భగవంతుడికి మోక్షం వుంటుందా ?

ముందుగా టపా శీర్షికకు అంతగా సంబంధంలేని ఓ విషయం మాట్లాడుకుందాం. సృష్టిరచన జరగకముందు, వివిధ మతాలనూ తత్వాలనూబట్టి, శూన్యమో దేవుడో ఉండేది (భగవంతుడికి లింగం లేదు గనక ఉండేది అంటే సమంజసమేనని అనుకుంటున్నా). దేవుడు ఆజ్ఞాపించగానే శూన్యంలోని శక్తి మార్పుచెంది ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చరాచర జగత్తుగా రూపుదాల్చింది. కొంచెం లోతుగా చూస్తే శక్తి మొదట పదార్ధంగా మారి ఆపైన పరమాణువుగా, అణువుగా, మూలకంగా... ఈ క్రమానుసారంగా ప్రాణిగా రూపాంతరం చెందింది. ప్రాణికి ఉండే 'బుద్ది' కారణంగా అది ఆలోచించగలదు. భౌతిక శాస్త్ర నియమం ప్రకారం దేన్నీకూడా ఏమీలేని శూన్యం నుండి సృష్టించలేము. శక్తిని సృష్టించలేము దాన్ని కేవలం ఒక స్వరూపం నుండి మరొక స్వరూపంలోకి మాత్రమే మార్చగలం. అంటే బుద్ది కూడా శక్తి స్వరూపమే అయ్యుండాలి అయితే నిర్గుణమైన శక్తి క్రమపద్దతిలో 'బుద్ది'గా మారిన తరువాత దానికి ఏదో ఒక గుణం చేకూరడం ఆశ్చర్యకరం. ఇప్పుడు మళ్లీ బుద్ది ఉన్న ప్రాణి దగ్గరికి వద్దాం. ప్రాణుల్లో వాటివాటి పరిమాణక్రమాన్ని అనుసరించి, అంటే ప్రాణుల్లో ఉత్కృష్టమైనవి మోక్షన్ని కోరుకుంటాయట. వాటి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షానికి మోక్షానికి మధ్య ఆత్మ/ప్రాణి సాగించే యాత్రే జనన మరణాలు అని అంటువుంటారు. మార్పుంటూలేని, స్వఛ్చమైన, నిర్మలమైన ఆ మోక్షం ఏమై వుండవచ్చు ? సృష్టిరచన జరిగేముందు ఉన్న శక్తి కావచ్చునా ? సృష్టిరచన ఉద్దేశ్యం మరొక సృష్టి అవసరంలేని శక్తి సహిత శూన్యంలోకి వెళ్లడమా ?

ఇక టపా శీర్షిక గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి హైందవ ధర్మంలో, బౌద్ధంలో మోక్షమనే జనన-మరణరహిత స్థితి ఉంటుంది. దేవుడి ఇఛ్చనుబట్టి, ప్రాణి పూర్వకర్మలనుబట్టి మోక్షస్థితి పొందటమా లేక మరోసారి జన్మనెత్తడమా నిర్ణయించబడుతుందట.  ఇస్లాం, క్రైస్తవంలో ఇటువంటిది లేదనుకుంటా. ఆ మతాల్లో దేవుడు ప్రాణులని సృష్టిస్తాడు సుకర్మలద్వారా ధర్మాచరణ చేసిన ప్రాణులకు ఉర్ద్వలోకాల్లో సుఖసంతోషాలను ఇస్తాడు. ఐతే ఈ అన్నీ ధర్మాలలో, మతాలలో దేవుడు నిరంతరం సృష్టిరచన చేస్తూనే ఉంటాడు. హైందవ ధర్మం తీసుకుంటే కొన్ని మహాయుగాల తరువాత ప్రళయంలో సృష్టి అంతా లయమౌతుంది ఆ తరువాత కొత్త సృష్టి మొదలౌతుంది(ట). మిగతా మతాలలో దేవుడనేవాడు ప్రాణులను సృష్టించడం నిరంతరం చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. ఐతే సర్వజ్ఞుడైన దేవుడికి ప్రాణిని సృష్టించాల్సిన అవసరం ఏముంది ? తను తప్ప మరెవరూలేనపుడు ఎవరికి ఏం తెలియజేద్దామని సృష్టిని చేసాడు ? పైన చెప్పుకున్నట్టు దేవుడు నిరంతరం సృష్టిరచన చేయడానికి బద్దుడైతే అతను మోక్షప్రదాత ఎలా కాగలడు ? 
If He knows all and every thing why then there is a creation ?

If He is not free Himself, how can he free others ?

8 వ్యాఖ్యలు.. :

కొత్త పాళీ said...

Deep stuff, man!
Everything alright with you??
ఇటీవల ప్రేమలో ఫెయిలవడం, కొత్తగా ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం లాంటి ఉపద్రవాలేమీ జరగలేదు కద??

శిశిర said...

మతమనేది మనిషి మనుగడ సరైన దిశగా సాగడానికి ఒక ఊతమేమో! నువ్వు తాగితే ఆరోగ్యం పాడవుతుంది, తాగకు అని ఏ డాక్టరో చెప్పినా వినని మనిషి ఈ ఫలానా పుణ్య దినాన నువ్వు తాగితే మహాపాపం అన్నమాట విని ఆరోజు రాత్రి 12 దాటేవరకూ ఓపిగ్గా ఎదురుచూసి మరీ అప్పుడు తాగుతాడు. :) ఈ మోక్షసాధనలూ అవీ కూడా అలాంటివేనేమో. మోక్షం అంటే జనన రహిత స్థితి అని చెప్పడంవల్ల మనిషి ఈ జన్మలోనే అన్ని రకాల కష్ట సుఖాలనూ చూస్తూండడం వల్ల మరు జన్మ పట్ల అయిష్టతతో, సత్కర్మలు చేస్తే మోక్షం కలుగుతుందన్న నమ్మకంతో మంచి పనులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతాడు. సమాజంలోని మనుషులందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటే సమాజం బాగుంటుందన్న నమ్మకంతో అన్ని మతాలలోనూ ఇలాంటివి చెప్పారేమో అని నా ఆలోచన.

ఇక "If He knows all and every thing why then there is a creation ?"

మనిషి తనకి ఎప్పటికైనా మరణం తప్పదని తెలిసీ చివరి క్షణం వరకూ మంచో, చెడో, తప్పో, ఒప్పో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. సృష్టికర్త విషయంలోనూ ఇలాంటి లాజిక్ ఏదైనా ఉందేమో. ఆలోచించండి.:) మనిషి ఈ కర్మలన్నీ చేయడానికి కూడా తనకు తెలియకుండానే తనకు తెలియని ఆ దేవుడి లాజిక్ ఫాలో కావడమే కారణమేమో. :)

..nagarjuna.. said...

@కొత్తపాళిగారుః బానేవున్నానండీ, తెలుసుకోవడం ఎక్కువౌతుంటే ప్రశ్నలు కూడా ఎక్కువౌతున్నాయి.
BTW, పెళ్ళిని ఉపద్రవం అనేశారు! మీ ఇంట్లోవాళ్ళు బ్లాగులు చూడరా ;)
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

@శిశిరః మనిషిని సరియైన మార్గంలో నడిపించడానికి విశ్వాసాలను (మతాలు, ధర్మాలు వగైరా) ఏర్పరుచుకున్నాము అని అంటే వాటిలో exaggerations లేకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అలా కాకుండా అవి 'నిజం' అయినపుడు మనకు తెలిసినవాటిలో విస్పష్టమైంది ఎదో తెలుసుకోవాలని నా కుతూహలం.

>>మరణం తప్పదని తెలిసీ చివరి క్షణం వరకూ మంచో, చెడో, తప్పో, ఒప్పో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. సృష్టికర్త విషయంలోనూ ఇలాంటి లాజిక్ <<
అరిషడ్వర్గాలు, సుగుణ-దుర్గుణాలున్న మనిషి పోలికలను పరమాత్మకు కూడా ఆపాదించటమా ! పరమాత్మకు కూడా రాగద్వేషాలా !?
పోతే మీరన్న ఆఖరి వాక్యం కాస్త అయోమయంగావుంది .
వ్యాఖ్యకు ధన్యవాదాలు :)

శిశిర said...

:) నేనన్నది పరమాత్మకి మనిషి పోలికలని ఆపాదించమని కాదండీ. "ఈ లాజిక్" కాదు.
"ఇలాంటి లాజిక్" ఏదైనా ఉందేమో ఆలోచించండి అని. రాగద్వేషాలని, మనుషుల పోలికలని భగవంతుడికి ఆపాదించమని కాదు. చివరి మజిలీ మరణమేనని తెలిసీ మనిషి ఆ మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చోనట్టే, మీరన్నట్టు ("తను తప్ప మరెవరూలేనపుడు") తను తప్ప మరెవరూ లేరని తెలిసినా నిరంతరం సృష్టిరచన చేయడం వెనుక మనకి తెలియని ఇలాంటి కారణం ఏదైనా ఉండవచ్చేమో అని నా ఉద్దేశ్యం. అంతేకానీ భగవంతుడికి రాగద్వేషాలని ఆపాదించమని కాదు. :)
నా ఆఖరి వాక్యం
"అన్నీ తెలిసిన పరమాత్మ నిరంతర సృష్టి రచన ఎందుకు చేస్తున్నట్టు" అని కదా మీ మీమాంస. భగవంతుని నిరంతర సృష్టి రచన వెనుక ఉన్న కారణం తెలియని మనిషి తాను కూడా అలాంటి చక్రాన్నే అనుసరిస్తున్నాడు అని (మరణించే వరకూ ఏదో ఒకటి చేస్తుండడం). భగవంతుడు నిర్దేశించిన విధంగా మనిషి కర్మలు ఉంటున్నాయని నా అభిప్రాయం. మనిషి గుణదోషాలు భగవంతునికి ఆపాదించడం కాదు.

..nagarjuna.. said...

క్షమించాలి, 'కోరిక', 'ఆశ' లాంటి పదాలు కాకుండా రాగద్వేషాలు అంటూ negative అర్ధం వచ్చే పదాలు వాడాను. ఐతే దేవుడికి కూడా తప్పించుకోలేని ( తనకు కలిగిన ఓకానొక కోరిక మూలంగానైనా ) ఓ 'కారణం' ఉండొచ్చు అంటారు హ్మ్... !

కాకతాళీయంగా నిన్నటి 'ఈనాడు' ఆదివారం సంచికలో వచ్చిన ఈ వ్యాసం, Indian Minerva గారి బ్లాగుపోస్ట్ కొంతవరకు నా అనుమానాలను తీర్చాయి. మన ఉనికి కు కారణమైన ఆ 'కారణం' తన సృష్టికి సంబంధించినంత వరకే తప్ప పరిపూర్ణంగా all powerful, all knowing కాదేమో ? సమాధానం ఎన్నటికి దొరికేనో !

ఆ.సౌమ్య said...

వామ్మోయ్...ఏంటి ఈ ప్రశ్నలు!

మీ చర్చ బావుంది. కాస్త తీరికగా చదివి మళ్ళీ వస్తా!

bondalapati said...

ఐన్-స్టీనుడు కూడా pantheistic God నే నమ్మాడు. pantheistic God కీ నాస్తికత్వానికీ పెద్ద తేడా లేదు. నా ఈ పోస్ట్ లు ఆల్రెడీ చదవకపోతే చదవండి.
http://wp.me/pGX4s-vR
http://wp.me/pGX4s-sF

..nagarjuna.. said...

మీ టపాలు ఇదివరకే చదివా బొందలపాటిగారు.
మనిషి (ప్రాణి) తన మనఃసాక్షికి,తనుండే సమాజంతో పాటు వేరొక బుద్దిజీవి(దేవుడు)కి accountable అనే వాదన, మన కర్మలు ఆ బుద్దిజీవిని సంతృప్తిపరిచేలా ఉండాలా? అసలా అవసరం ఉందా లేదా తెలుకోడానికి ఈ పోస్ట్.

ప్రాణి తన మనఃసాక్షికి, సమాజహితం అనుగుణంగా ప్రవర్తించినంతకాలం తన నమ్మకాలను ఇతరులపై బలవంతంగా రుద్దనంతకాలం అధ్యాత్మికత,ఆస్థికత్వం, నాస్తికత్వం ఏది ఆచరించినా తేడా ఉండదనేది నా అభిప్రాయం.

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis