Showing posts with label విమర్శ. Show all posts
Showing posts with label విమర్శ. Show all posts

మేరా భారత్ మహాన్

భారత ప్రభుత్వంవారికి,
అయ్యా  ఈరోజు మీకు శుభాభినందనలు తెలియజేయడానికి నాకు నోటమాట కరువౌతోంది. మొన్నీమధ్యనే జరిగిన ముంబాయి పేలుళ్లను మరవకముందే రక్తసిక్త చేతులతో పట్టుబడ్డ కసబ్‌గారు అథిదిగృహం లాంటి జైలులో పట్టుమని ఓ పదికేజీల బరువు పెరగకుండానే మళ్ళి పేలుళ్లు జరిగాయంట!  సంతోషం. నావొళ్లు పులకించిపోయింది. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా భావించే ఉగ్రవాదులకు మన రక్ష్యణా వ్యవస్థ, గూఢచర్య వ్యవస్థ మరీ తిసికట్టుగా తయారైయ్యేట్టు చేసినందుకు మీకు శతకోటి వందనాలు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌ను, రె‌డ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కసబ్‌ను భవిష్యత్తులో పట్టుబడబోయే మరేయితర ఉగ్రవాదినో సిగ్గు-శరం లేకుండా ఉంటూ ఏమి చేయలేని మీ రాజనిరతికి నా జోహార్లు. ఇవాల్టి ఈ పనికి పైలోకంలోని వందలాది ఉన్నికృష్ణన్లు, కామ్టేలు, కర్కరేలు ఆనందభాష్పాలు రాలుస్తుంటారు. మీకు హ్యాట్సాఫ్.


ఏదేమైనా సారూ మనకి ఈసారి కూడా అదృష్టం కలిసిరావాలని కోరుకుందాం. ఏ రాముగాడో, సోమూగాడో సంఘటనా స్థలానికి వెళ్ళేలా చేద్దాం. 
వాడిచేత ఓ బ్రహ్మాండమైన సినిమా తీయిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం పై మనం జరిపే పోరుకు అందరూ మద్దతివ్వాలని కోరుకుందాం. సొల్లు కబుర్లు చెప్పుకోడానికి వీలయ్యే దైపాక్షిక చర్చలకు సానుకూల వాతావరణం కలగాలని కోరుకుందాం. ఎంచక్కా మన మంత్ర్లులు వాళ్ల అనుచరగణం టీవీల్లో, పేపర్లలో దర్జాగా పబ్లిసిటీ ఇప్పించుకోవచ్చు. నా భ్రమగాని ఈ పాటికే మీ మేనిఫెస్టో లోని సగటు మనిషి/ ఆమ్ ఆద్మీ/common man ఈ బాధ్యత తీసుకొని ఉంటాడు. రేప్పోద్దున చూడండి ఏ భయం లేకుండా ముంబాయ్ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తాడు. ఛాయ్ బండ్ల దగ్గర సమోసాలు తింటాడు. ఉగ్రవాదులకు మేము భయపడము అని వార్తా ఛానల్లు ఊదరగొట్టుకునేలా చేస్తాడు. ఆ పేరుతో మనందరం చంకలు గుద్దుకొవచ్చు. ఆ పిచ్చి ఛానళ్లకు అసలు సంగతి తెలీదు, పనికెళ్లకపోతే తిండి దొరక్క చస్తాడు ఆ సగటు మనిషి. దానికన్నా బాంబులు ఉంటాయో ఉండవో అని 
అనుమానపడుతూ, తననుతాను సంబాలించుకుంటూ వీధుల్లో తిరుగుతుంటాడు. సగటు మనిషికి అలాంటి మహర్ధశ పట్టించిన మీకు ఎన్ని కితాబులిచ్చినా తక్కువే.

కొన్ని రోజులపాటు న్యూస్‌పేపర్లు, టీ.వీ ఛానళ్లు మీమీద బురద జల్లుతాయి. పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, సరిపడ నిధులు  ఇవ్వలేదని. మీరేమి వాటిని చెవికెక్కించుకోవద్దు. పోలీసులను నేతల ఇళ్లదగ్గర, సమావేశాల దగ్గ్రర  కాపలా కుక్కల్లా పెట్టేసుకోండి. ఎదురు మాట్లాడినవాడి పీక నొక్కడానికి వాడండి. ప్రతిపక్షం గతజన్మలో చేసిన అవినీతితి గురించి, తప్పొప్పుల గురించి యేళ్లతరబడి ఉపన్యాసాలు దంచండి. ఎవరైనా ఓ ఇంటిపై దాడిచేస్తే, ఆ ఇంట్లో మగాడు ఏం చేయలేకపోతే వాడికి గాజులు తొడిగి మూల కూర్చోబెడతారు. మీమీద ఉన్న అమితమైన వాత్సల్యం, అభిమానం, ప్రేమ కొద్ది మేమా పనులు ససేమీరా చేయం. దర్జాగా ఏలుకోండి, మమ్మల్ని దోచుకోండి. ఇలాంటి దాడులు జరిగినపుడు ఏవో పదో పరకో ప్రాణాలు పోతాయ్. వెధవది గాల్లో దీపాల్లాంటివి ఆమ్ ఆద్మీ ప్రాణాలు మీరు దేశానికి చేయబోయే విశాల ప్రయోజనాలకంటే ఎక్కువకావు. నిస్సిగ్గుగా ఉండండి. మీరు మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం.

మేరా భారత్ మహాన్. మేరా నేతా మహాన్.

PS: అయ్యా ఉగ్రవాదులూ తమరు ఎంతో కష్టనష్టాలొనర్చి, పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి చిన్నచిన్న బాంబులు పెడుతున్నారు. ఇకపై అంత కష్టం తీసుకోకండి. ఎక్కడ దాడి చేయనున్నారో నేరుగా మా ప్రభుత్వానికే తెలియజేయండి. మీకు సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఒకవేళ పోలీసులో కమేండోలో అనవసర సాహసం చేసి పట్టుకుందనుకోండి మీరు ఈ దేశానికి చేసిన మహత్తర సేవకుగాను మీకు దేశంలో ఎవరికీలేని రక్షణమధ్య రాజమర్యాదలు ఉంటాయి. ఆ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాకపోతే ఒక్క విన్నపం, దేశ రక్షణ అంటే పవిత్రమైన పని అని ప్రాణాలిచ్చైనా దీని సార్వభౌమత్వాన్ని కాపాడాలని సరిహద్దులోని మా వెర్రి సిపాయిలు, పోలీసుల్లో కొందరు అమాయకులు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వచ్చే సమయంలో మా గవర్నమెంటువారికి ఆ సిపాయిలను, పోలీసులను కాసేపు తప్పించమని చెప్పండి. పాపం వారు మధనపడకుండా ఉంటారు. ఎప్పటిలాగే మేము మీ రాకకై ఎదురుచూస్తూ, మీ చేతుల్లో ప్రాణాలొదలడానికి సిద్దంగా ఉంటాం

ఇట్లు,
సగటు మనిషి.

చెత్త పోస్టు, సుత్తి పోస్టు - పని లేకపోతేనే చదవండి

మళ్ళి చెబుతున్నా.... రివ్యూనో, పక్కవాడిలో గమనించిన విషయాలో చెప్పను. పూర్తిగా చెత్తపోస్టు ఇది. టైం బ్యాడ్‌గా ఉంది అనుకుంటేనే చదవండి.....

చదువుదామంటే...
--కామెడి పోస్టులు నవ్వు తెప్పించడంలేదు, [ తోటరాముడి బ్లాగు కూడా నవ్వించలేక పోయింది ]
--సీరియస్ పోస్టులు బాధను/సానుభూతి భావనను కలిగించడంలేదు.
--కెలుకుడు  పోస్టులు ఆసక్తి కలిగించడంలేదు.
something is terribly wrong with me, i guess.

ఈ-మెయిలు చెక్ చేస్తూ ఓ ఫ్రెండ్ పంపించిన మెయిల్ చూసా...

ఓ చిన్నపాప [మూడు వారాల వయసు ఉండొచ్చు] ఫొటో, ఆ పాపకు ఏదో భయంకరమైన జబ్బంట, పాప తల్లిదండ్రుల దగ్గర డబ్బుల్లేవంట. ఈ సమయంలో ఓ తొక్కలో ఈ-మెయిల్ కంపెనీగాడు పాప ఫొటోతో ఉన్న మెయిల్ ను ఎంతమంది ఎన్నిసార్లు ఇతరులకు చేరవేస్తారో అన్ని రూపాయలు/సెంట్లు/యెన్‌లు, నా బొంద, ఆ పాప తల్లిదండ్రులకు ఇస్తారంట. ప్లీ..........జ్ మీకు హృదయం అనేది ఏడిస్తే ఫార్వర్డ్ చేయండి అని రాసుంది.
చదవంగానే మెయిలు పంపించిన ఫ్రెండును గూబమీద ఒక్కటి పీకాలనిపించింది. ఈ దరిద్రపు ప్రపంచంలో ఈ-మెయిలు ఇంకొకళ్లకు పంపించినదానికే డబ్బులిచ్చే తలకుమాసిన వెధవెవడైనా ఉంటాడా......ఇట్టాంటి మెసేజీలు వేరేవాళ్లకు పంపించేపుడు కాసేపైనా ఆలొచించొచ్చుగా.......ఊహూ అక్కడకు ఈళ్లొక్కల్లే హృదయం ద్రవించిపోయిన మనుషులు. ఏవన్నా అంటేనేమో 'ఏమో, నిజంగానే పాపకు జబ్బు తగ్గడానికి డబ్బులు ఇస్తారేమోననే ఆశ/నమ్మకం' అంటారు.  To hell with your sentiments అని అరవాలనిపిస్తుంది. చేతకాక....చేయలేక ఇవి అబద్దం అని చెప్పే అంతర్జాల లింకు ఒకటి పంపించినోడి మొహం మీద పడేస్తాను.

ఈ పోస్టును ఇంకా ఎవరైనా చదువుతుంటే వాళ్లకు ఒక విజ్ఞప్తి....
అమ్మలారా/అయ్యలారా... మీరు ఈ-మెయిల్లు ఫార్వార్డ్ చేసినంత మాత్రాన ఎవడూ ఎవడికి డబ్బులియ్యరు. తలకుమాసిన సన్నాసులు కొందరు మానవ సహజమైన భావోద్వేగాలతో అడుకునే పరమచెత్త చేష్ట అది. మీకు అలాంటివి తగిలినపుడు హృదయం ద్రవించిపోయి వేరేవాళ్లకు పంపిస్తే ఆ వికృత పాచికలో మీరు భాగస్వాములు అయినట్టే.

ప్రస్తుతం నేనుకూడా అలాంటి పనే చేసాను. నాకు ఎటూ పాలుపోక మీ సమయాన్ని వృధా చేయడానికి ఈ పొస్టు రాసాను . చూడబోతే psycho లక్షణాలు ఎక్కువౌతున్నాయి ఏంటో లేకపోతే హిట్స్ పెంచుకోవడానికి తప్ప ఉపయోగపడిని నా ఈ పోస్టెందుకో.... . పాఠకులకు వీలైతే మన్నించండి లేకపోతే మీ భావావేశాలను వెళ్లగక్కండి....కామెంటు బాక్సు మీకోసమే పడుంది

కోర్టులు, తీర్పులు, మన్నూ, మశానం

వివాదాస్పదమైన బాబ్రికేసులో అలహాబాదు హైకోర్టు తన తీర్పును ఇంకో పదిరోజుల్లో వెలువరించనుంది అనగా భారత ప్రభుత్వం తీర్పు వల్ల  అవాంఛనీయ ఘటనలు జరగొచ్చునేమోనని ఊహించి తీర్పు వెలువరించే రెండురోజుల ముందునుండి  ప్రసార మాధ్యమాలలో మసీదు పడగొట్టేప్పడి క్లిప్పింగులు పదే పదే చూపించడంగాని, తీర్పుపై ఊహాగానాలుగాని, రాబోయే తీర్పుపై  చర్చలుగానీ చేయరాదనిమార్గదర్శకాలు జారి చేసింది.సెల్‌ఫోనుల నుండి ఒక వర్గాన్ని ఎంచుకొని SMS పంపించవద్దని కొన్ని చోట్ల పోలీసు శాఖవారుకూడా  సూచించారు.  హ్మ్....జనం బాగోగులు బాగా చూసుకునే మన మీడియా రెండురోజుల ముందునుండి నిషేదించారుగాని అంతకు ముందునుండి కాదు అనే పాయింటు బాగా ఒంటబట్టించుకొని వో....... చర్చలు విశ్లేషణలూ అభిప్రాయ సేకరణ అంటూ పోల్సు వగైరా వగైరా అన్నీ కావాల్సినంత చేశారు. ఇహ ఆ చర్చలు, సేకరణలో వాళ్ల మతలబు ఏంటొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "తీర్పు మీకు అనుకూలంగా రాకుంటే మీరు ఏం చేస్తారు?", " రాముడికి/మసీదుకు ఆ స్థలం ఇవ్వకుంటే మీవాళ్ళు ఏం చేయాలి అంటారు..", "...అంటే ఏరకమైన ఆందోళన చేయాలనుకుంటున్నారు.." ఇలా ఉంటాయి చాలా చర్చలు. దేశప్రజలకు ప్రతి విషయాన్ని తెలియపరచాలని, అంతవరకు తెలియనొడికి కూడా కొత్త కోణాలు చూపించాలని వీళ్లు చేసే ప్రయత్నం చూసి నాకు ఆనందభాష్పాలు టప టపా రాలాయి.

ఈ విశ్లేషణలు బ్లాగులకు కుడా తగులుకున్నాయి....నేను చూసిన కొన్ని బ్లాగుల్లో పోల్స్, గ్రహాలు ఉపగ్రహాలు అంటూ ఊహాగానాలు జరిగాయి. సరే....., ముఖ్యమైన అంశం కాబట్టి, వద్దన్న పని చేయడం మన నైజం కాబట్టి చేశారనుకున్నా. తీర్పు వచ్చింది, ఆషాడభూతులు అనుకున్నట్టు ఏ అవాంఛనీయ ఘటనలు, ప్రదర్శనలు, దాడులు జరగలేదు. చాలామంది మేధావులు (నిజ, కామెడి, కుహనా లాంటి అన్ని విధములవారు) అనుకున్నట్టు   తీర్పు ఏకపక్షంగా కాకుండా రాజీకుదర్చడానికన్నట్టు మధ్యేమార్గంగా స్థలాన్ని మూడుభాగాలుగా పంచింది. దీనివల్ల జనం ఏమి అనుకోలేదు...పాపం మనసోకాల్డ్ నాయకులు, మేధావులే వో ఇబ్బందడిపోయారు. "అసలు నమ్మకాల ఆధారంగా తీర్పులెలా ఇస్తారు?", "ఒకే దగ్గర మందిరం మసీదు ఎలా కడతారు?", " కడితే  గొడవలురాకుండా ఉంటాయా...!", " మామాటే నెగ్గింది...మేమన్నది నిజం అని తేలింది", " వాళ్ళు త్యాగం చేయాలి....మొత్తం మాకు ఇచ్చేయాలి" అని ఏవేవో అన్నారు అంటున్నారు. నాకర్ధం కానిది ఏంటంటే ఏ సినిమాలోనో, కధలోనో హిందూ-ముస్లిములు కలిసున్నారు అని చదివితేనో....నిన్న మొన్నటిదాకా వివాదాస్పద స్థలంలో మందిరం-మసీదు రెండూ కడదాం అని ప్రతిపాదనలొచ్చినపుడు ఇదీ మన భారతీయత అని కాలర్‌ ఎగరేసుకుంటూ చెప్పినోళ్లకు ఇప్పుడెందుకు ఇది మింగుడుపడటంలేదు, హిందూ ముస్లిం భాయి భాయి   అని మనం నిజంగా నమ్ముతున్నామా లేదా అని. ఎవరో ఎందుకు త్యాగం చేయాలి? కలిసి ఉండనివ్వాలి అని నమ్మకాల ఆధారంగా చెబితే ఏం తప్పు ఉంది అందులో? పోనీ నిజంగానే మసీదు మందిరం పక్కపక్కనే ఉంటే ఇబ్బాందనుకుంటున్నారా ? బాబులు...సమస్యాత్మక ప్రాంతం అని అనుకునే మా హైదరాబాదులో, మా ఏరియాలో నాకు తెలిసిన గత పధ్నాలుగేళ్ళుగా మసీదు మందిరం పక్కపక్కనే  ఉన్నా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాము...ఒకసారి  అక్కడకుడా కట్టిచూడండి. తప్పక కలిసుంటారు.


సరైన న్యాయం దక్కలేదని, కొందరిని బుజ్జగించాలని చేస్తున్న ప్రయత్నమని ఇదై ఫీలైపోతున్నవారు రెండుమూడు రోజుల తేడా వ్యవధిలో వచ్చిన ఆయేషా మీరా కేసు తీర్పు గురించి మాట్లాడరెందొకో. ఓ కట్టడంమొక్క చరిత్ర ,తీర్పు భవిష్యత్తూ గట్రా నిశితంగా పరిశీలించేవారు, ఔత్సాహికులు ఆయేషామీరా లాంటి కేసులగురించి మాట్లాదరెందుకో...!!?? ఏం మాట్లాడినా మనల్ని పట్టించుకునేవాడుండనా !!


గమనిక: ఇది లోకం తీరుతెన్నులు తెలియని,  వచ్చిన తీర్పు జనాలబాగుకోరి ఇచ్చినది అని నమ్మే ఒక అజ్ఞాని ఏడుపు. మీకు ఈ ఏడుపులో నిజాయితి, న్యాయం, ధర్మం కనబడితే ఓ గుడ్డముక్క మొహానవేసి వెళ్లండి,తుడుచుకోడానికి పనికొస్తుంది, వీలైతే నాతో కలిసి ఏడవండి. ఏది కనబడక నచ్చకపోతే మీ ఇష్టం.., మీదారిన మీరుపోండి......I don't care.....

నేటి పరిస్థితి

1) పుట్టుకతో మూగ చెవిటి అయిన విశ్వేశ్వరరావు అనే అభ్యర్ధి PD కోటాలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకుంటే లంచం అడిగిన సంబంధిత శాఖ అధికారులు. సిగ్గుండాలి ఈ నా  ______కులకి. సామన్యుడి దగ్గర చేయిచాస్తారు, అది సరిపోక వైకల్యం ఉన్నవాడు తనకాళ్లమీద తను నిలబడతానంటే అతని దగ్గరకూడా లంచం అడగటం. చూస్తే శవాలమీద చిల్లర ఏరుకునే బాపతులా అనిపిస్తుంది. పైగా ఈ  _____కులకి సంఘాలు, ధర్నాలు......థూ

ధైర్యం చేసిన విశ్వేశ్వరరావు  సదరు అవీనీతాగ్రేసరుడి పేరు బయటపెట్టడానికి  కూడా తయారయి ముఖ్యమంతిని కలిసి తన బాధ చెప్పుకుందామని రాజధాని వస్తే అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా జాప్యం చేసిన సెక్యూరిటి.

2) విశాఖలో ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి......ఈళ్లకి మామూలుగా చెప్తే వినరు. అప్పుడొసారి వరంగల్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తే తప్పుబట్టాను....కాదు అలానే చేయాలి. అలాంటి వెధవలు బ్రతికుండి వేస్ట్, ఇంకొకళ్లనైనా వేధిస్తారు. లేపిపారేయండి వెధవల్ని......

బ్లాగుల్లో దాడులు

తెలుగ బ్లాగులు పచ్చగా పిచ్చ పిచ్చగా ఎవళ్ల పని వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో మళ్ళి దాదులు మొదలయ్యాయి....ఒకప్పుడు దాడికి ప్రతిదాడి కాన్సెఫ్టుతో  ప్రారంభమైనదే  కెలుకుడు బ్లాగర్ల సంఘం (కెబ్లాస). ఈ సంఘం ఆధ్వర్యంలో దాడులు భీకరంగా సాగేవి అప్పుడప్పుడు సంబరాలు కూడా చేసుకునేవారు. ఈ సంఘంలో ఒక సభ్యుడు శరత్ వీలు చూసుకొని తన హిడెన్ ఎజెండా బయటపెట్టాడు. ఊరంతా ఒకదారైతే ఉలికిపిట్టదొక దారని...మిగతా వాళ్లంతా మానవ హక్కులు వంకాయ బీరకాయ అంటే ఈయన LGBT హక్కులు, adult హక్కులు అని వాపోతుండేవాడు...ఈయన నస పట్టలేక జనాలు  ఈయనకో సంఘం గుంపగత్తుగా ఇచ్చేసి పండగా చేసుకో నాయనా అని తేల్చేసారు. ఇక దాన్ని ఆయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకొని ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. పైగా ఉన్న సంఘానికి అనుభంధంగా పిల్ల సంఘాలు....ఆయన లోకంలో ఆయనున్నాడు.  ఐతే  ఈ కెబ్లాసలోంచి మరీ ముఖ్యంగా టపాలు రాసే పనిలోంచి పెళ్లికాని ప్రసాదు ఒకరు వెళ్ళిపోవడంతొ గతకొద్ది కాలంగా దాడులు తగ్గుముఖం పట్టాయి. వెళ్ళిపోయిన సదరు సభ్యుడిలోటును ఈ మధ్య ఓ ఫ్రూఫు‌లు అడిగే అతను భర్తి చేస్తున్నాడు. మాట్టాడితే ఫ్రూఫులు ప్లీజ్, స్టాట్స్ ప్లీజ్ అని దాడి చేయడం ఈయన మార్కు

ఒకవ్యక్తిపై జరిగే దాడులలో ముఖ్యంగా ఈ కెబ్లాసకు అనుభంద సంస్థ ఒకటి, అమెచ్యూర్ బ్లాగర్లు కలిసి పెట్టుకున్న సంఘం ఒకటి ముఖ్యమైనవి. వీళ్లు రాసే మాటల తూటాలకు అప్పట్లో అగ్రిగేటర్లు మహేష్‌బాబు కొట్టకుండానే దిమ్మతిరిగి బ్లాకయ్యెవి :)

 ఐతే దాడి కి ప్రతిదాడి భావంనుండి కాక అభిమానం వల్ల కూడా దాడులు జరిగాయి. ’బావ కళ్ళ్లలో ఆనందం కోసం’లా తమ అభిమాన బ్లాగరు నేస్తం రాసే టపాల్లో ఎప్పటికైనా వంద కామెంట్లు చెయ్యాలనుకొని కామా చూడలనుకొని సిండికేట్‌ అయ్యిన బ్లాగర్లు కొందరు తీరా ఆ భాగ్యం కొత్తగా వచ్చిన బ్లాగరిణి కొట్టేయడంతో పట్టలేని ఆవేశంలో ఆక్రోషంతో  సదరు బ్లాగరిణి బ్లాగులో కామెంట్లదాడి మొదలెట్టారు. యెన్నో వ్యయ ప్రయాసల తరువాత ఆ కొట్టుకోవడానికి భరతవాక్యము, కొత్త స్నేహానికి నాంది వాక్యము జరిగినాయి. అలా పుట్టిందే వబ్లాస (వంద కామెంట్ల సంఘం)...పుట్టిపుట్టంగానే, in fact పిండరూపంలో ఉండగానే, మూడు బ్లాగుల్లో ‘శతక్కోట్టుడు’ చేయడం దీని ప్రత్యేకత. కొన్నాళ్ళకు సభ్యుల  విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, వైవిధ్యం చూపించే బ్లాగర్లను ప్రోత్సహిమ్చాలని  దీన్నే యు.బ్లా.స (యువ బ్లాగర్ల సంఘం) గా మార్పు చేయడం జరిగింది. దీనికీ ఓ ప్రత్యేకత ఉంది...బ్లాగులోకంలో అపాలజీలు చెప్పే బాధ్యతను ఈ సంఘంలో ఒక బ్లాగరిణి తీసుకోవడం అని జనాలతో చెప్పించుకోవడం . ఇలా చేయడం వల్ల మనల్ని ఎవరూ లెక్కచేయట్లేదు తల్లోయ్ అని సభ్యులే పులి సినిమాలో లా ’అమ్మ తల్లీ...’ అని అందుకుంటున్నారు...... ప్చ్. తను మాత్రం "మీ అభిమానం చుక్కల పద్దతిన కాకుండా లీటర్ల పద్దతిన ఉంది నేనాగలేను ఇప్పుడు" అని అలా పరిగెడుతూనే..................ఉంది. ఎప్పటికి ఆగేనో మరి !!

ఐతే ఓ పెద్ద చెట్టుకింద ఓ చిన్న చెట్టు ఎదగాలంటే మాటలా.......ఎప్పుడో భూమిపుట్టినప్పుడు మొదలైన సంఘాల మద్య్హలో ఇప్పుడో కొత్త సంఘం అనగానే పాతవాళ్ళు షివరింగ్‌ అయ్యారు......ఇంగ దాడి షురు.పనిలేని మంగళి పిల్లతల గొరిగినట్టు మీ సంఘంలో సభ్యులెంత, ఆఫీసెక్కడ, జమా ఖర్చులెంత అని ఈకలూ తోకలూ చూపించమన్నారు.ఈ దాడి చేసిందికూడా ఓ యువ బ్లాగరే కావడం ప్చ్ అహ్ శోచనీయం ... :( ఇందులో అతడితోపాటు కెబ్లాస లక్షణాలను తోసెయ్యలేం :D :(
 ఇది చాలదన్నట్టు తన రాజ్యంలో అన్ని పాత్రలను తానే ఏకపాత్రాభినయం  చేసుకుంటూ, సంతానవతుడయ్యుండి అస్ఖలిత బ్రహ్మచారిని అనే చెప్పుకుంటూ తనుకు తాను కుర్రాడిలా ఫీలయ్యే శరత్‌గారు  నేను కుర్రాన్నెనోచ్ నన్నూ కలుపుకోండి అని వాలిపోయాడు.  మనవాడే  పైగా పరిచయస్తుడే అని దాదాపుగా కలుపుకుందా మనుకునేలోపు  ఈయన గూరించి యుబ్లాసకు అప్పటికి అప్రకటిత సభ్యులొకరు ఉప్పందించారు. కర్ర విరగొద్దు పాము చావాలి అన్న చందంగా  పరిశీలిస్తున్నాం అని చెప్పటం జరిగింది. ఆయనమాత్రం యుబ్లాస సభ్యుడినేనంటూ ప్రచారం చేసుకుంటున్నాడు.   పెద్దల నుండి నిరాకరణ జరగొచ్చునేమోనని ముందుచూపుతో కొందరిని తమ సంఘానికి సలహాదారులుగా నిమమించుకుంది......ఇక తేలాల్సింది విధివిధానాలు. వీటిపైనే ఇప్పుడు దాడి......హ్మ్. అందుకే ఈ బ్లాగు ముఖంగా కొన్నిటిని నివృత్తి చేయదలచాం

1)మా సంఘంలో ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు ఉండబోరు....అందరూ కార్యవగ్గ సభ్యులే. అందరూ సమానమే.
2) ఒకే విషయం పై నా దృక్కోణం అనీ, పక్కవాడి దృష్టికోణం, లంబకోణం, వక్రకోణం అని చెప్పే సోదితో విసిగిపోయాం బాబు. కాబట్టి యుబ్లాస సభ్యత్వం తీసుకోదలచినవారు వైవిధ్యభరితంగా నసపెట్టకుండా రాయవలెను :)
౩) యుబ్లాస లో గరిష్ట వయసు పరిమితి 32-34 సం. 32 రాగానే క్రియాశీల కార్యవర్గంనుండి తప్పుకుంటారు. 34 దాటినవారు సలహాదారులుగా ఉంటారు......వయసుతో కూడిన అనుభవం వల్ల వచ్చిన మార్గ్దదర్శనం చేయడానికి. వయసుతో సంభంధం లేకుండా మనసు ద్వారా మేం యువకులమే అనేవాళ్ళు బ్లాగులోకంలో చాలామంది ఉన్నారు. సోది పెట్టనంతవరకూ అందరికీ స్వాగతం :)

ఈతరం బ్లాగులో కొత్త్గగా ఒక వ్యక్తిపై దాడి జరుగుతుంది. అతడే బ్లాగు బాబ్జి అనే కాండిడేటు. అడవి యాసతో అందరిని కెలికుతూ పూర్వపు కెబ్లాసను తలపిస్తున్నాడు. ఇతగాడు తనబ్లాగులో తప్పవేరే బ్లాగుల్లో కామెంటకపోవడం, బ్లాగ్లోకంలో కొందరితో (PhD candidates తో) తనకు ఆల్రెడి పరిచయం ఉందని చెప్పడంతో ఇతగాడు వెళ్ళిపోయిన పెళ్ళికాని ప్రసాదేమోనని ప్రశ్నల దాడితో వేధించారు....బ్లాగులోకంలో అంతో ఇంతో తెలిసిన ప్రతి సాల్తీతో అంటగట్టడం మొదలెట్టారు. తిక్కరేగి తాను ఎవరిని కాదు అని  చెప్పి కొద్దిపాటి నమ్మకం కలిగించాడు.

పోతే అతినూతనంగా ప్రారంభమైనదాడి అభం శుభం తెలీని బ్రహ్మచారులపైన. ఒక సీనియర్ బ్లాగర్ మొదలెట్టిన గోడు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు, జోగి జోగి రాసుకొని బూడిద రాల్చినట్టు (నోటిదూల :D)  మొగుడ్స్- పెళ్ళామ్స్ గోలలోంచి పుట్టిందే బ్రహ్మచారుల బ్లాగర్ల సంఘం ( బ్ర బా స ). ఐతే మిగతా నూతన సంఘాలకు ఎదురైనట్టుగానే దీనికి దాడులు ఎదురైనై. పెట్టిన మరుసటి రోజే ఓ సభ్యుడు పెళ్ళి చేసుకోవడం ఊహించని మలుపుకాగా, పెట్టిన కొత్త్లోనే ఇది బ్రహ్మి గూపు అనే టాగు మరో దెబ్బ, అక్కడికి బ్రహ్మచారులంతా సాఫ్ట్‌వేర్‌వాళ్ళె ఐనట్టూ.....మిగిలిన దెబ్బలు కుటుంబరావులు,   సతీ సక్కుబాయిలనుండి ఎదురౌతుంది. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే నిన్నగాక మొన్నటివరకు బ్రహ్మచారి జీవితాన్ని మూడు లైన్లు అరు బీట్లతో గడిపిన ఓ మాజి బ్రహ్మచారి చేయడం. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.........ఐనా బ్రబాస సభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో ఐదేళ్ల తరువాతైనా ఈ హీరోగారు తమ  సహాయం కోరకపోతారా అని. దీనికి తోడు ఇందాక చెప్పిన ఏకఛత్రాధిపత్యం చేసే సదరు సాల్తీ తానుకూడా బ్రహ్మచారినే అంటూ తననీ చేర్చుకోవాలంటూ కామెంట్ల దాడి చేస్తున్నాడు. మేము చూస్తున్నాం కట్టే విరక్కుండ పాము చచ్చేట్లు.........!!



అదండీ సంగతి ప్రస్తుత తెల్గూ బ్లాగ్లోకం ముడు గ్రూపులు ఆరు ప్రతి గ్రూపులు చందాన తాన అంటే తందానా అంటూ సాగుతుంది. ఈ పరిణమాం ఎటుపోతుందో మరి.....ఖచ్చితంగా హర్షాతిరేకాలకు కారణమవ్వాలని కోరుకుంటూ అందరికి


య్యాపి Engineer's Day :)


Just for fun........

మాకి నచ్చట్లేదు హై......

అవును మాకి  హేమి నచ్చట్లేదు ఇది. అరే అసలే తల/బుర్ర సరిగా పనిచేయని,పనిచేసే వాళ్ల మధ్యన ఉంటున్నాం.., కొంచెం తెరిపి కోసం గోడును గాలికి చెబుదాం అని బయటకు (లోపలికి) బయలుదేరితే నాలా చెప్పుకోవడానికి ఆల్రెడి చేరుకున్నోళ్లు గంపెడు. ఒకరు హంసధ్వని రాగంలో పాడుతుంటే మరొకరు హింసధ్వని రాగంలో ఆలపిస్తుంటారు. నేనేమో ఏదో తెలియని నా రాగం అందుకొని గోడు వెళ్లగక్కుతాను. అరుపులు కేకలు మధ్యమధ్యలో వాటంతట అవే దూరుతాయి. ఈ గోడు అటుగాపోయే దారినపోయే సాటి గోడయ్యలకు/గోడమ్మలకు నచ్చితే ‘ఓహ్ అలానా సోదరా’ ,‘భేష్ భేష్’,‘నాదీ గోడు  నీదీ గోడు ఒకటే హై’,‘థూ నీ గోడు చెడ’ అని సవాలక్ష (అంత కాకపోవచ్చు ఓ సవావంద  ఉండొచ్చు ) చాక్లెట్లు, వాతలు ఇచ్చేస్తారు. ఈళ్లెవ్వర్రా అని తరచి చూస్తే అబ్బో....ఆనంధభైరవి,శంకరాభరణం ( ఎక్కువడగొద్దు నాకు తెలిసిన రాగాలు ఇవే) కలిపి గుండేలో....తుల్లోంచి మాట్లాడి ఆడిపాడేవారు కొందరు, ఎండలో మాడిపోతున్న జనాలకు గోడు కాకుండా గోళీషోడా ఇచ్చేవారు కొందరు (దండేసి దణ్ణం పెట్టాలీళ్లకు), అయ్యబాబోయ్ అసలీడేందుకు గోడుతన్నాడ్రా సామి అనుకుంనేంతగా తీవ్ర హింసధ్వని ఆలాపించేది ఇంకొందరు....

ఏదో ఒకటి.., షోడా బాబులు (దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం ?), రాగ-మేళకర్తలు ఉన్నారుగా అని సంతోషిస్తుంటాను. ఇది ఈళ్లకు నచ్చదేమో, అశ దోశ అప్పడం ఆలు అని జంపు జిలానీలుగా తయారైనారు. పోన్లే ఒకరిద్దరే అని ఊరుకుంటుంటే హమ్మా...రోజురోజుకీ ఈ జాగాలో జంపు జిలానీల బ్యాచ్ ఎక్కువైపోతుంది. చెప్పులు లేవని జంపు, ఇళ్లు మారానని జంపు, మొలకలు వచ్చాయని జంపు, చెట్టు విరిగిందని జంపు....టూ మచ్ టూటూ మచ్. అందుకే అసల అస్సలు నచ్చట్లేదు

అప్పుడేపుడొ ఆ గోళీషోడాలమ్మే ఆయన జంపన్నాడు, కొద్దిరోజులకు ఆయన బెదరు కూడా పత్తాలేకుండా పోయాడు. వేరే షోడా బాబులు (మళ్ళి తెలుస్తలేదు, దీనికి సమాంతర ఆడ స్త్రీ లేడి మహిళా పదం) ఉన్నారు, వస్తున్నారు కాని ఎంతైనా old is gold కదా.... ఈ షోడా సంగతి పక్కన పెడితే మొన్నీమధ్య మంచిగోడులు చెప్పేటాయన ఓసారి నేనూ కూడా జంపోచ్  అని  దాదాపు చాపచుట్టేసేంత పని చేసాడు ఇదేమిటయ్యా మగడా ఏమైనా పద్దతిగా ఉందా నీకు అనేసరికి  కాదు కాదు టెంపరవరీ మౌనవ్రతం అని గమ్మునుండిపోయాడు. కబుర్లు చెప్పే కబుర్లమ్మ చెప్పా పెట్టకండానే వెళ్ళిపోయింది. అపుడు అసలేంత ఫీలయ్యానో వీళ్ళకేం తెలుసు యువరానర్ అధ్యక్ష్యా!!.   ఆ తరువాత లాజిక్కులు, మ్యాజిక్కులు అడిగే ఓ ఆసామి అల్‌విదా అల్‌విదా అని పాట పాడేసి సినిమాలో జ్యొతిలక్ష్మిలా కనిపించి కనపడాకుండా వినిపించి వినపడకుండా తిరుగుతున్నాడు భూతంలాగా(ఈ మాట ఎవరైనా పుసుక్కునెళ్ళి ఆయనకు చెప్పేరు బాబ్బాబు అక్కఅమ్మలు ఆ పని చేయకండి. చెప్పాక గోడడానికి నేను, నేను గోడిన గోడులు రెండు మిగలవు,.ఆయనకో బ్యాచ్ టైపులో జనం ఉన్నారు మరి)...యే డైరెక్టుగానే రావచ్చుగా ఉహూ రారు.... ఊకనే మొండి చేస్తున్నారు నాకు తెలుసు.

ఇపుడు కొత్తగా, జస్ట్ టూ డేస్ బాక్,  బెమ్మాండంగా పాడతారు అని పిలవబడే ఇంకొకరు యెళ్ళిపోయారంటా..నేనైతే ఆ సదరు పాటలు వినలేదు కాని ఎంతైన పాపులర్ పర్సనాలిటీ అంటే పాటలు బానే పాడతారనడంలో నిజం ఉండే ఉంటుంది కాబట్టి జంపు జంపే....చాప చుట్టేస్తానంటే  వాతలు పడతాయనేమో కొత్త పథకం కింద లాంగ్‌లీవులు పెట్టేస్తున్నారు ఉద్యోగులు. అఫ్‌కోర్స్ ఇంకా అమృతధ్వని రాగంలో గోడేవాళ్లున్నారు కాని ఈళ్ళంతా ఇలా వరసపెట్టి జంపేస్తుంటే ఇక్కడ మాగతేంగాను మంచోళ్లందరూ మైనారిటీలో పడిపోతే జోగిజోగి కలిసి బూడిద రాల్చవూఊఊ...దీనికి సమాధానం చెప్పాల్సిందే అని బల్లగుద్ది, అవసరమైతే పక్కవాడి గుండుగిద్ది అడుగుతున్నా ఆనర్ అద్దేచ్చా...

అందుకే ఈ యవ్వారం నాకి హేమి నచ్చట్లేదు హై...మీకీ కూడా నచ్చట్లేదు హై అయితే రండి, ఇక్కడ ఆ గోడు కక్కి, అరుపులు కేకలు పెడదాం

******************************************************************
పోస్ట్‌లో ప్రస్తావించిన బ్లాగరులు, వారి అభిమానులు నేను ఏమైనా దెప్పిపోడిచే విధంగా మాట్లాడాను అని భావిస్తే క్షంతవ్యుడిని. అది నా అభిమతంకాదు. బ్లాగును విరమించడానికి వారి సొంత కారణాలు వారికున్నాయని చెప్పారు. ఎటొచ్చి ఇంతమంది తెలిసిన బ్లాగ్మిత్రులు వారి బ్లాగులు ఇకపై కనపడరు అనే తలపు  పట్టలేక రాసినది, ఇంకెటువంటి భావనా లేదు.    
I wish all of them  good luck in their endeavors and hope they will get back to blogging again soon

చేదుపాట

నిన్న రాత్రి తెలిసిన బ్లాగులు కొన్ని తరచి చూస్తూ కృష్ణప్రియ గారు  సమీర్ పైన రాసిన పోస్టునొకటి చూడడం జరిగింది. నిజానికి ఆ పోస్టు ఎప్పుడొ నా ఫీడ్ బర్నర్ లో వచ్చింది కాని టైటిల్‌లో ‘కథ’ అనివుండే సరికి నిజంగా కథ అయివుండవొచ్చని ఇన్ని రోజులు చదవలేదు. కాని నిన్న ఆ పోస్టును చదివిన దగ్గరినుండి నాలో ఎదో దుఃఖం లాంటిది ఏర్పడింది. ఆ సమీర్ ఎవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు అతను గనక ఎదురైతే అతన్ని హత్తుకొని ‘Every thing is all right bro' అని అనాలనిపిస్తుంది. అతణ్ణి గురించి కృష్ణప్రియ గారు చెప్పిన ఓ పేరాను ఇక్కడ చూడండి
ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.
 అతని స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఆ కోపాన్ని అలాగే కొనసాగించే వారు. అతనో కాశ్మీరి పండిట్ కుటుంబానికి చెందినవాడు. పండిట్ల పట్ల కాశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలను తెలిసినవాడు. అతను పై సందర్బంలో కోప్పడడంలో తప్పులేదనిపించింది....అయినా చివరకు తేలికయ్యాడు. మనలో ఎంతమంది అలా చేయగలం ?
పోస్టు మొత్తం చదివాక గుండె బరువెక్కిపోయింది. అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నా...ఆ ఫీలింగ్‌ నుండి బయట పడడానికి పాటలు వినడం, వేరె బ్లాగులు ఓపెన్ చేయడం, నా బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు చూడడం మొదలుపెట్టా...ఉహూ అస్సలు వీలవలేదు. ఎదో తెలియని బాధ.  అదే సమయంలో అంతకు ముందురోజు చూసిన వజ్రాల తవ్వకాలలో నలిగిపోతున్న ఆఫ్ర్రీకా ప్రజలమీద తీసిన బ్లడ్ డైమండ్ సినిమా, నా తెలంగాణాలోంచి మిగతావారిని తరిమేయాలని కేసిఆర్ చేస్తున్న చర్యలు, అప్పుడేపుడొ చేతన్ భగత్ three mistakes of my life  పుస్తకంలో ఒక కాశ్మిరీ పండిట్ పాత్ర గుర్తుకొచ్చాయి. అప్పటిదాకా మనస్సులో ఉన్న బాధ ఎక్కువై కళ్లలో నీళ్లు తిరిగాయి.

అసలు మన దేశంలో ఉన్నవారి గురించి మనకేం తెలుసు. కాశ్మీర్‌లో ప్రజలు పడే బాధలు, ఈశాన్య భారతంలో సైనికుల అకృత్యాలు, విప్లవం పేరుతొ మావోయిస్టులు శాంతి పేరుతో పోలీసులు-ప్రభుత్వాలు చేస్తున్న దురాగతాలు , తిండిలేక నిర్లక్ష్యపు వరదలో కొట్టుకుపోతున్న జనం మనకేం తెలుసు (నేనేమి మినహాయింపు కాదు). బండేసుకు తిరగడానికి తక్కువ ధరలో పెట్రోలు, మాట్లాడటానికి చేతిలో సెల్లు, వీకెండ్స్ ఆనందంగా గడపడానికి పార్కులు పబ్బులు ఉన్నాయని సంబరపడుతున్నాం. రెండంకెల జీడిపి ని తలుచుకొని మురిసిపోతున్నాం. నాణేనికి మరోవైపు ఇంత చీకటి ఉన్నాకూడా. అన్నీ బాగుండాలి, నాకో idealistic ప్రపంచం కావాలని కాదు, కాని ఇన్నేళ్లుగా సమస్య అలాగే ఉన్నా స్తబ్థత ఎందుకు మనలో, ఎందుకు ఈ నిర్లక్ష్యం ?

సమీర్ గురించి చదివాక శ్రీశ్రీ గారి కవితలు కొన్ని గుర్తోచ్చాయి...
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం...
లేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా, చదువు వృధా
కవిత వృధా!,వృధా,వృధా!
మనమంతా బానిసలం
గానుగులం, పీనుగులం
ఆలోచన, ఇంగితం ఉన్న మనుషులుగా పుట్టాక తినడానికి ముప్పూటలా తిండి, చుట్టూ అభిమానించే జనం,చేయడానికి శ్రమ సంపాదించుకోలేమా...? ఎందుకీ ద్వేషాలు, పౌరుషాలు, మోసాలు...

I realize that the world is more sinner and cynic than i thought it to be and I do believe that it has much more love and humanity to rescue this place from the tyranny and brutality of human oppression . But will we ever let it show up ?

‘మద్య’వర్తి.....

వారం రోజుల క్రితం గుజరాత్‌లో కల్తీమద్యం తాగి సుమారు 130 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 1961 నుండి మద్యనిషేదం అమల్లొవుంది. కాబట్టి సహజంగానే అక్రమ మద్యవ్యాపారం అక్కడ బాగానే జరుగుతుంది. దినికి బానిసలైనవారు ఎలాగూమానలేరు కాబట్టి వ్యాపారులు అక్రమ మద్యం తయారుచేయడం మాత్రమేకాక దాన్ని కల్తీ కూడా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, అక్రమమద్య వ్యాపారుల స్వార్థం అన్నీ కలిసి ఇటీవలి మరణాలకి కారణం అయ్యాయి.
దీమిపైన చాలా దుమారమే చెలరేగింది. మద్యంపైన నిషేధం ఉన్నాక్కూడా అక్రమమద్యం ఎలా దొరుకుతుందనీ, అసలు గాంధీ రాష్ట్రంలో మద్యంతాగి ప్రజలు చనిపోవటం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నానాయాగి చేశాయి.


ఈ సిన్లో ఒకాయన చేసిన వ్యాఖ్య కొన్ని రోజులుగా నాకు చికాకు కలిగిస్తుంది ( తిక్కరేగ్గొడుతుంది అంటే బావుంటుంది ). సందట్లో సడేమియాలాగా ఆయనగారు తన వ్యాపారవ్యూహాలను ఇలాంటి సందర్భంలో దూర్చాలనుకోవడం మరీ రోతగా ఉంది. ఆ మనిషి ‘లిక్కర్‌కింగ్‌’గా పిలవబడే బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా.
సంఘటన జరిగిన కొన్ని రోజులకు కింగ్‌గారు విలేఖరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు ,"మన రాజకీయ hyopocrites ఇకనైనా మేల్కోవలసిన సందర్భమిది. ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకునేటట్లు శాసనకర్తలు తగిన మార్పుచేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మద్యనిషేదం విధిచడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీనిగురించి పునరాలోచించాలి ."

మొదటి రెండు వాక్యాలు పర్లేదు...మిగతా లైన్లతోనే తంటా వచ్చిపడింది. పోనీ పెద్దోళ్ళ మాటలను మీడియా వక్రీకరిస్తుంది అంటారుకదాని ఆ మాటలకుండగలిగే అర్థాలేంటో ఆలోచించాను. రెండు భావాలు చిరిగినాయి...అవి
మొదటిది:‘ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.....ప్రజలు స్వచ్ఛందంగా మానుంటే సమస్య లేదు’
రెండవది: ‘ ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టే ఇదంతా.....నిషేదం ఏత్తేస్తే వారికి (జనానికి) చట్టబద్దంగా నాణ్యమైన మద్యం దొరుకుతుంది......మరణాలుండవు. so, నిషేదం ఎత్తేయాలి’
మెడకాయ మీద తలకాయున్న ఎవరికైనా మాల్యా మొదటి అర్థంతో చెప్పాడంటే నమ్మరు.
ప్రభుత్వం కాకపోతే ఎవరు నిషేదం విధిస్తారు...? ‘సేన’లా, మత సంస్థలా......నో ఛాన్స్‌. ఒకవేళ విధించినాకాని ఈ కింగ్‌లోళ్లే కేసు వేసిమరీ అమ్మించుకుంటారు.

నిషేదం ఉన్నాకాని సచ్చినోళ్ళు తాగి సచ్చారంటే.....శానా బాగా ఎడిక్ట్‌ అయ్యుంటారు. గవర్నమెంటు మందమ్ముకునే లైసెన్సు ఇచ్చుంటే నా బీరురంగా....... ఐ.పీ.ఎల్‌ అవసరం లేకుండానె కుప్పలుగా డబ్బులొచ్చేవని బహుశా కింగ్‌ అనుకొని ఉంటాడు. పైకి చెప్పలేక భారి డైలాగులు పేల్చాడు.
దీన్నిగూర్చి ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలకు మన దేశంలో మద్యం అమ్మడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకంటే మా ఏరియాలో బస్టాపు దగ్గరే ఓ మందు దుకాణం ఉంది. దానికి కొంచెం దూరంలో జూనియర్ కాలేజి ఉంది (ప్రభుత్వం నిర్దేశించిన దూరానికి ఓ పది మీటర్ల అవతల). సాయంత్రం అయ్యిందంటే దుకాణం దగ్గర జాతర జరుగుతుంది. పీకలదాకా తాగినోళ్ళు, తాగాలనుకుంటున్నోళ్ళు అంతా అక్కడే. అదే టైముకి కాలేజి వదలడం. ఆ బస్టాపులో ఎలా wait చేస్తారో వాళ్లు. సరిహద్దుల్లో ఉండే జవాన్లుకు, అపర దేవదాసులకైతే ఫరవాలేదు- అమ్మినా వాళ్ళ పనేదో అది చేసుకుపోతారు. ఎటొచ్చీ మిగతా వాళ్లకే అవసరమా. మానదా ఎదో కొన్ని నెలలు తప్పితే సంవత్సరాంతం చలి దారుణంగా ఉండే దేశంకాదు ( మందు బాబులను ఎందుకు తాగుతున్నావురా అంటే మూడొంతుల మంది చెప్పే జవాబు ఇదే- ఒళ్ళు వేడి చేసుకోడానికి) ఐనా తాగుతారు.... తాగి రభస చేయడానికి, ఎక్కువైనోడు చచ్చి ఇలా ఈవిధంగా ‘మద్య’వర్తిలు నోరొపారేసుకోడానికి, నాయకులుతో వారి కుటుంబాలు పరామర్శించబడటానికి.

మేఘసందేశం....ఓ వానాకాలం ఆలస్యంగా!

ఇది నా మేఘసందేశంకు కొనసాగింపు.....
వర్షాలు కురిసే ఉపాయాం చెప్పిన వారికి అగ్రహారాలు బహుమతిగా ఇస్తానన్న రాజుగారి ప్రకటనవిని ఓ పూజారి వచ్చాడు. తనకు అగ్రహారాలు ఏమి వద్దనీ ప్రజల బాధలుకు చలించిపోయి వచ్చానని చెప్పడు. సంతోషించిన రాజు వర్షాలు కురవాడినికి ఏం చేయలో చెప్పమన్నాడు. అందుకా పూజారి...
"రాజా...నా దగ్గర ఎటువంటీ ఉపాయమూలేదు. ఈ సమస్యకు పరిష్కారం మీవద్దనే ఉన్నది. మీకు దాన్నిచూపించడానికే నేను వచ్చాను"అని చెప్పాడు.
"ఏమిటీ, పరిష్కారం మావద్దనే ఉన్నదా..."రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోతూ అనుకున్నారు.
"అవును రాజా...రాజ్యంలో ధర్మం సరిగా ఉంటే ప్రకృతి తన ధర్మం పాటిస్తుందంటారు. మీ రాజ్యంలో అది గతితప్పినట్టుంది, అందుకే ఈ వైచిత్రి..."చెప్పాడు పూజారి.
"ఏమిటి మా పరిపాలనలో ధర్మం గతితప్పినదా......నీవు ఏం మాట్లాడుతున్నవో తెలుస్తుందా...." ఒకింత ఆగ్రహంగా అన్నాడు రాజు.
"అవును రాజన్‌....కావాలంటే ఈ విషయం ఆ మేఘుడితోనే చెప్పిస్తాను" ఏ మాత్రం భయంలేకుండా చెప్పాడు పూజారి.

"మేఘుడితోనా....ఎలా"
"మాగురువుగారు నాకు నేర్పిన విద్య అది రాజా....మీరు ఒప్పుకుంటే మేఘుడిని పిలిపిస్తాను. ఆతనే చెప్తాడు మీ రాజ్యంలో ఎందుకు వర్షించడంలేదో" నివేదించాడు పూజారి.
"సరే....అలాగేకానిమ్ము. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో.నీవు చెప్పిన విషయం ఋజువు చేయలేకపోయవో నీకు తగిన దండన విధించబడుతుంది" హెచ్చరిస్తూ ఒప్పుకున్నాడు రాజు.
"అలాగే రాజన్‌. రేపే మేఘుడిని పిలిపిస్తాను..."

అన్న ప్రకారం పూజారి తరువాతి రోజు ఏదో తంతు జరిపించాడు. అది అవగానే ఏదో ఆకాశవాణి వినిపించింది.
"రాజా చెప్పండి నానుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో...."
"ఎవరు....ఎవరిదా గొంతుక....ఎవరూ కనిపించరే..."
"పిలిచిమరీ ఎవరునువ్వూ అంటావేమిటయ్యా.....నేను మేఘుడిని. ఐనా పూజరి నాతో మాట్లాడిస్తానన్నాడుగాని చూపిస్తాననలేదుగా.....సందేహాలుమాని ఎందుకు పిలిచావో చెప్పు. అవతల నాకు బోల్డు పనులున్నాయి..."చెప్పాడు మేఘుడు.
"ఓ మేఘుడా....మా రాజ్యంలో నీవు వర్షించుటలేదు....అందుకుగల కారణమేమిటి" దిక్కులు చూస్తూ అడిగాడు రాజు.
"మీ రాజ్యం....పక్కవాడి రాజ్యం అని మాకు భేదాలు ఉండవు రాజన్‌....ఈమారు నేను చాలా రాజ్యాలలో వర్షించలేదు.."
"అదే ఎందుకని..."
"దారి దోపిడికి గురయ్యాను కనుక.." చెప్పింది ఆకాశవాణి.
"దారి దోపిడినా......? అవగతముగాకున్నది...విపులంగా చెప్పెదవా" అన్నాడు రాజు, పూజారి చెప్పింది అబద్దమని అనుకుంటూ....
అందుకేగా వచ్చింది. చెప్తావిను అని మొదలు పెట్టింది మేఘం.

"వర్షాకాలం మొదలవగానే అరేబియా సముద్రం నుండి నీళ్ళు తోడుకొని బాగా అలంకరించుకొని వర్షించడానికి బయలుదేరాను. ఓ మోస్తారు దూరం ప్రయాణించగానే దిగాలుగా కొందరు తారసపడ్డారు. దగ్గరకువెళ్ళి చూసాను. వాళ్ళు నేనెరిగినవాళ్లే. ఒకప్పుడు నాతోపాటే ‘గాల్లో’ తేలేవారు. అదిచూసి నేను వారు ఏ శాస్త్రజ్ఞులో, మానవరూపంలోవున్న గంధర్వులో అనుకునేవాడిని . తరువాత తెలిసింది వారిని ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు’ అంటారని.
దిగాలుగా ఉన్నారు సంగతేంటో కనుకుందామని వేళ్ళా. అదేదో మాంద్యమట, దాని దెబ్బకు కొందరికి ఉద్యోగాలు ఊడినాయి, ఊడనివాడికి జీతాలు ఊడినాయి. ఆ వాతకి దిమ్మతిరిగి ఏడవటానికి ఒంట్లో నీళ్ళుకూడా లేవంట. నాతోపాటు కొన్నాళ్ళు ఉన్నారుగా, నా బలహీనతతెలిసి నేను మోసుకొస్తున్న నీళ్లు లాక్కున్నారు.మనసారా ఏడవటానికి... తెలిసినవాళ్లకే ఇచ్చానుకదా అని సరిపెట్టుకున్నాను.
అటునుంచి బయల్దేరి మీ నేలలో వచ్చానోలేదో.....అబ్బో ఏడుపులు, ఆర్తనాదాలు, కేకలు......మిగిలిన కాసిన్ని నీళ్లుకూడా సమర్పించుకోవాల్సి వచ్చింది..."

"ఏడుపులు, ఆర్తనాదాలా....?"

"అవును.....ఏడుపులే...పెట్రోల్‌ రేట్లు పెరిగి వాహనదారులు ఏడుస్తున్నారు.కాలుష్యం పెరిగి పాదచారులు ఏడుస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు ఏడుస్తున్నాడు. స్కూలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బండెడు పుస్తకాలు మోయలేక పిల్లలు ఏడుస్తున్నారు. పేరుగొప్ప కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లేక విద్యార్థులు ఏడుస్తున్నారు.
ఎరువులు, గిట్టుబాటు ధరలేక రైతు ఏడుస్తున్నాడు. సీట్లరాక, వచ్చినా పదవిరాక నాయకులు ఏడుస్తున్నారు. నాయకులు చెప్పింది చెయ్యలేక అధికారులేడుస్తున్నారు. వీళ్లందరు కన్నిరు కార్చలేక ఏడుస్తున్నారు...బాధ బయటకి కక్కడానికి దారిచూపు దేవుడాఅంటే జాలిపడి తలాకొంత ఇచ్చాను.

భౌతికదాడులు, యాసిడ్‌దాడులు భరించలేక ఆడవాళ్లు లోలోపల ఏడుస్తున్నారు.వాళ్ళను చూసాక అడగకపోయినా నేనె నీళ్ళిచ్చెశాను. అయినా మీకు అదేం పోయెకాలమయ్యా..., ప్రేమించలేదనీ ఇష్టపడలేదనీ హింసిస్తున్నారే.....హవ్వ. ఇంత జరిగినా, ఇంకా జరుగుతున్నా ఏం చేయలేని మిమ్మల్ని చూస్తుంటే అసహ్యమేస్తుంది నాకు. అవకాశంవుంటే వాళ్ళమీది పిడుగైపడిపోదును.....కాని ఏం చేయను అందరికి పంచేసెసరికి బలం పోయింది.
నల్లగా నిగనిగలాడిపోతూ బయల్దేరిన నేను గాలి నింపుకున్న బుడగలాగా, జబ్బుపడ్డవాడిలాగా తెల్లగా పాలిపోయాను.
ఇది చాలదన్నట్టు మాంద్యం సమయంలో వనరులని నిరుపయోగం చెసానని మా పైఅధికారులు నా ఉద్యోగం ఊడపీకారు.....ఇప్పుడు నేను ఏడుస్తున్నాను....నీరులేక ఏడుస్తున్నాను" గోడు వెళ్ళబోసుకున్నాడు మేఘుడు.

"మరి మా వర్షాల సంగతి....." సందేహం వెలిబుచ్చాడు రాజు.
"ఉండవయ్యా.....నా ఉద్యోగంపోయి నేనెడుస్తుంటే నువ్వొకడివి. చెప్పానుగా నీళ్లు లేవని. మా జూనియర్లు కొందరు బయల్దేరారు...వాళ్లను ఏవరూదోచుకోకపోతే అప్పుడు చూద్దాం. ఈలోగా బంగాళాఖాతంలో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట. అక్కడ ప్రయత్నించిచూస్తా.దిరికితే వచ్చి వర్షిస్తా" చెప్పింది ఆకాశవాణి.
"మరి అప్పటిదాకా ఏం చేయమంటావ్‌. రాజుగా ప్రజలకు సమాధానంచెప్పాలిగా" అడిగాడు రాజు.
"ఆ...కప్పలు పడుతూకూర్చో. నువ్వు చేయగలిగింది అదొక్కటేగా..."
" !@#$%*&.." ఈసారి రాజుగారి మొహం తెల్లబోయింది.
************************************************

ఇప్పటికే ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయట......సంతోషం.
ఈ కథతో టాపాని ఆలస్యంగా మొదలుపెట్టాను...మొదటి టాపా పోస్టు చేసేసరికి వర్షాలు మొదలయ్యాయి. విడగొట్టాను కాబట్టి ఈ పోస్టు రాయల్సొచ్చింది. దీనివల్ల ఓ వాక్యం నేర్చుకున్నా.... "నేను అచ్చేయల్సిన పోస్టు ఓ వానాకాలం లేటు" అని
( చిన్నప్పుడు తెలుగు పాఠం ‘ఆశ-నిరాశ’లో ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడు ఓ జీవితకాలం లేటు’ అని ఉంటుంది. ఈ పాఠం రచయత పేరు గుర్తురావడంలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మేఘసందేశం

అనగాఅనగా అనే ఒకవూర్లొ ఫలానా అనే రాజు ఉండేవాడు. ఆయనకి మరియు, మొదలగు అనే ఇద్దరు పుత్రరత్నాలు. ఓ రోజు ఫలానా రాజుగారి పుత్రులు దేశాటన ముగించుకొనివస్తూ తమతోపాటూ రెండు కప్పలను తీసుకొచ్చారు. ఇవేమిటని ప్రశ్నించిన రాజుగారితో తమకు ఓ సన్నాసి (తెలుగు సినిమా సన్నాసి కాదులేండి.....) కానుకగా ఇచ్చాడనీ, ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు విరజిల్లుతాయనీ చెప్పాడని చెప్పారు. ఇంకా ఇవి దివ్యమండూకములనీ వీటిని మంచినీటి బురదలోనో, కొలనులోనో పెంచవలసిందిగా ఉపదేశించారనిన్ని సెలవిచ్చారు.
దివ్యమండూకాలని, సన్నాసి ప్రసాదమని తెలుసుకున్నరాజుగారు వాటి సంరక్షనా బాధ్యతలను ఓ సేవకుడికి అప్పగించాడు. సేవకుడు వాటిసేవలో తరించిపోతున్నాడు.....

వేరే ఒక రోజు విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు ఏదో శబ్దాలకు నిద్రలేచారు.
బెక......బెక.....బెక.....బెకమని గదిలో అటూ-ఇటూ గెంతూతూ పుత్రరత్నాలు తెచ్చిన కప్పలు కనిపించాయి. కొలనులో ఉండాల్సిన కప్పలు ఇలా గదిలోపలికి ఎందుకువచ్చాయా అనుకుంటూ "కప్పలారా....కప్పలారా ఎందుకు కొలనులోంచి బయటకి వచ్చారు" అని అడిగాడు.
" హే ఫలానా రాజన్‌ ఫలానా రాజన్‌, నీకు తెలుసునుకాదా మేము దివ్యమండూకములని......మేము మంచినీటిలోనే నివసించెందమనీ. కానీ మా సంరక్షకుడు గతకొంతకాలంగా సరిగా చూసుకొనుటలేదు....మంచి నీరు అందించుటలేదు.....బెక.........బెక" అని వాపోయాయి. ఇది విన్న రాజుగారు వేంటనే ఆ సేవకుడిని పిలిపించి
"సేవకా......సెవకా.......నీకు ఈ దివ్యమండూకములను సరిగా చూసుకోవలెనని ఆజ్ఞాపించినాము కదా.....మరి నీవు వీటికి మంచినీరు ఎందుకు అందించుటలేదు" అను అడిగాడు.
"రాజా రాజా.....నా విధినిర్వాహణలో ఎలాంటి దోషమూలేదు. నేను వీటికి మన ఆస్థాన జలగుత్తేదారు సరఫరా చేసేనీటినే వాడుతున్నాను. గతకొంతకాలంగా అతను ఇచ్చేనీటిలో తేడాకనపడుతున్నది. దానివలనే ఈ సమస్యనుకుంటా ప్రభూ"అన్నాడు.
"అయితే వెంటనే ఆతణ్ణి పిలిపించండి".
"చిత్తం ప్రభూ" అని గుత్తేదారుని తీసుకువచ్చాడు.

"గుత్తేదారా గుత్తేదారా.......ఎందుకు నీవు మంచినీరు సరఫరా చేయుటలేదు" అని రాజు నిలదీశాడు.
"రాజా రాజా.....ఇందులో నా దోషము ఇసుమంతైనైనూలేదు. రాజ్యంలో వర్షాలు కురవడంలేదు. అందుకని నేను వేరే రాజ్యంనుండి నీటిని కొని మీకు పంపిస్తున్నాను. కొంతకాలంగా మీకు భోలక్‌పూర్‌ అను రాజ్యం నుండి తెచ్చిన నీటిని సరఫరా చేస్తున్నాను.....అక్కడి ప్రజలు అవే త్రాగుతారట. పైగా ఆ నీరు అక్కడి జలమండలి వారు ఎన్నో వ్యయప్రయాసలోర్చి సరఫరా చేస్తారట. ప్రజలు తాగి జీవించగాలేంది కప్పలు జీవించలేవాని ఆ నీటినే ఇచ్చాను ప్రభూ" సెలవిచ్చాడు గుత్తేదారు.
" ఊమ్... అనవసర విషయాల ప్రస్తావన ఏల. రాజ్యంలో వర్షాలు కురవడంలేదా....ఈ సంగతి మాకుతెలియనేలేదే. ఏమీవిపత్కర పరిస్థితి. ఏమి దీనికి పరిష్కారము.."మధనపడిపోతూ మంత్రిగారిని పిలిపించాడు.

"మంత్రీ మంత్రీ.....మన రాజ్యంలో సకాలంలో వర్షాలు కురవడంలేదట. ఈ విషయం ప్రజలు చెబితే తెలిసినది. ఎందుకు నాకు తెలియపరచలేదు" అన్నాడు మంత్రితో.
"రాజా రాజా......నాకునూ ఇప్పుడె తెలిసినది ఆ సంగతి. వేరే వ్యాపకాలలో ఉన్నందున సరైన సమాచారం అందలేదు. ఏమైననూ ఇప్పుడున్న సమస్య ఝటిలమైనది. దీనికి ఒకే ఉపాయమున్నది"
"ఏమది..."
"పొరుగు రాజ్యాలలో మేఘమధనమని ఓ ప్రక్రియను అవలంభిస్తున్నారు. వాటివల్ల ప్రయోజనమొనగూరవచ్చు" తరుణోపాయం వివరించాడు మంత్రి.
అట్లయినచో, వెంటనే మేఘమధనం జరిపించండనీ రాజుగారు ఆజ్ఞాపించి తన విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయాడు.
కప్పలు వాటికి వచ్చిన లాంగ్‌జంప్‌ ఆటలో ఆరితేరి వాటి దారిలో వచ్చినవాటిని బెక......బెక....బెకమనిపిస్తున్నాయి

రాజాజ్ఞ ప్రకారం మంత్రి మేఘమధనం జరిపించాడు. ఎంత మధించినా ఫలితం శూన్యం. వానలు ఇల్లె. రాజుగారు విషయం తెలుసుకొని విచారపడ్డాడు. గమనించిన మంత్రి రాజుతో ఇది దైవసంబంధ విషమైవుండవచ్చుననీ ఆస్థాన పురోహితుడిని పిలిపించమని నివేదించాడు. అలాగే కానిమ్మన్నాడు రాజు. మరుసటిరోజు సభకి రాజపురోహితుడు వచ్చాడు.
"పురోహిత పురోహిత.......వర్షాలు ఎందుకు పడటంలేదు. నీకేమైన ఎరుకనా. పరిష్కారమేమైనా ఉన్నాదా..." అని పురోహితుడిని అడిగాడు.
"రాజా రాజా......."పురోహితుడు ఏదో చెప్పబోతూ కప్పల శబ్దం విని ఆగాడు.
బెక......బెక.....బెక.....బెక....
"రాజా...రాజా..."
బెక....బెక.....బెక...బెక.....
పురోహితుడికి విసుగొచ్చింది. అది గ్రహించిన రాజు వాటిని పట్టించుకోకుండా కానిమ్మన్నాడు.
"రాజా....రాజా..... మీరు కొన్ని సంవత్సరాలుగా యజ్ఞ-యాగాదులేవియూ జరిపించలేదు. అందువలనే ఈ వైపరిత్యము సంభవించినదని నా అభిప్రాయము. ఈ సమస్య తీరవలెనన్న వేయిమంది విప్రోత్తములచే వరుణయాగం జరిపించవలె"నని రాజుగారికి విన్నవించాడు పురోహితుడు.
బెక....బెక....బెక....బెక......
"యజ్ఞము చేసిన వర్షము వచ్చునా....."రాజుగారు సందేహం వెలిబుచ్చాడు.
"ముందు పొగొత్తది......"వెనకనుండి పురోహితులవారి శిష్యగణం నుండి వినిపించింది.
రాజుకి ఒళ్ళుమండి " అసంధర్బ ప్రేలాపనలు కట్టిపేట్టి ముందు ఆ యాగం సంగతి చూడండి. ఈ కప్పల గోల భరింపనలవిగాకున్నది. పైగా ఇవి అన్ని కప్పలవలే 'బెక బెక' మనక 'బెక' అనిమాత్రమే అరుస్తున్నవి....కటకటా..."

పురోహితుడు చెప్పిన ప్రకారం యాగం చేయించాడు రాజు........ఇప్పుడు కూడా ఫలితం సున్నా. కప్పలు మాత్రం ఆ పొగకి రెచ్చిపోయి మరింత బెక....బెక పెడుతున్నాయి.
సిరిసంపదల సంగతి దేవుడెరుగు ముందు వర్షాలు పడి ఈ కప్పగెంతులు ఆగితే బావుణ్ణు అనుకొని వర్షం కురిసేలా చేసిన వారికి పాతిక అగ్రహారాలు బహుమతిగా ప్రకటించాడు.

(ఇంకా బెక....బెక ఉంది)

ShareThis