Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

The joy of wonderful life

ఏ తరగతిలోనో గుర్తులేదుగాని స్కూల్ రోజుల్లో  మాకొక ఇంగ్లీష్ పాఠం ఉండేది. దక్షిణాఫ్రికాలోని  
డా.క్రిష్టియన్ బెర్నాడ్‌కు (ప్రపంచంలో మొట్టమొదటి మానవ హృదయమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు ఈయన) మానవ జీవితంలోని బాధ, వ్యధ పట్ల ఒక ధృక్పథాన్ని, జీవితం గొప్పదానాన్ని తెలియజేసిన ఒక అనుభవం గురించి ఆ పాఠం. ఒకనాడు డాక్టర్ గారు, ఆయన భార్య రెస్టారెంట్ నుండి తిరిగొస్తూ రోడ్డు దాటుతుంటే కారు గుద్దడంవల్ల పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఇద్దరికీ. ఎందరికో వైద్యం చేసిన ఆయనే కొన్నిరోజుల పాటు ఆసుపత్రి పడకమీద ఉండాల్సివచ్చేసరికి ఎందరో పేషంట్స్‌కు తన అవసరం ఉండగా, తామిద్దరి ఆలనపాలన అవసరమైన చంటిపిల్లలు ఉండగా తమకే ఎందుకిలా జరిగిందనీ.. మానవ జీవితంలో కష్టాలు బాధలూ తప్పనిసరి బరువేనా అని దిగులు పడుతూ అప్పటికి యేడేళ్ల క్రితం ఎదురైన సంఘటనను గుర్తుతెచ్చుకుంటాడు. అదే పాఠంలోని ముఖ్యమైన భాగం. ఒకరోజు డాక్టర్ గారు పిల్లల వార్డులో తిగుతుండగా నర్సులు అలానే వదిలేసి వెళ్ళిపోయిన బ్రేక్‌ఫాస్ట్ ట్రాలీని ఇద్దరు పిల్లలు ’లాగేసుకొని’ వార్డులో ఫార్ములా-వన్ రేసులాగా నడుపుతుంటారు. వెనక వైపు నుండి ఒక పిల్లాడు మెకానిక్ పాత్రని నిర్వహిస్తూ ట్రాలీని తోస్తూవుంటే ముందు భాగంలో కూర్చొని మరో పిల్లాడు డ్రయివింగ్ చేస్తుంటాడు.. వార్డ్‌లోని మిగతా పిల్లలు హర్షధ్వానాలతో వీళ్లను సపోర్ట్ చేస్తారు.  ఈ ఇద్దరు పిల్లల గురించి డాక్టర్ గారు చెబుతూ ఆ మెకానిక్ అబ్బాయి తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారట, ఒకనాడు ఆ గొడవల్లో పిల్లావాడి తల్లి భర్త మీదకు లాంతరు దీపాన్ని విసిరేస్తే అది గురితప్పి ఈ అబ్బాయి మొహం మీద పడుతుంది.. మొహంపై మంటలు అంటుకోవడంతో అతని చూపు పోతుంది. ఎన్నో సర్జరీల తరువాత కూడా ఆ అబ్బాయి మొహం పై చర్మం జారగిలబడుతూ చూడడానికి చాలా వికృతంగా కనిపించేవాడట. ఇక ఆ డ్రైవర్ అబ్బాయికి అంతకు కొన్నాళ్ల క్రితమే ఒక హృద్రోగ సమస్య నిమిత్తం బెర్నాడ్ గారు వైద్యం చేశారు, కాని ఎముకల్లో ట్యూమర్ రావడంతో అతడిని మళ్ళీ హస్పటల్‌లో చేరుస్తారు. రేస్ జరిగిన కొద్దిరోజుల ముందే ఆ డ్రైవర్ పిల్లాడి చేయినొకదాన్ని తీసేయాల్సివస్తుంది.. ట్యూమర్ కారణంగా.

అంతటి విషాదకరమైన కష్టంలో  ఉండీ కూడా ఆ పిల్లలు రేసు ముగించాక బర్నార్డ్‌ దగ్గరికొచ్చి ’మేం గెలిచాం’ అని గర్వంగా చెప్పారట. బాధ, కష్టం తాలుకు నీడలేవి దరిజేరనీయకుండా సంతోషంగా కనిపించిన ఆ క్షణం ఆ ఇద్దరు పిల్లలూ తనకు అత్యంత విలువైన సత్యాన్ని తెలియజేసారనీ, బ్రతికుండటంలోని మాధుర్యాన్ని ప్రతీక్షణం ఆస్వాదించడమే జీవితపు సారమని గుర్తుచేసుకుంటారు. కష్టాలు పడ్డాము కాబట్టి వ్యక్తిగా ఎదగమూ కాని ఆ కష్టాల తాలుకు అనుభవం (సానుకూల ధృక్పథం ఉంటే) మనల్ని వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని చెప్తారు.
I had been looking at suffering from the wrong end. You don’t become a better person because you are suffering; but you become a better person because you have experienced suffering.These children showed me that it’s not what you’ve lost that’s important. What is important is what you have left.

The Business of living is the celebration of being alive.
   -- Dr. Barnard

 ఇదే సందేశాన్ని ఇచ్చిన ఒక మంచి సినిమా గురించి చెప్పుకుందామిపుడు. 1946 లో విడుదలైన 'It's a Wonderful Life'  అమెరికన్ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆణిముత్యం. క్రిస్‌మస్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఆ తరువాతి కాలంలో క్లాసిక్ స్థాయిని అందుకొంది. జీవితంలోని ఆనందాన్ని, జీవించేందుకు స్ఫూర్తిని నింపగలిగే చిత్రాల్లో ముందువరసలో ఉంటుంది. శివరాత్రి నాడు ఎలాగైతే మనకు భూకైలాస్ చూడటం అలవాటైపోయిందో అలానే ఒకప్పుడు అమెరికన్ టీవి ఛానెళ్ళు క్రిస్‌మస్ సందర్భంగా ఈ సినిమాను ప్రదర్శించేవట. సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ టైటిల్స్ పూర్తవగానే క్రిస్‌మస్‌‌కు ముందురోజు సాయంత్రాన అమెరికాలోని Bedford Falls అనే ఊళ్లో ముసలీ ముతకా పిల్లాపీచు చిన్నాపెద్దా ఆడమగా తేడా లేకుండా కథానాయకుడైన జార్జ్ బెయిలి అనే వ్యక్తి బాగుండాలి, అతనికి సహాయం చేయండనే ప్రార్ధనలతో మొదలౌతుంది. ఆ ప్రార్దనలు తారాలోకంలోని దేవతలకు చేరి మన కథానాయకుడికి సహాయం చేయడానికి క్లారెన్స్ (Clarence) అనే దేవదూతను పంపిస్తారు. సాయం చేయమని Bedford Falls ప్రజలు ఎందుకు కోరుకున్నారో, అతనికి క్లారెన్స్ ఏవిధంగా సహాయం చేశాడో తెల్సుకునేముందు జార్జ్ బెయిలి గురించి తెలుసుకుందాము.

Bedford Falls అనేది న్యూయార్క్ పరిసరాల్లోని ఒక ఊహాజినిత ఊరు... మన దగ్గర ఆర్కే.నారాయణ్ గారి మాల్గుడి లాగ. ఆ బెడ్‌ఫోర్డ్ ఫాల్స్ లో టాక్సీలనుండి థియేటర్లదాకా బ్యాంకుల నుండీ బిల్డింగులదాకా చాలా వారకు Mr.Potter అనే వ్యాపారస్థుడి చేతుల్లో ఉంటుంది. డబ్బు మీద ఆ ఊరి మీద పెత్తనం పై విపరీతమైన ఆశ. ఆయనకున్న ఎన్నెన్నో వ్యాపారాల్లో ఆ ఊళ్ళో ప్రజలకు చాలీచాలని ‘కొంప’లను  అద్దెకు ఇవ్వడం ఒకటి. అదే ఊళ్ళో Peter Bailey అనే ఆయన సామాన్యుడు ఎప్పుడో పదవి విరమణ వయసు వచ్చినపుడు కాకుండా పిల్లలు పిల్లలుగా ఉన్నపుడే  అందుబాటు ధరలో సొంతింటిని  కట్టుకోగలగాలనే ఆశయంతో  'Building and Loans' అనే సంస్థను నడుపుతూంటాడు. మనసున్న మనిషి. ఆ సంస్థను కూడా సొంతం చేసుకుంటే ఇక ఊరు మొత్తం తన గుప్పిట్లో ఉంటుందని అందులో వాటాదారుగా చేరతాడు Potter  కాని పీటర్ పట్టుదల కారణంగా అది అడియాశగానే ఉండిపోతుంది.  Peter Bailey కి ఇద్దరు కొడుకులు.. ఆ ఇద్దరిలో పెద్దవాడే మన కథానాయకుడు జార్జ్ బెయిలి.


హైస్కూల్ చదువు అయ్యాక దేశవిదేశాలు చుట్టేసి కాలేజిలో ఉన్నతవిద్య అభ్యసించాలని చిన్నప్పటినుండి ఉవ్విళ్ళూరుతూంటాడు. కాలేజి చదువు అయ్యాక ఆ ఊళ్ళోనుండి బయటకొచ్చేసి పెద్ద పెద్ద టవర్లు, బ్రిడ్జిలూ, రహదార్లు కట్టేయాలని ప్లాన్ అతనిది. భవిష్యత్తులోని వచ్చే క్షణంలో, వచ్చే రోజులో, వచ్చే సంత్సరంలో ...ఆ వచ్చే సంవత్సరంలో ఏమేం చేయాలో తన దగ్గర పక్కా ప్లాన్ ఉంది. అయితే మనం వేసుకున్న ప్లాన్స్ కన్నా గొప్పదీ సంక్లిష్టమైన మాష్టర్‌ ప్లానొకటి తలరాత రాసేవాడి దగ్గర ఉంటుంది. ఎవరి ప్రణాలికకు బంగారు మెరుగులు అద్దుతాడో, ఎవరి ప్రణాలికలను పేకమేడలా కూల్చుతాడో ఆ పైవాడికే ఎరుక. తమ్ముడి హైస్కూల్ చదువు పూర్తయ్యాక అతడిని Building and Loans లో తన స్థానంలో తండ్రికి చేదోడుగా చేర్చి తను ప్రపంచ యాత్రకు బయల్దేరబోతున్న తరుణంలో గుండెపోటు కారణంగా తండ్రి మరణించాడనే వార్త తెలుస్తుంది. తండ్రి హఠాత్మరణంతో తన ప్రయాణ ఏర్పాట్లన్నీ వాయిదా వేసుకొని కొన్ని నెలలపాటు సంస్థ కార్యకలాపాలు చక్కదిద్దుతాడు...అవన్నీ కొలిక్కి వచ్చాక సంస్థలోని బోర్డ్‌ ఆఫ్ మెంబర్స్‌కు దాన్ని అప్పజెప్పేసి కాలేజి చదువు కోసం వెళ్ళాలి అనుకుంటాడు. పీటర్ చనిపోవడం, జార్జ్ బెయిలి వెళ్ళిపోవాలనుకోవడంతో ఇదే అదనుగా సంస్థను రద్దు చేసేద్దామని Potter ఒత్తిడి తెస్తాడు. ఇది గ్రహించిన జార్జ్ అందుకు ససేమీరా ఒప్పుకోడు కాని సంస్థ కొనసాగాలంటే Potter పాలబడకుండా ఉండాలంటే జార్జ్ సారధ్య బాధ్యతలు తీసుకోవాలని బోర్డ్‌ ఆఫ్ మెంబర్స్ తీర్మానించడంతో జార్జ్  ఆ ఊళ్ళోనే ఉండిపోవాల్సొస్తుంది. ఈ పరిస్థితిలో కూడా జార్జ్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. తన బదులు తమ్ముడు హ్యారిని కాలేజి చదువులకు పంపించి అతను తిరిగొచ్చాక బిజినెస్ అప్పగించేసి తన ప్రపంచయాత్ర, చదువు పూర్తిచేయాలని.

అయితే విధి మరోలా తలచింది. కాలేజి చదువు పూర్తి చేసుకున్న హ్యారి భార్యా సమేతంగా దిగిపోతాడు హ్యారికి అతని మామగారు న్యూయార్క్‌లోని ఆయన ఫ్యాక్టరిలో మంచి ఉగ్యోదమిచ్చాడని తెలుసుకుంటాడు. తను అడిగితే తమ్ముడు కాదనడని తెలిసినా అతనికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజి వెళ్ళాలనే ప్లాన్‌ను పూర్తిగా చెరిపివేస్తాడు.
అప్పుడే తనని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న మేరి‌ని చాలా రోజుల తరువాత కలుసుకుంటాడు.మేరి ఇంకా తననే కావాలి అనుకుంటుందని గ్రహిస్తాడు. అంటే మనవాడేం తక్కువకాదు ఆ అమ్మాయి కోరుకుంటే నింగిలోని జాబిల్లిని తాడు వేసి భూమ్మీదకు దించేస్తాననేంతగా ప్రేమిస్తాడు. సంస్థ బాధ్యతల్లో మునిగిపోవడం, మేరి కూడా ఇన్నిరోజులూ చదువు కోసం వేరే ఊళ్ళో ఉండడంతో  ప్రేమ అనే విషయాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు మేరి తిరిగిచ్చేయడంతో, ‘నువ్వూ ఒక ఇంటివాడివి అవ్వూ’ అని తల్లి నచ్చజెప్పడంతో చిన్ననాటి ప్రియురాలిని జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు.

తమ్ముడు కూడా వెళ్ళిపోవడంతో  Building and Loan బాధ్యతల్లో, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మధ్యతరగతి మనిషికి సొంతింటిని కట్టివ్వాలనే పనిలో పూర్తిగా మునిగిపోతాడు జార్జ్. ఎంతోమందికి అందుబాటు ధరలో చక్కని వసతులతో వాళ్ళు కావాలనుకునే పొదరింటిని కట్టిస్తాడు. మేరి కూడా అతనికి తన సహాయసహకారాలు అందిస్తుంటుంది. మరోపక్కన Potter తనకు వీలైనపుడల్లా జార్జ్ ను‌ ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెడుతుంటాడు.  పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బుతో పెళ్ళయ్యక హని‌మూన్ వెళ్లబోతుంటే సంస్థలో ఎదో అలజడి రేపి అతని ట్రిప్‌ను చెడగొడతాడు. వారానికి  నలభైఐదు డాలర్ల సంపాదనతో, పది డాలర్ల  పొదుపుతో (ఇప్పుడైతే అమెరికాలో పనిచేసే ఐటి ఉద్యోగి ఒక గంటలో సంపాదించే సగటు వేతనం సుమారు 30-90 డాలర్లు) నెట్టుకొస్తున్న జార్జ్ ‌కు సంవత్సరానికి ఇరవై వేల డాలర్ల ఆశ చూపించి అతడినీ, తద్వారా పోటీగా ఉన్న Building and Loan ను హస్తగతం చేసుకోవాలి అనుకుంటాడు. కాని ఇవిదేనికీ జార్జ్ లొంగకుండా ఉంటాడు.

ఇలాంటి ఒడిదొడుకుల మధ్య సంవత్సరాలు దొర్లిపోతాయి. సినిమాలో ప్రస్తుత కాలానికి వస్తాము...క్రిస్‌మస్‌కు ముందురోజు సాయంకాలమది. జార్జ్‌వాళ్ళు బ్యాంక్‌కు బాకీపడిపోయిన ఎనిమిది వేల డాలర్లు ‘కనిపించకుండా పోతాయి’. ఆరోజు కల్లా డబ్బు జమచేయకపోత బ్యాంకు అతడిని ఎగవేతదారు క్రింద జమకట్టి, సంస్థ దివాళా తీసిందని ప్రకటించి జైల్లో పెడుతుంది. గత్యంతరం లేని ఈ పరిస్థితిలో అత్మాభిమానం చంపుకొని పాట్టర్‌ను సహాయం చేయమని అర్దిస్తే సహాయం అటుంచి జార్జ్‌ను హేళన చేస్తాడు, అవమానిస్తాడు. పరువుమర్యాద మంటకలసిపోతాయని భయపడి, ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గమే లేదని, దివాళాతీసి  జైలుకెళితే తన భార్యాపిల్లలు దిక్కులేనివారు అవుతారని, పాట్టర్ ఊరు మొత్తాన్ని తన చేతుల్లో తీసేసుకుంటాడని..ఇన్నేళ్ల తన ప్రయాస వృథా అయిందని వ్యధచెంది జార్జ్ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుందామని.

అప్పుడే మన దేవదూత క్లారెన్స్ రంగంలోక దిగుతాడు. మొదట్లో క్లారెన్స్‌ను మతిభ్రమించినవాడుగా అనుకుంటాడు జార్జ్, దేవదూతవైతే రెక్కలేవని జోక్ చేస్తాడు. కథల్లో, సినిమాల్లో దేవదూతలంటే శ్వేతాంబరధారులై, చేతిలో మంత్రదండంతో, రెక్కలు ఉన్నట్టు చూపిస్తారుకదా అలానే మన కథానాయకుడూ అనుకుంటాడు. తరువాత్తరువాత జార్జ్ ఇన్నేళ్ళ తన జీవితంలో సాధించినదేమిటో అది తెలుసుకునేందుకు క్లారెన్స్ వాడిన పద్ధతేంటో అతడికి మెల్లిమెల్లిగా అర్దమవుతుంది, క్లారెన్స్ పై నమ్మకం కుదురుతుంది. అతడికి జీవితం పై మళ్ళీ ఆశ చిగురిస్తుంది...బ్రతుకుతో పోల్చుకుంటే అప్పుడు తనకు ఎదురైన సమస్య దూదిపింజమంత తేలికైందని గ్రహిస్తాడు.  అసలు ఏం చేసి క్లారెన్స్ జార్జ్ మనసు మార్చాడు? వారానికి నలభైఅయిదు డాలర్లు సంపాదించే జార్జ్ ఆ రాత్రి గడిచేకల్లా ఆ ఊళ్లోకెల్లా ధనవంతుడెలా అయ్యాడనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఆ సంతోషాన్ని స్వయంగా చూసి అనభవించాల్సిందే :)


చక్కని కథనం, సంభాషణలతో మనసుకు హత్తుకునేలా సాగిపోతుంది సినిమా. తన కోరికలు, ఆశలు ఒక్కొక్కటే తొలగిపోతుంటే బాధ్యతల తాలుకు బరువును మోస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో జార్జ్ పడే మానసిక సంఘర్షను అత్యద్భుతంగా పోషించాడు అమెరికన్ స్క్రీన్ లెజెండ్ James Stewart.  డబ్బు, పెత్తనం మీద విపరీతమైన వ్యామోహంతో...జార్జ్‌ను ఇబ్బంది పెడుతూండే పాత్రలో మన రావుగోపలరావు, రంగారావులను తలపిస్తూ అంతే గొప్పగా నటించారు Lionel Barrymore. భర్త మనసు తెలుకొని నడుచుకునే ఇల్లాలిగా పాత్రోచితంగా నటించారు Donna Reed.  ఇక నిడివి తక్కువే అయినే క్లారెన్స్ పాత్రతో చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటారు Henry Travers.
Strange, isn't it? Each man's life touches so many other lives. When he isn't around he leaves an awful hole, doesn't he?
No man is a failure who has friends.
  -- Clarence

పూజలూ పునస్కారాలు యజ్ఞయాగాలు కఠోరమైన తపస్సులు ప్రార్దనలూ ఇవేవీ అవసరం లేకుండానే మనమేమి అడగకుండానే మనపై అనంతమైన ప్రేమతో సృష్టిస్థితిలయ కారకుడైన ఆ భగవంతుడు ఇచ్చిన అతిగొప్ప వరం ఈ జీవితం. దానిని నిలుపుకోవడమో, నిర్లక్ష్యం చేయడమో పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చూడగలిగితే పైకి కనపడని క్లారెన్స్‌లు మనమధ్యే తిరుగుతూ ఉంటారు.

******************************************************************

ఈ సినిమా గరించి బ్లాగర్ మధురవాణి గారి పరిచయం ఇక్కడ చదవచ్చు.
Christiaan Barnard గారి పాఠం ఇక్కడ

******************************************************************

క్రిస్‌మస్, నూతన సంవత్సర సందర్భంగా అందినదే ఛాన్స్ అని SMS, internet అనే తేడా లేకుండా మొబైల్ ఆపరేటర్లు రేట్లు పెంచేశారట. రేపోమాపో ఈ గూగులోడూ అలాగే చేస్తాడేమోనని (చెయ్యడులెండి.. ఎందుకంటే బేసిగ్గా వీడు మంచోడు:) )  సందేహానుమానంతో,  ‘ఇంధ్రధనస్సు’ పాఠకులందరికీ కొంచెం ముందుగానే  నూతన సంవత్సర శుభాకాంక్షలు ... Happy holidays and have fun :)


The Greatest Dictator

మానవ సంబంధాలనూ కలిమిలేమిలలో వాటి మార్పులను బంధాల్లోని నైతికత తాత్వికను విశ్లేషిస్తూ బుచ్చిబాబు గారు ’చివరకు మిగిలేది’ అనే చక్కని నవల రాసారు. అందులో కొన్నిచోట్ల వాతావరణం గంభీరంగా తయారౌతున్నపుడు దాన్ని తేలికపరుస్తూ వుంటుంది ’జగన్నాథం’ అనే పాత్ర. కథ-కథాగమనం తో పెద్దగా సంబంధం లేదనుకున్నారోమరి ఈ పాత్రను విశ్లేషించేవాళ్ళు తక్కువ. అయితే నవలా నాయకుడు దయానిధి తో  జగన్నాథం మాట్లాడే ఒక సందర్భం నాకు చాలా ఇష్టం. ప్రస్తుత పోస్ట్ కు లీలామాత్రంగానైనా సంబంధం ఉంటుందని ఇక్కడ రాస్తున్నా. తనకు కావాల్సినవారి క్షేమసమాచారాలు తెల్సుకుంటుండగా దయానిధి జగన్నాథంతో అంటాడు,

ద:"నువ్విలా చిత్రంగా మాట్లాడతావెందుకు? స్వభావమా తెచ్చిపెట్టుకున్నదా ?"
జ:"తెచ్చిపెట్టుకునేది ఏదీలేదు"
"ఎప్పుడేనా నువ్వు నువ్వుగా వుంటావా?"
"నేను నేనుగా వుండే అవసరం, పుస్తకాల్లో మనుషులకి తప్ప మామాలు మనుషులకి రాదు. ఒస్తే వాళ్ళు ఛస్తారు!"
"ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ ఎందుకు మాట్లాడవు ?"
"ఇట్లా మాట్లాడితే ఎవ్వరూ లైక్ చెయ్యరు."
"నీ సంభాషణంతా ఒక్క నటనన్న మాట!"
"అసలు జీవితమే నాటకరంగం; మనం అందరం  పాత్రలం; సంభాషణ నటనెందుకు కాకూడదు ? నటుడు నటించడం మానేసి, తన నిజ స్వరూపం ప్రదర్శించి గొడవలు మొదలుపెడితే, ప్రేక్షకులు ఏం చేస్తారని మీ వూహ ?..."

-- 'ఆకులు రాలడం' అధ్యాయం నుండి.
************************************************

నవ్వడం ఒక వరం, నవ్వలేక పోవడం  రోగం, నవ్వించగలగడం ఒక యోగం అన్నారు. ఈ మాటను కొలమానంగా తీసుకుంటే అతను తన league లో ఉన్నవాళ్ళతో పోల్చినపుడు ఎవరెస్టు శిఖరం  అధిరోహించిన యోగి.

ఇంగ్లీష్ దంపతులు హన్నా చాప్లిన్- స్పెన్సర్ చాప్లిన్‌లకు మొదటి సంతానంగా జన్మించాడు Charles Spencer Chaplin- చార్లీ చాప్లిన్ అంటే ఇంకాస్త సులువుగా గుర్తుపట్టగలరేమో. చార్లెస్ తల్లిదండ్రులిద్దరూ రంగస్థల కళాకారులు,తల్లి గాయని-నటి కాగా తండ్రి స్పెన్సర్ చాప్లిన్ అప్పట్లో పేరున్న నటుడు.చార్లెస్ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా నటనతో పాటు పేదరికాన్నీ పొందాడు. అతను పుట్టాక తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లికి పెద్దకొడుకు-తనకు అన్న అయిన సిడ్నితో పాటు తల్లి సంరక్షణలో పెరిగాడు. కారణాంతరాల వలన తండ్రినుంచి రావాల్సిన భరణం రద్దు అవడంతో చాలా ఏళ్ళు దుర్భర దారిద్ర్యంలో గడిపారు. ఇంగ్లాండ్ కెన్నింగ్‌టన్ రోడ్డు చుట్టుపక్కల ఏమైనా నాటకాలు ఆడితే  వాటిలో హన్నా చిన్నచిన్న పాత్రలు వేస్తూ వెళ్ళదీసుకొచ్చేది, ఐతే అది కుటుంబపోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. పేదరికాన్ని దగ్గరనుంచి చూశాను కాబట్టే దాంట్లోంచి అంతగా హాస్యం పుట్టించగలిగానని తరువాత చెప్పేవాడు చార్లి.  చిన్నపుడు తల్లితో పాటు తనూ నాటకాలకు వెళ్తుండేవాడు కానీ అతని రంగస్థల అరంగేట్రం విచిత్రంగా  జరిగింది. అల్డర్‍షాట్ క్యాంటీన్‌లో హన్నా ప్రదర్శన ఇస్తుండగా ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యం ఎక్కువయి బాధించడంతో ఆమే స్టేజ్ నుండి వెళ్లిపోవాల్సొస్తుంది, ప్రేక్షకుల గోల ను అదుపు చేయడానికి అయిదేళ్ల చాప్లిన్‌ను థియేటర్ మేనేజర్ స్టేజీ మీద వదిలేస్తాడు కొత్తే అయినా తన వయసుకు సజహమైన అమాకత్వంతో ప్రేక్షకులను మెప్పించాడు చార్లీ. కాని ఇక్కడ irony ఏంటంటే చార్లీ మొదటి ప్రదర్శన హన్నా ఆఖరు ప్రదర్శన అదే అవటం. 


హన్నా ఆరోగ్యం చేడిపోయి ఆసుపత్రి పాలవడం,  ఆ తరువాత కొన్నాళ్ళకే తండ్రి కూడా మరణించడంతో చార్లీ దాదాపుగా అనాథ అవుతాడు. ఇక తనను తాను పోషించుకునే పరిస్థితి కాబట్టి తనకు ఇష్టమయిన నాటకాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.స్థానిక నాటకాల కంపెనీలలో చిన్నచిన్న పాత్రలు వేస్తూ తన అసాధారణ ప్రతిభతో ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నాడు. యూరప్ అమెరికాలలో పలు ప్రదర్శనలిచ్చాడు. అటు తరువాత హాలివుడ్ స్టుడియో కీస్టోన్ నుంచి పిలుపు రావడంతో అమెరికా వెళ్ళిపోయాడు.

Birth of the 'Tramp':

కీస్టోన్ స్టూడియో వాళ్ళు అప్పట్లో Ford Sterling అనే హాస్య నటుడి స్థానాన్ని భర్తీ చేయడానికి చార్లీతో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా పిలిపించుకున్నారు. స్టూడియో లో చేరనైతే చేరాడుగానీ చాలా రోజులదాకా తనకు ఏ పనీ చెప్పేవారు కాదంట.. నెల జీతం మాత్రం ఇచ్చేవారట. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు కీస్టోన్ భాగస్వామి మ్యాక్ సెన్నెట్ స్టూడియోకు వచ్చి అప్పుడు తీస్తున్న ఒక సినిమాకు కొత్త ఐడియాలు ఏదీ రాకపోవడంతో అక్కడేవున్న చార్లీను చూసి ఏదో ఒకటి చేయమన్నాట్ట. చార్లీ మేకప్ రూం వెళ్ళి అక్కడ కనిపించిన తన సహనటుల కాస్ట్యూములు దొరికినవి దొరికినట్టు వేసుకున్నాడు. వదులు ప్యాంటు, బిగుతు కోటు, పెద్ద బూట్లు, వంకీలు తిరిగిన చేతికర్ర, డర్బీ టోపీ, అంగుళం మీసం తగిలించుకొని బయటకు వచ్చాక అప్పటిదాకా ఉనికిలో లేని ఓ కొత్త మనిషి తానే రూపుదిద్దుకున్నాడని చెప్పాడు. అలా కాకతాళీయంగా ప్రపంచ ప్రసిద్దిపొందిన, ఎందరో గొప్ప గొప్ప నటులు కూడా  అనుకరించిన ’ట్రాంప్’ పుట్టాడు.




ట్రాంప్ పాత్రతో చాప్లిన్ సాధించిన విజయాలు అతడిని ఒక స్టార్ ను చేశాయి.. ప్రొడక్షణ్ కంపెనీలు అతనితో సినిమాలు తీయడానికి క్యూలు కట్టేవి, వేరే ఊర్లకు రైలు ద్వారా ప్రయాణాలు చేయాల్సివస్తే ఎంత గోప్యంగా ఉంచినా అతని రాక తెలిసిపోవడమూ స్టేషన్లు జనాలతో కిటకిటలాడటమూ జరిగేది, గొప్పవాళ్ళతో పరిచయాలూ పెరిగాయి. చిన్నపుడు ఆకలి తీర్చుకోడానికి అన్న సిడ్ని కోటును కుదవ పెట్టే అవసరం నుండి సినిమాకు లక్షల డాలర్లు తీసుకునే స్థాయికి ఎదిగాడు. అయితే ఈనాటికీ చాప్లిన్‌ను గుర్తుపెట్టుకోవడానికి ఇవే కారణం కాదు. గొల్లపూడి వారు చెప్పినట్టు ’ఆకలిని ఆర్టుగా మార్చిన ఘనత’ వల్ల... తన సినిమాల్లో అభినయానికి పెద్దపీట వేసి వాటిలోని పాత్రలలో అమాయకత్వం నుండి అచ్చమైన హాస్యాన్ని పుట్టించి థియేటర్‌కు వచ్చే జనాలను మైమరిపోయేలా చేసినందుకు. చక్కని హాస్యం అమాయకత్వం నుంచి, దగ్గరివారి మధ్య సరసం నుంచి పుడుతుంది ఈ సంగతి చార్లీకి బాగా తెలుసు..దాన్ని వెండితెర పై అద్భుతంగా పండించినవాళ్ళలో చార్లీ మొదటి వరుసలో ఉంటాడు.

నటుడిగా, సెలెబ్రిటిగా ఎన్ని విజయాలు గౌరవాలు అందుకున్నాడో అంతే స్థాయిలో ఇబ్బందులూ పడ్డాడు. ఏ అమెరికాలోనైతే నీరాజనాలు అందుకున్నాడో అదే దేశంలో మనసువిప్పి మాట్లాడడానికి సైతం జంకేవాడు, అదే దేశం ద్వారా వెలివేయబడ్డాడు. సుస్పష్టమైన కారణం నాకూ తెలియరాలేదు కాని రెండవ  ప్రపంచ యుద్ద సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని కోరడానికి, రష్యన్‌‌లతో కలిసి పొరాడాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి మాట్లాడమని ప్రభుత్వమే ఆహ్వానించిన ఓ కార్యక్రమంలో రష్యన్స్ ను సోదరులుగా సంభోదించడం, తాను కాపిటలిస్ట్ సిద్దాంతం పట్ల తటస్థంగా (pro-capitalism కాకపోవడంవల్ల pro-communism అనుకున్నారు(ట)) ఉండటం కారణం అంటాడు చార్లీ. అమెరికా విడిచివెళ్ళాక స్విట్జర్లాండ్ లో మూడవ భార్య ఊనాతో, పిల్లలతో మరణించేదాకా ఉండిపోయాడు.


సాధారణంగా నేటి హాస్యనటులకు సినిమాలలో అంతగా ప్రాధాన్యం ఉండదు, కథతో పెద్దగా సంబంధం ఉండదు... నాయకుడిని స్తోత్రం  చేయడానికో హీరో/విలన్ లేకపోతే వీధినపోయే ఎవవ్వరితోనైనా తన్నులు తినడానికో లేకపోతే సినిమా కథతోనే ప్రేక్షకుడికి విసుగు పుట్టే అవకాశం వస్తుందనుకున్నపుడు హాస్యం జొప్పిస్తారు. చాప్లిన్ అలాక్కాదు హాస్యంతోనే ప్రశ్నించుకునేలా చెయ్యగలడు, నిరంకుశులను విదూషకుడిగా మార్చగలడు బాధను గెలవచ్చు అన్న ధీమా ఇవ్వగలడు హాస్యాన్ని హీరోయిజం కు ఎలివేట్ చేసిన ’తపస్వి’. ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ దురాగతాలకు మిగతావాళ్ళు అవేదన చెందటమో, పిడికిళ్ళు బిగించి ఆవేశం పడటమో చేస్తే చార్లీ మాత్రం తనకే సాధ్యమైన హాస్యంతో హిట్లర్ ను ఓ బఫూన్ లా ప్రపంచం ముందు నిలబెట్టాడు... 'The Great Dictator' ఈ క్లయిమాక్స్ సన్నివేశం అతనిలోని  మానవతావాదానికి చక్కని ఉదాహరణ.అతను క్యాపిటలిస్టు, కమ్యునిస్టు కన్నా ఎత్తులో ఉన్న హ్యూమనిస్టు.





వీడియోకు నా తెలుగు అనువాదం క్లుప్తంగా. చూడడానికి Show/hide బటన్‌‌ను క్లిక్ చేయండి.


Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot.
--చార్లీ
సరిగ్గా ఇలాగే పోలి ఉంటుంది అతని జీవితం. పేదరికం, ఇప్పటి నాగరికత దృష్టి లో కొన్ని దురలవాట్లు, సంపద, కీర్తి, తిరస్కరణ అన్నీ కలబోసి ఉంటాయి. కొండలు లోయలు వంకలు దాటుకుంటూ సాగుతుంది నది ప్రవాహం ఎక్కడో కొండరాళ్ళలో పుట్టే నీటి ధారను చూసినవాడెరగడు అదొక మహా ప్రవాహం కాగలదని, లోయల్లో ఆగాధాల్లో దాని ప్రయాణం చూసి జాలిపడొచ్చు, వంకలు తిరగడం చూసినవాడు తిన్నగా వెళ్లకుండా ఇదేమి వక్రబుద్ది అనుకోవచ్చు.... కాని ఒడ్డున కూర్చొని నదిపై నుండి వీచే పిల్ల తమ్మెరలను అనుభవిస్తూ దాని ప్రయాణం మొత్తం అవలోకనం చేసుకుంటే ఉచ్ఛనీచాలకు మంచి చెడులకు అతీతమైన అందమైన అనుభూతి అది.




ఏప్రిల్ 16 న నా అభిమాన నటుడు చార్లి చాప్లిన్ జయంతి సంధర్భంగా ఓ చిరు నివాళిగా రాసిన ఈ పోస్ట్ సాటివాడిని నవ్వుతూ ఆనందంగా చూడాలనుకునే మనందర్లోని చార్లీలకు అంకితం. Happy Birthday Charile.




***************
Reference: చార్లీ చాప్లిన్ ఆత్మకథ 'My Autobiography' కు అశ్వనీకుమార్ గారి తెలుగు అనువాదం
'నా ఆత్మకథ'
Image Courtesy: Google Image Search

Some web links

చార్లి చాప్లిన్ గురించి గొల్లపూడి మారుతీరావు గారు
http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=29456&Categoryid=11&subcatid=20


చార్లీ సినిమాల గురించి ’నవ తరంగం’ ఆర్టికల్
http://navatarangam.com/2012/07/world-cinema-history8/


*Spoiler Content  పెట్టడానికి  technical guidance అందించిన 'నాతో నేను నా గురించి ' వేణూశ్రీకాంత్ గారికి బ్లాగుముఖంగా కృతజ్ఞతలు.

రొబో! రొబో! ఈ సినిమా చాలా ఖరీదు గురూ...

ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ రియల్ లైఫ్ కామెడి ట్రాజెడి థ్రిల్లర్ మూవి. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే  మీ  బ్యాడ్‌ లక్  నేనేమి చేయలేను.

అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు. అందుకు ఎలాగైనా పగ ప్రతీకారం తిర్చుకోవాలని, పోగొట్టుకున్నచోటే వెతుక్కొవాలని తహతహలాడిపోతున్న రోజులు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక రోజు తలైవార్ రజిని సినిమా వస్తుందని తెలిసి మంచి ఛాన్స్ వచ్చిందని మా ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టా..
 "గుడ్, మంచి ఛాన్స్‌ఇది. దీన్ని వదలొద్దు. నువ్వు టికెట్లు బుక్ చెయ్యి. మిగతా స్కెచ్చు తర్వాత రాద్దాం" అన్నారు.
ఏంటి మనందరికి నేను బుక్ చెయ్యాలా....ఎప్పటికైనా  reimbursement అవ్వుద్దారా  అని దీనంగా మొహం పెట్టి నివేదించుకున్నా. ఆ పాషాణ హృదయాలు కరగకపోవడంతోతప్పక  నాతోపటు  ఆరుగురికి బుక్ చేయాల్సొచ్చింది. సినిమా చూడాల్సిన రోజు వచ్చింది.  సైన్యం 14 మందిని  పోగేసుకొని కాలెజ్ నుండి  టాక్సీలో స్టేషన్ చేరుకున్నాం. హౌరాకు ఎక్స్‌ప్రెస్ టికెట్లు తీసుకొని ట్రైన్ కొసం ఎదురు చూస్తున్నాం.
అరగంటైంది ఒక్క ట్రైను రాలా.....
గంటైంది...ఒక్క ఎక్స‌ప్రెస్   ట్రైను రాలా. వచ్చిన లోక్‌ల్ ట్రైన్‌లను మావాళ్లు వదిలేస్తున్నారు మూడు గంటలు అందులో గడపడం ఇష్టం లేక. అసలే చలికాలం కావడంతో ఎండకు ఒళ్లు చివుకు చివుకుమంటుంది. పైగా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఒరేయ్  ఇలాగైతే మనం శుభం కార్దు పడే సమయానికి చేరుకుంటామేమోరా...ఎదో ఒక ట్రైను ఎక్కేసి తొందరగా పోదాంరా అన్నాను.
"ఆగు బే...హడావిడి చేస్తావెందుకు. ఎళ్లగానే మనకు రెడ్ కార్పెట్టెసి వెల్కం ఏం చెప్పరు. ఐనా  వెళ్లేది ఫస్ట్ షో కు కదా...కాసేపాగ" న్నాడు బాక్స్ సంతోష్‌గాడు. నోర్మూసుకొని ఉండిపోయాన్నేను. ఇంకో అరగంట అయ్యాక మమ్మల్ని ఉద్దరించడాని అన్నట్లు ఎక్స్‌ప్రెస్ రైలొకటి వచ్చింది. ఖరగ్‌పుర్ నుండి హౌరా మధ్యలో అది ఒక్కసారే ఆగుతుంది... పైగా హౌరా ఆఖరు స్టేష‌న్ కాబట్టి స్లీపర్లో సీట్లు చాలామటుకు ఖాళీగా ఉన్నాయి  సభాశ్ అనుకొని ఎక్కడానికి నిశ్చయించుకున్నాం. అసలే తీసుకున్నది జనర‌ల్ టికెట్లు, అందరం ఒకే బోగీలో ఎక్కితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని మేము నాలుగు గ్రూపులుగా (G1, G2, G3, G4 అనుకోండి) విడిపోయి మూడు బోగీల్లో(B1, B2, B3 అనుకోండి) ఎక్కాం. నేను నాతో ఇంకో ముగ్గురు ( G2)  కలిసి  ఒక బోగీలో(B2) ఉన్నాం. సీట్లు ఖాళీగా ఉండడంతో ముగ్గరం RAC సీట్లో ఇంకొకడు పక్కన లోయర్ బెర్తు సీటులో సెటిలయ్యాం. రైలు కదిలింది...సుమారు గంటన్నర తరువాత అది ఆగాల్సిన స్టాపుకూడా దాటేసింది, ఇక ప్రాబ్లం ఏమి ఉండదనుకొని సొల్లు కబుర్లేవో చెప్పుకుంటున్నాం.

అంతలో మావాడొకడు "అరె మన B1 బోగీలోవున్న నలుగురు G1 గాళ్లు ఏంచేస్తున్నారో చూసొస్తా"నన్నాడు. కాసేపయ్యాక వాడు పరిగెత్తుకుంటా వచ్చి " ఏ...వాళ్లను స్క్వాడ్ పట్టుకున్నాడు. బాబులు ఫైన్ కడుతున్నార"న్నాడు. Waste fellows అనుకొని శంకర్ గురించి, ఐశ్వర్యారాయ్ గురించి etc etc గురించి మా కబుర్లలో మళ్లా మునిగిపోయాం. కాసేపటికి స్క్వాడ్ మా బోగీలొ కనిపించింది. ఎలాగైనా ఫైన్ తప్పించుకోవాలని ఇంటెలిజంట్‌గా ఆలోచించి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసాం. మా నలుగురిలో ఒకడు పక్కన ఉన్న లోయర్ బెర్తులో, ఒకడు అప్ప్ర్‌ర్ బెర్తులో నిద్రపోతున్నట్టు జీవించాలని, మిగతా ఇద్దరు కూర్చున్న RAC సీట్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లలా కటింగ్ ఇచ్చుకుంటూ సెటిల్ అవ్వాలని ప్లాన్. నేనూ మా  రాహుల్‌గాడు RAC సీట్లో కూర్చుండిపోయాం రజినిని మించి నటిస్తూ.  ముగ్గురు స్క్వాడ్స్ ఒక్కొక్కరు మా సీటు దాటుకొని వెళ్ళారు ఒక్కరుకూడా మమ్మల్ని ఏమి అడగలేదు. బ్రిలియంట్ ప్లాన్ వండర్‌ఫుల్‌గా పని చేసిందనుకొని పొంగిపోతున్నాన్నేను....హ్మ్ నాకెంతెలుసు in front crocodile festival అని. అందరికన్నా ఆఖరునవున్న స్క్వాడ్ దగరకొచ్చి 'టికెట్ ప్లీజ్' అన్నాడు. ఇంకేముంది ఖేల్ ఖతం. జేబులో ఉన్న జనరల్ టికెట్టు తీసి చూపించా.
"ఇది జనరల్ టికెట్, స్లీపర్‌లో చెల్లద"న్నాడు
"అంటే..సీట్స్ ఖాళిగా ఉన్నయని ఎక్కాం"
"అలా కుదరదు....ఫైన్ కట్టండి" . " అవునూ టికెట్ నలుగురికి తీసుకున్నావుగా మిగతా ముగ్గురేరి"  అని తన మిగతా స్క్వాడు మిత్రులని పిలుస్తూ అన్నాడు.
యాక్టింగ్‌లో  జీవిస్తున్న ముగ్గురిని తట్టిలేపి స్క్వాడ్‌కు చూపించాను. నలుగురికి ఫైన్ రాస్తున్నారు స్క్వాడ్.
"ఎంత?" ప్లాపయిన సినిమా ప్రొడ్యూసర్ మొహం పెట్టుకొని అడిగాను.
"330"
"ఒహ్..నలుగురికి కలిపి అంతేనా....చాలా చీప్ అయ్యాయి ట్రైన్ జర్నీలు" మా ఫ్రెండ్‌తో అన్నాను.
"ఒక్కొక్కరికి 330 " ఆ గుంపులో ఉన్న ఒకానొక తెలుగు స్క్వాడ్‌ నుండి రిప్లై...

!@#(*%&((%#

"సార్...కొంచెం తగ్గించండి...అసలే స్టూడెంట్స్‌ మేము" దీనంగా వేడుకున్నాం.
"నథింగ్ డూయింగ్" అని వాళ్లు చలాన్లను బరబరా బరికేస్తున్నారు. నలుగురమూ ఆ ఫైన్ కట్టేసి ఎదవ టైమింగ్ అనుకొని సెటిలయ్యాం.
"శంకర్ ఈ సినిమా కోసం 160 కోట్లు ఖర్చు పెట్టించాడు...మనం ఆఫ్ట్రాల్ 330 పెట్టలేమారా" బాక్స్ సంతోష్ గాడు సెలవిచ్చాడు. ఆ పాయింటు నాకు financialగా సరిగా అనిపించకపోయినా  logicalగా బావుందనిపించి ఊరుకున్నా.
తాయిలం సమర్పించుకున్నాక G1 గ్రూపు నుండి అనిల్‌గాడు  వచ్చి " ఏరా పర్సులు ఖాళి చేయించుకున్నారా" అని ఒకటైపు చులకనగా ప్రశ్నించాడు.
"లేదురా... మీరు ఫైన్ కట్టడం చూసి మేము ఒక బ్రిలియంట్ ఐడియా వేసి తప్పించుకున్నాం" అని ఈసారి ఇంకెక్కువ జీవించేసి చెప్పాం వాడికి.
"బొంగేం కాదు...మీరు డబ్బులు కడుతుంటే నేను డొర్ దగ్గర నిలుచొని చూస్తూనేవున్నా"
ఆ మాటకు గాలి తీసేసిన ట్యూబులా చల్లబడి మీరెంత కట్టార్రా అని ఆరా తీసాం. ఈసారి వాడు గాలి తీసిన టైరు మొహం పెట్టి " ఫైన్ కట్టండి అన్నప్పుడు డబ్బులు లేవని చెప్పామురా...వాళ్లు మా పర్సులు తీసుకొని అందులో నొట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ల చలానా రాసుకొని మిగిలిన 400 తిరిగిచ్చారు. దరిద్రం ఏంటంటే  వాడు రాకముందు మా దగ్గర 1800 ఉన్నాయో 2000 ఉన్నాయో తెలిసి చావట్లేద"ని ఒక మాదిరి వైరాగ్యపు నవ్వుతో అన్నాడు.

ఈలోపు మా రాహుల్ గాడు B3 బోగీకి వెళ్ళి కొత్త ఇన్‌ఫర్మేషన్‌ మోసుకొచ్చాడు. ఏం జరిగిందిరా అని అడిగితే.." హైలైటమ్మా... G3, G4 (ఈ గ్రూపులో ఇద్దరే ఉన్నారు) ఒకే బోగీలో ఎక్కారు ఒకరు ఈ చివర ఇంకొకళ్ళు అటు చివర కూర్చున్నారు. G3కు మనకులాగే  బొక్క పడింది."
"మరి G4 అయినా సేఫా" ఆత్రంగా అడిగాము.
"ఆళ్లదే ట్విస్టు. వీళ్ళిద్దరు అక్కడ లోయర్ బెర్తులో కూర్చుంటే కరెక్టుగా స్క్వాడ్స్ అందరూ వాళ్ల ఎదురు బెర్తులో రెస్టు తీసుకోవడానికి కూర్చున్నారంట. మనోళ్లు గుమ్మడికాయ దొంగల తరహాలో ఉండటం చూసి వాళ్లక కూడా కోటింగ్ ఇచ్చారు" ఒకింత గర్వంగా చెప్పాడు. ఆ మాట విని ఒకటే నవ్వు.

రైలు హౌరా వచ్చింది. నాలుగు గ్రూపులు ప్లాట్‌ఫాం పై చేరుకొని ఒకళ్ల మొహాలు ఒకరం చూసుకొని 14 మందిమి  అందరం ఏకరీతిన పట్టుబడ్డందుకు (  తుచ్చమైన ఈ ప్రపంచములో దాని పరిభాషలో చెప్పాలంటే వెధవలమైనందుకు )  ఈఈ అని నవ్వుకున్నాం. (స్వగతం: హుం ఇంకా నయం అంతకు ముందురోజు స్నేహితులు ఇంకొందరు ఇదే ట్రైనులో వెళ్ళి ఇలాగే పట్టుబడి మమ్మల్ని ఈ ట్రైను ఎక్కొద్దని చెప్పారని చెప్పానుకాదు). స్టేషను బయటకొచ్చి టాక్సీలు మాట్లాడుకొని సుమారు గంట ప్రయాణం తరువాత సరదు మల్టీప్లెక్స్ ఉన్న మాల్‌కు బయల్దేరాము. థియేటర్ చేరగానే గుర్తొచ్చిందేటంటే పొద్దటినుండి అసలే తినలేదని. మాల్‌లో KFC కనపడగానే అరికాళ్లలో ఉన్న ప్రాణం లేచొచ్చింది. ఇంకేముంది అందరం ఛలో KFC. 
లోపలికెళ్ళాక  ఎవడిక్కావాల్సింది వాడు ఆర్డరిస్తున్నాడు. నాది + నా G2 స్నేహితుల ఆర్డర్ చెప్పడానికి క్యూలో వెయిట్ చేస్తున్నా. పక్క క్యూలో వెరే గ్రూపు మెంబరొకడు " మామా నా కార్డు swipe చేస్తే బిల్లింగ్ అవడంలేదురా...నీ కార్డ్ ఇస్తావా. కాలేజ్‌కెళ్ళాక సెటిల్ చేస్తా"నన్నాడు. ఇప్పుడున్న బొక్కలకు తోడు ఇదొక బొక్కనాకు, వీడెప్పుడు సెటిల్ చేసేనో అని మనసులో అనుకొని " sure మామా నీకన్నా ఎక్కువనారా" అని నవ్వుతూ వాడికి కార్డిచ్చాను. Brunch (breakfast + lunch = brunch ) చేసాక  కౌంటర్లో  టికెట్లు తీసుకొని థియటలోకి వెళ్లాం.

ఇప్పుడోక చిన్న ఇంటర్వెల్....ఈలోపు మీరు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ గట్రా పుచ్చుకొనిరండి. నేను వెయిట్ చేస్తూవుంటా..

**********************************************************************************


అందరం సీట్లలో సెటిలయ్యాం.  హాల్‌లో లైట్లార్పేసారు. రొటీన్ ప్రకటనలు ఐపోయాయి. సినిమా సర్టిఫికెటు డిస్ప్లే అయింది. ధియేటర్లో ఒకటే ఈలలు. గోల గోలగావుంది. టైటిల్లు పడుతున్నాయ్. ఈలలు ఇంకా ఎక్కువయ్యాయి. RAJINI అని  ఒక్కొక్కటే అక్షరాలు పడుతుంటే మాకు థియేటర్లో సౌండ్ సిస్టం  బాలేదనిపిచ్చింది. అదే మన APలో ఐతేనా.. సినిమా టైటిల్ పడుతుంటే DTS హోరులో  హాలు దడదడలాడిపోయేది. ఏం చేస్తాం రజిని సినిమాకు కూడా కాలం కలిసి రాలేదని బాధపడిపోయి సినిమా అలాగే చూసేసాం.


సినిమా అయిపోయింది. మాల్ బయటకు వచ్చాం. చుట్టుపక్కన ఎక్కడా ఆటొలు టాక్సీలు గట్రా కనిపించలా. అక్కడేవున్న సెక్యూరిటీని అడిగితే అది సిటి outskirts కాబట్టి అంత రాత్రిపూట ఆటొలు టాక్సీలు ఉండవన్నాడు. మరెలా అని అనుకుంటుండగా ఓ పది నిముషాలు నడుచుకుంటా వెళ్తే అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడినుండి టాక్స్లీ/ఆటో దొరకొచ్చని సెలవిచ్చాడు. మా ప్రాప్తాన్ని తిట్టుకోడన్నిక్కూడా ఓపికలేక అలా నడుచుకుంటూ  వెళ్తున్నాం. పదినిముషాలు అలా నడుస్తూనేవున్నా  కూడలి ఏదీ కనిపించలేదు. దారిన పోయేవాళ్లని ఒకరిని అడిగితే ఇంకో పది నిముషాలు నడవండి వస్తుంది అన్నారు. అప్పుడు చూడాలి మా స్థితి. (ఇక్కడ డైలాగులేమన్నా expect చేస్తున్నారా ? భలేవారే...ఇంత ట్రాజెడిలో కూడా డైలాగులెందుకు సార్/మేడమ్ ). మొత్తానికి అలా నడిచాక  చౌరస్తా చేరుకొని ఒక అరగంటపాటు దొరికిన ఆటోలను టాక్సీలను వాళ్లు ’మేం రాము’ అంటున్నా ’దాదా చలో, దాదా ఆవో’ అని అడుగుతూనేవున్నాం. చివరకు దయగల ఒక దాదా మా వేడుకోలుకు జాలిపడి ఇంకొక ఆటొను పిలిచి మమ్మల్నందరిని హౌరా చేర్చాడు. అక్కడనుండ ఖరగ్‌పూర్ స్టేషన్, స్టేషన్ నుండి  కాలేజ్ చేరుకునే  సరికి అర్దరాత్రి మూడు అయింది మరియూ  ఒక్కొక్కడికి కేవలం కేవలం రూ. 1000 ఖర్చయింది. ఒకరికొకరం  ’గుడ్‌నైట్’ ’గాడిద గుడ్డు’ చెప్పుకొని మంచం మీద వాలిపోయాం.


మర్నాడు ఉదయం లంచ్ దగ్గర అందరం కూడుకొని గతదినం తాలుకు తీపి సంఘటనలను నెమరు వేసుకుంటున్నాం. అంతలో నిన్న మాతోపాటు రాని నరేష్‌గాడు వచ్చాడు. "ఏరా సినిమా బావుంది కదా...శంకర్ ఎక్సలెంట్‌గా తీసాడు" అని చెప్పాడు. "ఆ...అవున్లే బాగా తీసాడు. ఇంతకీ నువ్వెప్పుడు చూసావు.  DC++ లోనా ( ఇది కాలేజ్‌లో ఉండే ఓ internal కంప్యూటర్  నెట‌వర్క్. సినిమాలు, పాటలు, సాఫ్ట్‌వేర్లు విద్యార్దులు ఇందులో ఇచ్చిపుచ్చుకుంటారు ) ? అని అడిగాన్నేను. " లేద్రా...బాంబే థియేటర్లో మధ్యాహ్నం చూసానురా. నిన్న మధ్యాహ్నం నుండే వేసాడు తెలుగు వెర్షన్‌" అని రిప్లై ఇచ్చాడు. వాడిచ్చిన సమాధానానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటారా...... సదరు బాంబే థియేటరు క్యాంపస్‌ నుండి సైకిల్‌పై అరగంట దూరం..... :(


"టికెట్ ఎంతరా" విషణ్ణవదనుడనై అడిగాను వాడిని.
బ్యాక్‌గ్రౌండులో మంద్రంగా సంగీతం వినపడటం మొదలుపెట్టింది నాకు.
"ముప్ఫై రూపాయలు రా" అని చిద్విలాసంగా సెలవిచ్చాడు నరేష్‌గాడు.


హరిమా హరిమా నేనో సింహపు కొదమా, నువ్వో జింకై వస్తే కొమ్మా వదలనులెమ్మా....
పాట ఫుల్‌గా వినపడుతుంది నాకు. అప్పుడు పులి చేతిలో, నిన్న సింహం చేతిలో...ఛీ వెధవది...



***********************************************************************************

ఇతి రోబో చిత్ర దర్శనార్థం మత్‌ చే కర్మాణి సమస్థ అవస్థయహః సమాప్తహః
కావున ప్రజలారా, ఈ కథను విన్నవారు కన్నవారు రైలు ఎక్కేప్పుడు తమ టికెట్టు పరిధిని ఒకటికి పదిసార్లు చూచుకుందురని. సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏ కంపార్టుమెంటు కనపడితే ఆ కంపార్టుమెంటు ఎక్కవద్దనీ. సినిమాకు వెళ్లెముందు పూర్తి అవగాహనతో వెళ్లెదరని. తద్వారా సఖపడెదరనీ  ఖరగ్‌పురాణం ద్వితీయార్థం సినిమా పర్వములో నాగార్జునాచార్యుడు ప్రపచించెను.

ఆఆ సినిమా ఐపోయింది. ఇంకా కూర్చున్నారేంటి. లేవండి లేవండి. వెళ్లేటప్పుడు సినిమా చూసినందుకు డబ్బులు కట్టి వెళ్లండి.


రావణ రాజనీతి- సినిమా చూసిన వారికే

గమనిక : ఒకవేళ మీరు గనక ‘రావణ్’ , ‘రాజ్‍నీతి’ సినిమాలు చూడకపోయినట్లైతే ఈ పోస్టు చూడనక్కరలేదు. మీకు ఉపయోగపడే సమీక్షలు చాలా దొరుకుతాయి. ఈ సినిమాలను చూడద్దనో చూడమనో ఇక్కడ చెప్పడంలేదు.
 *********************************************************************************

కత్రీనా సోనియా పాత్ర పోషిస్తుందట, నసిరుద్దిన్ షా, నానా పటేకర్, అజయ్ దేవ్‌గన్‌, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్లలందరు ఉన్నారనగానే చాలా ఆత్రుత కలిగింది. ఇంటికేళ్లినప్పుడు ఎలాగైనా చూడాలనుకున్నా. తోడేవరు లేకపోవడంతో కాలేజిలో వచ్చిన పైరేటేడ్‌ వెర్షన్ చూసా. సినిమా మధ్యలోనే అనిపించింది, నటీనటుల కౌశలాన్ని సరిగా ఉపయోగించుకొలేదని.....పైగా చాలా చెత్తగా ఉపయోగించుకున్నారు. ఎంచుకున్న కథకు ట్విస్టులు, సస్పెన్స్‌లు అస్సలు అవసరంలేదు. screenplay, పాత్రల పరిచయ విషయాల్లో కాస్తంత బుర్ర పెట్టుంటే బాగుండేది. సినిమా మొదట్లో నసిరుద్దిన్‌ షా పాత్ర అసలు అవసరమే లేదు. అంత పెద్ద యాక్టింగ్‌ జీనియస్‌ను అనవసరంగా దిష్టిచుక్కలాగా వాడుకున్నారు.
తరువాత వచ్చే అజయ్‌ దేవగణ్‌ పాత్ర, ఆ పాత్ర పరిచయం ఇంకా చెత్త. అతనుండే ఆజాద్‌ నగర్‌ అనే స్లమ్‌ ఏరియాలొ అతను అక్కడి జనం మెచ్చిన లీడర్. ఆ లీడర్ రేంజ్ ఎంటో చెప్పలేదు. సినిమాలో చూస్తే అతనో కాలనీకో, వార్డుకో నాయకుడిలా చూపించారు సింపుల్‌గా చెప్పాలంటే గల్లి లీడర్‌లా.... కాసేపయ్యే సరికి అసెంబ్లీ ఎలక్షన్లు మొదలౌతాయి. మన హీరోగారు ఆ ఏరియా అసెంబ్లి టికెట్ కావాలంటాడు (అదీ ఆ ఆజాద్‌ నగర్ బాగు కోసం)...అదీ ఓ రాష్ట పార్టి కార్యాలయానికి నేరుగా వెళ్లి...‘ముఝె పార్టి టికెట్ చాహియే’. వెంటనే మనోజ్ బాజ్‌పాయ్ తన బాబాయ్ కొడుకుకి ప్రత్యర్ది దొరికాడని పొంగిపోయి ఉప్పొంగిపోయి  అతనికి పార్టి టికెట్, బలహీన వర్గాల విభాగనికి అధ్యక్ష పదవి ఇస్తానంటాడు. ఆ డవిలాగు విన్నాక కాసేపు నాకు అవి అసెంభ్లి ఎలక్షన్లు అని చెప్పాడో మున్సిపల్‌ వార్డు ఎలక్షన్లు అని చెప్పాడో అర్థంకాలేదు. పోనీ ఎదో విధంగా విలన్ గ్రూపులో చేరిపోయాడు అనుకున్నా.....అంతలోనే సడెన్‌గా ఈయనగారిలో విలన్ లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నపళంగా జనంలోంచి వచ్చినోడికి రాక్షస బుద్దులు ఎక్కడినుంచొచ్చాయొ ఆలోచిస్తే మిగిలింది బొచ్చే.... ఈ పాత్ర కర్ణుడికి పోలిక అనుకుందామనుకున్నా భారతంలో ఎక్కడా కర్ణుడిని లీడర్‌లా చూపించింది లేదు. పార్దుడికి సరైన ప్రత్యర్ది దొరికాడని ధుర్యోధనుడు అక్కున చేర్చుకుంటాడు అదీ కర్ణుడి ప్రతిభ చూసిన తరువాత. ఇలా సినిమాలో చూపించినట్టు ఓ మంచి గల్లి నాయకుడు లెక్కా పత్రం లేకుండా పోటికి రావడం ఆ తరువాత చెడ్డవాడవడం---కామన్ సెన్సును కూడా మరచినట్లున్నారు.

సినిమాకి ఇంకో బొక్క సోనియా గాంధి పాత్ర ఉందంటూ చేసిన హడావిడి.  మార్కెటింగ్‌ గిమ్మిక్‌ తప్పిస్తే మరోటి కాదు. చివర్లో కత్రీనా ఓ రెండు క్షణాలు చీర కొంగును తలపైన పట్టుకొని ప్రజలకు అభివాదం చేస్తుంది దానికోసం సోనియా పేరుని వాడి నిరాశ పరిచారు. తెలుగులో వచ్చిన ‘లీడర్’ చూసాక రణ్‌బీర్ పాత్ర interestingగా అనిపించలేదు. నానా పాటేకర్ కూడా ‘లీడర్’లో కోటాను తలపిస్తాడు. కొద్దొగొప్పో ఈ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మనోజ్ బాజ్‌పాయ్, అర్జున్ రాంపాల్ పాత్రలు. అధికారం కోసం వెంపర్లాడే పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్, పెదనాన్న ఇచ్చిన అధికారం నిలబెట్టుకోవడానికి బలహీనతలున్నా ప్రయత్నించే పాత్రలో అర్జున్‌రాంపాల్ మెప్పించారు. మొదటి పావుగంట అవసరమే లేదు. రామాయణంలో పిడకల వేటన్నట్టు ఓ ఐటమ్ సాంగ్...#%^#^#*)(#
హరేకృష్ణ గారి బ్లాగులో  పియా మోరా పాట బాగుందన్నారు...సినిమాలో చిన్న చిన్న బిట్లుగా వినపడిందా పాట. బహుశా పైరేటెడ్ ప్రింట్ కాబట్టి కట్ అయిందనుకుంటా... ఆడియో సాంగ్ మాత్రం బావుంది.

 రావణ్ రిలీజ్ అయ్యాక  అందులో మణిత్నం సినిమా అనిపించదగ్గ అంశాలేవి లేవని ,ట్విస్టులు లేవని (నాకర్థం కానిది, రామాయణం లాంటి తెలిసిన కథలో ఎలాంటి ట్విస్టుల్ని ఎక్స్‌పెక్ట్ చేసారో ఈ రివ్యూ చేసిన వాళ్లు) , చూడ్డం దండగని చాలా రివ్యూలొచ్చాయి. మా తమ్ముడైతే ఏకంగా ఝండు బామ్ సేల్స్ పెంచాలనుకుంటే రావణ్ చూడొచ్చు అన్నాడు. అయినాసరే, ఎంతయినా మణిరత్నం సినిమా, చూసి తీరాలనుకున్నా. సినిమా సగం అయ్యేంతవరకు ‘రావణ్’  చేసిన కిడ్నాప్‌కు కారణం తెలియరాదు. అంతవరకు ఏవైనా కట్టిపడేసే ఎలిమెంట్స్ చెప్పుకోవాల్సి వస్తే అది కెమెరా వర్క్ మాత్రమే. కేరళ అందాలు చూపించడానికేమో అన్నట్లు ఉంది మొదటి భాగం. ద్వితీయార్థంలో నైనా ప్రియమణి పార్టు, క్లయిమాక్సులో డైలాగులో కొంచెం పట్టు ఉండబట్టి సరిపోయింది లేకపోతే మా తమ్ముడు అన్నట్లు ఘండు బామ్ సేల్స్ పెంచి ఉండేవాణ్ణి.
మణి రత్నం సినిమాలో తప్పులు చూపే సాహసం కాదు కాని సినిమాలో కొన్ని లోపించాయని చెప్పొచ్చు. ఫ్లాష్‌‍ బ్యాక్ పార్టులో తప్పితే ఎక్కడ నటుల మొహాల్లో ఎమోషన్స్ కనపడలేదు. పలికించాలనుకున్న భావాలన్ని వాళ్ల మొహాలకు అద్దిన రంగులను చూసి తెలుసుకోవాలి. ‘రావణ్’ మొహానికి సన్నివేశానికో రంగు అద్దారు కాసేపు సున్నం, కాసేపు పసుపు, కాసేపు బొగ్గు, కాసేపు మన్ను. ఐశ్వర్య చెట్టు మీద నుండి పడేప్పుడు ఒక స్లో మోషన్  ఫ్రేము, పడ్డాక నీళ్లల్లోంచి లేచేప్పుడు ఓ స్లో మోషన్ ఫ్రేము....వీటన్నిటిని అర్థం  చేసుకోవాలంటే చూసేది  భావుకులన్నా అయి ఉండాలి లేకపోతె ఫొటొగ్రఫి ఆస్వాదించే వారన్నా అయిఉండాలి.  మణి మ్యాజిక్ చూడాలనుకునే సగటూ ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థం కాని ఎలిమెంట్స్ సినిమా టైములో సగానికి పైగా ఉంటాయి. రిలీజ్‌ ముందు ఇది రామాయణం బేస్ చేసుకొని తీస్తున్న సినిమా అని  చెప్పకపోయి ఉండనట్లైతే సినిమాను కనీసం ఓ పోయటిక్ ఎక్స్‌ప్రెషన్‌గా నైనా స్వీకరించేవాళ్లెమో. ఇపుడు అలాగే అనిపిస్తుంది నాకు  It's more  a poetic expression than a celluloid magic.

స్వాతికిరణాలు

నేను చూసిన విశ్వనాథ్‌గారి మొదటి సినిమా సాగరసంగమం. అది చూసిన తరువాత నేను కమలహాసన్‌కు అభిమానినైపోవడమూ, విశ్వనాథ్‌గారి అన్ని సినిమాలు చూడాలనుకోవడమూ, పక్కవాడికి బాధ కలిగినాసరే సంగీతమో,నాట్యమో నేర్చుకోవాలనుకోవడమూ అలా అలా జరిగిపోయాయి.

రొప్పుతూ, మూలుగుతూ ఇన్నాళ్లకు ‘స్వాతికిరణం’ చూసా. నిజజీవిత అనుభూతులకు దగ్గరగా ఉండడంచేత ( మమ్మూట్టి ఈర్ష్య, ధర్మవరపు సుబ్ర్మణ్యం హోటల్లో జరిగే సినిమా చర్చలు, అచ్యుత్ పడే ‘టి’ప్పట్లు వగైరా) సాగరసంగమం,శంకరాభరణం కన్నా బాగా నచ్చింది.  సినిమాలోని పాటలు మరీముఖ్యంగా నచ్చేసాయి. ఈమధ్య ఎప్పుడుపడితే అప్పుడు వింటున్నా ఈ పాటలని. వినడమేంటి పక్కవాళ్లకు కూడా వినిపిస్తున్నా.

అందులో ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తేటతెలుగులో ఉండే వాటిని వింటుంటే చెవిలో తేనెపోసినిట్టు అనిపిస్తుంది. అంతమంచి బాణిలనందించిన మహదేవన్‌గారికి, స్వరాన్నిచ్చిన SPగారికి, వాణిజయరాంగారికి, స్వాతిచినుకు ముత్యంలాంటి చిత్రాన్నిచ్చిన విశ్వనాథ్‌గారికి ఎన్ని జోహార్లిచ్చినా సరిపోదు.

పాటల్లో కొన్ని చరణాలు మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగావున్నాయి
ఉదా:

" నీ ఆన లేనిదే గ్రహింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం,
   నీ సైగకానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం..."

"జంగమదేవర సేవలుగొనరా  మంగళదాయక దీవెనలిడరా
సాష్టంగముగా దండముచేతురా..
ఆనతి నీయరా...."

"సున్నిపిండిని నలిపి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి
  సుతుడన్నా మతిమరచి శూలన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
  ప్రాణపతినంటుందా బిడ్డగతి కంటుందా...ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్నా ఘాటైన గరళమిది... గొంతునులిమే గురుతై వెంటనేఉంటుంది.."


కొన్నిసార్లు విన్నతరువాత ఓ పాటలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి తట్టింది. ఈ సినిమాలో చాలావరకు పాటలు వాణిజయరాంగారే పాడారు తెలిమంచు తొలిగింది పాటలో రెండు పాత్రలు పాడాల్సివున్నా మొత్తంపాట ఆవిడచేతే పాడించారు. అయితే ‘శ్రుతినీవు గతినీవు’ పాటను జానకి,వాణిజయరాంగార్లతో పాడించారు. గొంతు sharpగా వుంటుందికనుక సినిమాలో చిన్నపిల్లల పాత్ర పాడే పాటలు జానకిగారి చేత పాడించేవారంట అప్పట్లో. దానికి తగ్గట్టుగానే ఆ పాటలో గంగాధరం పాడే భాగన్ని జానకిగారితో, రాధిక పాడే భాగాన్ని వాణిజయరాంగరితో పాడించారు.
పాట సందర్భానికొస్తే గంగాధరం కట్టిన కొత్త బాణిని రాధికకు వినిపించాలి, ఇక్కడ గంగాధరం గురువు రాధిక ఆ బాణిని అనుసరించాలి.
పాట మొదలయేప్పుడు వాణిజయరాం (రాధిక) బాణిని తప్పుగా అందుకుంటుంది, జానకి (గంగాధరం) పెద్దవారుకనుక గురువు స్థానం తీసుకొని ఆ తప్పుని సరిచేస్తూ ఎలాపాడాలో చెబుతుంది.
మీరూ ఓసారి చూడండి



జానకిగారితో పాడించడం లాజికల్‌గానూ, అంతర్లీనంగానూ మంచి ఆలోచన అనిపిస్తుంది.

ఏంటి కొండను తొవ్వి ఎలకను పట్టాననిపిస్తుందా...., అనిపించినా ఫరవాలేదులేండి మీకు ఓ మంచి పాటను వినిపించాను...చాలు.

ShareThis