స్వాతికిరణాలు

నేను చూసిన విశ్వనాథ్‌గారి మొదటి సినిమా సాగరసంగమం. అది చూసిన తరువాత నేను కమలహాసన్‌కు అభిమానినైపోవడమూ, విశ్వనాథ్‌గారి అన్ని సినిమాలు చూడాలనుకోవడమూ, పక్కవాడికి బాధ కలిగినాసరే సంగీతమో,నాట్యమో నేర్చుకోవాలనుకోవడమూ అలా అలా జరిగిపోయాయి.

రొప్పుతూ, మూలుగుతూ ఇన్నాళ్లకు ‘స్వాతికిరణం’ చూసా. నిజజీవిత అనుభూతులకు దగ్గరగా ఉండడంచేత ( మమ్మూట్టి ఈర్ష్య, ధర్మవరపు సుబ్ర్మణ్యం హోటల్లో జరిగే సినిమా చర్చలు, అచ్యుత్ పడే ‘టి’ప్పట్లు వగైరా) సాగరసంగమం,శంకరాభరణం కన్నా బాగా నచ్చింది.  సినిమాలోని పాటలు మరీముఖ్యంగా నచ్చేసాయి. ఈమధ్య ఎప్పుడుపడితే అప్పుడు వింటున్నా ఈ పాటలని. వినడమేంటి పక్కవాళ్లకు కూడా వినిపిస్తున్నా.

అందులో ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తేటతెలుగులో ఉండే వాటిని వింటుంటే చెవిలో తేనెపోసినిట్టు అనిపిస్తుంది. అంతమంచి బాణిలనందించిన మహదేవన్‌గారికి, స్వరాన్నిచ్చిన SPగారికి, వాణిజయరాంగారికి, స్వాతిచినుకు ముత్యంలాంటి చిత్రాన్నిచ్చిన విశ్వనాథ్‌గారికి ఎన్ని జోహార్లిచ్చినా సరిపోదు.

పాటల్లో కొన్ని చరణాలు మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగావున్నాయి
ఉదా:

" నీ ఆన లేనిదే గ్రహింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం,
   నీ సైగకానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం..."

"జంగమదేవర సేవలుగొనరా  మంగళదాయక దీవెనలిడరా
సాష్టంగముగా దండముచేతురా..
ఆనతి నీయరా...."

"సున్నిపిండిని నలిపి చిన్నారిగా మలిచి సంతసానమునిగింది సంతులేని పార్వతి
  సుతుడన్నా మతిమరచి శూలన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
  ప్రాణపతినంటుందా బిడ్డగతి కంటుందా...ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్నా ఘాటైన గరళమిది... గొంతునులిమే గురుతై వెంటనేఉంటుంది.."


కొన్నిసార్లు విన్నతరువాత ఓ పాటలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి తట్టింది. ఈ సినిమాలో చాలావరకు పాటలు వాణిజయరాంగారే పాడారు తెలిమంచు తొలిగింది పాటలో రెండు పాత్రలు పాడాల్సివున్నా మొత్తంపాట ఆవిడచేతే పాడించారు. అయితే ‘శ్రుతినీవు గతినీవు’ పాటను జానకి,వాణిజయరాంగార్లతో పాడించారు. గొంతు sharpగా వుంటుందికనుక సినిమాలో చిన్నపిల్లల పాత్ర పాడే పాటలు జానకిగారి చేత పాడించేవారంట అప్పట్లో. దానికి తగ్గట్టుగానే ఆ పాటలో గంగాధరం పాడే భాగన్ని జానకిగారితో, రాధిక పాడే భాగాన్ని వాణిజయరాంగరితో పాడించారు.
పాట సందర్భానికొస్తే గంగాధరం కట్టిన కొత్త బాణిని రాధికకు వినిపించాలి, ఇక్కడ గంగాధరం గురువు రాధిక ఆ బాణిని అనుసరించాలి.
పాట మొదలయేప్పుడు వాణిజయరాం (రాధిక) బాణిని తప్పుగా అందుకుంటుంది, జానకి (గంగాధరం) పెద్దవారుకనుక గురువు స్థానం తీసుకొని ఆ తప్పుని సరిచేస్తూ ఎలాపాడాలో చెబుతుంది.
మీరూ ఓసారి చూడండిజానకిగారితో పాడించడం లాజికల్‌గానూ, అంతర్లీనంగానూ మంచి ఆలోచన అనిపిస్తుంది.

ఏంటి కొండను తొవ్వి ఎలకను పట్టాననిపిస్తుందా...., అనిపించినా ఫరవాలేదులేండి మీకు ఓ మంచి పాటను వినిపించాను...చాలు.

3 వ్యాఖ్యలు.. :

ప్రణీత స్వాతి said...

బాగుందండీ..చక్కటి సినిమా, మంచి పాటలు పరిచయం చేశారు. అలాగే పన్లో పని శుభలేఖ, సప్తపది, స్వర్ణ కమలం కూడా చూసెయ్యండి. చాలా బాగుంటాయ్.

..nagarjuna.. said...

@ ప్రణీత గారు: స్వర్ణ కమలం చుసానండి, అందులోని ‘శివపుజకు చిగురించిన..’ పాట నా ఫేవరెట్. శుభలేఖ, సప్తపది ఇక్కడి మా కాలేజి DC++ లో ఎంత వెతికినా దొరకట్లేదు. ఈసారి ఇంటికెళ్లినప్పుడు ఏదైనా సీడి షాపులొ దొరుకుతుందేమో చూడాలి.

మీ ’స్నిగ్ధకౌముది’ నామకరణ స్వగతం బావుంది.

Padmaja said...

I think that this song was sung by Vani Jayaram and Chitra

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis