అనగాఅనగా అనే ఒకవూర్లొ ఫలానా అనే రాజు ఉండేవాడు. ఆయనకి మరియు, మొదలగు అనే ఇద్దరు పుత్రరత్నాలు. ఓ రోజు ఫలానా రాజుగారి పుత్రులు దేశాటన ముగించుకొనివస్తూ తమతోపాటూ రెండు కప్పలను తీసుకొచ్చారు. ఇవేమిటని ప్రశ్నించిన రాజుగారితో తమకు ఓ సన్నాసి (తెలుగు సినిమా సన్నాసి కాదులేండి.....) కానుకగా ఇచ్చాడనీ, ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు విరజిల్లుతాయనీ చెప్పాడని చెప్పారు. ఇంకా ఇవి దివ్యమండూకములనీ వీటిని మంచినీటి బురదలోనో, కొలనులోనో పెంచవలసిందిగా ఉపదేశించారనిన్ని సెలవిచ్చారు.
దివ్యమండూకాలని, సన్నాసి ప్రసాదమని తెలుసుకున్నరాజుగారు వాటి సంరక్షనా బాధ్యతలను ఓ సేవకుడికి అప్పగించాడు. సేవకుడు వాటిసేవలో తరించిపోతున్నాడు.....
వేరే ఒక రోజు విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు ఏదో శబ్దాలకు నిద్రలేచారు.
బెక......బెక.....బెక.....బెకమని గదిలో అటూ-ఇటూ గెంతూతూ పుత్రరత్నాలు తెచ్చిన కప్పలు కనిపించాయి. కొలనులో ఉండాల్సిన కప్పలు ఇలా గదిలోపలికి ఎందుకువచ్చాయా అనుకుంటూ "కప్పలారా....కప్పలారా ఎందుకు కొలనులోంచి బయటకి వచ్చారు" అని అడిగాడు.
" హే ఫలానా రాజన్ ఫలానా రాజన్, నీకు తెలుసునుకాదా మేము దివ్యమండూకములని......మేము మంచినీటిలోనే నివసించెందమనీ. కానీ మా సంరక్షకుడు గతకొంతకాలంగా సరిగా చూసుకొనుటలేదు....మంచి నీరు అందించుటలేదు.....బెక.........బెక" అని వాపోయాయి. ఇది విన్న రాజుగారు వేంటనే ఆ సేవకుడిని పిలిపించి
"సేవకా......సెవకా.......నీకు ఈ దివ్యమండూకములను సరిగా చూసుకోవలెనని ఆజ్ఞాపించినాము కదా.....మరి నీవు వీటికి మంచినీరు ఎందుకు అందించుటలేదు" అను అడిగాడు.
"రాజా రాజా.....నా విధినిర్వాహణలో ఎలాంటి దోషమూలేదు. నేను వీటికి మన ఆస్థాన జలగుత్తేదారు సరఫరా చేసేనీటినే వాడుతున్నాను. గతకొంతకాలంగా అతను ఇచ్చేనీటిలో తేడాకనపడుతున్నది. దానివలనే ఈ సమస్యనుకుంటా ప్రభూ"అన్నాడు.
"అయితే వెంటనే ఆతణ్ణి పిలిపించండి".
"చిత్తం ప్రభూ" అని గుత్తేదారుని తీసుకువచ్చాడు.
"గుత్తేదారా గుత్తేదారా.......ఎందుకు నీవు మంచినీరు సరఫరా చేయుటలేదు" అని రాజు నిలదీశాడు.
"రాజా రాజా.....ఇందులో నా దోషము ఇసుమంతైనైనూలేదు. రాజ్యంలో వర్షాలు కురవడంలేదు. అందుకని నేను వేరే రాజ్యంనుండి నీటిని కొని మీకు పంపిస్తున్నాను. కొంతకాలంగా మీకు భోలక్‌పూర్ అను రాజ్యం నుండి తెచ్చిన నీటిని సరఫరా చేస్తున్నాను.....అక్కడి ప్రజలు అవే త్రాగుతారట. పైగా ఆ నీరు అక్కడి జలమండలి వారు ఎన్నో వ్యయప్రయాసలోర్చి సరఫరా చేస్తారట. ప్రజలు తాగి జీవించగాలేంది కప్పలు జీవించలేవాని ఆ నీటినే ఇచ్చాను ప్రభూ" సెలవిచ్చాడు గుత్తేదారు.
" ఊమ్... అనవసర విషయాల ప్రస్తావన ఏల. రాజ్యంలో వర్షాలు కురవడంలేదా....ఈ సంగతి మాకుతెలియనేలేదే. ఏమీవిపత్కర పరిస్థితి. ఏమి దీనికి పరిష్కారము.."మధనపడిపోతూ మంత్రిగారిని పిలిపించాడు.
"మంత్రీ మంత్రీ.....మన రాజ్యంలో సకాలంలో వర్షాలు కురవడంలేదట. ఈ విషయం ప్రజలు చెబితే తెలిసినది. ఎందుకు నాకు తెలియపరచలేదు" అన్నాడు మంత్రితో.
"రాజా రాజా......నాకునూ ఇప్పుడె తెలిసినది ఆ సంగతి. వేరే వ్యాపకాలలో ఉన్నందున సరైన సమాచారం అందలేదు. ఏమైననూ ఇప్పుడున్న సమస్య ఝటిలమైనది. దీనికి ఒకే ఉపాయమున్నది"
"ఏమది..."
"పొరుగు రాజ్యాలలో మేఘమధనమని ఓ ప్రక్రియను అవలంభిస్తున్నారు. వాటివల్ల ప్రయోజనమొనగూరవచ్చు" తరుణోపాయం వివరించాడు మంత్రి.
అట్లయినచో, వెంటనే మేఘమధనం జరిపించండనీ రాజుగారు ఆజ్ఞాపించి తన విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయాడు.
కప్పలు వాటికి వచ్చిన లాంగ్‌జంప్ ఆటలో ఆరితేరి వాటి దారిలో వచ్చినవాటిని బెక......బెక....బెకమనిపిస్తున్నాయి
రాజాజ్ఞ ప్రకారం మంత్రి మేఘమధనం జరిపించాడు. ఎంత మధించినా ఫలితం శూన్యం. వానలు ఇల్లె. రాజుగారు విషయం తెలుసుకొని విచారపడ్డాడు. గమనించిన మంత్రి రాజుతో ఇది దైవసంబంధ విషమైవుండవచ్చుననీ ఆస్థాన పురోహితుడిని పిలిపించమని నివేదించాడు. అలాగే కానిమ్మన్నాడు రాజు. మరుసటిరోజు సభకి రాజపురోహితుడు వచ్చాడు.
"పురోహిత పురోహిత.......వర్షాలు ఎందుకు పడటంలేదు. నీకేమైన ఎరుకనా. పరిష్కారమేమైనా ఉన్నాదా..." అని పురోహితుడిని అడిగాడు.
"రాజా రాజా......."పురోహితుడు ఏదో చెప్పబోతూ కప్పల శబ్దం విని ఆగాడు.
బెక......బెక.....బెక.....బెక....
"రాజా...రాజా..."
బెక....బెక.....బెక...బెక.....
పురోహితుడికి విసుగొచ్చింది. అది గ్రహించిన రాజు వాటిని పట్టించుకోకుండా కానిమ్మన్నాడు.
"రాజా....రాజా..... మీరు కొన్ని సంవత్సరాలుగా యజ్ఞ-యాగాదులేవియూ జరిపించలేదు. అందువలనే ఈ వైపరిత్యము సంభవించినదని నా అభిప్రాయము. ఈ సమస్య తీరవలెనన్న వేయిమంది విప్రోత్తములచే వరుణయాగం జరిపించవలె"నని రాజుగారికి విన్నవించాడు పురోహితుడు.
బెక....బెక....బెక....బెక......
"యజ్ఞము చేసిన వర్షము వచ్చునా....."రాజుగారు సందేహం వెలిబుచ్చాడు.
"ముందు పొగొత్తది......"వెనకనుండి పురోహితులవారి శిష్యగణం నుండి వినిపించింది.
రాజుకి ఒళ్ళుమండి " అసంధర్బ ప్రేలాపనలు కట్టిపేట్టి ముందు ఆ యాగం సంగతి చూడండి. ఈ కప్పల గోల భరింపనలవిగాకున్నది. పైగా ఇవి అన్ని కప్పలవలే 'బెక బెక' మనక 'బెక' అనిమాత్రమే అరుస్తున్నవి....కటకటా..."
పురోహితుడు చెప్పిన ప్రకారం యాగం చేయించాడు రాజు........ఇప్పుడు కూడా ఫలితం సున్నా. కప్పలు మాత్రం ఆ పొగకి రెచ్చిపోయి మరింత బెక....బెక పెడుతున్నాయి.
సిరిసంపదల సంగతి దేవుడెరుగు ముందు వర్షాలు పడి ఈ కప్పగెంతులు ఆగితే బావుణ్ణు అనుకొని వర్షం కురిసేలా చేసిన వారికి పాతిక అగ్రహారాలు బహుమతిగా ప్రకటించాడు.
(ఇంకా బెక....బెక ఉంది)
Subscribe to:
Post Comments
(
Atom
)
2 వ్యాఖ్యలు.. :
మొదటిసారి బెక బెకలకే జల్లులు కురిసాయండి.
@ Padmarpita
వానరాకడ లాగే నా పోస్టుకుడా లేటైందిలెండి. అందుకే అలా అనిపిస్తుందేమో...
Post a Comment
మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ