చదువుకో పిచ్చి నాయనా నిన్నాపేదెవ్వరూ..

నిన్న మధ్యాహ్న సమయమున తిన్న భోజనము అరుగుటనూ, చలువమరల కృత్రిమ గాలినుండి కాస్త ఉపశమనమునూ ఆశించినవాడనై నా సహోద్యోగితో వాహ్యాళికి వెళితిని. ఆకాశము మేఘావృతమైయుండెను. దారిలో ఒక పక్కనుండి పురపాలక సంఘము వారి కుప్పతొట్టి వెదజల్లు గాలి, మరొక పక్కనుండి అదే పురపాలక సంఘము వారి ఉద్యానము నుండి వీచే మలయమారుతములు కలగలిసి ఒక విశేష్యమైన అనుభూతి కలుగుచుండెను. దినకరుడు మబ్బు చాటున దాగియుడుట వలన వేడిగా ఉన్నదని, లేదు చల్లగా ఉన్నదని చెప్పలేనటువంటి స్థితి ఉన్నది. అట్టి సమయమున నా సహోద్యోగి నన్ను చూచి "ఓయి, మనము ఇంత కష్టపడి కూర్చీలలో కూర్చొని బుద్దిని శ్రమింపజేసి, బొజ్జలు పెంచేది ధనము కొఱకే కదా! ఒకవేళ నీకు జీవిత పర్యంతమూ సరిపోవు అమితమైన ధనము వచ్చినదనుకొనుము దానితో నీవు ఏమి చేసెదవు" అని ప్రశ్నించెను. క్షణమైనా జాగు చేయక " అట్లైన ఒక గ్రంథాలయము సమకూర్చుకొని అందులో నన్ను నేను బందీగా చేసికొని జీవితాంతము పుస్తక పఠనము గావించెద"నని వ్రాక్కుచ్చితిని. అతను చిన్నగా దరహాసము చేసి "బాగుగా ఉన్నది. కాని నీవు ఆరోగ్యమను ఒక ముఖ్యమైన బంతిని మరచితివ"నెను.
"బంతా! అదియేమి?"
"అవును. ప్రతి మనిషి జీవితము కుటుంబము, స్నేహితులు, ఉద్యోగము, ఆరోగ్యము, ఆత్మ సంతృప్తి అను ఐదు బంతులుగా విభజించబడియున్నది. మనందరమూ ఈ ఐదు బంతులను సంబాళించుకొనుచు ఏ బంతిని యెళ్లవేళలా అట్టిపెట్టుకొననట్టు గారడి చేయవలెను. వీటిలో ఉద్యోగమనునది రబ్బరు బంతికాగా మిగిలినవి గాజు బంతులు - జారవిడిస్తే శాశ్వతముగా పగిలిపోగలవు.  దురదృష్టవశమున నేటి యువతీయువకులు రబ్బరు బంతి కధిక ప్రాధాన్యమునిచ్చు చున్నారు. ధనము వచ్చినది కాబట్టి నీవు ఆత్మ సంతృప్తి అన్న బంతికి అధిక ప్రాధాన్యమును ఇచ్చుచున్నావు, ఆరోగ్యమును విస్మరించుచున్నావు. అరోగ్యమే మహాభాగ్యమని కదా పెద్దలు కూడా చెప్పినద"నెను. అట్లేమి లేదు భోజమను చేయుటకు జల క్రీడలు గావించుటకు బయటకు వచ్చెదనని చెప్ప సంకల్పించితిని. అంతలోపే అతడు పరుగున కార్యాలయమునకు వెళ్లడముతో ఊరకుండినాను.

 కార్యాలయము చేరాక ఈ విషయముపై విచారించితిని. ఔరా! నిజమే కదా పుస్తక పఠమను గావించెదము సరే, కాని అవి వ్రాసే రచయితలకు ఆయా కథా వస్తువు ఎచటినుండి వచ్చును? సమాజము నుండియే కదా. ఒక్కొక్క కవి/రచయిత తనను స్పందింపజేయు విషయములను పరీశీలించును వాటిని గ్రంధస్తం చేయును. కొందరు రచయితలు సృజనాత్మకులు వీరికి సెలయేళ్ళు, నెమలి నాట్యము, కోమలి హంసనడకలు, వెన్నెల రాత్రులు, ప్రేమికుల విరహము కథా వస్తువులు ఎక్కువగా వాటి మీదనే రచనలు చేసెదరు. మరికొందరు పరిశీలురు వీరు సమాజం పోకడలను గమనించువారు. వ్యక్తిలోని గుణదోషములు సమాజముపై వాటి ప్రభావములు చర్చించెదరు.  ఇహంలో అగ్రరాజ్యముల పెత్తమము మొదలుకొని ఇంట్లోని అర్ధాంగి పెత్తనము వరకు వీరికి కాదేది అనర్హము. మరికొందరు భక్తి రక్తి ముక్తి మొదలగు విషయములపై మక్కువ కలవారు. ఇట్లు ఒక్కొక్క కవికి ఒక ప్రత్యేకమయిన ఆసక్తి ఉండును. వాటిని రచనలుగా మలుచును. అవి చదివినచో ఆయా విషయముల పట్ల జ్ఞానము కలుగును. సరియైన గురువు ఉన్నచో ఆ జ్ఞానమునకు తోడు విలువలు, వినయము కూడా సిద్దించుకొనవచ్చు దానినే 'విద్య' అనవలెనని నా నమ్మిక. ప్రస్తుతము మనయంతట మనమే నేర్చుచున్నాము కాబట్టి అది విద్య కాదు. చదువు అనుకొనెదము. పదములదేముంది అవి ఎట్లయినను వాడకొనవచ్చును.

 కావున కేవలము పఠనము చేసిన ఆయా రచయితల అనుభవమును తెలిసికొనెదము కాని మనకు స్వంత అనుభవముండదు, మనము మాత్రమే ఆనందించదగిన విషయములు కోల్పోయెదము. సమాజముతో సంబంధ బాంధవ్యాలు నెఱపుట ఎంతైనా అవసరము అని తెలుసుకొంటిని.


అటుతరువాత అసలు ఈ పఠనము ఎన్ని విధములు అని నన్ను నేను ప్రశించుకొంటిని. మొదటిది పత్రికా పఠన విధము- ఈ వర్గంలోని వారు ఏమి చదివినా ఆమూలాగ్రము చదువుదురు. ఎంతబాగా చదివాము అన్నది తప్పితే ఏమి చదువుతున్నాము అన్నది పట్టదు.వదిలేస్తే  ఇహపరములను కూడా మరచిపోవుచుందురు. book worm - ఆంధ్రీకరించిన, పుస్తకము పురుగు అని ఖ్యాతినార్జించెదరు.




రెందవది పరీక్షా పఠనము. పరీక్షలాసన్న మైనపుడు విద్యార్ధులు, ముఖ్యముగా ఇంజనీరింగ్ విద్యార్దుల చదువులాగా ఉండును. కనురెప్ప మూసి తెరిచేలోపు పుంఖాను పుంఖాలు తిప్పెదరుగాని సంగ్రహించెడిది అల్పము. విద్యార్ధులు మార్కుల కోసము చదివినట్టు 'మమ' అన్నవిధముగా కానిచ్చెదరు.


పఠమనము ఏ విధము అయినను అది ఎన్నో ప్రభావములు కలిగించును. కొందరిలో సంతృప్తి కలుగును, కొందరిలో అంతవరకూ ఉన్న సందేహము నివృత్తి అగును-అమితానందము కలగును, కొందరిలో కొంగొత్త సందేహములు వచ్చును, కొందరికి ఏహ్యభావము వచ్చును, కొందరికి ఆయా విషయములలో ఆసక్తి ద్విగుణీకృతమగును.అందరిలో సమానముగా కాకపోయినా ఎక్కువ శాతం జనులకు తాము కూడా రచనలు సల్పవలెనని అనిపించును, అధమము తాము నేర్చికొనినది నలుగురికీ చెప్పవలెనని అనిపించును. నలుగురూ చేరిన చోట తాము కొత్తగా చదివిన (అది ఏ విధము అయిననూ) పుస్తకమో, పత్రికలో వచ్చిన వ్యాసము గురిమ్చి చర్చింటుయయో జరుగును కదా అది ఒక నిదర్శనము. తాము చెప్పెడిది ఎవరూ పట్టించుకొననపుడు మేధావి మాటలు సామాన్యులకు అవగతము కావనుకొందురు, వారికా భాగ్యము లేదనుకొందురు. తమలో తామే ప్రశ్నించుకొనుచు సమాధానలు వెతుకుచుందురు. స్థోమత పేరు ఉన్నవారు తమ ఆలోచనలు ముద్రించెదరు. సాంకేతిక పరిజ్ఞానము పెరగడముతో సామాన్యుడికి సైతం తమ ఆలోచనా ఝరి ఇతరులతో పంచుకొనెడి అవకాశమేర్పడినది.

రచనలు మన స్వంతముగా చేసినను మనము చదివిన అభిమాన రచయితల ప్రభావం ఎంతయినా ఉండును. సదరు రచనలు/ప్రక్రియలు సమాజమునకు నచ్చితే గురువును మించిన శిష్యుడనెదరు లేకపోతే కాళిదాసు కవిత్వము కొంత వీరి పైత్యము కొంత అని నొసలు చిట్లించెదరు. ఇక్కడ కథకుల గూర్చి చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. ఏ కారణము కొఱకు రచనలు చేసిననూ కొందరు తాము ఎవ్వరు అనేది చెప్పుటకు ఇష్టపడరు మారు పేరుతో వ్రాసెదరు. వారు మనకు బాగా పరిచయమున్నవారు కావచ్చును తాముగా బయటపడితే తప్ప అది వారేనన్నది ఎవరికినీ తెలియదు. తాము ఎందుకు, ఎక్కడ, ఏ విషయము గూర్చి వ్రాస్తున్నమో కూడా గ్రహించక వ్రాసెడి వారునూ కలరు. అట్టివారు తమ రచనల వాలనే ప్రభావితులైరని తెలియవచ్చినపుడు సదరు ప్రభావమునకు కారణమైనవారు  ప్రప్రధమముగా తామెందుకు రాయాల్సివచ్చెనని చింతించెదరు.
మరి కొందరు తమ పాఠకులలోని రచయితను బయటకు తీసుకువచ్చుటకు ప్రయత్నించెదరు. ఉదాహరణకు ఆండి, ఫోటాన్ అను యువకులు. వీరిలో ఒకరు తేరగా వచ్చినదని చదివేసి వెళ్ళిపోతే కత్తి ప్రయోగము చేసెదమని హెచ్చరింతురు. పాఠకులకు మంచి అవకాశం ఇవ్వుటకే తాముంటిమని చెప్పెదరు. మరొకరు కత్తి కంటే మర ఫిరంగుకు ఎక్కవ శక్తి ఉంటుందని తమ అభిప్రాయము నేరుగా చెప్పకనే చెప్పుదురు. కూలంకషముగా సామ దాన భేద దండోపాయములు ఉపయోగించుచూ ఉత్తేజ పరిచెదరు. వీరి కృషి శ్లాఘనీయమూ, వీరు మన మధ్య ఉండుట మిక్కిలి ముదావహము. తాము వ్రాయడమే కాక ఇతరులు వ్రాసినవీ చదువుచూ నలుసంత బాగా వ్రాసినా నల్ల ఏనుగంత బాగా వ్రాసినారు అని ప్రోత్సహించే వారునూ కలరు. ఒక్కో పర్యాయము వారి మాటలలో నిజము కూడా ఉండును. తరచి చూసిన వారికి పుంఖాను పుంఖాలుగా వ్రాసే మరియూ లెక్కకు మిక్కిలి రచనలు చదివే ఓర్పు ఎక్కడిదని మనకు ఆశ్చర్యము కలగును. ఉదాహరణకు రసజ్ఞగారి లాంటివారు. వీరు ఎక్కడెక్కడి నుండో సేకరించి  సుందరమైన వర్ణ చిత్రములు, చక్కని పద్యములు తెచ్చెదరు వాటి చరిత్రమునూ అర్ధమునూ వివరించెదరు. అంతటితో ఆగక ప్రతిఒక్కరి రచనలు చదువుతూ బాగుగా వ్రాస్తున్నారని మెచ్చికొనెదరు. ప్రోత్సహించుచూ చేసే వ్యాఖ్యలే మిక్కిలిగా ఉంటే అసలు వారు ఎన్ని రచనలు చదివెదరొ ఊహించికొనవచ్చును. అసలు అంత ఓర్పు వారికి ఎలా వచ్చినదో నా మోకాలును  ఎంత scratch చేసినా రహస్యము catch అవదు. మరికొందరు అద్భుతముగా వ్రాయగలిగే నేర్పు ఉన్ననూ అతి తక్కువగా వ్రాసెదరు. మరికొంత వ్రాయవచ్చుగా అని అభిమానులచేత 'చిన్నపిల్లల' మాదిరి బ్రతిమాలించుకొందురు కాని వారు కోరిక మన్నించిరా ? ప్రసన్నులైరా అని ప్రశ్నించుకొంటే ప్రశ్ననే మిగులును.

అసలు ఈ చాంతాడంత వివరణ ఎందులకు చెప్పుచుంటివి అని మీరు ప్రశ్నించవచ్చును. నించకున్ననూ చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది. నిన్న పుస్తకముల గురించి ప్రస్తావన వచ్చినది కదా, ఆ ప్రస్తావన ఆలోచనగా మారి పెరిగి పెద్దదయి  ఒకానొక పుస్తకము తీసుకొన సంకల్పించి 'విశాలాంధ్ర' కేగితిని. ఒక పుస్తకము కాస్తా పెక్కు పుస్తకములైనవి, చివరకు కొనదలచిన పుస్తకము తీసుకొనలేదు. కొత్తవాటితో కలిపి 'నిశ్చయముగా చదివెద'ననుకొని తీసుకున్న పుస్తకములు తిరుపతి వెంకన్న బాకీ వలె పెరిగిపోయినవి. అమితోత్తేజముగా గృహమునకు వచ్చిన మీదుట మత్ మాతాశ్రీ వాటిని చూచి ఎందులకురా ఇన్నేసి పుస్తకమణులు తెచ్చెదవు నీవా చదవవూ వాటిని అమ్మివేయనీయవని విచారము వ్యక్తము చేసి నన్ను విచారమునకు గురి చేసినది. అయినా ఆ విచారము కొంతసేపే ఏల అనగా,



10 వ్యాఖ్యలు.. :

Alapati Ramesh Babu said...

అవును పాపం మీకున్నంత ఆలోచన ఆమెకు లేదు. డబ్బు లాస్.అబ్బాయి ప్రవృత్తి అన్ని పుస్తకాలు చదివి ఆరోగ్యం ఏమవుతుందో అనే అందోళన ఇంటికి అడ్డు అని అంటే మీరు వైరాగ్యశతకం చదివినవాడిలా అలా పాక్షిక గ్రాంధికము లో వ్రాస్తే ఎలా!

..nagarjuna.. said...

అలా కాదులెండి. మా అమ్మకు చిన్న భయం, సినిమాల్లో చూపించినట్టు నవలల పిచ్చోడిని అయిపోతానేమోనని :)
పాతకాలపు తెలుగు సినిమా భాష+ యమలీలలో బ్రహ్మానందం భాష కలిపి రాసాను అనుకుంటున్నా. మీరేమో పాక్షిక గ్రాంధికం అంటున్నారు. ఏది కరెక్టు అంటారు. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.

రసజ్ఞ said...

హహహ! బంతుల థియరీ కొంచెం క్రొత్తగా ఉన్నా నీతి బాగుందండీ. నా దగ్గర రబ్బరు బంతి లెదూఊఉ :( పత్రికా పఠన విధము- ఈ వర్గంలోని వారు ఏమి చదివినా ఆమూలాగ్రము చదువుదురు. అయ్యో నేను రాజకీయాల గురించి తప్ప ఏదయినా చదువుతానండీ :) హహహ ఇహ పరీక్షలకి నేను ఏవయినా చాప్టర్లు వదిలేస్తే వాటిలో నుండి బిట్టు కూడా వచ్చేది కాదు. ఇది నాకు బంపర్ ఆఫర్ అనమాట. ఆహా ఇంద్రధనస్సు మన నాగార్జున గారిదే కదా ఏ రంగు గురించి వ్రాసుంటారో అని ఆసక్తిగా చదువుతూ నా పేరు చూసి అవాక్కయ్యా!!! వ్యాజ్యస్తుతో కాదో అర్థం కాలేదు కానీ మీ టపాలో నా పేరు చూసి సంతోషించా :D మా ఇంట్లో ఉన్న పుస్తకాలనే గ్రంధాలయాలకి ఇచ్చేస్తుంటే క్రొత్త పుస్తకం కొనడం అన్న ఆలోచన నా మదిలోకి వచ్చినా మా వాళ్ళంతా ఎగిరెగిరి తన్నేలా ఉన్నారు. మీకా పరిస్థితి లేదు సంతోషించండి :) విచారము వలదు చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కదా! ఈ వ్యాఖ్యని దయచేసి మీ మాతృమూర్తికి చూపించవద్దని మనవి ;)

Anonymous said...

ఒక దశలో విశ్వనాథను ఇమిటేట్ చేస్తున్నట్టుంది. :) అంశమూ, దాన్ని సమర్పించిన తీరూ రెండూ బాగున్నాయి.

హరే కృష్ణ said...

కెవ్వ్ కెవ్వ్ నాగార్జున :))
ప్రెజెంటేషన్ సూపరో సూపర్ :))
>>ఆండి, ఫోటాన్ అను యువకులు. వీరిలో ఒకరు తేరగా వచ్చినదని చదివేసి వెళ్ళిపోతే కత్తి ప్రయోగము చేసెదమని హెచ్చరింతురు. పాఠకులకు మంచి అవకాశం ఇవ్వుటకే తాముంటిమని చెప్పెదరు.
పోస్ట్ కి కామెంటని వాణ్ణి కత్తితో పొడలని వ.బ్లా.స లో డిసైడ్ చేసేతిమి కదా :P

Anonymous said...

చాలా బాగా రాశారు. నేను కొత్త పుస్తకాలు కొన్నపుడు వాటిని కారు లో పెట్టి అందరు నిద్ర పోయాక నారూంలోకి తీసుకొస్తాను. కనీసం ఒక వారం వాటిని మా అమ్మ కంట పడనివ్వను. మా అమ్మకుడా వాటివలన ఇంటినిండా అడ్డం, సర్దలేక పోతున్నాని తెగ బాధపడుతూంట్టుంది.

SriRam

..nagarjuna.. said...

@రసజ్ఞగారుః బిజినెస్‌లో ఓ మాట ఉందండి, If you don't take care of your customers, soon others will అని. ఇది గుర్తు చేయడానికే మా మాతాశ్రీ అలా అనివుండవచ్చు.
ఇక మీరు అర్జెంటుగా ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెంసి ప్రారంభించాలి. ఈ రాష్టంలో ఏ పరీక్ష జరిగినా మీరు ఆ సిలబస్ చదవకుండా ఉండాలి. మీరు చదవనివి రావు కాబట్టి అందరు పాస్ :)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.


@ఫణిగారుః అంటే పాత తెలుగు సినిమాలు విశ్వనాథ వారిని అనుకరించాయేమో! మీ పరీశలనకు ధన్యవాదాలు :)

@హరేః ఏంటొ స్వామి బొత్తిగా జనరల్ నాలెడ్జి లేకుండా పోతుంది. వబ్లాస లో ఈ రూల్ పెట్టారని కూడా తెలీదు చూశావా. ప్చ్ ః( గుర్తు చేసి జ్ఞాన దీపం వెలిగించినందుకు థాంకులు :)


@శ్రీరాం గారుః చాకచక్యంగా మీ పని కానిచ్చేస్తున్నారుగా. మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అప్పుడప్పుడు కాసిన్ని ట్రిక్కులు నేర్పించండి :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

కడు చక్కగా వ్రాసితిరి ! రబ్బరు బంతి కధ ఆంగ్లమున చదివియుంటిని . (కోకో కోలా అధిపతి సెలవిచ్చినట్లు గుర్తు ) .
>> కొత్తవాటితో కలిపి 'నిశ్చయముగా చదివెద'ననుకొని తీసుకున్న పుస్తకములు తిరుపతి వెంకన్న బాకీ వలె పెరిగిపోయినవి.
బాగా వ్రాసితిరి నేను నా డెస్క్ లో ఉన్న చాలా మంది రచయితలకు అప్పు పడియుంటిని .అయిననూ కొత్త పుస్తకములు కొనుట మానలేదు . తమరు కొన్న కొత్త పుస్తకముల గూర్చి కొంత సెలవిచ్చేదరా ?
మీరు సెలవిచ్చిన విధంబుగా రసజ్ఞ గారి కృషి శ్లాఘనీయము . టపా మొత్తము చక్కగా వ్రాసితిరి యని మరియొక మారు ఆనందము గా తెలియ చేయుచుంటిమి

..nagarjuna.. said...

ధన్యవాదములు మిత్రమా.. కొత్తగా వచ్చిన వారిలో పాశ్చాత్యులైన hawking, tolstoy, gorki, chekhov మహాశయులు స్వదేశీయులు తిలక్,కొ.కు, బుచ్చిబాబు మున్నగువారు కలరు :)

Unknown said...

బహు చక్కగాఉన్నది. ఇవ్విదంగా వ్రాసెడి మీరు ఎందులకు బ్లాగ్ లో వ్రాయుటలేదు Radhika (nani)

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis