ఫస్ట్ షో.....

జులై 19న ఖరగ్‌పూర్‌లో అడుగు పెట్టినప్పటినుండి ఈరోజుకి మూడువారాలు పూర్తి.
M.Tech కోర్సు oreintation ప్రోగ్రామ్‌ నుండి మొన్నటి lab session వరకూ అన్నీసమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉన్నాయి.

అసలే మొదటిసారిగా హాస్టల్‌లో ఉండాలి, పైగా వంగదేశంలో, ఎలా అని ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఖరగ్‌పూర్‌లో ఉన్నానా లేదా అని అనిపించింది. అంతగా ఉన్నారు ఇక్కడ తెలుగు తమ్ముళ్లు, అన్నయ్యలు (తెలుగుదేశం వారో, ప్రజారాజ్యం వారో కాదులె..). మామూలుగా ఐఐటీల్లో ఆంధ్రప్రదేశ్‌ వాళ్ళు ఎక్కువ ఉంటారు అని విన్నాను, కాని మరీ ఇంతగానా....10 మందిని కెలికితే (విద్యార్థి పరిభాషలో పలకరిస్తే అని అర్థం) సుమారుగా అయిదుగురు అంధ్రదేశంనుంచే. మిగతా అయిదుగురిలో కనీసం ఒక్కడు మా హైదరాబాద్ ACE Academy వాడే. మేము ఉండే MMM హాస్టల్లో 60% స్టుడెంట్సూ, హాల్‌ మేనేజరూ, మెస్సు మేనేజరూ తెలుగే.
ఇతర రాష్టాల విద్యార్థి సంఘాలు ఫ్రెషర్స్‌ పార్టీలు పెట్టేస్తున్నాయి, మనవాళ్ళు ఎందుకు పెట్టడంలేదని అడిగితే, " వాళ్ల సమావేశాలకి ఓ ఆడిటోరియం సరిపోతుందిరా, మనం పెట్టాలనుకుంటే ఓ స్టేడియం కావాలిరా, దానికోసమే ప్రయత్నిస్తూన్నా"మని రిప్లై వచ్చింది. campusలోనే అనుకోంటే ఖరగ్‌పూర్‌ టౌన్‌లో మరీనూ. వీధికో తెలుగు దుకాణం (చిన్నా చితకా ఏంకావు), తెలుగు సినిమా పోస్టర్లూ (ఇక్కడ Big Bazaarకి వెళ్తుంటే ‘ప్రజారాజ్యం’ పోస్టర్‌ కనిపించింది, దీ**ల్లి ఇంతమంది తెలూగోల్లున్నారా అనిపించిందపుడు), ఆంధ్ర స్కూళ్లు.....అబ్బో, ఎంతగానంటే దారికనుక్కొడానికి నేను హిందీలో అడిగితే జనాలు ఫేస్‌రీడింగ్ చేసేసి తెలుగులో జవాబిచ్చేస్తున్నారు.
ఇట్టాగే కొనసాగితే ఖరగ్‌పూర్లో బెంగాలీబాబులు మైనార్టీలో పడిపోతారేమో అనిపించీంది....ఇక్కడ పరిచయమైన మళయాలీ ఫ్రేండొకడు ఒక్కసారికూడా ఆంధ్రరాలేదు, కాని మన సంఖ్యాబలం చూసి మాట్లాడటానికి మెజార్టీ వాళ్లు మనోల్లే కాబట్టి తెలుగు నేర్చేసుకుంటున్నాడు ( అడ్డమైన తెలుగు సినిమాలు డౌన్‌లోడు చేసుకొని చూసి ఆ డైలగులన్ని వాగేస్తున్నాడు....యెదవ)

మన రేంజ్ ఇంతగా పెరిగిపోయింది కాబట్టి నేననేదేంటంటే భవిష్యత్తులో జాతీయ తెలుగు మాహాసభలు ఎవైనా పెడితే ఇక్కడా పెడితే బాగుంటుంది, మాలాటోళ్ళకి దూరాభారం తగ్గుతుంది. అంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టిలు ఇక్కడి తెలుగు వాళ్ళ కోసం ప్రతేక ప్యాకేజి ప్రకటించాలి, బోల్డు వోట్లు ఉన్నాయి మరి. రైల్వే వాళ్ళు బెంగాల్‌-విజయవాడ-హైదరాబాదు-గుంటూరు మీదుగా కొత్త రైళ్ళు వేయకుండా ఇన్నాళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఇకనైనా వేస్తే బాగుపడతారు.

వచ్చిన వారం పదిరోజుల వరకూ కోర్సు confirm చేసుకోడానికి సరిపోయింది, తరువాత రజిస్ట్రేషననీ, రూమ్‌ సర్దుకొడనికీ, ఉన్న తెలుగు మొహాలని గుర్తుపెట్టుకోడానికి ,అసాధ్యం అని తెలుసు కాని అయినంతలో అయినంత కవర్‌ చేద్దామని, కంప్యూటర్‌ని మనం అడిగినప్పుడు మనక్కావాల్సింనంతసేపు ఇచ్చేవాడికోసం వెతకడానికి సరిపోయింది.
ఇవాళ నా రూమ్మేట్‌ జాహెద్‌ గాడు ఏదో పనిమీద వేరేవూరు వెళ్ళాడు. వాడి laptop ఇక్కడే వదిలివెళ్ళాడు...ఇప్పటి వరకూ ఆర్కుట్‌, ఫేస్‌‍బుక్, యాహూల్లో పండగ చేసుకొని బ్లాగుని బరుకుతున్నాను ( తలగోక్కోవొద్దు, విద్యార్థి పరిభాషలో బరకడం అంటే రాయడం అని అర్థంలెండి). వాడు వస్తే నాకు మా రూమ్‌లో నాతోపాటే సావాసం చేస్తున్న కంప్యూటర్‌కూ బంధం తెగిపోతుంది. వీలైనంత తోందరగా నేను కూడా సిస్టం కొనేసి దాంతో పండగ చేసుకుంటా.
అప్పటి వరకూ కాగితాలపైన బరుక్కుంటా.......రికార్డులూ, అసైన్‌మెంట్లూ ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నా

తొందరలోనే మళ్ళి కలుస్తా.....అల్‌విదా, నమస్కార్‌, శుబోశి(ఇది బెంగాలీ తేలీని తెలుగు వాళ్ళకి. ఒకవేళ తెసినాకూడా కామ్‌గా ఫాలో ఐపోండి, దీని అర్దం నమస్కారం అని...)

శుభాకాంక్షలు..

స్నేహితులకు, బ్లాగ్మిత్రులకు,వీక్షకులకు స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు.

సొగసు చూడతరమా....రష్యాలో కనపడే సైబేరియన్‌ పులి ఇది. మన బెంగాల్‌ పులులు రాజసానికి పెట్టింది పేరైతే సైబేరియన్‌ పులులు చూడ్డానికి అందంగా వుంటాయి. చలి ప్రదేశాల్లొ నివాసం కాబట్టి చర్మం మీది వెంట్రుకలు దట్టంగా, ముదురు రంగులో ఉంటాయి. ముదురు గోధుమ రంగుపైన నల్లని చారలతో గ్లామరస్‌గా ఉంటాయి. ఫోటొ జూస్తే తెలుస్తలే..
అడవుల నరికివేత, మనుషుల వేట కారణంగా వీటి సంఖ్య ప్రమాదంలో పడిపోయింది.
ఫోటొ విషయానికి వస్తే ఈ pose లొ బంధించడానికి ఫొటొగ్రాఫర్‌ గంటల తరబడి దాని చుట్టుపక్కనే ఉండాల్సి వచ్చిందట. చాలా దగ్గరినుండి తీసాడంట...ఎలా ఉండగలిగాడో మరి.


పెపంచకంలో ఇంతకన్నా సుఖమైన పని ఏమైనా ఉంటుందా బాబయ్యా.
ఏ చేప పిల్ల దొరికిందని కలగంటుందో ఏంటొ...డిస్టర్బ్‌ చేయకండి

ద్రువపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సీళ్ళ చర్మం కోసం, వాటి కొవ్వు నుండి తీసే నూనెల కోసం ఒకప్పుడు వీటిని విచ్చలవిడిగా చంపేసేవారు.హిమాలయాలు, నేపాల్, చైనా ప్రాంతంలో కనపడే ఎర్ర పాండాలు ఇవి. Fire Fox అనికూడా అంటారు. నలుపు-తెలుపు పాండాల దగ్గరి పొలికల్తో ఉంటుంది. వాటిలాగే శాకాహార జీవి. అధికారిక లెక్కల ప్రకారం వీటి జనాభా సుమారు 2500.
అడవుల నిరికివేత కారణంగా వీటి మనుగడ ప్రమాదంలో పడింది.
కోరల్‌ రీవ్స్‌...భూమిపైన జలంతర్భాగంలో ఉండే స్వర్గం. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్కవరీలోనో, Nat Geoలోనో చూసేఉంటారు. వీటి చుట్టుపక్కల ఉండే జీవవైవిద్యం ఎక్కడా ఉండదు. సెంటీమీటరు సైజు చేపల నుండి పదడుగుల పొడవుండె షార్క్‌ చేపల వరకు అన్నీ కనిపిస్తాయి. భూవాతావరణంలోని ఉష్ణొగ్రతల మార్పులకు చాలా ప్రభావితమౌతాయి. సముద్రపు ఉప్పు శాతం పెరిగినా, సాధారణ ఉష్ణోగ్రత పెరిగినా ఇవి దెబ్బతింటాయి.ఉత్తర, దక్షిణ అమేరికాలలో ప్రముఖంగా కనిపించే కౌగార్‌ పెద్దపిల్లులో నాలూగో అతిపెద్దది ( పులి, సింహం, జాగ్వార్‌ ల తరువాత ). ఇప్పటికైతే వీటి మనుగడకొచ్చిన ముప్పేమీలేదని WWF చెబుతుంది. కానీ కొన్ని అమెరికా రాష్ట్రాలలో వీటిని వేటాడటం చట్టబద్దమేనట. ఆ రకంగా ప్రమాదంలో ఉంది.
తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వఁ బెన్న.....
( పదో తరగతిలో ‘ప్రవరుని స్వగతం’లో చదివిన పద్యం, వ్యాకరణ దోషాలేమైన ఉంటే మన్నించండి)

ఇంజనీరింజ్‌లో మేము మనాలీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటొ . రోతాంగ్‌ పాస్‌ వేళ్ళే సమయానికి మంచు ఏక్కువ కురుస్తుందని ఆ దారి మూసేసారు.....చివరికి సోలాంగ్‌ valleyకు వేళ్ళాం.దారిలో తీసిన క్లిక్కు ఇది. హైదరాబాదులో చిన్న గుట్టలే చూసిన నాకు అంతంత పెద్ద కొండలు చూసేసరికి ఎవరూ కొట్టకుండనే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకైంది. తెల్లటి మంచుకొండలపైన ఎండపడి వెలిగిపోతుంటే......చూడ్డానికి నాలుగు కళ్లు చాలలేదు ( నాకు కళ్ళజోడు ఉందిమరి).
పెరిగిపోతున్న భూవాతావరణం కారణంగా వీటిపైన ఉండే మంచు త్వరగా ( ఎండాకాలం ముందుగానే) కరగుతుందంట.
ఇలాగే కొనసాగితే మున్ముందు అక్కడ రాళ్లకొండలే ఉంటాయి కాబోలు.

టాపా రాస్తుంటే winampలో ‘ఓయ్!’ సినిమా పాట ప్లే అవుతుంది...,
"అనుకోలేదేనాడు  ఈ లోకం నాకోసం
అందంగా ముస్తాబైవుంటుందనీ...."
నాకోసం సరే అందంగానే ఉంది......కాని వచ్చే తరానికి.....?
వీటి సొగసు రానున్న తరాలు చూడశక్యమా......

‘మద్య’వర్తి.....

వారం రోజుల క్రితం గుజరాత్‌లో కల్తీమద్యం తాగి సుమారు 130 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 1961 నుండి మద్యనిషేదం అమల్లొవుంది. కాబట్టి సహజంగానే అక్రమ మద్యవ్యాపారం అక్కడ బాగానే జరుగుతుంది. దినికి బానిసలైనవారు ఎలాగూమానలేరు కాబట్టి వ్యాపారులు అక్రమ మద్యం తయారుచేయడం మాత్రమేకాక దాన్ని కల్తీ కూడా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, అక్రమమద్య వ్యాపారుల స్వార్థం అన్నీ కలిసి ఇటీవలి మరణాలకి కారణం అయ్యాయి.
దీమిపైన చాలా దుమారమే చెలరేగింది. మద్యంపైన నిషేధం ఉన్నాక్కూడా అక్రమమద్యం ఎలా దొరుకుతుందనీ, అసలు గాంధీ రాష్ట్రంలో మద్యంతాగి ప్రజలు చనిపోవటం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నానాయాగి చేశాయి.


ఈ సిన్లో ఒకాయన చేసిన వ్యాఖ్య కొన్ని రోజులుగా నాకు చికాకు కలిగిస్తుంది ( తిక్కరేగ్గొడుతుంది అంటే బావుంటుంది ). సందట్లో సడేమియాలాగా ఆయనగారు తన వ్యాపారవ్యూహాలను ఇలాంటి సందర్భంలో దూర్చాలనుకోవడం మరీ రోతగా ఉంది. ఆ మనిషి ‘లిక్కర్‌కింగ్‌’గా పిలవబడే బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా.
సంఘటన జరిగిన కొన్ని రోజులకు కింగ్‌గారు విలేఖరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు ,"మన రాజకీయ hyopocrites ఇకనైనా మేల్కోవలసిన సందర్భమిది. ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకునేటట్లు శాసనకర్తలు తగిన మార్పుచేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మద్యనిషేదం విధిచడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీనిగురించి పునరాలోచించాలి ."

మొదటి రెండు వాక్యాలు పర్లేదు...మిగతా లైన్లతోనే తంటా వచ్చిపడింది. పోనీ పెద్దోళ్ళ మాటలను మీడియా వక్రీకరిస్తుంది అంటారుకదాని ఆ మాటలకుండగలిగే అర్థాలేంటో ఆలోచించాను. రెండు భావాలు చిరిగినాయి...అవి
మొదటిది:‘ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.....ప్రజలు స్వచ్ఛందంగా మానుంటే సమస్య లేదు’
రెండవది: ‘ ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టే ఇదంతా.....నిషేదం ఏత్తేస్తే వారికి (జనానికి) చట్టబద్దంగా నాణ్యమైన మద్యం దొరుకుతుంది......మరణాలుండవు. so, నిషేదం ఎత్తేయాలి’
మెడకాయ మీద తలకాయున్న ఎవరికైనా మాల్యా మొదటి అర్థంతో చెప్పాడంటే నమ్మరు.
ప్రభుత్వం కాకపోతే ఎవరు నిషేదం విధిస్తారు...? ‘సేన’లా, మత సంస్థలా......నో ఛాన్స్‌. ఒకవేళ విధించినాకాని ఈ కింగ్‌లోళ్లే కేసు వేసిమరీ అమ్మించుకుంటారు.

నిషేదం ఉన్నాకాని సచ్చినోళ్ళు తాగి సచ్చారంటే.....శానా బాగా ఎడిక్ట్‌ అయ్యుంటారు. గవర్నమెంటు మందమ్ముకునే లైసెన్సు ఇచ్చుంటే నా బీరురంగా....... ఐ.పీ.ఎల్‌ అవసరం లేకుండానె కుప్పలుగా డబ్బులొచ్చేవని బహుశా కింగ్‌ అనుకొని ఉంటాడు. పైకి చెప్పలేక భారి డైలాగులు పేల్చాడు.
దీన్నిగూర్చి ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలకు మన దేశంలో మద్యం అమ్మడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకంటే మా ఏరియాలో బస్టాపు దగ్గరే ఓ మందు దుకాణం ఉంది. దానికి కొంచెం దూరంలో జూనియర్ కాలేజి ఉంది (ప్రభుత్వం నిర్దేశించిన దూరానికి ఓ పది మీటర్ల అవతల). సాయంత్రం అయ్యిందంటే దుకాణం దగ్గర జాతర జరుగుతుంది. పీకలదాకా తాగినోళ్ళు, తాగాలనుకుంటున్నోళ్ళు అంతా అక్కడే. అదే టైముకి కాలేజి వదలడం. ఆ బస్టాపులో ఎలా wait చేస్తారో వాళ్లు. సరిహద్దుల్లో ఉండే జవాన్లుకు, అపర దేవదాసులకైతే ఫరవాలేదు- అమ్మినా వాళ్ళ పనేదో అది చేసుకుపోతారు. ఎటొచ్చీ మిగతా వాళ్లకే అవసరమా. మానదా ఎదో కొన్ని నెలలు తప్పితే సంవత్సరాంతం చలి దారుణంగా ఉండే దేశంకాదు ( మందు బాబులను ఎందుకు తాగుతున్నావురా అంటే మూడొంతుల మంది చెప్పే జవాబు ఇదే- ఒళ్ళు వేడి చేసుకోడానికి) ఐనా తాగుతారు.... తాగి రభస చేయడానికి, ఎక్కువైనోడు చచ్చి ఇలా ఈవిధంగా ‘మద్య’వర్తిలు నోరొపారేసుకోడానికి, నాయకులుతో వారి కుటుంబాలు పరామర్శించబడటానికి.

మేఘసందేశం....ఓ వానాకాలం ఆలస్యంగా!

ఇది నా మేఘసందేశంకు కొనసాగింపు.....
వర్షాలు కురిసే ఉపాయాం చెప్పిన వారికి అగ్రహారాలు బహుమతిగా ఇస్తానన్న రాజుగారి ప్రకటనవిని ఓ పూజారి వచ్చాడు. తనకు అగ్రహారాలు ఏమి వద్దనీ ప్రజల బాధలుకు చలించిపోయి వచ్చానని చెప్పడు. సంతోషించిన రాజు వర్షాలు కురవాడినికి ఏం చేయలో చెప్పమన్నాడు. అందుకా పూజారి...
"రాజా...నా దగ్గర ఎటువంటీ ఉపాయమూలేదు. ఈ సమస్యకు పరిష్కారం మీవద్దనే ఉన్నది. మీకు దాన్నిచూపించడానికే నేను వచ్చాను"అని చెప్పాడు.
"ఏమిటీ, పరిష్కారం మావద్దనే ఉన్నదా..."రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోతూ అనుకున్నారు.
"అవును రాజా...రాజ్యంలో ధర్మం సరిగా ఉంటే ప్రకృతి తన ధర్మం పాటిస్తుందంటారు. మీ రాజ్యంలో అది గతితప్పినట్టుంది, అందుకే ఈ వైచిత్రి..."చెప్పాడు పూజారి.
"ఏమిటి మా పరిపాలనలో ధర్మం గతితప్పినదా......నీవు ఏం మాట్లాడుతున్నవో తెలుస్తుందా...." ఒకింత ఆగ్రహంగా అన్నాడు రాజు.
"అవును రాజన్‌....కావాలంటే ఈ విషయం ఆ మేఘుడితోనే చెప్పిస్తాను" ఏ మాత్రం భయంలేకుండా చెప్పాడు పూజారి.

"మేఘుడితోనా....ఎలా"
"మాగురువుగారు నాకు నేర్పిన విద్య అది రాజా....మీరు ఒప్పుకుంటే మేఘుడిని పిలిపిస్తాను. ఆతనే చెప్తాడు మీ రాజ్యంలో ఎందుకు వర్షించడంలేదో" నివేదించాడు పూజారి.
"సరే....అలాగేకానిమ్ము. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో.నీవు చెప్పిన విషయం ఋజువు చేయలేకపోయవో నీకు తగిన దండన విధించబడుతుంది" హెచ్చరిస్తూ ఒప్పుకున్నాడు రాజు.
"అలాగే రాజన్‌. రేపే మేఘుడిని పిలిపిస్తాను..."

అన్న ప్రకారం పూజారి తరువాతి రోజు ఏదో తంతు జరిపించాడు. అది అవగానే ఏదో ఆకాశవాణి వినిపించింది.
"రాజా చెప్పండి నానుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో...."
"ఎవరు....ఎవరిదా గొంతుక....ఎవరూ కనిపించరే..."
"పిలిచిమరీ ఎవరునువ్వూ అంటావేమిటయ్యా.....నేను మేఘుడిని. ఐనా పూజరి నాతో మాట్లాడిస్తానన్నాడుగాని చూపిస్తాననలేదుగా.....సందేహాలుమాని ఎందుకు పిలిచావో చెప్పు. అవతల నాకు బోల్డు పనులున్నాయి..."చెప్పాడు మేఘుడు.
"ఓ మేఘుడా....మా రాజ్యంలో నీవు వర్షించుటలేదు....అందుకుగల కారణమేమిటి" దిక్కులు చూస్తూ అడిగాడు రాజు.
"మీ రాజ్యం....పక్కవాడి రాజ్యం అని మాకు భేదాలు ఉండవు రాజన్‌....ఈమారు నేను చాలా రాజ్యాలలో వర్షించలేదు.."
"అదే ఎందుకని..."
"దారి దోపిడికి గురయ్యాను కనుక.." చెప్పింది ఆకాశవాణి.
"దారి దోపిడినా......? అవగతముగాకున్నది...విపులంగా చెప్పెదవా" అన్నాడు రాజు, పూజారి చెప్పింది అబద్దమని అనుకుంటూ....
అందుకేగా వచ్చింది. చెప్తావిను అని మొదలు పెట్టింది మేఘం.

"వర్షాకాలం మొదలవగానే అరేబియా సముద్రం నుండి నీళ్ళు తోడుకొని బాగా అలంకరించుకొని వర్షించడానికి బయలుదేరాను. ఓ మోస్తారు దూరం ప్రయాణించగానే దిగాలుగా కొందరు తారసపడ్డారు. దగ్గరకువెళ్ళి చూసాను. వాళ్ళు నేనెరిగినవాళ్లే. ఒకప్పుడు నాతోపాటే ‘గాల్లో’ తేలేవారు. అదిచూసి నేను వారు ఏ శాస్త్రజ్ఞులో, మానవరూపంలోవున్న గంధర్వులో అనుకునేవాడిని . తరువాత తెలిసింది వారిని ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు’ అంటారని.
దిగాలుగా ఉన్నారు సంగతేంటో కనుకుందామని వేళ్ళా. అదేదో మాంద్యమట, దాని దెబ్బకు కొందరికి ఉద్యోగాలు ఊడినాయి, ఊడనివాడికి జీతాలు ఊడినాయి. ఆ వాతకి దిమ్మతిరిగి ఏడవటానికి ఒంట్లో నీళ్ళుకూడా లేవంట. నాతోపాటు కొన్నాళ్ళు ఉన్నారుగా, నా బలహీనతతెలిసి నేను మోసుకొస్తున్న నీళ్లు లాక్కున్నారు.మనసారా ఏడవటానికి... తెలిసినవాళ్లకే ఇచ్చానుకదా అని సరిపెట్టుకున్నాను.
అటునుంచి బయల్దేరి మీ నేలలో వచ్చానోలేదో.....అబ్బో ఏడుపులు, ఆర్తనాదాలు, కేకలు......మిగిలిన కాసిన్ని నీళ్లుకూడా సమర్పించుకోవాల్సి వచ్చింది..."

"ఏడుపులు, ఆర్తనాదాలా....?"

"అవును.....ఏడుపులే...పెట్రోల్‌ రేట్లు పెరిగి వాహనదారులు ఏడుస్తున్నారు.కాలుష్యం పెరిగి పాదచారులు ఏడుస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు ఏడుస్తున్నాడు. స్కూలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బండెడు పుస్తకాలు మోయలేక పిల్లలు ఏడుస్తున్నారు. పేరుగొప్ప కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లేక విద్యార్థులు ఏడుస్తున్నారు.
ఎరువులు, గిట్టుబాటు ధరలేక రైతు ఏడుస్తున్నాడు. సీట్లరాక, వచ్చినా పదవిరాక నాయకులు ఏడుస్తున్నారు. నాయకులు చెప్పింది చెయ్యలేక అధికారులేడుస్తున్నారు. వీళ్లందరు కన్నిరు కార్చలేక ఏడుస్తున్నారు...బాధ బయటకి కక్కడానికి దారిచూపు దేవుడాఅంటే జాలిపడి తలాకొంత ఇచ్చాను.

భౌతికదాడులు, యాసిడ్‌దాడులు భరించలేక ఆడవాళ్లు లోలోపల ఏడుస్తున్నారు.వాళ్ళను చూసాక అడగకపోయినా నేనె నీళ్ళిచ్చెశాను. అయినా మీకు అదేం పోయెకాలమయ్యా..., ప్రేమించలేదనీ ఇష్టపడలేదనీ హింసిస్తున్నారే.....హవ్వ. ఇంత జరిగినా, ఇంకా జరుగుతున్నా ఏం చేయలేని మిమ్మల్ని చూస్తుంటే అసహ్యమేస్తుంది నాకు. అవకాశంవుంటే వాళ్ళమీది పిడుగైపడిపోదును.....కాని ఏం చేయను అందరికి పంచేసెసరికి బలం పోయింది.
నల్లగా నిగనిగలాడిపోతూ బయల్దేరిన నేను గాలి నింపుకున్న బుడగలాగా, జబ్బుపడ్డవాడిలాగా తెల్లగా పాలిపోయాను.
ఇది చాలదన్నట్టు మాంద్యం సమయంలో వనరులని నిరుపయోగం చెసానని మా పైఅధికారులు నా ఉద్యోగం ఊడపీకారు.....ఇప్పుడు నేను ఏడుస్తున్నాను....నీరులేక ఏడుస్తున్నాను" గోడు వెళ్ళబోసుకున్నాడు మేఘుడు.

"మరి మా వర్షాల సంగతి....." సందేహం వెలిబుచ్చాడు రాజు.
"ఉండవయ్యా.....నా ఉద్యోగంపోయి నేనెడుస్తుంటే నువ్వొకడివి. చెప్పానుగా నీళ్లు లేవని. మా జూనియర్లు కొందరు బయల్దేరారు...వాళ్లను ఏవరూదోచుకోకపోతే అప్పుడు చూద్దాం. ఈలోగా బంగాళాఖాతంలో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట. అక్కడ ప్రయత్నించిచూస్తా.దిరికితే వచ్చి వర్షిస్తా" చెప్పింది ఆకాశవాణి.
"మరి అప్పటిదాకా ఏం చేయమంటావ్‌. రాజుగా ప్రజలకు సమాధానంచెప్పాలిగా" అడిగాడు రాజు.
"ఆ...కప్పలు పడుతూకూర్చో. నువ్వు చేయగలిగింది అదొక్కటేగా..."
" !@#$%*&.." ఈసారి రాజుగారి మొహం తెల్లబోయింది.
************************************************

ఇప్పటికే ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయట......సంతోషం.
ఈ కథతో టాపాని ఆలస్యంగా మొదలుపెట్టాను...మొదటి టాపా పోస్టు చేసేసరికి వర్షాలు మొదలయ్యాయి. విడగొట్టాను కాబట్టి ఈ పోస్టు రాయల్సొచ్చింది. దీనివల్ల ఓ వాక్యం నేర్చుకున్నా.... "నేను అచ్చేయల్సిన పోస్టు ఓ వానాకాలం లేటు" అని
( చిన్నప్పుడు తెలుగు పాఠం ‘ఆశ-నిరాశ’లో ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడు ఓ జీవితకాలం లేటు’ అని ఉంటుంది. ఈ పాఠం రచయత పేరు గుర్తురావడంలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మేఘసందేశం

అనగాఅనగా అనే ఒకవూర్లొ ఫలానా అనే రాజు ఉండేవాడు. ఆయనకి మరియు, మొదలగు అనే ఇద్దరు పుత్రరత్నాలు. ఓ రోజు ఫలానా రాజుగారి పుత్రులు దేశాటన ముగించుకొనివస్తూ తమతోపాటూ రెండు కప్పలను తీసుకొచ్చారు. ఇవేమిటని ప్రశ్నించిన రాజుగారితో తమకు ఓ సన్నాసి (తెలుగు సినిమా సన్నాసి కాదులేండి.....) కానుకగా ఇచ్చాడనీ, ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు విరజిల్లుతాయనీ చెప్పాడని చెప్పారు. ఇంకా ఇవి దివ్యమండూకములనీ వీటిని మంచినీటి బురదలోనో, కొలనులోనో పెంచవలసిందిగా ఉపదేశించారనిన్ని సెలవిచ్చారు.
దివ్యమండూకాలని, సన్నాసి ప్రసాదమని తెలుసుకున్నరాజుగారు వాటి సంరక్షనా బాధ్యతలను ఓ సేవకుడికి అప్పగించాడు. సేవకుడు వాటిసేవలో తరించిపోతున్నాడు.....

వేరే ఒక రోజు విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు ఏదో శబ్దాలకు నిద్రలేచారు.
బెక......బెక.....బెక.....బెకమని గదిలో అటూ-ఇటూ గెంతూతూ పుత్రరత్నాలు తెచ్చిన కప్పలు కనిపించాయి. కొలనులో ఉండాల్సిన కప్పలు ఇలా గదిలోపలికి ఎందుకువచ్చాయా అనుకుంటూ "కప్పలారా....కప్పలారా ఎందుకు కొలనులోంచి బయటకి వచ్చారు" అని అడిగాడు.
" హే ఫలానా రాజన్‌ ఫలానా రాజన్‌, నీకు తెలుసునుకాదా మేము దివ్యమండూకములని......మేము మంచినీటిలోనే నివసించెందమనీ. కానీ మా సంరక్షకుడు గతకొంతకాలంగా సరిగా చూసుకొనుటలేదు....మంచి నీరు అందించుటలేదు.....బెక.........బెక" అని వాపోయాయి. ఇది విన్న రాజుగారు వేంటనే ఆ సేవకుడిని పిలిపించి
"సేవకా......సెవకా.......నీకు ఈ దివ్యమండూకములను సరిగా చూసుకోవలెనని ఆజ్ఞాపించినాము కదా.....మరి నీవు వీటికి మంచినీరు ఎందుకు అందించుటలేదు" అను అడిగాడు.
"రాజా రాజా.....నా విధినిర్వాహణలో ఎలాంటి దోషమూలేదు. నేను వీటికి మన ఆస్థాన జలగుత్తేదారు సరఫరా చేసేనీటినే వాడుతున్నాను. గతకొంతకాలంగా అతను ఇచ్చేనీటిలో తేడాకనపడుతున్నది. దానివలనే ఈ సమస్యనుకుంటా ప్రభూ"అన్నాడు.
"అయితే వెంటనే ఆతణ్ణి పిలిపించండి".
"చిత్తం ప్రభూ" అని గుత్తేదారుని తీసుకువచ్చాడు.

"గుత్తేదారా గుత్తేదారా.......ఎందుకు నీవు మంచినీరు సరఫరా చేయుటలేదు" అని రాజు నిలదీశాడు.
"రాజా రాజా.....ఇందులో నా దోషము ఇసుమంతైనైనూలేదు. రాజ్యంలో వర్షాలు కురవడంలేదు. అందుకని నేను వేరే రాజ్యంనుండి నీటిని కొని మీకు పంపిస్తున్నాను. కొంతకాలంగా మీకు భోలక్‌పూర్‌ అను రాజ్యం నుండి తెచ్చిన నీటిని సరఫరా చేస్తున్నాను.....అక్కడి ప్రజలు అవే త్రాగుతారట. పైగా ఆ నీరు అక్కడి జలమండలి వారు ఎన్నో వ్యయప్రయాసలోర్చి సరఫరా చేస్తారట. ప్రజలు తాగి జీవించగాలేంది కప్పలు జీవించలేవాని ఆ నీటినే ఇచ్చాను ప్రభూ" సెలవిచ్చాడు గుత్తేదారు.
" ఊమ్... అనవసర విషయాల ప్రస్తావన ఏల. రాజ్యంలో వర్షాలు కురవడంలేదా....ఈ సంగతి మాకుతెలియనేలేదే. ఏమీవిపత్కర పరిస్థితి. ఏమి దీనికి పరిష్కారము.."మధనపడిపోతూ మంత్రిగారిని పిలిపించాడు.

"మంత్రీ మంత్రీ.....మన రాజ్యంలో సకాలంలో వర్షాలు కురవడంలేదట. ఈ విషయం ప్రజలు చెబితే తెలిసినది. ఎందుకు నాకు తెలియపరచలేదు" అన్నాడు మంత్రితో.
"రాజా రాజా......నాకునూ ఇప్పుడె తెలిసినది ఆ సంగతి. వేరే వ్యాపకాలలో ఉన్నందున సరైన సమాచారం అందలేదు. ఏమైననూ ఇప్పుడున్న సమస్య ఝటిలమైనది. దీనికి ఒకే ఉపాయమున్నది"
"ఏమది..."
"పొరుగు రాజ్యాలలో మేఘమధనమని ఓ ప్రక్రియను అవలంభిస్తున్నారు. వాటివల్ల ప్రయోజనమొనగూరవచ్చు" తరుణోపాయం వివరించాడు మంత్రి.
అట్లయినచో, వెంటనే మేఘమధనం జరిపించండనీ రాజుగారు ఆజ్ఞాపించి తన విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయాడు.
కప్పలు వాటికి వచ్చిన లాంగ్‌జంప్‌ ఆటలో ఆరితేరి వాటి దారిలో వచ్చినవాటిని బెక......బెక....బెకమనిపిస్తున్నాయి

రాజాజ్ఞ ప్రకారం మంత్రి మేఘమధనం జరిపించాడు. ఎంత మధించినా ఫలితం శూన్యం. వానలు ఇల్లె. రాజుగారు విషయం తెలుసుకొని విచారపడ్డాడు. గమనించిన మంత్రి రాజుతో ఇది దైవసంబంధ విషమైవుండవచ్చుననీ ఆస్థాన పురోహితుడిని పిలిపించమని నివేదించాడు. అలాగే కానిమ్మన్నాడు రాజు. మరుసటిరోజు సభకి రాజపురోహితుడు వచ్చాడు.
"పురోహిత పురోహిత.......వర్షాలు ఎందుకు పడటంలేదు. నీకేమైన ఎరుకనా. పరిష్కారమేమైనా ఉన్నాదా..." అని పురోహితుడిని అడిగాడు.
"రాజా రాజా......."పురోహితుడు ఏదో చెప్పబోతూ కప్పల శబ్దం విని ఆగాడు.
బెక......బెక.....బెక.....బెక....
"రాజా...రాజా..."
బెక....బెక.....బెక...బెక.....
పురోహితుడికి విసుగొచ్చింది. అది గ్రహించిన రాజు వాటిని పట్టించుకోకుండా కానిమ్మన్నాడు.
"రాజా....రాజా..... మీరు కొన్ని సంవత్సరాలుగా యజ్ఞ-యాగాదులేవియూ జరిపించలేదు. అందువలనే ఈ వైపరిత్యము సంభవించినదని నా అభిప్రాయము. ఈ సమస్య తీరవలెనన్న వేయిమంది విప్రోత్తములచే వరుణయాగం జరిపించవలె"నని రాజుగారికి విన్నవించాడు పురోహితుడు.
బెక....బెక....బెక....బెక......
"యజ్ఞము చేసిన వర్షము వచ్చునా....."రాజుగారు సందేహం వెలిబుచ్చాడు.
"ముందు పొగొత్తది......"వెనకనుండి పురోహితులవారి శిష్యగణం నుండి వినిపించింది.
రాజుకి ఒళ్ళుమండి " అసంధర్బ ప్రేలాపనలు కట్టిపేట్టి ముందు ఆ యాగం సంగతి చూడండి. ఈ కప్పల గోల భరింపనలవిగాకున్నది. పైగా ఇవి అన్ని కప్పలవలే 'బెక బెక' మనక 'బెక' అనిమాత్రమే అరుస్తున్నవి....కటకటా..."

పురోహితుడు చెప్పిన ప్రకారం యాగం చేయించాడు రాజు........ఇప్పుడు కూడా ఫలితం సున్నా. కప్పలు మాత్రం ఆ పొగకి రెచ్చిపోయి మరింత బెక....బెక పెడుతున్నాయి.
సిరిసంపదల సంగతి దేవుడెరుగు ముందు వర్షాలు పడి ఈ కప్పగెంతులు ఆగితే బావుణ్ణు అనుకొని వర్షం కురిసేలా చేసిన వారికి పాతిక అగ్రహారాలు బహుమతిగా ప్రకటించాడు.

(ఇంకా బెక....బెక ఉంది)

బ్లాగారిష్టమ్స్...ఓ బ్లాగరి బాధల కథ

ఇల్లు అలగ్గానే పండగ కాదు, house decoration no festival-అన్నాట్ట ఎవరో పెద్దాయన
ఇల్లు కట్టిచూడు, పెళ్ళిచేసి చూడు- అని ఇంకో ఎవరో పెద్దాయన అన్నాట్ట
నా అనుభవాల మూలంగా ఈ సామెతల పరంపరలో నేను కొత్తగా కనిపెట్టిన సామెతలనుకూడా చేర్పించాలనుకుంటున్నాను అవి " బ్లాగు పెట్టిచూడు, పోస్టు రాసిచూడు", "బ్లాగు రిజిస్ట్‌ర్‌ చేయగానే పనైపోలేదు, blog register work not over".

ఏంటి...."వీడికి మతిపొయింది","ఈ చెత్తని కూడా సామెతలనాలా బాబు..." అని అనుకుంటున్నారా....ఐతే కూసింత ఆగి నా కష్టాలు ఓసారి వినండి...సారి.. చదవండి....తరువాత మీరె ఒప్పుకుంటారు నేను కనిపెట్టిన సామెతళు ఉత్కృష్టమైనవని.
అంతా సిద్దమేనా........ఐతే ఆలకించండి

మొట్టమొదటగా అంటే ఫస్ట్ ఫస్ట్‌......కొంతకాలంగా పనిపాటా లేని కారణంగా కంప్యూట‌ర్‌తో కాపురం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నెట్‌లో ఉన్న బ్లాగులపైన కన్నుపడటం అందునా తెలుగు బ్లాగులపైన పడటం జరిగి లోకకళ్యాణార్థం నేనుకూడా ఓ బ్లాగు తెరవాలనిపించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేంటని అనుకున్నదే తడవుగా గూగుల్‌ వారి సౌజన్యంతో, సహాయ సహకారాలతో, ప్రెమాభిమానాలతో, వంకాయ బీరకాయలతో.....వగైర వగైరలతో మార్గదర్శిలో చెరకుండానే ఓ బ్లాగు అడ్రసు సంపాదించుకున్నాను. ఇక్కడనుండి మొదలైంది crocodile festival.....జజ్జనక జనారే.

అడ్రసు రిజిస్ట్‌ర్‌ చేసుకోగానే దాన్ని ఓ మూలపడేసాను...తరువాత కొన్నాళ్ళకు జ్ఞానోదయం అవడం చేత పునరుద్దరణ కార్యక్రమం మొదలుపేట్టాను. సో... దానికోసం బ్లాగు template ఒకటి సెట్‌ చేయాలి. పాపం గూగుల్‌ గారు మ'ల్లి' వాత్సల్యాభిమానంతో కొన్ని templates కానుకగా ఇచ్చారు. అంత వీజిగా దొరికితే మనమెందుకు తీసుకోవాలనుకొని గో..........ప్ప...గా శోధించి శోధించి ఓ టెంప్లెట్‌ వెతికి పట్టుకొని దాన్ని నానా విధాలుగా దిగ్గొట్టి-ఎగ్గొట్టి, మడతలు పెట్టి-ముడతలు విప్పి బ్లాగుకి అంటించుకున్నా. ఈ తతంగం పూర్తి అయ్యెసరికి నేను తారె జమీన్‌ పర్‌ ఫ్రీగా చూసాను. ఫ్రీగా చూసాను అంటే పైరేటేడ్‌ CD తెప్పించుకొని చూసాననుకొనేరు.....చుక్కలు కనపడ్డాయి అని కాస్త సింబాలిక్‌గా చెప్పాను.

తరువాతి కార్యక్రమం బ్లాగుకి ఓ పేరు పెట్టడం.నామకరణం. దీనిక్కూడా ఓ మోస్తారు శోధనచేసి, మేథోమధనంగావించి "హరివిల్లు" అనే పేరు పెట్టాను(wat a lovely name....). ఓ పోస్టు కాడా రాసేసిన కొన్నిరోజులకు కూడలిలో జాయిన్‌ చేసా.ఎన్ని హిట్లు వస్తున్నాయో తెలుకునేందుకు code కూడా తగిలించుకున్నా. so far well and good. మొదటి పోస్టుకి ఆశించినన్ని హిట్లు లేవు. not bad, i'm not a popular blogger afterall అనుకొని అడ్జ్‌స్ట్‌ అయ్యా. రెండో టాపా పోస్టు చెసిన తరువాతరోజు ఒక్కసారిగా హిట్లు పెరిగిపోయినాయి.....పట్టలేని ఆనందం.....Eureka sakamIkA అని పాడెసుకున్నా.....తరువాత తెలిసింది నా లాంటి హరివిల్లులు (హరివిల్లు, హరివిల్లు) ఇంకో రెండు ఉన్నాయని......
బహుశా వాళ్ళ బ్లాగు అనుకొని నా బ్లాగుని చూసినట్టున్నారు (దీనికి గాను జయచంద్ర గారికి, శ్రీనివాస గారికి క్షమాపణలు-వారి హిట్లు తగ్గించినందుకు) .
నేను వాటిని పరికించాను, రాశిలోనూ వాసిలోనూ పెద్దవే. అదే పేరు తగిలించుకుంటే identity crisisతొ బాధపడాల్సి వస్తుంది.....so, పేరు మార్చాలి లేకపోతే ఆ ఇద్దరినీ నయానో భయానో ఒప్పించి వాళ్ల బ్లాగు పేర్లు మార్పించాలి. రెండొది కాస్త కష్టం అనిపించి (అంటే ఈమధ్యన ఎక్సర్‌సైజ్‌ చేయడం మానేసాను బాడి కొంచెం వీకైంది...) నాదాన్నే కర్రవిరక్కుండా పాము చచ్చేలా మార్చవలసివచ్చింది. "ఇంద్రధనస్సు" అని
హతోస్మి.
బ్లాగు జీవితంలో ఫస్ట్‌ psychic shock.


ఇహ ముఖ్యమైనది, తేల్చుకోవలసినదీ టాపాలు రాయడం. టాపాలు రాయడంతో సమస్య అన్నాను అంటే విషయాలు దొరక్కకాదు, తెలుగులో రాయడం అని. తెలుగు తెలీదనికాదుగాని 'ల'కారానికి ,'ళ'కారానికి ళంకె కుదరటంలేదు. మామూలు పదాలు ఓకేగాని,
'పళ్లెం' అనాలా 'పళ్ళెం' అనాలా
'గొళ్లెం' అనాలా 'గొళ్ళేం' అనాలా
'కళ్లు' అనాలా 'కళ్ళు' అనాలా
'పెళ్లి' అనాలా ' పెళ్ళి' అనాలా ఇలాంటివి అన్నమాట-సెకండ్‌ progressing psychic shock.
రాస్తూపోతూఉంటె అవేతెలుస్తాయిలె but తెలుసుకొనేతలోపు ఎవరైనా పోస్టులు చూసి ల-ళ చూసి జుట్టుపీక్కుంటే.....అదో తళనొప్పి.

అందుకే అనుకున్నాను " బ్లాగు పెట్టిచూడు, పోస్టు రాసిచూడు", "బ్లాగు రిజిస్ట్‌ర్‌ చేయగానే పనైపోలేదు, blog register work not over".

చూసారా నా కష్టాలు చదవంగానే మీకు బకేట్లకొద్దీ కన్నీరు కారుతుంది. ఏడవకండి, మీరు నాలాగే గుండె రాయి చేసుకోండి.మనుసున్న మనిషికే కష్టాలు....తప్పదు, అదే జీవితం.

త్వరళోనే ఇంకో టాపాతో మల్లి కళుసుకుందాం.

ప్రయాణం

హనుమంతుడి జాంపండు కస్తూరిరంగు పులుముకొని నిద్రలేచాడు. ఓక్కడే మెరిసిపోతుంటే ఏంబాగుంటుంది అనుకున్నాడోమరి....చుట్టూ ఉన్న ఆకాశానికి కూడా రంగు అద్దేసాడు.
సూరన్నతోపాటు నేను కూడా నిద్రలేచాను అని అరిచినట్లు కూతపెట్టుకుంటూ ప్లాట్‌ఫాం మీదకి రైలు వచ్చింది. వెళ్ళాల్సిన వాళ్ళు ఒక్కొక్కొరుగా ఎక్కుతున్నారు.


"చింటూ, చూసుకూంటూ ఎక్కు....మెల్లగా..." రెండున్నరేళ్ల చింటుగాడిని వెనకుండి ఎక్కిస్తున్నాడు వాళ్ళ నాన్న.
"వాణ్ణి నే ఎక్కిస్తాగాని మీరు ఆ లగేజిని లోపలికి తీసుకురండి ముందు..." భర్త అసలు బాధ్యత చూపిస్తూ అంది చింటూగాడి అమ్మ.
------------------------------------------------------

"సర్టిఫికెట్లు అన్ని పెట్టుకున్నావుగా..?" అశోక్‌ నాన్న వాకబు.
" ఆ‍.. అన్ని ఉన్నాయి నాన్న"
"ఇంటర్వ్యు జరిగే ప్లేస్‌ అడ్రస్‌ ఉందిగా...?"
"ఆ....ఉంది"
"ఇది మా ఆఫీసులో పనిచేసే రాంగనాథ్‌ నేంబరు. ఇప్పుడు ఆక్కడే ఉంటున్నాడు.....వెళ్ళాక ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయనకి ఫోన్‌ చెయ్యి. నువ్వు ఇలా ఇంటర్య్వుకి అని వస్తున్నావని చెప్పాను. టైమ్‌ అవుతుంది, నీ సీట్లో వెళ్ళికూర్చొ...ఇంద ఇవి వుంచు"
"మళ్ళి ఎందుకు నాన్నా ఇవి...నా దగ్గర ఉన్నాయిలే....కావలంటే ఫ్రెండ్స్‌ ఉన్నారుగా, మేనెజ్‌ చేసుకుంటాం"
"అంత దూరం వేళ్తున్నావ్‌ మళ్ళా మీ ఫ్రెండ్స్‌ని ఎందుకు అడగటం.నీక్కావాల్సినప్పుడు వాళ్ల దగ్గర ఉంటాయొ లేదో....ఎందుకైనా మంచిది ఉండనీ.."
-------------------------------------------

"అన్నయ్యతో నిన్న రాత్రి మాట్లాడాను, డాక్టరు తెలిసినతనే అంట, ఆపరేషన్‌ కుడా చిన్నదేనంట, ఆపరేషన్‌ అయ్యాక ఓ నెల రోజుల రెస్ట్ తీసుకుంటె సరిపోతుంది, భయపడాల్సింది ఏం లేదు అన్నాట్టా. పెద్దమ్మని నిన్నే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసారంట. నేను, నాన్న ఆఫీసు పనులు ముగించుకొని రేపు వస్తాం." అక్క ఆపరేషన్‌కని వెళ్తున్న వనజకి ధైర్యం చెప్తుంది తన కూతురు.
"ఏమోనే.....అక్కని చూసేంతవరకూ కుదురుగా ఉండలేను. ఈ వయసులో ఆపరేషన్లు, ఇంజక్షన్లు అవిఅంటే ఏలా భరిస్తుందో ఏమో."
"ఏం కాదులే అమ్మా.....పేద్దమ్మని చూసుకోడానికి అన్నయ్య, వదిన ఉన్నారుగా. ట్రైను స్టార్టయ్యే టైమైంది నువ్వు పద. స్టేషన్‌ దగ్గర pickup చేసుకోడనికి అన్నయ్య వస్తాన్నాడు......ప్రయాణంలో జాగ్రత్త, సరేనా.నేను, నాన్న రేపు వస్తాం."
--------------------------------------------------

"అరేయ్.....ఈ బాలాగాడేంట్రా ఇంకా రాలేదు, సీనుగాడు వెళ్ళేది ఇవాల్నేఅని చెప్పారా వాడికి"
"వాడి గురించి తెలిశికూడా ఎందుకు అడుగుతున్నావ్రా కార్తిక్‌. నువ్వు జూడు, నేను ఎక్కి ఈ ట్రైను ప్లాట్‌ఫాం దాటాక దిగుతాడు ఆ లేట్‌లత్తి గాడు. ఐనా ప్రిదీప్‌గా, నువ్వు వచ్చేరూట్లోనే కదరా వాడి ఇల్లు. వచ్చేటప్పుడు ఆణ్ణిగూడా ఎక్కించుకోనిస్తే ఆయిపోయేదిగా."
"ఆ ముక్క నిన్న రాత్రే అడిగాన్రా వాణ్ణి. లేదు నాక్కాస్త పని ఉంది నేను ఒక్కడినే వస్తానన్నాడు. సరే అని నేను శ్యామ్‌గాడు కలిసి వచ్చాం."
"వాడి సంగతి పక్కనపెట్టండ్రా....రేయ్‌ సీనుగా నీ ఎదురు బెర్తులో ఓ ఫీమేల్‌ candidateరా, పేరు కల్పనా అంటా...next స్టేషన్‌లో బోర్డింగ్‌ అంటా, సీట్‌ నెం 23,24 లో కుడా అమ్మాయిలేరా....పండగ చేసుకోరా..."
"అప్పుడే బోగీఅంతా స్కాన్‌చేసి పడేసావారా శ్యామ్‌..... hats off రా నీకు"
(ఇంతలో బాలావచ్చాడు.....)
" ఆ రండిసార్‌, మీగురించే మాట్లాడుకుంటున్నాం. ఫరవాలేదు తొందరగానే వచ్చారు.ఇంత సాహసం ఎలా వీలైంది సార్‌ మీకు."
"నువ్వు కాస్త మూస్తావా....ఆ శ్యామ్‌గాడెడి ముందు వాణ్ణి తన్నాలి. వాడు వాడి చెత్త స్టుడియో ఫ్రెండ్‌గాడు"
"కొంచెం క్లియర్‌గా జెప్తవా...."
"ఏంలేద్రా.....మనం ఈ 4 ఇయర్స్‌లో దిగిన ఫోటొస్‌ అన్ని ఒక ఆల్బంలా తయారుచేద్దాం అనుకున్నాం. ఎవరైనా తెలిసినవాళ్లు ఉన్నారాఅని ఈ శ్యామ్‌గాడిని అడిగితే ఓ స్టూడియో వాడిదగ్గరికి తీసుకెళ్లాడు. నిన్న రాత్రికల్లా తయారుచేసి పెడతానన్నాడు. తీరా వాడు చెప్పిన టైంకి‍ వెళ్తే అప్పటికే షాపు మూసేసి ఇంటికిపోయాడు. పొద్దున్నే రోడ్లమీద పడి వాడి ఇల్లు ఎక్కడుందో కనుక్కొని వెళ్తే ఆల్బం పని సగమే చేసాడు యెదవ.....దగ్గరుండి ఆ పని ఫినష్‌ చేయించే సరికి తల ప్రాణం తోకలోకి వచ్చింది. దాన్ని తిరిగి తలలోకి తెప్పించికొని వచ్చేసరికి ఈ టైమైంది....అబ్బో బాడి బస్టాండ్‌ అయ్యింద్రా ఈ ఎఫెక్ట్‌కి."
"ఈ కవర్లోది ఆ ఆల్బమేనా..."
"ఆ...."
(ఆల్బంలో ఫోటోలు చూసేసరికి కార్తిక్‌ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.)
" మనోడు వాటర్‌టాప్‌ ఓపెన్ చేసాడ్రా....వాణ్ణి ఆపండ్రా బాబు..."
"రేయ్‌ కార్తిక్‌ కంట్రోల్‌ మామా కంట్రోల్‌......చిన్నపిల్లాడిలా ఏందిరా ఇది.మనమేమైనా పర్మినెంట్‌గా దూరంఅవుతున్నామా....ఫోన్లో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాం కదా....ఊరుకో మామా.."
"అది కాదురా.....ఇవాళ నువ్వు వెళ్లిపొతున్నావ్‌, వచ్చేవారం శ్యామ్‌గాడు కూడా వెళ్లిపోతాడు.....ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం.అన్నింటినీ షేర్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడు అలా ఉండలేం రా. జాబనో, చదువనో ఒక్కొక్కరం తలోదారిలో వెళ్లిపోతాం. "

అంత సేపు సరదాగా ఉన్న వారిలో ఒక్కసారిగా మౌనం. ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. వాళ్ల మధ్య నిశబ్ధాన్ని ఛెదిస్తూ రైలుకూత.సీను భారంగా రైలు ఎక్కడు. ట్రైను స్టార్ట్ అయింది.
-------------------------------------------------------------

"బాయ్ రా సీను..."
"సీను బాయ్ రా..."
"ఇంటికి వెళ్ళాక కాల్‌ చెయ్యిరా....సరేనా...బాయ్"
"హ్యపి జర్ని మామా...""ఆల్ ది బెస్ట్ అశోక్‌.....దిగగానే ఓసారి ఇంటికి ఫోన్‌ చెయ్యి"


"జాగ్రత్త అమ్మా......నువ్వేమి ఖంగారు పడకు, పెద్దమ్మకి ఏంకాదు. స్టేషన్‌ చేరగానే అన్నయ్యకి ఫోన్‌చెయ్యి.వచ్చి తీస్కెల్తాడు."


"చింటూ, ట్ర్రెయిన్ స్టార్ట్ అయింది, అక్కడ-ఇక్కడ తిరగకుండా కూర్చో."

ట్రైను స్టేషన్‌ దాటింది.ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో అనుభూతి.

"డాడి....ఈ ట్ర్ర్రైను స్ట్రేట్‌గా తాతయ్య ఇంటికే వెళ్తుందా...?డాడీ వీళ్లందరూ కుడా మన తాతయ్య ఇంటికేనా..?"

ఇంటర్వ్యులో బాగా పెర్ఫామ్ చేయాలి.....జాబ్‌కి సెలెక్ట్ అవ్వాలి....ఇంట్లో ఇక అడ్జస్ట్‌మెంట్లు ఉండకూడదు....యెస్‌ ఉండకూడదు.

ఇంజనీరింగ్‌ అప్పుడే అయిపోకుండాఉంటే బాగుండేది......ఛస్‌ నాలుగేళ్లు అప్పుడే ఖతం అయినాయా...

దేవుడా అక్కకి ఏం కాకుండా చూడు స్వామి.....మనువడితో ఆడుకుంటూ సంతోషంగా ఉంది, తనని ఈ గండం నుండి బయటపడేట్టు చూడు తండ్రి.


కిటికీచాటు నుండి ఆకాశం ఓ సముద్రంలా కనిపిస్తుంది.వీళ్ళ ఆలోచనల లోతులాగా అదికూడా అనంతంగా, నీలంగా ఉంది.
నాకు శరీరం తప్ప స్పందించే హృదయం లేదు, నన్ను నడిపే వాడికి మీ ఆలోచనలతో పనిలేదన్నట్టుగా రైలు వెళ్తుంది.

***********************************************************************************
(రైలులో ఎదురైన సంఘటనల ఆధారంగా)

కధ మొదలు

నేను (నిద్రలొ జోగుతూ):"రెయ్....కాసెపు నిద్రపోనీండ్రా....ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం......"
"ఛా.......నేను ఇంతవరకు అదే చేస్తుండే........నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు పండుతున్నావ్ ర.......లే బె..,లే....."

"నీ......ఎవడ్రా నువ్వు....., సుఖంగా నిద్రపోతుంటే కేలుకుతున్నావ్...."అంటు కళ్ళు తెరిచాను....నా ఎదురుగా ఓ సాల్తి నిలబడి ఉంది.అప్పుడె లేచినందువల్ల మొహం సరిగా కనపడలెదు. ఆ నిద్రలేపిన సన్నాసి యెవడొ చూసి వాణ్ణి కుమ్మెద్దాం అనుకుంటు కళ్ళు రుద్దుకొని చూశా,వాణ్ణి చూసాక నా మతి పొయినంత పని ఐంది.అలా రాయి లాగా ఊండిపోయ,వాడు మాత్రం రిలాక్స్‌డ్‌గా నువ్వుతున్నాడు అసెంబ్లిలొ ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తుంటే ఏమి పట్టనట్టు అన్నింటికి ఓకె జవాబు ఇచ్చె SYR లాగా.

"నువ్వు........నువ్వు......ఎవరు నువ్వు.......అచ్చు నాలాగె ఉన్నావ్" ఆ మతి పొయినంత సంఘటన నుండి తేరుకొని ఎదురుగా ఉన్న సాల్తిని అడిగా. దానికి వాడు వెటకారంగా ఇంకో నవ్వు సమర్పించుకొని "ఏరా, రొజు అద్దం చూట్లెదెంది నీ ఫేసు కూడా నీకు గుర్తులేదా?" అని జాలిగా నా వైపు చూసాడు. "అందుకే అడుగుతున్నా నేను నాలోనె ఉంటె నాలా ఉన్న నువ్వు ఎవరు అని" అని నన్ను నేను గిల్లుకొంటు కొంచెం భయంగా,మెల్లగా అడిగా.

"నువ్వెమి కల కనడం లేదు నైనా......నువ్వు చూస్తుంది నిజమే.....నేను నేనె, నేను నువ్వె.....నేను నీ అంతరాత్మని" అని మళ్ళి ఓ నవ్వు విసిరాడు. "ఏంటి బాబు.... నా చెవిలొ పూలెమైన కనపడుతున్నాయా నీకు లేక ఏ మెంటల్‌ హాస్పిటల్‌ నుంచో పారిపొయి వచ్చావా" అని వాడివైపు ఓ మాదిరిగా చూస్తు అన్నాను.ఏక్కడ కాలిందొ ఏమొ ఒక్కసారిగా వాడి మొహంలొ తేడ వచ్చింది....."నీ ఎంకమ్మ, ఒకసారి జెప్తె అర్థం కాదు బె నీకు.....పిచ్చొంలాగ కనపడ్‌తున్నాన్‌ రా...చెప్పింది యిను....నేను నీ అంతరాత్మనే....పిచ్చి గిచ్చి అని యింకొసారి అన్నవొ నేను వచ్చిన సంగతి పక్కనబెట్టి నీ సంగతి చూస్త బిడ్డా..." అని అరిచాడు.
"అంటె.., నేను ఆత్మలు, దయ్యాలు లాంటివి నమ్మను.....నేను నాస్తికుడిని" కొంచెం వెనక్కు జరిగి అన్నాను.....వాడు కోపంలొ నన్ను ఎమైన చెస్తాడేమొనని...
"నీ నమ్మకాలు ఎవడిగ్గావలె.....కొన్నింటికి నమ్మకాలతొ సంబంధం ఉండదు నైనా.....నమ్మి తీరాల్సిందే....ఐనా ఇప్పుడు నా పని నీతోనే కాబట్టి....నువ్వు నేను ఒకటే కాబట్టి నీ డౌటు క్లియర్ జేస్త.......అంతరాత్మలకి రూపం దప్ప శరీరం ఉండదు...కావల్నంటె నన్ను తాకి చూడు..." అని నిల్చున్నాడు.వాడి కోపం తగ్గినట్టు నాకు అనిపించి ఒక్కొ అడుగు ముందుకు వేస్తు వాడి దగ్గరికి వేళ్ళాను....ఆ సాల్తి మాత్రం అలానె నిల్చొని ఉంది...నేను వాణ్ణి ఓ సారి తడిమి చూశాను, నా చెయ్యి అలా వాడిలోంచి వెళ్ళిపొయింది, నమ్మబుద్ది కాక కన్‌ఫ్‌ర్మ్‌ చేసుకుందాం అని ఇంకొసారి చెయ్యిపెట్టాను....మళ్ళి వాడిలోంచి వెళ్ళిపొయింది.......ముచ్చటగా మూడొసారి కన్‌ఫ్‌ర్మ్‌ చేసుకుందాం అనుకొని చెయ్యి తీసెసరికి "ఏ రా, ఇదెమైన గేమ్‌ అనుకుంటున్నవ్ ర.....పొనిలె అని ఊకుంటె రెచ్చిపొతున్నవ్...." అని గుర్రుమన్నాడు.

"సారి...., ఆత్మలను చూడటం మొదటిసారి కదా కొంచెం excite అయ్యాను" అని చెప్పి ఊరుకున్నాను. నేను మాట్లాడుతుంది నాతొనే అని తెలిసాక అప్పటిదాకా ఉన్న భయం పొయింది....ఆ రూపాన్ని తిరిగ్గా చూశాను...నిజంగానె డిట్టొ నాలాగె ఉన్నాడు. "సరె....నువ్వు నేనె అని ఒప్పుకుంటున్నా.....కాని ఏప్పుడు లేనిది ఇప్పుడు వచ్చావ్ ఎందుకు" అని అడిగాను....
"ఆ....నిన్ను ఓ నాలుగు తన్ని ట్రాక్‌లొ పెడ్‌దామని వచ్చిన." అని విసురుకుంటు చెప్పింది. "నాకెమైందని ఇప్పుడు....బాగానె ఉన్నాగా" అనేసరికి నా అంతరాత్మ కనుబొమ్మలు పైకి లేపి, "నువ్వు బాగుంటే సరిపొద్ది ర...నేను బాగుండాల్నా లేదా......నువ్వు జేసిన చెత్త పనికి నిద్రపట్టక,తలెత్తుకోలెక పరెషాన్‌ ఐతున్న" అని దిగాలుగా చెప్పింది. "నేనెం చెసాను నువ్వు అంతలా బాధ పడటానికి.....మర్డ్‌లా...?,మానభంగాలా...?, మోసాలా....?ఇవేమి చేయలేదే. కనీసం దూలయ్య, కోఫ్తా కపూర్‌ లాగా జనాలనూ హింసించలేదే.....ఏం చేసాను అని నువ్వు నా మీద అంత నింద వేస్తున్నవు" అని కాస్త సినిమా టైపు కటింగు ఇచ్చా....

"దూలయ్య, కోఫ్తా కపూర్‌ల రేంజ్‌ నీకు లేదు తమ్మి.....వాళ్ళు ఓ మనిషిని బతికుండంగనె పరలోకం పంపించె టాలేంట్‌ ఉన్నొళ్ళు.......మర్డ్‌లు etc లు చేయనీకె ఖలేజ కావాలె...నీకు.....అంత సిన్‌లెదు" అని నన్ను పైకి కిందకి చూస్తు చెప్పింది. "నువ్వు చేసింది మోసం తమ్మి...." అని అంది. "మోసమా....! నేనా......ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ చెసాను...?" అయోమయంగా ప్రశ్నించా.... "ఏవరినో మోసం జేస్తె నేను ఎందుకు పరేషాన్‌ ఐత.....నన్ను మోసం జేసి నా ఇజ్జత్‌ తీశినవ్‌.....గదె నా బాధ." "నేను నిన్ను మోసం చేశానా.....నాకేం అర్థం కాలెదు....కొంచెం విడమర్చి చెప్తవా..." అంటూ సమాధానం కోసం ఆగాను. "గప్పుడె మర్చినవ బెదరు...సరె చెప్త యినుకో......మూణ్ణెల్ల కింద బ్లాగుతాను అని జెప్పి ఓ తెలుగు బ్లాగు తయార్‌ జెసినవ్.....గుర్తుందా....నువ్వు దాన్ని....షురు జేస్తివొ లెదో, అప్పటి దాంక చానా మంది అంతరాత్మల్లాగ గమ్మునుండెటొన్ని మైకు పెట్టుకొని మావోళ్ళ దగ్గర లొల్లి పెట్టిన మావోడు అందర్లాంటొడు కాదు అని....మరి నువ్వు ఏమ్‌ జేశినవ్‌ రిబ్బన్‌ కటింగ్‌ ఐతె చెశ్న్‌వ్‌ గాని ఓక్క ముక్కైన బ్లాగినవా......లె....మరి నా పరువు ఏం గావలె......అందుకే ఆ సంగతి ఏందొ చూద్దాం అని వచ్చిన...."అసలు విషయం చెప్పెసింది ఆత్మ.

బ్లాగు అనగానె ఆ విషయం లీలగా గుర్తొచ్చింది....అపుడు ఖాళిగా ఉన్నప్పుడు దొరికిన తెలుగు బ్లాగల్లా చదివి ఆ ఆవేశం లొ ఓ తెలుగు బ్లాగు సిద్దం చేసాను ఏదొ బ్లాగెద్దామని......కాని చేయలేదు. మనల్ని ఎవడు అడుగుతాడులె అనుకొని అల వదిలేసాను......నాకేం తెలుసు, ఇపుడు నా అంతరాత్మె నన్ను అడుగుతుంది అని.వీడ్ని చూస్తె ఈ విషయం వదిలెలా లేడు....ఏదోల divert చెయాలి అనుకుంటు.." అవును అంతరాత్మ...." అని దాన్ని ఆడగబోతుండగా "ఊకె ‘అంతరాత్మా’ అని ఏదో వస్తువును పిల్చినట్టు పిలవకు బై.....నాకు గిట్ల ఒక పేరు ఉంది ‘బ్లాగారాం’....ఆ పేరు బెట్టి పిలువు" అని అంది. " ‘బ్లాగారాం’మా అదెం పేరు బాబు వేరే ఏ పేరు దొరకలేదా.....‘ఆకాశరామన్న’,‘గాలి గన్నారావ్‌’,‘బ్లాగారాం’ ఏం పేర్లు ఇవి......ఛా ఛ ఛ ఛ ఛ....."సైడ్‌ట్రాక్‌ చేయడానికి మాంచి టాపిక్కే దొరికింది అనుకుంటు అన్నాను.

"పేరు ఏదైతె నీకేందుకు.......నీకులాగ పేరుపెట్టనికి మాకు ఎవరు ఉన్నారు.....నువ్వు భ్లాగు షురు చేశినంక నేను నిద్రలేశిన కాబట్టి ‘బ్లాగారాం’ అని పేరు పెట్టుకున్న........నచ్చినా నచ్చకపోయినా ఆ పేరుతోనె పిలువు....గా పేరంటె నాకు మస్తు liking అయిపొయింది" అష్ట-చెమ్మ సినిమాలొ హీరొయిన్‌లా మెలికలు తిరిగిపోతు చెప్పాడు. "సరె బ్లాగారాం.....నువ్వు నేను ఒకటే కదా...మరి నువ్వు మాట్లాడె భాషకి, నేను మాట్లాడె భాషకి తేడా ఏందుకు ఉంది" గురుడు బాగానె దారి మళ్ళాడు అనుకుంటు అడిగా.
"సినిమాలు చూసే అలవాటు లేదా నైనా నీకు.......ఆత్మలకి భాషా పరిధులు, ట్రావెలింగ్‌ లిమిట్లు ఉండవు....they can speak any language....మేము ఏ భాషలోనైనా, ఏ మాండలికంలో అయినా మాట్లాడగలం,ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలం" కాలర్‌ ఎగరేసుకుంటూ చెప్పాడు బ్లాగారాం. "‘మాం..డలి...కం’మా అదేంటి.....మేండలీవ్‌ (Mendeleev) టేబుల్‌లో కొత్త ఏంట్రినా" అని తెలీనట్టు మొహం పెట్టి వాడివేపు చూసా. "ఛీ......సన్నాసి యెదవా.......పాత బుద్ది పోనిచ్చుకోలేదింకా నువ్వు.......అంతేలే...బయట తిరిగి ఏడిస్తే ఎదైనా తెలిసేది......అందుకే ఓ పెద్దాయన అన్నాడు.....మనిషన్నాక కూసింత భాషా జ్ఞానం ఉండలా....ఉత్తినే తిని కూసుంటే మనిషికి మేషినుకి తేడా ఏటుంటాది" అని సూక్తిముక్తావలి భోదిస్తున్న స్వామిలా చెప్పాడు. నేనేదో మాట్లాడబోతుంటే మధ్యలో ఆపి "అవునోరెయ్.....నేను ఏదో పని మీద వస్తే నన్ను సైడ్‌ట్రాక్‌ చేసి తప్పించుకుందాం అని ఆలోచిస్తున్నావా.....నాతొ గేమ్స్‌ ఆడావంటే బాడి burst అయిపోద్దిరోయ్.....బ్లాగు......బ్లాగు సంగతి ఏంటొ తేల్చు ముందు" అనుకుంటూ నామీదకి వచ్చాడు.

ఇహ తప్పెట్టు లేదు అనుకొని "మొదలైతే చేసాను కాని ఇప్పుడు టాపాలు రాసె మూడ్‌ లేదు రా.......ఓ నెల రోజుల నుండి నా టైమ్‌ ఏం బాగోలేదు.....అనుకున్నది ఒక్కటి కూడా జరగటం లేదు.....అన్ని ఆశలు చెదిరిపోతున్నాయి చాలా disappointingగా , విసుగ్గా, చిరాగ్గా, బాధగా......రకరకాలుగా ఉంది.....అందుకె దాన్ని లైట్‌ తీసుకున్నా.....బ్లాగుని మూసేద్దాం అని కూడా అనుకుంటున్నా..."తల పట్టుకుంటూ కుర్చీలో వాలిపోయాను.
"ఎదురుదెబ్బలు,ఆశాభంగాలు, టైమ్‌బాడ్‌లు లేనిది ఎవరికి......ఆ మాత్రం దానికే అంతా నాశనం అయినంత ఫీలవ్వాలా.....బాధలు బ్లాగితే సగమౌతాయ్ సంతోషాలు బ్లాగితే రెట్టింపు అవుతాయి.....ఈ మాత్రం జనరల్‌ నాలెడ్జ్ లేదుగాని ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోతున్నారు....ప్చ్.......అయన్ని పట్టించుకోకు.......నీకు అందాల్సినవి అందకుండా పోవు......ఇవాళ కాకపోతే రేపు వస్తాయి.....వాటి కోసం మిగతా వాటిని వదిలేస్తే చివరికి నిజంగానే ఏడుస్తూ కూచుంటావ్...." దగ్గరికి వచ్చి హితబోధ ఇచ్చాడు బ్లాగారాం.
"నీ గోల నీదె కాని నా సంగతి పట్టాదా......నాకిప్పుడు రాసె మూడ్‌ లేదు.....ఉన్నా ఏం రాయాలి....బుర్రంతా బ్లాంక్‌గా ఉంది....రాసినాకాని ఎవడు చూసాడు, ఎంతమంది చూసారు...వీటికితోడు కామెంట్ల గోల.....ఎవడు మెచ్చుకుంటాడొ ఎవడు తిట్టిపోస్తాడో అన్న టెన్షన్‌.......ఎహె...ఇది అంతా అవసరమా నాకు.......లైట్‌ తీసుకోని ఈ విషయం వదిలెయ్" అని అన్నాను. వాడు కూడా నా మూడ్‌లోకె వచ్చెసి "ఇంకా మొదలేపెట్టలేదుగాని అప్పుడె కామెంట్ల దాకా పోయావా.......అడ్డెడ్డెడ్డె...ఏం....త ముందుచూపు రా నీది......నీ ఎంకమ్మ.......రాయడానికి నీ బుర్ర ఉపయోగించమని ఎవడు అన్నాడు....పేపర్లు, టీవి వాళ్ళు చెప్పెదాంట్లొనే ఏ అర్థం ఉండిచావట్ల ఈమధ్యన.......ఏది తోస్తె అది రాసిపారై.....తలుపు గొళ్లెం, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం కాదెది కవితకనర్హం అన్నాడు ఓ పెద్దాయన....అట్లాగే.....ఇనప ముక్క, వలపు చెక్క, మనిషి తిక్క కాదేది బ్లాగుకనర్హం...........కావాలోయ్ బ్లాగావేశం......కాబట్టి నే చెప్పొచెదేటంటే.....నువ్వు ఇది అది అని లేకుండా నీకు తోచింది బ్లాగిపారెయి.....తరువాత ఎవడైనా ఎమ్మనా అంటే నే చూసుకుంటా" భరోసా ఇచ్చడు బ్లాగారాం.

లోపలి నుండి అంత దన్ను తన్నుకువస్తుంటే ఆపే శక్తి ఎవరికి ఉంటుంది.....వాణ్ణి నా ట్రాక్‌లో తెచ్చుకుందాం అనుకుంటే నేనె వాడి దారిలో వచ్చెసాను...."సరె నువ్వు అంతగా రెచ్చిపొమ్మంటే ఇక ఆగడం దేనికి.....ఇవాళే బ్లాగు పునురుద్దరణ చేసి బ్లాగడం మొదలు పెడతా" అని అనంగానే బ్లాగారాం గాడు ఆర్కెమెడిస్ టైపులో ‘యురేకా’ అని చిందేసాడు.వాడిని శాంతింపచేయటానికి నా తలప్రాణం అరికాళ్ళలోకి వచ్చింది. నేను ఇక బ్లాగు సంగతి చూసుకుంటా నువ్వు వెళ్ళు అన్నా,"ఇంతసేపు లెక్చర్‌ ఇచ్చింది నీకు చెప్పేసి వేళ్ళిపోతందుకారా.....ఆ షురు చెశెడ్‌ది ఏందో నా ముంగల్నె చెయ్యి...చూసెల్త" చాక్లెట్‌ కొనివ్వమని భిష్మించుకునే పిల్లాడిలా చేతులు ముడుచుకొని నిలబడ్డాడు బ్లాగారాం.

"నీ ఇష్టం..." అని చెప్పి రాయడం మొదలుపెట్టా "సోదర సోదరిమణుళ్ళారా..."అని ఫ్లొలొ వెళ్తుంటే వెనకనుండి అప్పుడె కామెంట్లు ఎక్కుపెట్టాడు. "ఏరా.... నువ్వేమైనా ఆల్ ఇండియా మహిళా మండలికి లీడరువా......‘సోదరిమణళ్ళారా’ అంటున్నవ్......కలరింగ్‌ అవసరం లేదు మాములుగా ఉన్నది ఉన్నట్టు చెప్పు" ఓ మొట్టికాయ వేసి అన్నాడు. "హి హి హి సారి....ఆవేశంలో స్పెల్లింగ్‌ తప్పు చేసాను" ఓ వెధవ నవ్వు నవ్వుతూ చెప్పాను.
"మై బ్రదర్స్......అండ్‌ మై డియర్ లేడిస్‌.....నా అంతరాత్మ చేసిన జ్ఞానోదయం వల్ల ఓ మూల పడెసిన ఈ బ్లాగుని పునురుద్దరిస్తున్నాను. ఇకపై ఇందులో సప్తవర్ణ సహిత, నవరసభరిత, షడ్రసోపేత టాపాలు అందిస్తానని...."రాస్తుండాగానె మళ్లా తలమీద ఓ దెబ్బేసి "ఇంత కిచిడి చేస్తే జనాలు వాంతులు చేసుకొని నిన్నూ నీ బ్లాగుని పాడెక్కించెస్తారు....అప్పుడు నేను స్పెసల్‌గా రానాక్కర్ల.....నువ్వు నేను డై...రెక్టుగా కలుసుకోచ్చు"అని అచ్చే అవని నా టాపా ఫ్రీగా ఇంకొ కామెంట్ ఇచ్చాడు.
"రెయ్ నువ్వు ఇలాగే కెలుకుతూ ఉంటే బ్లాగడం నా వల్లకాదు" అనేసి ఒక్కటంటే ఒకె ముక్క బ్లాగాను
"కద మొదలెట్టాను.......కనిపెట్టుకునుండండే...."

ShareThis