The joy of wonderful life

ఏ తరగతిలోనో గుర్తులేదుగాని స్కూల్ రోజుల్లో  మాకొక ఇంగ్లీష్ పాఠం ఉండేది. దక్షిణాఫ్రికాలోని  
డా.క్రిష్టియన్ బెర్నాడ్‌కు (ప్రపంచంలో మొట్టమొదటి మానవ హృదయమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు ఈయన) మానవ జీవితంలోని బాధ, వ్యధ పట్ల ఒక ధృక్పథాన్ని, జీవితం గొప్పదానాన్ని తెలియజేసిన ఒక అనుభవం గురించి ఆ పాఠం. ఒకనాడు డాక్టర్ గారు, ఆయన భార్య రెస్టారెంట్ నుండి తిరిగొస్తూ రోడ్డు దాటుతుంటే కారు గుద్దడంవల్ల పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఇద్దరికీ. ఎందరికో వైద్యం చేసిన ఆయనే కొన్నిరోజుల పాటు ఆసుపత్రి పడకమీద ఉండాల్సివచ్చేసరికి ఎందరో పేషంట్స్‌కు తన అవసరం ఉండగా, తామిద్దరి ఆలనపాలన అవసరమైన చంటిపిల్లలు ఉండగా తమకే ఎందుకిలా జరిగిందనీ.. మానవ జీవితంలో కష్టాలు బాధలూ తప్పనిసరి బరువేనా అని దిగులు పడుతూ అప్పటికి యేడేళ్ల క్రితం ఎదురైన సంఘటనను గుర్తుతెచ్చుకుంటాడు. అదే పాఠంలోని ముఖ్యమైన భాగం. ఒకరోజు డాక్టర్ గారు పిల్లల వార్డులో తిగుతుండగా నర్సులు అలానే వదిలేసి వెళ్ళిపోయిన బ్రేక్‌ఫాస్ట్ ట్రాలీని ఇద్దరు పిల్లలు ’లాగేసుకొని’ వార్డులో ఫార్ములా-వన్ రేసులాగా నడుపుతుంటారు. వెనక వైపు నుండి ఒక పిల్లాడు మెకానిక్ పాత్రని నిర్వహిస్తూ ట్రాలీని తోస్తూవుంటే ముందు భాగంలో కూర్చొని మరో పిల్లాడు డ్రయివింగ్ చేస్తుంటాడు.. వార్డ్‌లోని మిగతా పిల్లలు హర్షధ్వానాలతో వీళ్లను సపోర్ట్ చేస్తారు.  ఈ ఇద్దరు పిల్లల గురించి డాక్టర్ గారు చెబుతూ ఆ మెకానిక్ అబ్బాయి తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారట, ఒకనాడు ఆ గొడవల్లో పిల్లావాడి తల్లి భర్త మీదకు లాంతరు దీపాన్ని విసిరేస్తే అది గురితప్పి ఈ అబ్బాయి మొహం మీద పడుతుంది.. మొహంపై మంటలు అంటుకోవడంతో అతని చూపు పోతుంది. ఎన్నో సర్జరీల తరువాత కూడా ఆ అబ్బాయి మొహం పై చర్మం జారగిలబడుతూ చూడడానికి చాలా వికృతంగా కనిపించేవాడట. ఇక ఆ డ్రైవర్ అబ్బాయికి అంతకు కొన్నాళ్ల క్రితమే ఒక హృద్రోగ సమస్య నిమిత్తం బెర్నాడ్ గారు వైద్యం చేశారు, కాని ఎముకల్లో ట్యూమర్ రావడంతో అతడిని మళ్ళీ హస్పటల్‌లో చేరుస్తారు. రేస్ జరిగిన కొద్దిరోజుల ముందే ఆ డ్రైవర్ పిల్లాడి చేయినొకదాన్ని తీసేయాల్సివస్తుంది.. ట్యూమర్ కారణంగా.

అంతటి విషాదకరమైన కష్టంలో  ఉండీ కూడా ఆ పిల్లలు రేసు ముగించాక బర్నార్డ్‌ దగ్గరికొచ్చి ’మేం గెలిచాం’ అని గర్వంగా చెప్పారట. బాధ, కష్టం తాలుకు నీడలేవి దరిజేరనీయకుండా సంతోషంగా కనిపించిన ఆ క్షణం ఆ ఇద్దరు పిల్లలూ తనకు అత్యంత విలువైన సత్యాన్ని తెలియజేసారనీ, బ్రతికుండటంలోని మాధుర్యాన్ని ప్రతీక్షణం ఆస్వాదించడమే జీవితపు సారమని గుర్తుచేసుకుంటారు. కష్టాలు పడ్డాము కాబట్టి వ్యక్తిగా ఎదగమూ కాని ఆ కష్టాల తాలుకు అనుభవం (సానుకూల ధృక్పథం ఉంటే) మనల్ని వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని చెప్తారు.
I had been looking at suffering from the wrong end. You don’t become a better person because you are suffering; but you become a better person because you have experienced suffering.These children showed me that it’s not what you’ve lost that’s important. What is important is what you have left.

The Business of living is the celebration of being alive.
   -- Dr. Barnard

 ఇదే సందేశాన్ని ఇచ్చిన ఒక మంచి సినిమా గురించి చెప్పుకుందామిపుడు. 1946 లో విడుదలైన 'It's a Wonderful Life'  అమెరికన్ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆణిముత్యం. క్రిస్‌మస్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఆ తరువాతి కాలంలో క్లాసిక్ స్థాయిని అందుకొంది. జీవితంలోని ఆనందాన్ని, జీవించేందుకు స్ఫూర్తిని నింపగలిగే చిత్రాల్లో ముందువరసలో ఉంటుంది. శివరాత్రి నాడు ఎలాగైతే మనకు భూకైలాస్ చూడటం అలవాటైపోయిందో అలానే ఒకప్పుడు అమెరికన్ టీవి ఛానెళ్ళు క్రిస్‌మస్ సందర్భంగా ఈ సినిమాను ప్రదర్శించేవట. సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ టైటిల్స్ పూర్తవగానే క్రిస్‌మస్‌‌కు ముందురోజు సాయంత్రాన అమెరికాలోని Bedford Falls అనే ఊళ్లో ముసలీ ముతకా పిల్లాపీచు చిన్నాపెద్దా ఆడమగా తేడా లేకుండా కథానాయకుడైన జార్జ్ బెయిలి అనే వ్యక్తి బాగుండాలి, అతనికి సహాయం చేయండనే ప్రార్ధనలతో మొదలౌతుంది. ఆ ప్రార్దనలు తారాలోకంలోని దేవతలకు చేరి మన కథానాయకుడికి సహాయం చేయడానికి క్లారెన్స్ (Clarence) అనే దేవదూతను పంపిస్తారు. సాయం చేయమని Bedford Falls ప్రజలు ఎందుకు కోరుకున్నారో, అతనికి క్లారెన్స్ ఏవిధంగా సహాయం చేశాడో తెల్సుకునేముందు జార్జ్ బెయిలి గురించి తెలుసుకుందాము.

Bedford Falls అనేది న్యూయార్క్ పరిసరాల్లోని ఒక ఊహాజినిత ఊరు... మన దగ్గర ఆర్కే.నారాయణ్ గారి మాల్గుడి లాగ. ఆ బెడ్‌ఫోర్డ్ ఫాల్స్ లో టాక్సీలనుండి థియేటర్లదాకా బ్యాంకుల నుండీ బిల్డింగులదాకా చాలా వారకు Mr.Potter అనే వ్యాపారస్థుడి చేతుల్లో ఉంటుంది. డబ్బు మీద ఆ ఊరి మీద పెత్తనం పై విపరీతమైన ఆశ. ఆయనకున్న ఎన్నెన్నో వ్యాపారాల్లో ఆ ఊళ్ళో ప్రజలకు చాలీచాలని ‘కొంప’లను  అద్దెకు ఇవ్వడం ఒకటి. అదే ఊళ్ళో Peter Bailey అనే ఆయన సామాన్యుడు ఎప్పుడో పదవి విరమణ వయసు వచ్చినపుడు కాకుండా పిల్లలు పిల్లలుగా ఉన్నపుడే  అందుబాటు ధరలో సొంతింటిని  కట్టుకోగలగాలనే ఆశయంతో  'Building and Loans' అనే సంస్థను నడుపుతూంటాడు. మనసున్న మనిషి. ఆ సంస్థను కూడా సొంతం చేసుకుంటే ఇక ఊరు మొత్తం తన గుప్పిట్లో ఉంటుందని అందులో వాటాదారుగా చేరతాడు Potter  కాని పీటర్ పట్టుదల కారణంగా అది అడియాశగానే ఉండిపోతుంది.  Peter Bailey కి ఇద్దరు కొడుకులు.. ఆ ఇద్దరిలో పెద్దవాడే మన కథానాయకుడు జార్జ్ బెయిలి.


హైస్కూల్ చదువు అయ్యాక దేశవిదేశాలు చుట్టేసి కాలేజిలో ఉన్నతవిద్య అభ్యసించాలని చిన్నప్పటినుండి ఉవ్విళ్ళూరుతూంటాడు. కాలేజి చదువు అయ్యాక ఆ ఊళ్ళోనుండి బయటకొచ్చేసి పెద్ద పెద్ద టవర్లు, బ్రిడ్జిలూ, రహదార్లు కట్టేయాలని ప్లాన్ అతనిది. భవిష్యత్తులోని వచ్చే క్షణంలో, వచ్చే రోజులో, వచ్చే సంత్సరంలో ...ఆ వచ్చే సంవత్సరంలో ఏమేం చేయాలో తన దగ్గర పక్కా ప్లాన్ ఉంది. అయితే మనం వేసుకున్న ప్లాన్స్ కన్నా గొప్పదీ సంక్లిష్టమైన మాష్టర్‌ ప్లానొకటి తలరాత రాసేవాడి దగ్గర ఉంటుంది. ఎవరి ప్రణాలికకు బంగారు మెరుగులు అద్దుతాడో, ఎవరి ప్రణాలికలను పేకమేడలా కూల్చుతాడో ఆ పైవాడికే ఎరుక. తమ్ముడి హైస్కూల్ చదువు పూర్తయ్యాక అతడిని Building and Loans లో తన స్థానంలో తండ్రికి చేదోడుగా చేర్చి తను ప్రపంచ యాత్రకు బయల్దేరబోతున్న తరుణంలో గుండెపోటు కారణంగా తండ్రి మరణించాడనే వార్త తెలుస్తుంది. తండ్రి హఠాత్మరణంతో తన ప్రయాణ ఏర్పాట్లన్నీ వాయిదా వేసుకొని కొన్ని నెలలపాటు సంస్థ కార్యకలాపాలు చక్కదిద్దుతాడు...అవన్నీ కొలిక్కి వచ్చాక సంస్థలోని బోర్డ్‌ ఆఫ్ మెంబర్స్‌కు దాన్ని అప్పజెప్పేసి కాలేజి చదువు కోసం వెళ్ళాలి అనుకుంటాడు. పీటర్ చనిపోవడం, జార్జ్ బెయిలి వెళ్ళిపోవాలనుకోవడంతో ఇదే అదనుగా సంస్థను రద్దు చేసేద్దామని Potter ఒత్తిడి తెస్తాడు. ఇది గ్రహించిన జార్జ్ అందుకు ససేమీరా ఒప్పుకోడు కాని సంస్థ కొనసాగాలంటే Potter పాలబడకుండా ఉండాలంటే జార్జ్ సారధ్య బాధ్యతలు తీసుకోవాలని బోర్డ్‌ ఆఫ్ మెంబర్స్ తీర్మానించడంతో జార్జ్  ఆ ఊళ్ళోనే ఉండిపోవాల్సొస్తుంది. ఈ పరిస్థితిలో కూడా జార్జ్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. తన బదులు తమ్ముడు హ్యారిని కాలేజి చదువులకు పంపించి అతను తిరిగొచ్చాక బిజినెస్ అప్పగించేసి తన ప్రపంచయాత్ర, చదువు పూర్తిచేయాలని.

అయితే విధి మరోలా తలచింది. కాలేజి చదువు పూర్తి చేసుకున్న హ్యారి భార్యా సమేతంగా దిగిపోతాడు హ్యారికి అతని మామగారు న్యూయార్క్‌లోని ఆయన ఫ్యాక్టరిలో మంచి ఉగ్యోదమిచ్చాడని తెలుసుకుంటాడు. తను అడిగితే తమ్ముడు కాదనడని తెలిసినా అతనికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజి వెళ్ళాలనే ప్లాన్‌ను పూర్తిగా చెరిపివేస్తాడు.
అప్పుడే తనని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న మేరి‌ని చాలా రోజుల తరువాత కలుసుకుంటాడు.మేరి ఇంకా తననే కావాలి అనుకుంటుందని గ్రహిస్తాడు. అంటే మనవాడేం తక్కువకాదు ఆ అమ్మాయి కోరుకుంటే నింగిలోని జాబిల్లిని తాడు వేసి భూమ్మీదకు దించేస్తాననేంతగా ప్రేమిస్తాడు. సంస్థ బాధ్యతల్లో మునిగిపోవడం, మేరి కూడా ఇన్నిరోజులూ చదువు కోసం వేరే ఊళ్ళో ఉండడంతో  ప్రేమ అనే విషయాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు మేరి తిరిగిచ్చేయడంతో, ‘నువ్వూ ఒక ఇంటివాడివి అవ్వూ’ అని తల్లి నచ్చజెప్పడంతో చిన్ననాటి ప్రియురాలిని జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు.

తమ్ముడు కూడా వెళ్ళిపోవడంతో  Building and Loan బాధ్యతల్లో, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మధ్యతరగతి మనిషికి సొంతింటిని కట్టివ్వాలనే పనిలో పూర్తిగా మునిగిపోతాడు జార్జ్. ఎంతోమందికి అందుబాటు ధరలో చక్కని వసతులతో వాళ్ళు కావాలనుకునే పొదరింటిని కట్టిస్తాడు. మేరి కూడా అతనికి తన సహాయసహకారాలు అందిస్తుంటుంది. మరోపక్కన Potter తనకు వీలైనపుడల్లా జార్జ్ ను‌ ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెడుతుంటాడు.  పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బుతో పెళ్ళయ్యక హని‌మూన్ వెళ్లబోతుంటే సంస్థలో ఎదో అలజడి రేపి అతని ట్రిప్‌ను చెడగొడతాడు. వారానికి  నలభైఐదు డాలర్ల సంపాదనతో, పది డాలర్ల  పొదుపుతో (ఇప్పుడైతే అమెరికాలో పనిచేసే ఐటి ఉద్యోగి ఒక గంటలో సంపాదించే సగటు వేతనం సుమారు 30-90 డాలర్లు) నెట్టుకొస్తున్న జార్జ్ ‌కు సంవత్సరానికి ఇరవై వేల డాలర్ల ఆశ చూపించి అతడినీ, తద్వారా పోటీగా ఉన్న Building and Loan ను హస్తగతం చేసుకోవాలి అనుకుంటాడు. కాని ఇవిదేనికీ జార్జ్ లొంగకుండా ఉంటాడు.

ఇలాంటి ఒడిదొడుకుల మధ్య సంవత్సరాలు దొర్లిపోతాయి. సినిమాలో ప్రస్తుత కాలానికి వస్తాము...క్రిస్‌మస్‌కు ముందురోజు సాయంకాలమది. జార్జ్‌వాళ్ళు బ్యాంక్‌కు బాకీపడిపోయిన ఎనిమిది వేల డాలర్లు ‘కనిపించకుండా పోతాయి’. ఆరోజు కల్లా డబ్బు జమచేయకపోత బ్యాంకు అతడిని ఎగవేతదారు క్రింద జమకట్టి, సంస్థ దివాళా తీసిందని ప్రకటించి జైల్లో పెడుతుంది. గత్యంతరం లేని ఈ పరిస్థితిలో అత్మాభిమానం చంపుకొని పాట్టర్‌ను సహాయం చేయమని అర్దిస్తే సహాయం అటుంచి జార్జ్‌ను హేళన చేస్తాడు, అవమానిస్తాడు. పరువుమర్యాద మంటకలసిపోతాయని భయపడి, ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గమే లేదని, దివాళాతీసి  జైలుకెళితే తన భార్యాపిల్లలు దిక్కులేనివారు అవుతారని, పాట్టర్ ఊరు మొత్తాన్ని తన చేతుల్లో తీసేసుకుంటాడని..ఇన్నేళ్ల తన ప్రయాస వృథా అయిందని వ్యధచెంది జార్జ్ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుందామని.

అప్పుడే మన దేవదూత క్లారెన్స్ రంగంలోక దిగుతాడు. మొదట్లో క్లారెన్స్‌ను మతిభ్రమించినవాడుగా అనుకుంటాడు జార్జ్, దేవదూతవైతే రెక్కలేవని జోక్ చేస్తాడు. కథల్లో, సినిమాల్లో దేవదూతలంటే శ్వేతాంబరధారులై, చేతిలో మంత్రదండంతో, రెక్కలు ఉన్నట్టు చూపిస్తారుకదా అలానే మన కథానాయకుడూ అనుకుంటాడు. తరువాత్తరువాత జార్జ్ ఇన్నేళ్ళ తన జీవితంలో సాధించినదేమిటో అది తెలుసుకునేందుకు క్లారెన్స్ వాడిన పద్ధతేంటో అతడికి మెల్లిమెల్లిగా అర్దమవుతుంది, క్లారెన్స్ పై నమ్మకం కుదురుతుంది. అతడికి జీవితం పై మళ్ళీ ఆశ చిగురిస్తుంది...బ్రతుకుతో పోల్చుకుంటే అప్పుడు తనకు ఎదురైన సమస్య దూదిపింజమంత తేలికైందని గ్రహిస్తాడు.  అసలు ఏం చేసి క్లారెన్స్ జార్జ్ మనసు మార్చాడు? వారానికి నలభైఅయిదు డాలర్లు సంపాదించే జార్జ్ ఆ రాత్రి గడిచేకల్లా ఆ ఊళ్లోకెల్లా ధనవంతుడెలా అయ్యాడనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఆ సంతోషాన్ని స్వయంగా చూసి అనభవించాల్సిందే :)


చక్కని కథనం, సంభాషణలతో మనసుకు హత్తుకునేలా సాగిపోతుంది సినిమా. తన కోరికలు, ఆశలు ఒక్కొక్కటే తొలగిపోతుంటే బాధ్యతల తాలుకు బరువును మోస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో జార్జ్ పడే మానసిక సంఘర్షను అత్యద్భుతంగా పోషించాడు అమెరికన్ స్క్రీన్ లెజెండ్ James Stewart.  డబ్బు, పెత్తనం మీద విపరీతమైన వ్యామోహంతో...జార్జ్‌ను ఇబ్బంది పెడుతూండే పాత్రలో మన రావుగోపలరావు, రంగారావులను తలపిస్తూ అంతే గొప్పగా నటించారు Lionel Barrymore. భర్త మనసు తెలుకొని నడుచుకునే ఇల్లాలిగా పాత్రోచితంగా నటించారు Donna Reed.  ఇక నిడివి తక్కువే అయినే క్లారెన్స్ పాత్రతో చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటారు Henry Travers.
Strange, isn't it? Each man's life touches so many other lives. When he isn't around he leaves an awful hole, doesn't he?
No man is a failure who has friends.
  -- Clarence

పూజలూ పునస్కారాలు యజ్ఞయాగాలు కఠోరమైన తపస్సులు ప్రార్దనలూ ఇవేవీ అవసరం లేకుండానే మనమేమి అడగకుండానే మనపై అనంతమైన ప్రేమతో సృష్టిస్థితిలయ కారకుడైన ఆ భగవంతుడు ఇచ్చిన అతిగొప్ప వరం ఈ జీవితం. దానిని నిలుపుకోవడమో, నిర్లక్ష్యం చేయడమో పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చూడగలిగితే పైకి కనపడని క్లారెన్స్‌లు మనమధ్యే తిరుగుతూ ఉంటారు.

******************************************************************

ఈ సినిమా గరించి బ్లాగర్ మధురవాణి గారి పరిచయం ఇక్కడ చదవచ్చు.
Christiaan Barnard గారి పాఠం ఇక్కడ

******************************************************************

క్రిస్‌మస్, నూతన సంవత్సర సందర్భంగా అందినదే ఛాన్స్ అని SMS, internet అనే తేడా లేకుండా మొబైల్ ఆపరేటర్లు రేట్లు పెంచేశారట. రేపోమాపో ఈ గూగులోడూ అలాగే చేస్తాడేమోనని (చెయ్యడులెండి.. ఎందుకంటే బేసిగ్గా వీడు మంచోడు:) )  సందేహానుమానంతో,  ‘ఇంధ్రధనస్సు’ పాఠకులందరికీ కొంచెం ముందుగానే  నూతన సంవత్సర శుభాకాంక్షలు ... Happy holidays and have fun :)


3 వ్యాఖ్యలు.. :

జయ said...

చాలా బాగుంది నాగార్జునా. అద్భుతం...నాకు భలే నచ్చింది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శిశిర said...

>>>కష్టాలు పడ్డాము కాబట్టి వ్యక్తిగా ఎదగమూ కాని ఆ కష్టాల తాలుకు అనుభవం (సానుకూల ధృక్పథం ఉంటే) మనల్ని వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని చెప్తారు.<<,
>>>You don’t become a better person because you are suffering; but you become a better person because you have experienced suffering. <<<

Thanks for the post.

..nagarjuna.. said...

ధన్యవాదాలు జయగారు, శిశిరగారు.

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis