కోసలాధీశులు

                          **శ్రీరామ**                               

                       వెండి కవచాలు ధరించిన సైనికులు ముందుండి దారి నడువగా అరుణవర్ణ పతాకం పూన్చిన రథమెక్కి లోకాలను మేల్కొలిపేందుకు బయలుదేరాడు ఆదిత్యుడు. కార్తీకమాసపు మేలిముసుగు వేసుకొని మెల్లగా కదులుతున్న సరయూనది పై సూర్యుడి స్పర్శ తగిలి, గాలివీచి జాబిల్లిని వీడిన నల్లమబ్బులగా, తళుకుళీనుతున్న సరయూ సొగసుని తెలుపుతూ మంచుతెర తొలగిపోయింది. చెట్టు తొర్రలో హాయిగా ముడుచుకొని పడుకున్న తేనె పిట్టలు, జిట్టలు తొలి కిరణాలు పడగానే బద్దకంగా వొళ్లు విరుచుకొని లేచి వెంటనే హుషారుగా నింగికెగిసాయి. గింగిర్లు కొడుతూ, మెలికలు తిరుగుతూ కొమ్మకొమ్మను పలకరిస్తూ బ్రహ్మదత్తమైన గంధర్వగళాన్ని విప్పి రాగాలాపన చేయడం మొదలుపెట్టాయి. ఈ క్షణానికన్నా గొప్ప ముహూర్తమేది లేదన్నట్టు చెట్లూ పుట్టలే తమ శ్రోతలన్నట్టు పరవశించి పాడుతుంటాయవి.  కొమ్మల చాటున చేరి సరసమాడుకునే గువ్వపిట్టలను సరదాగా ఆటపట్టిస్తాయి, మధ్యాహ్నవేళ చెట్టు నీడలో కూర్చొని పిల్లనగ్రోవి వాయిస్తున్న గోపబాలుడికి వాద్య సహకారమందిస్తాయి.వాటికి సన్మానాలు, ప్రశంసలతో పట్టింపులేదు. ఈ పిట్టలను గురించి ఒక కథ చెప్పుకుంటారు. పూర్వం కొందరు మునులు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశారట. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నిరంతర తపస్సాధనలో పడి తామెందుకు తపస్సు మొదలుపెట్టారో మర్చిపోయారట. సృష్టికర్త ఎదురగా ఉన్నాడని గ్రహించి ఒకరివంక ఒకరు చూసుకొని ముక్త కంఠంతో "విరించీ, ఎన్ని జన్మలవరకైనా మానవుడు మా పలుకులు వినగానే తన కష్టాలు మరచిపోవాలి, అతని మనసు తేలికపడి ఉల్లాసం చెందాలి. అంతటి వాక్శక్తినీయి తండ్రి" అని అడిగారట. నిస్వార్దమైన వారి కోరికను మన్నించిన హంసవాహనుడు వారిని సృష్టి పర్యంతమూ ఈ పక్షులుగా పుట్టిస్తూ వారికి చిరకాల యశస్సును ప్రసాదించాడట.

ఆ పక్షులు నదీతీరాన ఒక చెట్టు కొమ్మపై కూర్చొని నగరానికి వస్తున్న బాటసారులకు సుస్వరాల స్వాగతం పలుకుతుంటే శోభాయమానమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆగిపోయారు. కరిగిపోతున్న పొగమంచులో పర్వతపాదాల్లో దట్టమైన దేవదారు వృక్షాలు, సరయూ ప్రవాహం వల్ల నునుపుదేలిన పెద్దరాళ్లు అంచున ముత్యాలు పొదిగిన పచ్చల హారాన్ని తలపిస్తున్నాయి. నయన మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తున్నా అంతకంటే మధురమనోహరమైన సీతారామచంద్రుల దర్శనం కోసం అయోధ్య వైపు సాగారు. భరధ్వాజ మహర్షి వరం వల్ల అయోధ్యకు వెళ్లే దారులన్నీ కాలంతో సంబంధం లేకుండా వసంత శోభతో కళకళలాడుతున్నాయి. ఋతువుతో నిమిత్తం లేకుండా ప్రతి చెట్టూ ఫలపుష్పాలను మోస్తూ పెళ్ళి కూతురిని తలపిస్తుంది. వేళకాని వేళ  మామిడి చెట్టు పూత వేయడమేంటని కొత్తగా వచ్చిన తుమ్మెదలు 'ఇవి మాయా వృక్షాలు కదా కదా' అని సంశయంతో అంటీముట్టనట్లుగా పువ్వులను సమీపిస్తుంటే  అంతకంటే ముందు వచ్చిన తుమ్మెదలు తమలాగే వీళ్ళూ తికమక పడటం చూసి నవ్వుకున్నాయి.

                                అయోధ్యలో ప్రవేశించిన బాటసారులంతా ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుండి సుఖసౌఖ్యాలను వదిలిపెట్టి ఆశ్రమజీవితం స్వీకరించి నిరాడంబరంగా ధార్మిక కర్మలు చేయడానికే కాలం గడిపిన అయోధ్యకు ఇప్పటి అయోధ్యకూ ఎంత అంతరం! ఇప్పటి అయోధ్య పచ్చని పందిళ్లతో, గుమ్మాలకు మామిడాకులు బంతిపూల తోరణాలతో, నట్టింట్లో పట్టుపరికిణిల లేడిపిల్లల కాలిమువ్వలు ఘల్లు ఘల్లుమంటుంటే ప్రతి వాకిలిలోనూ పండుగ సంబరం నెలకొని ఉంది. మొన్నటిదాకా భిక్షగా జొన్న అన్నం స్వీకరించిన సాధువుకు ఇవాళ నేతి ఘుమఘుమలతో పంచభక్ష్య పరమాన్నం దొరుకుతుంది. జంతికలు, లడ్డూలు ముటగట్టుకొని పిల్లవాడొకడు చెంగున వీధిలోకి వచ్చాడు. తోటి పిల్లలు తమ ఇండ్లనుంచి తెచ్చిన కజ్జికాయలూ, అప్పాలు, మురుకులు అన్నీ ఒకదగ్గర పోగేసి పంచుకుంటున్నారు. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్న బృందానికి గృహస్థు ఒకతను మజ్జిగ ఇస్తూ వారి వివరం అడిగాడు. గోదావరితీరం వారట, కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాక శ్రీరాముడు అయోధ్య చేరుకున్నాడని తెల్సుకొని ఆయనని కన్నులార చూద్దామని వచ్చరట. ఎంతో సంతోషించి ఇల్లాలికి తనూ వాళ్లతోపాటే వెళ్లివస్తానని చెప్పి బయలుదేరాడు...అతను క్రితం సాయంత్రమే అంతఃపురంలో రాముడిని చూసివచ్చాడు!
'రామన్న రాముడూ కోదండరాముడూ శ్రీరామచంద్రునీ చూద్దామురా, అహ సీతమ్మతల్లినీ చూద్దామురా' అంటూ తప్పెట్లు కొడుతూ వెళుతున్న బృందాన్ని చూసి ఆ పిల్లలు 'ఒరే, రాములోరిని చూడ్డానికి వెళ్తున్నారట్రా..పదండి మనమూ పోదా'మని వాళ్లతో అంతఃపురం వైపు కదిలారు.

                                                              **************
"రక్ష. రక్ష మాతా రక్ష రక్ష"
ఉద్యానంలో నడుస్తున్న కౌసల్య, సుమిత్రా, కైకేయిలకు ఈ మాటలు వినిపించి వెనక్కు తిరిగి చూసారు. మిత్రవర్ధనుడు రొప్పుతూ వస్తున్నాడు. దశరధనందనులకు బాల్య సఖుడు, సుమంత్రుడి సహాయకుడు అతడు. రామపట్టాభిషేకం చూద్దామని వచ్చిన వానర, విభీషణాదులకు అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకోవాల్సిందిగా నియమించారు. పట్టాభిషేకం జగిరిన తరువాత అందరూ వెళ్ళిపోగా కొన్నిరోజుల తరువాత హనుమ మాత్రం కోసలలో మరికొంతకాలం రాముడి సన్నిధిలో ఉంటానని వచ్చాడు. అతడికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్నాడిపుడు. పరిగెత్తూకుంటూ వచ్చి "అమ్మా, ఈ సంకటం నుండి మీరే కాపాడాలి" అంటూ కాళ్ల మీద పడ్డాడు. "సంకటమా? ఏమిటది?" అని అడుగుతుండగానే "మిత్రవర్ధనా.. మిత్రవర్ధనా.. ఎక్కడున్నావయ్యా" అంటూ హనుమ వెతుక్కుంటూ రావడం గమనించి కౌసల్యాదేవి వెనక దాక్కొని "అదిగోనమ్మా సంకటం" అంటూ హనుమవైపు చూపించాడు. రాజమాతలకు వందనాలు సమర్పించి 'నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూచున్నావా పద పద‌‌' అంటూ మిత్రవర్దనుడిని పిలిచాడు. ఏం జరిగింది అని అడిగిన సుమిత్రతో మిత్రవర్దనుడు  "ఏమి చెప్పమంటారు తల్లీ, ఏ ముహూర్తంలో నన్ను ఈ మహానుభావుడికి అప్పగించారోగాని నా ప్రాణం మీదకు వచ్చిందది. అయోధ్య తిప్పి చూపించమంటే సరస్సులూ, భవంతులూ చూపించమన్నాడనుకున్నా. కాదు కాదు..రాముడు తిరిగిన ఉద్యానాలు ఊగిన ఉయ్యాల ఎక్కిన చెట్లు చూపించాలట, ఆడిన ఆటలు ఏమిటో, బాల్య సఖులతో పాడుకున్న పాటలేమిటో కావాలట. మధ్యాహ్నమైంది కదాని భోజనం చేసి కాస్త కునుకు తీస్తే ఉపద్రవమేదో వచ్చినట్టు లేపి 'ఇదిగో.. శ్రీరాముడు చిన్నప్పుడు గోరుముద్దలు తినేటపుడెపుడైనా మారం చేసేవాడా? అల్లరి చేస్తే ఎవరు బుజ్జగించేవారు? ఏమని బుజ్జగించేవారు? ఎవరు తినిపించేవారూ'అని అడుగుతాడు. మాటకు ముందొక 'రాముడు‌‌' మాటకు వెనక ఒక 'రాముడు‌‌'. కూచర్చుంటే రాముడు, నిల్చుంటే రాముడు. అలుపన్నది లేకుండా అది చూపించు, ఇది చూపించు, అప్పుడేమయింది అంటాడు. ఇప్పుడు కూడా అదే తంతు, చిన్నప్పుడు చంద్రుని చూపించమని మారం చేస్తే మీరు అద్దంలో చూపించారని చెప్పాను ఎగిరి గంతేసి 'భలే భలే...రామచంద్రుడికి చంద్రుడిష్టమా, అయితే నా భుజాలనెక్కు క్షణంలో ఆ చంద్రుడిని పట్టుకొచ్చేద్దాం' అంటాడు‌‌" అని దీనంగా చెప్తుంటే హనమ వినయంగా "తప్పించుకునేందుకు ఇతగాడు ఏవేవో చెప్తున్నాడు మాతా...అవి కాదుగాని రాముడికి చంద్రుడంటే ఇంకా ఇష్టమేనా? ఇష్టమైతే రివ్వున అలా ఆకాశానికి ఎగిరి ఆ నెలరాజును హారంలో పెట్టి నా రాజుకు కానుకగా ఇస్తా‌‌"నని దర్పంగా చెప్పాడు. "నువ్వు అంత క్షష్టపడి తీసుకొచ్చినా చక్కని చుక్కలాంటి మా కోడలి ముందు ఆ చందమామ తేలిపోతాడు హనుమా" చురకేసినట్టూగా అన్నది కైక. "ఇతగాడికి సరైన సమాధానమే ఇచ్చారమ్మా" మిత్రవర్ధనుడు అంటుండగానే "అవును తల్లీ ఆ క్షీరరాజ తనయ నా స్వామి చెంతనుండగా నా బోటివాడు ఇచ్చుకునేది ఏముంటుంది. ఇక మీరు సెలవిప్పిస్తే ఈ మిత్రవర్దనుడితో కాస్త పనుంది‌‌" అంటూ అతడి రెక్క పట్టుకుని  'రామచంద్రప్రభో..' అని ఆతను వేడుకోలుగా అంటుంటే "ఆఁ ఆ రామయ్య గురించే... ఆయనకి ఇష్టమైన ఫలమేమిటి? మీరందరూ కలిసి ఎక్కడ ఆడుకునేవారో చూపిద్దువుగాని" అంటూ మోసుకొనిపోయాడు. ఏమి ఈ హనుమ అని మిగతాముగ్గురూ ముక్కున వేలేసుకున్నారు

                                                              **************
సభ ఇంకాసేపట్లో మొదలవుతుంది అనగా సిద్దార్ధుడు, మరికొందరు మంత్రులతో కలిసి భరతుడు తన రథమెక్కి వసిష్ఠాశ్రమానికి పయనమయ్యాడు. రాజ్యపాలన మొదలుపెట్టిన తరువాత మొదటి కార్తీకమాసం అవడంతో నగరంలో ఒక గొప్ప శివాలయ నిర్మాణం చేయ సంకల్పించాడు రాఘవుడు. అందుకు స్థల, ముహూర్త నిర్ణయం చేయడానికి కుల గురువు వసిష్ఠుని తీసుకొని రావలసిందిగా క్రితంరోజు తీర్మానించారు. ఆ పని పైనే భరతుడు తానే స్వయంగా వెళ్లి గురువుగారిని సకల మర్యాదలతో తీసుకొని వస్తానన్నాడు, ఆ మిషపై వెళ్లి గురువు దగ్గర తన మనసులోని సంఘర్షణను తెలియజేసి శాంత పడదామనుకున్నాడు. అన్నయ్య అరణ్యవాసం ముగించుకొనివచ్చి రాజ్యం స్వీకరించాడు, తాను యువరాజైనాడు, తన పరివారమూ, ప్రజలు  చాలా సంతోషంగా ఉన్నారు. అయినా అతడిలో ఏదో అలజడి. తెలియని దిగులేదో ఆవరించిందీ మధ్య.
                    అయోధ్య దాటుతుండగా కుండలు చేసే గంగు కనిపించాడు. 'అతడిని తానెరుగుదును. నగరంలో ఎవరింటిలో శుభకార్యం జరిగినా అందుకు కావాల్సిన మట్టిపాత్రలూ, కండలపై చక్కని రంగులు, చిత్రాలు వేసి ఇస్తుంటాడు. పధ్నాలుగు సంవత్సరాల ముందు మేనమామ ఇంటి దగ్గర ఉన్న తనను హుటాహూటిన బయలుదేరమని కబురొచ్చింది. అయోధ్య చేరుకోగానే ఇళ్లన్నీ పందిళ్లు వేసివున్నా ఎందుకనో కళావిహీనంగా ఉన్నాయి, తెగిపోయిన పూమాల పందిరిలో దిగులుగా ఏడుస్తూ కూర్చున్న గంగు ముఖం ఇంకా మానసంలో సజీవంగా ఉన్నది. ఇప్పుడతనికి ఐదేళ్ల కుమారుడు. నిన్న రాత్రి మారువేషంలో గుప్తచారులతో వెళ్ళి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుంటూ నగరంలో తిరుగుతుంటే గంగు ఇంటివైపు వెళ్ళినపుడు అతని ఇంటిచుట్టూ ఉన్న పిల్లలను పోగేసి అరుగుపై, తన ఒడిలో కొడుకును కూర్చోబెట్టుకొని, వాళ్లందరికి రామకథను చెబుతున్నాడ‌‌'ని మెదిలింది భరతుడికి. గంగు చేసిన అభివాదాన్ని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు కలిలాడు.

                        సరయూ తీరంలో ఎత్తైన సాల, దేవదారు, వివిధ ఓషధీ వృక్షాలూ పూల మొక్కల మధ్య కుటీరాలతో ఉదయపు ఎండలో వసిష్ఠుని ఆశ్రమం తులసికోటలో దీపంలాగా ప్రకాశిస్తుంది. నిత్యాగ్నిహోత్రం నుండి వచ్చే మూలికల ధూమంతో ఆ పరిసరాలలో అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొని ఉంది
భద్రం కర్ణేభిః శృణు యామదేవా  భద్రం పశ్యేమాక్షు భిర్యజత్రాః
స్థిరై రంగై స్తుష్టు వాగ్‌‌ం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయః

అంటూ రావిచెట్టు నీడలో మునిబాలురు కొందరు వేద పఠనం చేస్తున్నారు. వేరొక కుటీరం దగ్గర రాచబిడ్డలు గురువుల దగ్గర రాజనీతి శాస్త్రం అభ్యసిస్తున్నారు. గోశాలలో  అరుంధతీదేవితో కలిసి కొందరు పిల్లలు కామధేనువుకు, నందినీ ధేనువుకు సపర్యలు చేస్తుంటే మోరలెత్తి పిల్లలు ఇస్తున్న గ్రాసం తీసుకుంటున్నాయవి.

భరతుడుకి ఆశ్రమవాసులు సాదర స్వాగతం పలికారు. వసిష్ఠారుంధతిలకు ప్రణామం చేసి శివాలయ నిర్మాణ నిమిత్తం రాముడు తనను తోడ్కొని రమ్మన్నాడని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పడానికి వెనకాడుతున్న భరతుని చూసి 'ఏదో విషమై ఆందోళన చెందుతున్నావు. చెప్పడానికి సంశయిస్తున్నావు, ఏమిటది ?" అని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు వసిష్ఠుడు. చేతులు కట్టుకొని "సర్వజ్ఞులు మీకు తెలియనిది కాదు. తండ్రిగారి చేతుల మీదుగా రాజ్యం స్వీకరించాల్సిన అన్నయ్య నా తల్లి అడిగిన వరాల కారణంగా అడవులపాలు కావాల్సివచ్చింది, కాళ్ల పారాణి కుడా ఆరని వదినమ్మ రాక్షసుల చెరలో ఎన్నో కష్టాలు పడింది...సౌమిత్రికి ఇన్నేండ్లు సరియైన నిద్ర కరువైంది. భగవంతుడి కృప వల్ల అన్నయ్య తిరిగివచ్చి రాజ్యపాలన చేస్తున్నారు...ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు" అని తడబడుతున్న స్వరంతో, "ఇదంతా చూస్తుంటే అయోధ్య వాసులకూ, అన్నావదినలకు ఇన్నేళ్లు ఆనందం దూరమవడానికి నేనే కారణమన్న భావన తొలిచేస్తున్నది. ఒకవేళ అన్నగారు కూడా..." చెప్పడానికి మాటలు రాక నేలవైపు చూస్తూ మౌనం దాల్చాడు భరతుడు.

"సోదరుల కోసం తపంచిపోయే అన్న, అన్న కోసం సర్వం త్యజించడానికి వెనుకాడని తమ్ముళ్లు. ఎంతటి పుణ్యం చేసుకున్నదో ఇక్ష్వాకు వంశం ఇంతటి ఉదాత్తమైన గుణసంపన్నులను ఈ ఆర్యావర్తానికి అందించింది...మీలాంటి వారికి ఆచార్యుడిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ భరతుడితో వాత్సల్యంగా "అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని రాముడియందే న్యాసం చేసి దాన్ని పదునాలుగేండ్లు కంటికి రెప్పలా కాపాడి, సమయం రాగానే అన్నకు అప్పగించి రాజ్యభారాన్ని వదులుకున్నావుగాని...అది తీసుకొచ్చిన దిగులును ఇంకా మోస్తూనే ఉన్నావా! అది నీవంటి వాడికి శోభనివ్వదు,

అమ్మై రుద్రుని చేత దామసుల సంహారమ్ము గావించె, స
త్వమ్మౌ సీత బరిగ్రహింప నదె రౌద్రధ్వంస వైదగ్ధ్య కా
ర్యమ్మున్ జూపె, గుణాగుణద్వయ విదూరంబైన యా శక్తి ధ
ర్మమ్మున్ బూని గుణమ్ము జేగొనుట చిత్రంబౌనె రామానుజా!

                                                       
నాయనా నీకొక రహస్యం చెబుతాను, పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని వరం పొంది  ధర్మవిరోధులై ముల్లోకాలనూ పీడించారు. ఆ అసరులబారి నుండి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని ప్రార్ధించగా ముక్కంటి సమరానికి కదలగా శ్రీమహావిష్ణువు విల్లుగానూ, మేరు పర్వతము ధనస్సుగానూ, ఆదిశేషుడు వింటినారిగానూ మారి రాక్షసులను అంతమొందించారు. అసురసంహారం కోసం రౌద్రమూర్తి చేతిలో ఆయుధమై నిలిచిన ఆ విష్ణువే తదనంతరం సద్గుణశోభితయైన సీతను చేపట్టడానికి పూర్వరూపమైన అదే ఆయుధాన్ని పడగొట్టి తనలోని తమోగుణాన్ని జయించడానికి ప్రతీకగా చాటాడు. అంతటి పురుషోత్తమునిలో ధర్మాచరణకు అవసరమైనది తప్ప అన్య భావం చేరదు..అతనియందు ఎటువంటి దోషమూ కలుగనేరదు. నీ కారణంగా అరణ్యవాసం చేసాడనటానికిగాని, నువ్వు లేకపోతే అప్పుడే పట్టాభిషేకం జరిగి ఉండేదనడానికిగాని చెప్పడానికి వీలులేదు. రావణ సంహారం, లోక కళ్యాణం కోసం జరిగిన జగన్నాటకంలో నీవు నిమిత్తమాత్రుడివి. లంకాధీశుని నేలకూల్చి విభీషనుడిని రాజును చేసాక అతను ఎంత అడిగినా అక్కడ ఉండలేదు..నిన్ను చూడటానికి పరుగు పరుగున వచ్చాడు. అన్ని కష్టాలు అనుభవించి వచ్చినా ముందుగా నీ దీక్షను విరమింపజేసి తాను జటలు విప్పాడు. తన మనసులో మీ మీద వాత్సల్యం తప్ప అన్యభావన లేద"ని చెప్పాడు.
                
                          వసిష్ఠుని పలుకులతో భరతుని మనసులో ప్రశాంతత కలిగినట్లయింది. రామచంద్రుడు వస్తున్నాడని నందిగ్రామానికి వచ్చి మారుతి చెప్పిన రోజును గుర్తుచేసుకున్నాడు. విభీషణుడు చేస్తానన్న సత్కారాలనూ, మర్యాదలను సైతం కాదని తన కోసం ఏమాత్రం ఆలస్యం చేయక వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకున్న సంఘటన మదిలో మెదిలి  ఆనందం కదిలింది. సూర్యూడిని పట్టిన గ్రహణంలా ఆవరించిన దిగులు నీటి బుడగలా మాయమైంది.
ప్రసన్నమైన మనసుతో గురువుగారికి నమస్కరించి, ఆయననూ అరుంధతి దేవిని రథమెక్కించి తాను ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించాడు. ధరించిన పట్టుపీతాంబరాలు, కంఠాన్ని అలంకరించిన ముత్యాలహారాన్ని మించిన తేజస్సు మోముపై కదులుతుండగా అశ్వాన్ని అయోధ్య వైపుకు నడిపాడు.

1 వ్యాఖ్యలు.. :

..nagarjuna.. said...

జిట్ట: Generic name for some of Warbler, babbler birds... Prinia (Ashy Prinia) bird in this post

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis