్తబ్థత ఎందుకు మనలో, ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

సమీర్ గురించి చదివాక శ్రీశ్రీ గారి కవితలు కొన్ని గుర్తోచ్చాయి...
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం...
లేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా, చదువు వృధా
కవిత వృధా!,వృధా,వృధా!
మనమంతా బానిసలం
గానుగులం, పీనుగులం
ఆలోచన, ఇంగితం ఉన్న మనుషులుగా పుట్టాక తినడానికి ముప్పూటలా తిండి, చుట్టూ అభిమానించే జనం,చేయడానికి శ్రమ సంపాదించుకోలేమా...? ఎందుకీ ద్వేషాలు, పౌరుషాలు, మోసాలు...

I realize that the world is more sinner and cynic than i thought it to be and I do believe that it has much more love and humanity to rescue this place from the tyranny and brutality of human oppression . But will we ever let it show up ?

రావణ రాజనీతి- సినిమా చూసిన వారికే

గమనిక : ఒకవేళ మీరు గనక ‘రావణ్’ , ‘రాజ్‍నీతి’ సినిమాలు చూడకపోయినట్లైతే ఈ పోస్టు చూడనక్కరలేదు. మీకు ఉపయోగపడే సమీక్షలు చాలా దొరుకుతాయి. ఈ సినిమాలను చూడద్దనో చూడమనో ఇక్కడ చెప్పడంలేదు.
 *********************************************************************************

కత్రీనా సోనియా పాత్ర పోషిస్తుందట, నసిరుద్దిన్ షా, నానా పటేకర్, అజయ్ దేవ్‌గన్‌, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్లలందరు ఉన్నారనగానే చాలా ఆత్రుత కలిగింది. ఇంటికేళ్లినప్పుడు ఎలాగైనా చూడాలనుకున్నా. తోడేవరు లేకపోవడంతో కాలేజిలో వచ్చిన పైరేటేడ్‌ వెర్షన్ చూసా. సినిమా మధ్యలోనే అనిపించింది, నటీనటుల కౌశలాన్ని సరిగా ఉపయోగించుకొలేదని.....పైగా చాలా చెత్తగా ఉపయోగించుకున్నారు. ఎంచుకున్న కథకు ట్విస్టులు, సస్పెన్స్‌లు అస్సలు అవసరంలేదు. screenplay, పాత్రల పరిచయ విషయాల్లో కాస్తంత బుర్ర పెట్టుంటే బాగుండేది. సినిమా మొదట్లో నసిరుద్దిన్‌ షా పాత్ర అసలు అవసరమే లేదు. అంత పెద్ద యాక్టింగ్‌ జీనియస్‌ను అనవసరంగా దిష్టిచుక్కలాగా వాడుకున్నారు.
తరువాత వచ్చే అజయ్‌ దేవగణ్‌ పాత్ర, ఆ పాత్ర పరిచయం ఇంకా చెత్త. అతనుండే ఆజాద్‌ నగర్‌ అనే స్లమ్‌ ఏరియాలొ అతను అక్కడి జనం మెచ్చిన లీడర్. ఆ లీడర్ రేంజ్ ఎంటో చెప్పలేదు. సినిమాలో చూస్తే అతనో కాలనీకో, వార్డుకో నాయకుడిలా చూపించారు సింపుల్‌గా చెప్పాలంటే గల్లి లీడర్‌లా.... కాసేపయ్యే సరికి అసెంబ్లీ ఎలక్షన్లు మొదలౌతాయి. మన హీరోగారు ఆ ఏరియా అసెంబ్లి టికెట్ కావాలంటాడు (అదీ ఆ ఆజాద్‌ నగర్ బాగు కోసం)...అదీ ఓ రాష్ట పార్టి కార్యాలయానికి నేరుగా వెళ్లి...‘ముఝె పార్టి టికెట్ చాహియే’. వెంటనే మనోజ్ బాజ్‌పాయ్ తన బాబాయ్ కొడుకుకి ప్రత్యర్ది దొరికాడని పొంగిపోయి ఉప్పొంగిపోయి  అతనికి పార్టి టికెట్, బలహీన వర్గాల విభాగనికి అధ్యక్ష పదవి ఇస్తానంటాడు. ఆ డవిలాగు విన్నాక కాసేపు నాకు అవి అసెంభ్లి ఎలక్షన్లు అని చెప్పాడో మున్సిపల్‌ వార్డు ఎలక్షన్లు అని చెప్పాడో అర్థంకాలేదు. పోనీ ఎదో విధంగా విలన్ గ్రూపులో చేరిపోయాడు అనుకున్నా.....అంతలోనే సడెన్‌గా ఈయనగారిలో విలన్ లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నపళంగా జనంలోంచి వచ్చినోడికి రాక్షస బుద్దులు ఎక్కడినుంచొచ్చాయొ ఆలోచిస్తే మిగిలింది బొచ్చే.... ఈ పాత్ర కర్ణుడికి పోలిక అనుకుందామనుకున్నా భారతంలో ఎక్కడా కర్ణుడిని లీడర్‌లా చూపించింది లేదు. పార్దుడికి సరైన ప్రత్యర్ది దొరికాడని ధుర్యోధనుడు అక్కున చేర్చుకుంటాడు అదీ కర్ణుడి ప్రతిభ చూసిన తరువాత. ఇలా సినిమాలో చూపించినట్టు ఓ మంచి గల్లి నాయకుడు లెక్కా పత్రం లేకుండా పోటికి రావడం ఆ తరువాత చెడ్డవాడవడం---కామన్ సెన్సును కూడా మరచినట్లున్నారు.

సినిమాకి ఇంకో బొక్క సోనియా గాంధి పాత్ర ఉందంటూ చేసిన హడావిడి.  మార్కెటింగ్‌ గిమ్మిక్‌ తప్పిస్తే మరోటి కాదు. చివర్లో కత్రీనా ఓ రెండు క్షణాలు చీర కొంగును తలపైన పట్టుకొని ప్రజలకు అభివాదం చేస్తుంది దానికోసం సోనియా పేరుని వాడి నిరాశ పరిచారు. తెలుగులో వచ్చిన ‘లీడర్’ చూసాక రణ్‌బీర్ పాత్ర interestingగా అనిపించలేదు. నానా పాటేకర్ కూడా ‘లీడర్’లో కోటాను తలపిస్తాడు. కొద్దొగొప్పో ఈ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మనోజ్ బాజ్‌పాయ్, అర్జున్ రాంపాల్ పాత్రలు. అధికారం కోసం వెంపర్లాడే పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్, పెదనాన్న ఇచ్చిన అధికారం నిలబెట్టుకోవడానికి బలహీనతలున్నా ప్రయత్నించే పాత్రలో అర్జున్‌రాంపాల్ మెప్పించారు. మొదటి పావుగంట అవసరమే లేదు. రామాయణంలో పిడకల వేటన్నట్టు ఓ ఐటమ్ సాంగ్...#%^#^#*)(#
హరేకృష్ణ గారి బ్లాగులో  పియా మోరా పాట బాగుందన్నారు...సినిమాలో చిన్న చిన్న బిట్లుగా వినపడిందా పాట. బహుశా పైరేటెడ్ ప్రింట్ కాబట్టి కట్ అయిందనుకుంటా... ఆడియో సాంగ్ మాత్రం బావుంది.

 రావణ్ రిలీజ్ అయ్యాక  అందులో మణిత్నం సినిమా అనిపించదగ్గ అంశాలేవి లేవని ,ట్విస్టులు లేవని (నాకర్థం కానిది, రామాయణం లాంటి తెలిసిన కథలో ఎలాంటి ట్విస్టుల్ని ఎక్స్‌పెక్ట్ చేసారో ఈ రివ్యూ చేసిన వాళ్లు) , చూడ్డం దండగని చాలా రివ్యూలొచ్చాయి. మా తమ్ముడైతే ఏకంగా ఝండు బామ్ సేల్స్ పెంచాలనుకుంటే రావణ్ చూడొచ్చు అన్నాడు. అయినాసరే, ఎంతయినా మణిరత్నం సినిమా, చూసి తీరాలనుకున్నా. సినిమా సగం అయ్యేంతవరకు ‘రావణ్’  చేసిన కిడ్నాప్‌కు కారణం తెలియరాదు. అంతవరకు ఏవైనా కట్టిపడేసే ఎలిమెంట్స్ చెప్పుకోవాల్సి వస్తే అది కెమెరా వర్క్ మాత్రమే. కేరళ అందాలు చూపించడానికేమో అన్నట్లు ఉంది మొదటి భాగం. ద్వితీయార్థంలో నైనా ప్రియమణి పార్టు, క్లయిమాక్సులో డైలాగులో కొంచెం పట్టు ఉండబట్టి సరిపోయింది లేకపోతే మా తమ్ముడు అన్నట్లు ఘండు బామ్ సేల్స్ పెంచి ఉండేవాణ్ణి.
మణి రత్నం సినిమాలో తప్పులు చూపే సాహసం కాదు కాని సినిమాలో కొన్ని లోపించాయని చెప్పొచ్చు. ఫ్లాష్‌‍ బ్యాక్ పార్టులో తప్పితే ఎక్కడ నటుల మొహాల్లో ఎమోషన్స్ కనపడలేదు. పలికించాలనుకున్న భావాలన్ని వాళ్ల మొహాలకు అద్దిన రంగులను చూసి తెలుసుకోవాలి. ‘రావణ్’ మొహానికి సన్నివేశానికో రంగు అద్దారు కాసేపు సున్నం, కాసేపు పసుపు, కాసేపు బొగ్గు, కాసేపు మన్ను. ఐశ్వర్య చెట్టు మీద నుండి పడేప్పుడు ఒక స్లో మోషన్  ఫ్రేము, పడ్డాక నీళ్లల్లోంచి లేచేప్పుడు ఓ స్లో మోషన్ ఫ్రేము....వీటన్నిటిని అర్థం  చేసుకోవాలంటే చూసేది  భావుకులన్నా అయి ఉండాలి లేకపోతె ఫొటొగ్రఫి ఆస్వాదించే వారన్నా అయిఉండాలి.  మణి మ్యాజిక్ చూడాలనుకునే సగటూ ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థం కాని ఎలిమెంట్స్ సినిమా టైములో సగానికి పైగా ఉంటాయి. రిలీజ్‌ ముందు ఇది రామాయణం బేస్ చేసుకొని తీస్తున్న సినిమా అని  చెప్పకపోయి ఉండనట్లైతే సినిమాను కనీసం ఓ పోయటిక్ ఎక్స్‌ప్రెషన్‌గా నైనా స్వీకరించేవాళ్లెమో. ఇపుడు అలాగే అనిపిస్తుంది నాకు  It's more  a poetic expression than a celluloid magic.

ఓ స్నేహితుడి బ్లాగు

చాలా చక్కగా కవితలు వ్రాస్తాడు. I wish you  folks too have a look at them

http://mkreddysblog.blogspot.com/

Kgp-Hyd-Mum-Kgp

ఇంటికెళ్లి అయిదు నెలలవుతుంది. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కలవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు ఎటొచ్చి ప్రొఫెసరు ఇంటికెళ్లడానికి ఒప్పుకుంటాడొలేదో అనుకుంటూనే అడిగాం, ఓ పది రోజులకు పర్మిషన్. తరువాత తెలిసిందేంటంటే ఆయన కూడా లీవ్ పెట్టబోతున్నారని. ఏమి నా భాగ్యం అనుకొని పది రోజుల ట్రిప్‌ను నాకు నేనే సర్వసత్తాకంగా  పదిహేను రోజులకు పొడిగించుకొని క్రితం నెల 25న బయల్దేరా. వెళ్లేటపుడు ట్రెయిన్‌లో ఒకటే ఆలోచన- కాలేజీలో అయితే రోజుకి 9-10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా, కరెంటు కట్ అనేదే తెలీదు ఇంటికెళితే కరెంటు కట్ ఉంటుంది, అదేపనిగా కంప్యూటర్ పైన  వా్లిపోతే అమ్మో, నాన్నో తాటతిస్తారు, ఎలా మానేజ్ చేయాలా అని.

అలా అలోచిస్తూ చిస్తూ హైదరాబాదులో అడుగుపెట్టా. ఇంటికి చేరుకునేసరికి మా ఇళ్లు కొత్త పెళ్ళికూతురిలా వెలిగిపోతుంది. నే రావడానికి కొద్దిరోజులముందు ఇంటికి సున్నాలద్దారు అదీ దాదాపు పదేళ్ల తరువాత. ఏదైతే ఏమిగాని మా ఇళ్లు మాత్రం అందంగా తయారైంది నా రాక కోసమే అన్నట్లు


                                                                       

                                              కొత్తసీసాలో పాత సారా   అన్నమాట ఇంటికెళ్లినా కాలేజిలో ఒంటబట్టిన అలవాటు పోలా...రాత్రి 3:00 అయినా నిద్రపట్టేది కాదు. అందరూ పడుకున్నాక మేల్కోలేక, పడుకున్నా నిద్రరాక డాబా మీద కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగేవాణ్ణి. ఏ 4:00 కో 5:00 కో నిద్రపోయి మధ్యాహ్నం  పన్నెండు, ఒంటి గంట దాటాక మేల్కోవడం ఇలా ఓ నాలుగు రోజులు నిద్రార్పణం అయ్యాయి. ఎలాగైనా తొందరగా నిద్రపోవాలని అలసట తెప్పించుకోవడానికి రాత్రి 7 దాటాక తెగ నడవడం మొదలుపెట్టా. అలా తిరుగుతున్నప్పుడే కనిపించాయి మా ఏరియాలో కొత్తగా పెట్టిన ఓ నాలుగు banquet halls, ఓ కొత్త ATM center.ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా....ఐతే మీకు మా ఏరియా గురించి చెప్పాలి.

ఓ పక్క నాగార్జున సాగర్ రోడ్డు మరోవైపు విజయవాడ హైవే..., ఈ రెండు రోడ్ల మధ్య ఉంటుంది మా ఏరియ

ఆ సంతోష్‌నగర్ నుండి కర్మన్‌ఘాట్ వరకు మూడు కిలోమీటర్లు, ఈ మూడు కిలోమీటర్ల దూరంలో ఒక్క సాగర్  రోడ్దుమీదే   పద్దెనిమిది ఫంక్షన్‌ హాల్స్ ఉన్నాయి, అటుపక్క ఇన్నర్ రింగ్ రోడ్దు మీద ఓ పది దాకా ఉంటాయి. చిన్నాచితకా అనుకుంటున్నారేమో..peak seasonలో ఈ హాల్స్ బుక్ చేసుకోవాలంటే  లక్ష వరకు ఖర్చవుతుంది. ఇన్ని ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయని ఈ మూడు కిలోమీటర్ల వరకు సాగర్ రోడ్దును అనధికారంగా Gardens Street అంటారు. పెళ్లిళ్ళ సీజన్‌లో ఉంటుంది సామి ట్రాఫిక్ జాము, దరువు.....జజ్జనక జ్జజ్జన జనక జనక. ఇపుడు కొత్తగా పెట్టిన ఆ నాలుగు కలుపుకుంటే మొత్తం 36.
ఇక ATM సంగతికొస్తే నాకు తెలిసి హైదరాబాదులో మరెక్కడా ఇన్ని బ్యాంకుల ATMలు ఒకే దగ్గర ఉండవు. ఇప్పటి వరకు మూడే ఉండేవి ( Andhra bank, SBI, Canara Bank) కొత్తగా HDFC వాడు పెట్టాడు. మీకు తెలిసి హైదరాబాదులో కాని ఇండియాలో మరెక్కడైనా కాని ఇంతకంటే ఎక్కువ ATMs ఒకే దగ్గర ఉన్నట్టు తెలిస్తే చెప్పండి లేకపోతే నేను దీని గురించి లిమ్కా రికార్డుకోసం చూద్దామనుకుంటున్నా---కూసింత రీజినల్ ఫీలింగ్ ;)
ఇంటికొచ్చి స్నేహితులను కలుద్దామనుకుంటే వాళ్లు జాబ్స్‌లో బిజీ బిజీ. పోని శని- ఆదివారాల్లో వీలవుతుందనుకుంటే వాళ్లు బంధువులిళ్లకు వెళ్లడమో , షాపింగ్ అనో దొరకలేదు. ఏం చేసేది లేక మమః అన్నట్టు ఇద్దరిని ప్రత్యక్షంగా కలిసి, మరికొందరిని కలవాలనుకున్నా కుదరక ఫోన్లోనే పలకరించి ఇంకొందరిని అసలు ఏ విధంగా కుడా కలవకుండా ముంబై బయల్దేరా. అక్కడ IIT లో మా ప్రెండొకడున్నాడు వాణ్ణి కలవడానికి.
ముంబై వెళ్లడానికి Rs. 272 ట్రైన్ టికెట్టు దొరక్క తత్కాల్ చేసుకుందామని పొద్దునే 5గంటలకు లేచి రిజర్వేషన్ కౌంటరుకెళ్లా. ఆరోజు నా లక్కు అఘోరించినట్లుందనుకుంటా నా ముందు ఇంకో ముగ్గురు ఉన్నపుడు ఓ వెధవ ఆ రిజర్వేషన్‌ చేసే ఆవిడతో గొడవకు దిగాడు ఆవిడేమో అటు గొడవ పెట్టుకోలేక ఇటు రిజర్వేషన్ చేయలేక ఊరకే తాత్సారం చేసింది. పక్క కౌంటరులో ఒకరిద్దరు ముంబైకే బుక్ చేసుకుంటున్నారు...టికెట్లు టపా టపా పిట్టల్లాగా రాలిపోతున్నాయి,  మా లైనులో ఆ సనుగుడుగాడు వెళ్లడంలేదు, పైగా నా ముందు కాన్సిలేషన్  కోసం ఓ కాండిడేటు. కాస్నిలేషన్ కోసం అంత పొద్దునే లేచి తత్కాల్  లైనులో ఎందుకు నిల్చున్నాడో ఎంత బుర్రగోక్కున్నా అర్థం కాలేదు. బాబు నీది కాన్సిలేషనే కాదా ఓ పది నిముషాలయ్యకైనా చేసుకోవచ్చు మేము బుకింగ్ చేసుకోవాలి పక్కకు తప్పుకోరా నాయనా అన్నా వినలేదు. పర్యవసానమేంటొ మీకు చెప్పనక్కర్లేదనుకుంటా. అక్కడి నుండి ఊసూరుమనుకుంటూ వచ్చి నా బ్యాడ్ లక్‌ను, ఆ సనుగుడు వెధవని, ఆ రిజర్వే‌షనావిడని, ఆ కాన్సిలషన్‌గాడిని తిట్టుకుంటూ 1000 పెట్టి ( సారి 992 మాత్రమే ) RTC బస్సులో బయల్దేరా. బస్సులో రాష్ట్రం అవతల ప్రయాణించడం అదే మొదటిసారి. వచ్చే దారిలొ వాతావరణం చల్ల చల్లగా వుంది అంతకు ముందు రోజు రాత్రి వర్షం పడింది కాబోలు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో ఖండాలా చేరుకున్నాం, ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బస్సు కిటికిల్లొంచి కనిపించిన ఆ లోయల అందం ఎంత వర్ణించినా తక్కువే.

ముంబైలో ఈ నెల 11న దిగాను. ఫ్రెండ్‌ రూంకి వెళ్లాక బ్లాగు లోకం ఎలా ఉందో చూద్దామని ‘మాలిక’ ఓపెన్ చేసా.మంటలు కక్కుతూ పోస్టులు కనపడ్డాయి వాటిలో చలికాచుకోవడమో, చేతులు కాల్చుకోవడమో ఇష్టం లేక (నిజం చెప్పాలంటే భయమేసి) అక్కడున్న నాల్రోజులు ఇంటర్నెట్  వైపే వెళ్లలేదు. ఓ మూడు రోజులు బీచుల వెంబడి తిరిగాము. బీచులు అందునా ముంబై బీచుల వెంట కుర్రాళ్లం మేము  మూడు రోజులు ఎందుకు తిరిగామో మీకు చెప్పక్కర్లేదనుకుంటా ;)  ;)


చివరిరోజు Gateway of India  నుండి ఎలిఫెంటా కేవ్స్‌కు లాంచిలో వెళ్లాము. గంటసేపు ప్రయాణం.  సముద్రంలో ప్రయాణించడం , సముద్రంలో పెద్ద పెద్ద షిప్‌లను, కంటైనర్లను చూడటం అదే మొదటిసారి . వెళ్ళేటపుడు వాతావరణం ప్రశాంతంగవుంది.తీరా ఆ కేవ్స్‌కు వెళితే అక్కడ ఆర్కియాలజి డిపార్టుమెంటు వాళ్ళు పండులొ గుజ్జు తినేసి టెంకలు మిగిల్చారు. అదే మహాప్రసాదమనుకొని తిరుగు ప్రయాణమయ్యాం. అరగంట తరువాత వర్షం మొదలైంది గాలులు ఎక్కువైయ్యాయి. సముద్రంలో అలజడి. మా బోటు అలలకు పైకి కిందకు కదులుతుంది కొంతమంది భయపడుతున్నారు ఏమౌతుందోనని, ఇంకొందరు అలలు లాంచిలోకి వస్తుంటే ఆనందిస్తున్నారు ఆ రెండొ గ్రూపులో నేనుకూడా కలిసిపోయా. బోటు తిరిగి Gateway of India దగ్గరకు వచ్చేసరికి అలలు ఇంకా ఎక్కువయ్యాయి, అప్పుడే మా బోటు ఇంజన్‌లో తాడు చిక్కుకొని ఆగిపోయింది.....

కొంతమందిలో భయం మొదలైంది. పక్కనే ఇంకో బోటు ఉండడంతో మా లాంచి నుండి దానికి తాడు లంగరు వేసి మరొక ఒడ్డువైపు తీసుకెళ్లారు అదే అలలగుండా వెనక్కి వెళుతూ. తీసుకెలుతున్నపుడు మధ్యలో తాడు విడిపోయింది.బోటులో ఉన్నవాళ్లలో మళ్లి కలకలం. బోటులో ఇద్దరు High class ఆడవాళ్లు వాళ్ల పిల్లలతో (మరీ చిన్నవాల్లేం కాదు 16-22  మధ్య ఉంటారు) వచ్చారు. ఇంజన్ ఆగిపోయిన దగ్గరనుండి వాళ్ల పిల్లలు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు ఆ అమ్మలేమో ‘ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, దేవుడిని ప్రార్దించండి, మీ వాళ్లకు ఫోన్లు చేసుకోండి’ అనడం మొదలుపెట్టారు వాళ్ల మాటలకు ఆ పిల్లలు, ఇంకొందరు కూడా భయపడడం మొదలుపెట్టారు.   కుర్ర జంటలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. లాంచిలో ఓ మరాఠి ఫ్యామిలి ఉంది- లొయర్ మిడిల్‌క్లాస్ అనుకుంటా అందులోంచి ఒకాయన ‘మరేం ఫరవాలేదు సముద్రంలో ఇలాంటివి మామూలే, లాంచి వాళ్లు ఇలాంటివి చాలానె చుసుంటారు ఎవరికి ఏం అవదు’ అంటూ సర్దిచెబుతున్నాడు వాళ్ల కుటుంబంలో ఆడవాళ్ళు కూడా ఏమి గాబర పడటం లేదు.

లాంచివాడు ఆ విడిపోయిన తాడును మళ్ళి కట్టి వేరే పనిలో పడ్డారు. నేను, నా స్నేహితుడు లాంచి వాడి దగ్గరకు వెళ్లి ఎటు తీసుకెళుతున్నారో కనుక్కున్నాం...కాసేపట్లో చేరిపోతాము అని పక్కవాల్లకు చెప్పి ఊరుకున్నాం. లాంచిలో ఓ పంజాబీ యువకుడు, కుటుంబంతో వచ్చిన ఓ ముస్లిం యువకుడు  కూడా ఏమి అవదు అది చాలా చిన్న సంఘటన అని ధైర్యం చెబుతున్నారు. ఆ high class ఆడవాళ్లు మాత్రం ఆగటం లేదు. లాంచివాడిని ‘మీ ఓనర్ నెంబరు ఉందా?’, ‘ఇంజన్ ఇంకా ఎందుకు బాగు చేయలేదు’, ఆ మరాఠి ఆయన్ను ‘మీకెలా తెలుసు కాసేపట్లో చేరుకుంటామని?’ అంటూ తను హైరానా పడుతూ మిగతావాళ్లను కూడా హైరానా పెట్టింది. ఆ గోల భరించలే నేను ఆ మరాఠి ఆయన్తో కబుర్లు చెప్పటం మొదలుపెట్టా. Gate way of India నుండి మళ్ళి సుమారు గంట తరువాత  మా లాంచి్ మెజగాన్ డాక్ దగ్గర ఆగింది. అందరం సురక్షితంగా బయటపడ్డాం. కాని ఆ గంటసేపు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోయే సమయం. మనిషిలో ‘చావు’ అనే భయాన్ని, High classలో డాంబికాన్ని, మధ్యతరగతలో ధైర్యాన్ని దగ్గరగా చూసా. అక్కడ భయపడటానికి వాళ్లు high class వాళ్లొ, ధైర్యంగా ఉండటానికి, చెప్పడానికి ఆ మరాఠి అతను మిడిల్‌ క్లాసో అవనవసరం లేదు. కాని సాధారణంగా మనం ఈ తరగతుల గురించి వినే మాటలను ప్రత్యక్షంగా చూడటం నిజంగా ఓ deep impression కలిగిస్తుంది. ఎన్నిసార్లని గనుక ఇటువంటివి ఎదురౌతాయి!!

అక్కడున్నపుడు ‘తాళము వేసితిని గొళ్లెము మరచితిని’ పని చేసా.  IIT mumbai students కు విండోస్7 ఒరిజినల్ వెర్షన్ ఉచితంగా ఇస్తారు అని అంటే ఎగేసుకుంటూ install చేసుకున్నా...తరువాత వెలిగింది బల్బు firefoxలొ బ్లాగు ఫీడులను బుక్‍మార్క్ చేసిన ఫైల్‌ను  బ్యాకప్ చేయడం మరచిపోయానని.....వా :( .
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అప్పుడెపుడో క్రితం సంవత్సరం ఖరగ్‌పూర్ వచ్చేముందు బుక్‌మార్క్ ఫైలుని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసా. కాని అందులో అన్ని ఫీడ్స్ లేవు. గుడ్డిలో మెల్ల, ఆ మాత్రమైనా ఉన్నాయి. నిన్నంతా కూడలి, హారం, జల్లెడ, మాలికలు తిరగేసి మిస్ అయినవాటిలో కొన్ని తిరిగి సంపాదించా....

బొటు విహరం నుండి తిరిగొచ్చా రాత్రి 8 కి జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిరావాలి, వర్షం మొదలౌతుండగా ఆఘమేఘాల మీద ఓ ఆటో పట్టుకొని బయల్దేరాం. తీరా స్టేషను చేరుకొనేసరికి అక్కడ ట్రైను ఎనిమిది గంటలు వాయిదా అని announce చేసారు ఎందుకని వాకబు  చేస్తే రెండు వారాల క్రితం మావోయిస్టులు ట్రైను పేల్చినప్పటినుండి ఉదయం నాలుగింటికి మార్చారంట...మాకు మామూలుగా తిక్కరేగలేదు. అసలే ఆన్‌లైన్‌లో  తత్కాల్‌లో బుక్ చేసుకున్నాం అందులో వాయిదా అని ఏం చెప్పలేదు, పైగా స్టేషను చేరుకునేప్పుడు గొడుగు పోగొట్టుకున్నాం, దానికి తోడు ఉదయం జరిగిన లాంచి సంఘటన....ఒక్కసారిగా పిచ్చిపట్టినట్టు అనిపించింది. అయినా ఆ మావోలకి బలిసి కాకపోతే ఏం దొరకలేదా. ఎవడో చేసినదానికి అమాయకులను చంపేసారు....వీళ్లకు వంతపాడుతూ విప్లవ సంఘాలు..damn these people.

వాయిదా అని తెలిసి ఆ స్టేషనులో ఉండలేక కాంపస్‌కు తిరిగి వెళ్లాం. అర్థరాత్రి రెండుగంటలకు లేచి ఆటో వెతుక్కొని స్టేషన్ వచ్చా. ఎనిమిది గంటలు వాయిదా పడటం, ప్రయాణంలో రైలు  నాలుగు గంటలు ఆలస్యం వెరసి 36 గంటలు రైల్వే వారి సేవలో మునిగిపోయి ఖరగ్‌పూర్‌లో తిరిగివచ్చిపడ్డా.
ఖరగ్‌పూర్‌లో దిగగానే చేసిన మొదటిపని, స్టేషను బయట ఉండే Taaz ధాబాలో ఓ వేడి వేడి చికెన్ బిర్యాని లాగించడం. చూడ్డానికి చిన్న ధాబా లాగుంటుంది కాని ఇక్కడ చేసిన బిర్యానియంత బాగా ఎంటై.....ర్ ఖ‌రగ్‌పూర్‌లో దొరకదు.

పేరులో ’నేముంది’

అసలీ పెపెంచకంలో ఓ మనిషికి చాలా బాగా నచ్చేది ఏంటి? ఎవళ్ల సంగతో ఎందుగ్గాని నామటుకైతే ఎవరికైనా వాళ్ల వాళ్ల పేర్లు నచ్చుతాయి అని అనుకుంటున్నా...అందుకే మరి చిన్నప్పటినుండి వ్యాకరణ భాగాలలో మనకు నచ్చిందేంటయ్యా అంటే నామవాచకం, సర్వనామం ( సర్వనామం అంటే అమృతం సీరియల్లో సర్వర్ సర్వం పేరనుకునేరు...అదికాదు). నా ఈ ఇష్టం ఎంత ముదురంటే పక్కవాడు ఎవరిదన్నా లేక ఏదైన వస్తువు, ప్రదేశం పేరు తప్పుగా పలికితే చాలు నాలో ఠాగూర్ నిద్ర లేస్తాడు. పలికేది నోరు తిరగని అరబ్బు పేరైనా సరే, కరేక్టుగా పలకాల్సిందే. లేకపోతే మెజార్టి జనం పలికినట్టు అనాల్సిందే, అంతవరకు వదిలేవాణ్ణి కాదు. అలాంటిది నాకు, నాతో, నాపట్ల  నా పేరు సరిగా వినడానికి  తిప్పలు పడాల్సివచ్చింది....అదేదో సామెతలొ అందరికి శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడ్డట్టు.

మన పేరు నాగార్జున చారి. స్కూళ్లొ ఉన్నప్పుడు నాగార్జున అనొకడు, చారి అనొకడు ఎవరికి నచ్చిన పార్టు వాడు ఊడగొట్టి పిలిచేవాళ్లు. ఇరగ్గొడితే ఇరగ్గొట్టారు సరిగానే పలుకుతున్నారుకదా అని అనుకున్నా ఇంటర్‌ వచ్చాక తెలిందేంటంటే అది ఇష్టం కాదు convenience అని. ‘నాగార్జున ’ అనే నాలుగు శబ్దాల పదంకన్నా జనాలకు ‘చారి’ అనే రెండ శబ్దాలపేరే  పలకడానికి తేలికనిపించింది. ఇంజనీరింగ్‌లో మా ఇంటర్ ఫ్రెండ్స్ ఉండడంతో పొడుగు పేరు చెప్పించుకుందామనుకున్నా పొట్టి పేరు  పాపులరైపోయింది. ఈ స్టేజిలో వచ్చిన సమస్య స్పెల్లింగుతో....ఇంగ్లీషులొ నా పొట్టి పేరు chary అని ముద్రితమైపోయింది. అలా కాక e-mailsలో, orkut scraps లో, SMS లో char‘i’ అని ఎవరైనా రాస్తే గుండెలు తోడేసినట్టుండేది. ఇదెలాగూ తప్పేట్టు లేదని బ్లాగ్లోకంలో అయినా సరిగా పిలిపించుకుందామని display name ను ‘nagarjuna’ అని ఇంగ్లీషులో ‘చారి’ ని తెలుగులో రాసేసా. అందరు ఇక చచ్చినట్టు సరిగా రాస్తారు, పలుకుతారు అని.  
తరువాత మొదలైంది మొసళ్ల పండగ. నా పోస్టులకు వ్యాఖ్యలు రాసేఫ్ఫుడు, నే రాసిన వ్యాఖ్యలకు జవాబిచ్చేఫ్పుడు, ఇక్కడ కూడా convenience ప్రకారమో ఏమో,  పొట్టి పేరును ఎంచుకున్నారు బ్లాగర్లు. కుంటే కున్నారు మర్యాదకోసమో ఏమో దాని చివర ‘గారు’ అని అలంకారమొకటి నేనేదో పెద్దవాణ్ణైనట్టు!! అదీకాక ‘@ చారి గారు’ అంటుంటే ‘ఢీ’ సినిమాలో బ్రహ్మి గుర్తొచ్చేవాడు. ఇహ ఇలాక్కాదని ఈ రోజే ఆ పొట్టి పేరుని ఏకి పీకి పారేసా.....చూద్దాం ఈ లాజిక్ ఎన్నాళ్లు పని చేస్తుందో..

బెంగాల్‌లో పేరు కష్టాలు ఇంకో ఎత్తు. ఇక్కడ పేరు చివర  చాలామందికి అకారం ధ్వనిస్తుంది ‘బందోపాద్యాయా’, ‘భట్టాచార్యా’,‘ఆచార్యా’ ఇలాగ. కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో కంటి చెకప్ చేయించుకోడానికి డాక్టర్‌ను  కలుద్దామనివెళ్లా అక్కడ రిసెప్సెషన్‌ దగ్గర..
రిసె:  నామ్
నేను: నాగార్జున చారి
రిసె: నాగార్జున్‌ ఆచార్యా ?
నేను: నహి, నాగార్జున చారి...
రెసె: ఓహ్.., నాగార్జునాచార్యా..?
నేను: మనసులో " నీ బెంగాల్ బుద్ది తగలెయ్య".. నహీ భయ్ నాగార్జున చారి
రెసె: అచ్చా...ఠీక్ హై.
వీడిని దాటుకొని డాక్టర్ రూంలో వెళ్లాను
డా: హ్మ్...(రెసెప్షెన్లో ఇచ్చిన చీటీ చూస్తూ) నాగార్జునాచార్యా...what do u do?
నేను: మనసులో " నీ బొంద చేస్తుంటాను. నా పేర్రా.."  బయటకు- ఇట్స్ నాగార్జున చారి సర్... అయామ్ స్టడియింగ్ ఇన్ IIT
డా: హా..నాగార్జున..? ఆంధ్ర?..

కష్టాలు ఇక్కడితోనే ముగిసాయని నేననుకుంటే అవి మా క్లాస్‌రూంలో తిష్ట వేసాయి. మాకు GDR అని ఓ చంఢసాసన ప్రొఫెసరున్నాడు ఆయనతో మాట్లాడాలంటే  చాలామందికి కింద పడిపోయేది.  నేను ఈయన కోర్సు  రెండో సెమిస్టరులో తీసుకున్నా... మిగతా ప్రొఫెసర్లెవరు attendance తీసుకునేవారు కాదు ఏదో అమావాస్యకో పున్నమికో తప్పిస్తే..ఈయన మాత్రం నిష్ఠాగరిష్టుడిలా రోజు ఓ నాలుగైదు పేర్లు అడిగేవాడు...ఆ నాలుగైదుగురిలో నేనొకన్ని. నాపేరును రిజిష్టర్‌లో ఎలా రాసుకున్నాడొకని రోజుకో పేరుతో పిలిచేవాడు. పోపులో కరివేపాకును కలిపినట్టు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అనేవొడు. అందులో కొన్ని ఆణిముత్యాలు
‘నాగార్జు‍న్ ఆచార్యా’- ముందుగానే అలవాటైంది కాబట్టి ఏమనిపించలేదు
‘నాగార్జునాచార్యా’- ఇదికూడా
‘నాగారాజునా’ ఆ.....
‘రాజునా’
‘రాజునా చార్యా’ 
‘నాగారాజునాచార్యా’- వామ్మో....

ప్రొఫెసరిచ్చిన దెబ్బకు క్లాసులో తెలుగు స్నేహితులు తెగ నవ్వుకునేవాళ్లు. ఈయనొక్కడే అనుకుంటే క్లాస్‌లో బెంగాల్ ఫ్రెండొకడు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాడు. ‘చారి’ ని హిందిలో ‘చార్ ఈ’  = 4E గా మార్చేసాడు. తిక్కరేగి  లెఫ్టు రైటు ఇచ్చేసరికి ఆ పేరు ఎక్కువ రోజులు నిలవలేదు.
ప్రొఫెసరేంట్రా బాబు ఇలా వాయొంచేస్తున్నాడు నేనేం పాపం చేసానుకుంటే ఓ రోజు దగ్గరికొచ్చి రిజిష్టర్‌ చూపించి ‘ఈజ్ యువర్ నేమ్ ఎంటర్డ్ కరెక్ట్లి’ అన్నాడు. అందులో చూస్తే naga rajuna chary అని ఏ పార్టుకాపార్టు విరగ్గొట్టి రాసుకున్నాడు. ఇందుకా మహానుభావా ఇన్ని రోజులు ఆడుకున్నావు నాపేరుతో అనుకొని అదికాదు సార్ మధ్యలో gap లేదు అని సరిచేయించుకొన్నా ఇకనుండి విషాదశ్రవణయోగముండదుకొని ఆనందపడుతూ...
మరుసటి రోజు క్లాసులో ఆయన attendance తీసుకోడానికి బయల్దేరాడు. నా పేరు పిలిచే వంతొచ్చింది.
మా క్లాసువాళ్లు... ఓ సెలిబ్రిటి రాకకోసం ఎదురుచూస్తున్నవాళ్లలా
నేను.... కేసు ముగించి రిపోర్టు సమర్పించే CBI వాళ్లకోసం ఎదుర్చూసే మీడియా వాళ్లలాగా
ప్రొఫెసరు.... పెద్ద భయకరమైన వార్త చేప్పెవాడిలా కాసేపు ఆగి
" ద్రొణాచార్యా..."

అంతే....మిగతావాళ్లు పెదాలు మూసుకొని లొలొపల ప్రొఫెసర్‌కు వినపడకుండా తలలు దించుకొని రెండు సెకన్లకోసారి నన్ను చూసుకుంటూ విపరీతంగా నవ్వుకుంటున్నారు, నేనేమో విగత జీవుడులా అలా చూస్తూ ఉండిపోయా. కనీసం రెండు వారాలు పట్టింది మావాళ్లు దీన్ని మర్చిపోడానికి.
ఆ తరువాత సెమిస్టర్ పరీక్షలోచ్చాయ్....మొదటి సంవత్సరమైపోయింది. ఇకనుండి క్లాసులుండవు, ఆయన చేసే ప్రయోగాలుండవు కాస్తంత relaxation....కాని స్నేహితులకు ఆ పేర్లు ఇంకా గుర్తున్నాయి....వెధవలకి

ఋతుపవనాలొచ్చేసాయ్...

ఎట్టకేలకు ప్రళయ భానుడి ప్రకోపాన్ని తగ్గించడానికన్నట్లు చల్లని గాలులని మోసుకుంటూ చిరుజల్లుల సమేతంగా ఋతుపవనాలొచ్చెసాయి మా హైదరాబాదుకి. తొలకరిజల్లుల తాకగానే నేలతల్లి పులకించిపోయి సువాసన సౌరభాలను వెదజల్లింది. ఆ పరిమళం అమోఘం.....


వంగదేశపు ఎండలు తట్టుకోలేక కొన్నిరోజులు ఇంటిదగ్గర గడుపుదామనివస్తే ఇక్కడ ఇంకా దారుణంగా ఉండింది పరిస్థితి. ఏ రోజుకూడా 42కి తగ్గిందిలేదు. ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోదామనుకుంటే మాది గ్రౌండ్‌ఫ్లోర్‌ కట్టడం మాత్రమేనాయె. పగలు సూర్యారవుగారి ప్రత్యక్ష ఎండ బాదుడు, రాత్రుళ్లు పగలు పీల్చుకున్న సెగ వదులుడుతో ఇన్ని రోజులు దిమ్మతరిగిపోయింది. హమ్మయ్య...., చివరకు మేఘాలు తీపి కబురు మోసుకొచ్చాయి.  చిటపటమంటూ చినుకులు మొదలైనాయి.....ఆల్ హ్యాపీసు.

చినుకులు పడుతుంటే కాసేపు అలా తడుద్దామనుకున్నా. అట్లా చేస్తే మా ఇంట్లో వాళ్లు నన్ను ఉతికి ఆరేస్తారని ఆగిపోయా...హ్మ్...ఏం ఫరవాలేదు, నేను మా కాలేజికెల్లి అక్కడ వానలో enjoy చేస్తా. వర్షంలో క్రికేట్టాడాలని మహా కోరిక నాకు, ఇంతవరకు తీరలేదు. ఆ ముచ్చటకూడా తీర్చుకోవాలి. మీరు మాత్రం ఏమాత్రం అవకాశం కలిగినా వర్షంలో తడిసిపోండి.
అలాగని తుఫానువల్లో, అల్పపీడనంవల్లో కురిసే వర్షంలో తడిసేరు.....natural వర్షమైతేనే తడవండి.


ఋతుపవనాగమన శుభాకాంక్షలు
వేడివేడి పకోడీలు ప్రాప్తిరస్తు

ఇంత బేవార్స్‌గాల్లేంట్రా బాబు

అసలే రాష్ట్రం తుఫానుతో అల్లాడిపోతుంది. అందులో నష్టపోయినవాళ్లకు ఉన్న బాధలు చాలవన్నట్లు ‘ఎలావుంది’ అంటూ ఫినాయిల్ తాగే ఫేసులేసుకొనొచ్చే నాయకులు. ఆల్లేమైయినా ఆరుస్తారా తీరుస్తారాంటే అదీలేదు, మెయిన్‌ ఎడిషన్ ఫ్రంట్‌పేజి ఫొటొకోసం నోటికేదొస్తే అది వాగిపారేయడం.
వరదతాకిడి గురైన నెల్లూరు జిల్లాలో పర్యటించిన మన ‘డైనమిక్‌’ మాజి CM బాబు తన పర్యటనలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడంటా
"రోశయ్య ఆకాశంలో తిరుగుతూ తుఫాను నష్టాన్ని తెలుసుకుంటుంన్నారు...ఆకాశంలో తిరిగితే ఉలవపాడులో మామిడి నష్టం తెలుస్తుందా..? బొడ్డువానిపాలేలో పొగాకు నష్టం తెలుస్తుంద..? కళ్లాల్లో తడిసిన వరి సంగతి తెలుస్తుందా..? బొప్పాయి రైతుల కష్టాలు తెలుస్తాయా..? పత్తి రైతుల ఇక్కట్లు తెలుస్తాయా..?"
 అసలు ఈయనగారు బుద్దుండే ఈ మాట మాట్లాడాడా అని కాసేపు బుర్రగోక్కున్నా. CM హెలికాప్ట్రర్‌లో కాకపోతే ఎడ్లబండిలో వస్తాడు, అయితే ఏంటట వరద నష్టం అంచనా వేయడం, నష్టపోయినవాళ్లకు స్వాంతన చేకూర్చడం ముఖ్యంగాని!
బాబుగారి మాట విన్నాక అదేదో సినిమాలో సన్నివేశం గొర్తొచ్చింది. అక్కడకూడా సేమ్ scene వరదలొస్తే ముఖ్యమంత్రో ఇంకొకల్ళో చూడ్డానికి వెల్తాడు. ఇందులోకూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామని ప్రతిపక్షనేత తన అసిస్టేంట్లతో ఇలా అంటాడు " ఒరేయి రేపు గనక వాడు రైలులో పరామర్శిండానికి వస్తే మన పేపర్లో ‘జనాలు అల్లాడిపోతుంటే తాపిగా రైలులో వచ్చిన CM’ అని హెడ్‌లైను పెట్టేయి. అదికాక హెలికాప్ట్ర్‌ర్లో వస్తే ‘జనం నేలమీద బాధలు పడుతుంటే గాల్లో తిరుగుతూ వచ్చిన CM' అని రాసెయ్." అచ్చం అలాగే, తొమ్మిదేళ్లు CMగిరి వెలగబేట్టి ఇప్పుడు ఫక్తూ లోకల్ చిల్లర పొలిటీషియన్‌లాగా ఆ అర్థం పర్థంలేని వ్యాఖ్యలేంటొ ఈయనకు. పొయినసారి అసెంబ్లీలో ‘కావాలనే అబద్దం చెప్పా’మన్నందుకు వచ్చిన చీవాట్లు చాలవేమో. ఈయనగారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టినేత. ఏం ఖర్మరా దేవుడా!! అన్నేళ్ళు CMగా వుండి, అంతకన్నా ఎక్కువకాలం రాజకీయాళ్లో కీలకపదవుల్లోవుండి ఈయన సంపాదించిన ‘విజ్ఞత’ ఏమైనట్టు?
ఈయనగారికి తోడు తానాతందానా బామ్మర్ది, ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నామేమే’ అంటూ చరిత్ర సృష్టించిన పార్టికి ‘అవకాశం ఇస్తే’ సారథినౌతా అని డైలాగులు. తాతలు నేతులు తాగితే ఈళ్ల మూతుల వాసన ఎవడిక్కాలంట!


మన మెగానటుడిగారి రూటే సపరేటు. ఎంతసెపు ఆ సామాజిక న్యాయం, సామాన్య శాస్త్రం, నేనేం చేయాలో ప్రజలే చెప్తారు అని చెప్పుకుపోవడం తప్పిస్తే ఇంతవరకు ఒక్క అంశంమీద మా పంథా ఇదిఅని చెప్పిందిలేదు. అసెంబ్లీలో చేసిన performance చాలనట్టు రాజ్యసభక్కూడా వెళ్తార్ట. అవకాశం వినియోగించుకోవడంలో తప్పులేదుగా..నాక్కూడా అవకాశం వస్తే ఈయనకోటి చెప్పాలనుంది, ‘అయ్యా మీరంటే ఒకనటుడిగా మాకు ఇంకా చాలా గౌరవముంది.రాజకీయాల్లోకొచ్చి తలాతోకలేని నిర్ణయాలతో,మాటలతో దాన్ని పోగొట్టుకోకండి. టైం తీసుకున్నా ఫరవాలేదు  మీరు చేద్దామనుకుంటున్న ప్రజారాజకీయలపైన అవగాహన వచ్చాకే రండి’ అని. ఎన్నటికి కుదిరేనో.

అధికారపక్షం  చిన్నబాబుది ఇంకో స్టయిలు. ధరలుపెరిగి, పనుల్లెక పంటల్లెక తిండిలేక జనమేడుస్తుంటే అయ్యపోయిన సుమారు ఏడెనిమిది నెలల తరువాత ఓదార్పు యాత్రంట. నవ్వుకోడానిక్కాకపోతే ఇప్పుడు  ఆ పోయినాయనని తల్చుకొని ఎవడు బాధపదుతున్నాడొ?, వాళ్ల జీవితం మీది వాళ్లె బాధపడేవారు తప్పిస్తే. పైపెచ్చు ఆ బాధపడే వర్గమేదో ఆయన చనిపొయినప్పుడే రికార్డు లెవెల్లో పోయారుకదా. చూస్తూంటే శవంమీద చిల్లర ఏరుకునేట్లు కనిపిస్తుంది యవ్వారమంతా. బాబుగారు ‘ఫ్యూచర్ ముఖ్యమంత్రి’. హ్మ్ విధి వైపరిత్యంకాకపోతే ఏంటి ఇది!!  ఇంతచేసినా బాబుగారి బాజా భజంత్రీలకు కొదవేలేదు
" జనం జగన్‌తో ఉన్నారండి, వాళ్ల మనసులో జగనేఉన్నాడు.."
"రెడ్దిగారిలో ఎవైతే లక్షణాలుండేవొ అవన్ని జగన్‍లోకనపడ్డాయి నాకు"
"జగన్ జనం గుండేల్లో వున్నాడండి.."

ఛీ... ఇంత దరిద్రమేంట్రా బాబు అనిపిస్తుంది తలచుకుంటే.
భగవంతుడా....ప్లీజ్ సేవ్ మై పీపుల్‌స్వాతికిరణాలు

నేను చూసిన విశ్వనాథ్‌గారి మొదటి సినిమా సాగరసంగమం. అది చూసిన తరువాత నేను కమలహాసన్‌కు అభిమానినైపోవడమూ, విశ్వనాథ్‌గారి అన్ని సినిమాలు చూడాలనుకోవడమూ, పక్కవాడికి బాధ కలిగినాసరే సంగీతమో,నాట్యమో నేర్చుకోవాలనుకోవడమూ అలా అలా జరిగిపోయాయి.

రొప్పుతూ, మూలుగుతూ ఇన్నాళ్లకు ‘స్వాతికిరణం’ చూసా. నిజజీవిత అనుభూతులకు దగ్గరగా ఉండడంచేత ( మమ్మూట్టి ఈర్ష్య, ధర్మవరపు సుబ్ర్మణ్యం హోటల్లో జరిగే సినిమా చర్చలు, అచ్యుత్ పడే ‘టి’ప్పట్లు వగైరా) సాగరసంగమం,శంకరాభరణం కన్నా బాగా నచ్చింది.  సినిమాలోని పాటలు మరీముఖ్యంగా నచ్చేసాయి. ఈమధ్య ఎప్పుడుపడితే అప్పుడు వింటున్నా ఈ పాటలని. వినడమేంటి పక్కవాళ్లకు కూడా వినిపిస్తున్నా.

అందులో ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తేటతెలుగులో ఉండే వాటిని వింటుంటే చెవిలో తేనెపోసినిట్టు అనిపిస్తుంది. అంతమంచి బాణిలనందించిన మహదేవన్‌గారికి, స్వరాన్నిచ్చిన SPగారికి, వాణిజయరాంగారికి, స్వాతిచినుకు ముత్యంలాంటి చిత్రాన్నిచ్చిన విశ్వనాథ్‌గారికి ఎన్ని జోహార్లిచ్చినా సరిపోదు.

పాటల్లో కొన్ని చరణాలు మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగావున్నాయి
ఉదా:

" నీ ఆన లేనిదే గ్రహింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం,
   నీ సైగకానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం..."

"జంగమదేవర సేవలుగొనరా  మంగళదాయక దీవెనలిడరా
సాష్టంగముగా దండముచేతురా..
ఆనతి నీయరా...."

"సున్నిపిండిని నలిపి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి
  సుతుడన్నా మతిమరచి శూలన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
  ప్రాణపతినంటుందా బిడ్డగతి కంటుందా...ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్నా ఘాటైన గరళమిది... గొంతునులిమే గురుతై వెంటనేఉంటుంది.."


కొన్నిసార్లు విన్నతరువాత ఓ పాటలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి తట్టింది. ఈ సినిమాలో చాలావరకు పాటలు వాణిజయరాంగారే పాడారు తెలిమంచు తొలిగింది పాటలో రెండు పాత్రలు పాడాల్సివున్నా మొత్తంపాట ఆవిడచేతే పాడించారు. అయితే ‘శ్రుతినీవు గతినీవు’ పాటను జానకి,వాణిజయరాంగార్లతో పాడించారు. గొంతు sharpగా వుంటుందికనుక సినిమాలో చిన్నపిల్లల పాత్ర పాడే పాటలు జానకిగారి చేత పాడించేవారంట అప్పట్లో. దానికి తగ్గట్టుగానే ఆ పాటలో గంగాధరం పాడే భాగన్ని జానకిగారితో, రాధిక పాడే భాగాన్ని వాణిజయరాంగరితో పాడించారు.
పాట సందర్భానికొస్తే గంగాధరం కట్టిన కొత్త బాణిని రాధికకు వినిపించాలి, ఇక్కడ గంగాధరం గురువు రాధిక ఆ బాణిని అనుసరించాలి.
పాట మొదలయేప్పుడు వాణిజయరాం (రాధిక) బాణిని తప్పుగా అందుకుంటుంది, జానకి (గంగాధరం) పెద్దవారుకనుక గురువు స్థానం తీసుకొని ఆ తప్పుని సరిచేస్తూ ఎలాపాడాలో చెబుతుంది.
మీరూ ఓసారి చూడండిజానకిగారితో పాడించడం లాజికల్‌గానూ, అంతర్లీనంగానూ మంచి ఆలోచన అనిపిస్తుంది.

ఏంటి కొండను తొవ్వి ఎలకను పట్టాననిపిస్తుందా...., అనిపించినా ఫరవాలేదులేండి మీకు ఓ మంచి పాటను వినిపించాను...చాలు.

wordpress బ్లాగులు- నా తిప్పలు

బ్లాగులు రాసుకోడానికి గూగుల్ బ్లాగర్ ఒక్కటే ఉంటే సరిపోయేది నాకు తిప్పలు తప్పేవి.
మంచి పోస్టు ఒకటి చదివాక వ్యాఖ్యానించకుండా వుండలేము, అలా చేద్దామని బయలుదేరే ఇప్పుడు wordpress blogలో వీలుకాక తలపట్టుకుంటున్నా wordpress వాడేమైనా నన్ను కామెంట్లు రాయకుండా బహిష్కరించాడేమోనని!!


నా ఈ తిప్పలకి ఆరంభం అబ్రకదబ్ర గారి బ్లాగ్‌తో పరిచయమయింది. నచ్చిన పోస్టులకి comments వేద్దామని బయల్దేరతాన్నేను wordpressవాడు తాపిగా ‘ పేరు’, ‘ఈ-ఉత్తరం’ బ్రాకెట్లో ‘అవసరం’ అంటాడు. సరే ఆ తంతు ఏదో కానిచ్చి కామెంటు రాసి సమర్పయామి అనేస్తా. అంతే ఆ వ్యాఖ్య ఎటువెళ్లిందో, దాని గతి ఏమయిందో ఏది అంతుపట్టదు.అది అచ్చయిందేమొనని నే ఎదురుచూస్తా, ప్చ్ అవదు. గూగుల్‌ బ్లాగుల్లో అయితే ఎంచక్కా ‘ your comment is pending for approval ’ అనో, ‘ your comment is rejected ’ అనో, ‘ నువ్వు కామెంట్లు రాస్తున్నావేంట్రా వెధవ, రచయిత చెప్పింది ఏదో అర్థమయినట్లు ’ అనో (వాడు అన్కపోయినా లోపలనుండి బ్లాగారాం గాడు అంటాడులెండి అప్పుడప్పుడు) వస్తుంది. ఏది ఆ  wordpressలో ఇట్టాంటిది కనపడి చావదే.  ఆ బ్లాగులో కొన్ని పోస్టులతో   ఇలాంటి అనుభవమయ్యాక అబ్రకదబ్రగారు IP adress discrimination  చేస్తున్నారని అపార్థం చేసుకొని అక్కడ కామెంటడం మానేసా. అప్పటికి నాకు తెలిసిన  wordpress బ్లాగు అదొక్కటే, దాంతో వేరే బ్లాగులని అపార్దం చేసుకోలేకపోయా.

ఈ మద్య రీసెంట్‌గా కట్టావిజయ్ గారి బ్లాగ్‌లో ఇలాంటి అనుభవమే మళ్ళి ఎదురైంది, ఒహో ఈయనగారు కూడా వివక్ష చూపిస్తున్నారా అనుకున్నాను. వేరే wordpress బ్లాగులో నేను చేసిన వ్యాఖ్య అచ్చవడంతో నా అపార్దం binani + nagarjuna (నా కంపెని కాదులెండి) + ultratech+ ACC cements  తో కట్టిన బిల్డింగ్‌ అంత స్ట్రాంగ్‌ అయి కూర్చుంది.

జస్ట్ 2 hrs బ్యాక్, మన పిల్లకాకి  ఉరఫ్ కృష్ణ  బ్లాగులో వచ్చిన పోస్టు తెగ liking  అయ్యి కామెంటుదామని బయల్దేరా... ఉహూ ఎంతకి అయిచావదే!!! గూగుల్ అకౌంటుతో అవకపోవడంతో దాన్ని మార్చి ఈసారి wordpress account ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని ఉపయోగించి చాకిరేవులో ప్రయత్నించా.....damn it అదీ పనిచేయలా. అన్ని అనుభవాలు  ఒక్కొక్కటే  గుర్తుతెచ్చుకొని ఇందులో బ్లాగర్ల తప్పులేదని, "హేవిటి ఇన్ని రోజులు సాటి తెలుగు బ్లాగర్లనా అనుమానించింద"ని NTR స్టయిల్లో వాపోయి దీనంతటికి wordpress వివిక్షపూరిత చర్యలే కారణమని నిర్దారించేసుకున్నా మా హాస్ట్లల్ వెనక ఇప్పుడు ఇంత అర్థరాత్రి ఎవడొ వెధవ నిద్రాభంగం కలిగేంతగా వాయిస్తున్న డప్పుల మోత సాక్షిగా.

కాబట్టి సాటి గూగుల్ బ్లాగర్లకు నా విన్నపం ఏంటంటే మనకు సహకరించని ఈ వర్డ్‌ప్రెస్‌ బ్లాగులకు మనమూ సహకరిమ్చవద్దు.  "షొయాబ్ నాకు మోకాళ్ల పైన నుంచొని సారి" చెప్పాలన్న ఆయేషా అన్నట్టు వర్డ్‌ప్రెస్ యాజమాన్యంకూడా చెప్పెంతవరకు మనం వెనక్కు తగ్గొద్దు, నష్టపరిహారం లాంటిది ఇస్తే మరీ మంచిది...(నాతో సహకరించినందుకు మీక్కూడా కొంత ఇస్తానులెండి నేను మంచివాడిని కదా!!!). దీనికి wordpress బ్లాగర్లు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్బంగా కోరుకుంటున్నా.....వీలుని బట్టి మా గూగుల్ బ్లాగర్లకు పంచినతరువాత మిమ్మల్ని కుడా తగురీతిలో..____ అది.

కాబట్టి మై కామ్రేడ్స్
విప్లవం....  (ఈ silence ఏంటో)
విప్లవం..., జిందాబాద్ అనండయ్యా..
విప్లవం.... ఆ వినపడుతుంది చిన్నగా సన్నగా జిందాబాద్ అని

ShareThis