వంకాయ వంటి కూరయు .. పంకజముఖి సీతవంటి భామామణియున్..

అతిగా ఆనందపడుతున్న మగవాడిని చూసినా, అదే పనిగా బాధపడుతున్న ఆడవాళ్ళ గురించి విన్నా ఈ సమాజానికి కంటిమీద కునుకు ఉండదు. ఎలాగైనా వాళ్ళను ఆ పరిస్థితి నుండి లాగేయాలని తపించిపోతుంటుంది.  కొన్నాళ్ళ  ముందు వరకు వీకెండ్స్ లో షికార్లు కొడుతూ, వీక్‍డేస్‌లో ఆఫీస్లో తల పట్టుకుంటూ య్యమ ఆనందంగా ఉండేవాడిని. భూమ్మీద ఇంకొక ఆడ ప్రాణి తన గోడు చెప్పుకునేందుకు, హింసించేందుకు ఎవరూ దొరకడంలేదని బాధపడుతుండేది. మమ్మల్ని అలా చూడలేని సమాజం + పెద్దవాళ్ళు  విధి ఆడిన వింత నాటకంలో పావులుగా చేసారు. మా ఇద్దరికి పెళ్ళి చేసారు.
ఆఫీస్‌లో లంచ్ అయ్యాక కుటుంబరావుల్తో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దగ్గర్లోని పార్కులో ప్రదక్షిణలు చేసేవాళ్ళం. ఓరోజున అలాగే కుబుర్లలో "ఇదిగో అబ్బాయ్, నీకెలాంటి లైఫ్ పార్ట్‌‌నర్ కావాలి అనుకుంటున్నా"వని ఒక కుటుంబీ అడిగాడు. ఆ ప్రశ్నకు మొదట్లో సిగ్గుపడిపోయి ఆ తరువాత ఆలోచనలో పడిపోయి కాసేపటికి ఫ్లో లో పడిపోయి "అబ్బే నాకు పెద్దగా కోరికల్లేవండీ. అమ్మాయి చూడడానికి చక్కగా ఉండాలి. వాలు జడ, కలువ పువ్వుల్లాంటి కళ్ళు, నవ్వుతూంటే ముత్యాలు రాలుతున్నట్లు ఉండీ నేను ఆఫీస్ నుండి రాగానే కాఫీ ఇవ్వకపోయినా నీళ్ళు ఇచ్చే అమ్మాయి, షాపింగ్ అంటే పెద్దగా ఇష్టంలేని, నాతో పాటు క్రికెట్ మ్యాచులూ, న్యూస్/డిస్కవరీ వగైరా ఛానల్స్ చూడకపోయినా సీరియళ్ళు చూడని, అణకువగా ఉంటూ నన్ను అర్దం చేసుకొనే.." అని చెప్పడం ముగించకుండానే ఆపేసి  "చూడూ మనిషికి ఆశ ఉండటంలో తప్పు లేదు.. to an extent అత్యాశ ఉన్నా ఫరవాలేదు కాని దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు" అని వారిస్తున్నట్టు చెప్పాడు. నా expectationsకీ ఆశకీ దురాశకీ లింక్ ఎంటో తెలీక అడిగితే దీర్ఘంగా గాలి పీల్చుకుంటూ "నీకు అదృష్టం కలిసిరావాలి అనుకొవడం ఆశ. యాభై పైసలు.. అఫ్‌‌కోర్స్ ఇప్పుడు యాభై పైసలు లేవనుకో.. యాభై పైసలు పెట్టి నువ్వు  కొనుక్కున లాటరీ టికెట్టుకి యాభై కోట్లు తగలాలి అనుకోవడం అత్యాశ. పక్కనోడు కొనుక్కుంటే ఆ టికెట్ల డబ్బులు కూడా నీకే రావాలి అనుకోవడం దురాశ" అంటూ తేల్చాడు. అణకువగా ఉండీ అర్ధం చేసుకునే భార్య ఉండాలనుకోవడం అత్యాశట,  పెళ్ళి చేసుకున్న మగవాళ్ళలో సగటున నూటికి తొంభై ఎనిమిదిమంది బాధలు పడుతూంటే వాళ్ళను చూసి కూడా నేను సంతోషంగా ఉండాలనుకోవడం దురాశట !  చెరువులో స్నానం చేస్తున్నోడిని చూసి ఈతరాక ఒడ్డున సెటిలైపోయినోడి ఓర్వలేనితనం అనుకున్నాను అప్పుడు... in front crocodile festival అని తెలీక. కొలీగ్ చెప్పిన ఆశ, అత్యాశ, దురాశ మధ్యన తేడా  నిఘంటులేవీ వెతుక్కోకుండానే sprite డ్రింక్ అంత స్పష్టంగా తెలిసిపోయిందిప్పుడు.
అంటే...తను చాలా బాగుంటుంది..నవ్వితే ముత్యాలు కాదుగాని ఏకంగా వజ్రాలే రాలుతాయి పైగా పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది, అత్తాకోడళ్ళు వేరువేరు ఊళ్ళల్లో ఉండడంవల్ల 'అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతూరాలు! ఆహూ' టైపులో అనిపించేది. ఆఫీస్ టైము దాటితే క్షణం ఆలస్యమవకుండా గోముగా అడుగుతున్నట్టు 'బయలుదేరారా...' అంటూ ఐదు నిముషాల కొకసారి మెసేజ్ వచ్చేది. కాని చెప్పాను కదా విధి ఆడిన వింత నాటకం అని,  కొన్నిరోజులకు 'ఇంకా బయల్దేరలేదా.' అంటూ ఫుల్‌స్టాప్ తో మెసేజీలు వచ్చేవి. నిన్నైతే మరీ ఘోరం బయల్దేరడానికి ఆలస్యం అవుతుంది అన్నందుకు "ఇంకేం అక్కడే కాపురం పెట్టెయ్" అని మొహం మీదే తలుపేసినట్టు వచ్చింది. పెళ్ళవడం లేటయితే ఆ మగాడిని ముదురు బెండకాయ అంటుందీ పాడు లోకం.... కాని పెళ్ళయినవాడి పరిస్థితి ఇంట్లో  ఒక్కోసారి ఆ ముదురు బెండకాయలకన్నా, కూరలో కరివేపాకు కన్నా వరస్టుగా ఉంటుందని తెలిసింది. ఏమీ జరక్కపోతేనే ఇలా తగలడ్డ నా సిట్యుయేషను మొన్నాదివారం రోజున పెనం మీదనుండి పొయ్యిలోకి పడ్డట్టయింది. "పెళ్లయి ఇన్ని నెలలు అవుతున్నా మీ ఫ్రెండ్స్ ఒక్కసారయినా మనింటికి రాలేదు. ఒకసారి లంచ్ కు పిలవచ్చు కదా" అని తనంటే... వెర్రివాడిని... 'ఓహో, ఎన్నాళ్లకెన్నాళ్లకు... నా గురించి తెల్సుకొని నన్ను అర్దం చేసుకోవడానికి‌‌' కాబోలు అనుకున్నాను. వీకెండొస్తే ఫోన్లలో కూడా దొరక్కుండా  airforce గా తిరిగే మావాళ్లు పార్ధు,గిరి, రమణలను ఇంటికి పిలిచా. అత్తారింటికి వెళ్ళే పనుందని గిరి గాడు ఆఖరు నిమిషంలో డ్రాప్ అయ్యాడు (సిట్టింగ్ వేసుకుందామనుంటే మాత్రం వాడు చచ్చినా వెళ్ళేవాడు కాదని నా ప్రగాఢ నమ్మకం). మొదటిసారి వస్తున్నామన్న సెన్సు కూడా లేకుండా ఇంకో బెమ్మీ కొంపకు వచ్చామన్నట్టు నాచురల్గానే ఉత్తినే చేతులూపుకుంటూ వచ్చారు. కూల్‌‌డ్రింక్స్ కోసం కిచెన్‌లొకి వెళితే గుర్తు చేసి మరీ పొగిడింది.  భోజనం చేస్తూ కాలేజీ రోజుల గురించీ అప్పట్లో మేం చేసిన చిలిపి, అల్లరి, వెధవ పనులు etc., etc., తవ్వి తీశాం. అవన్నీ వింటూ ఈవిడ ‘అవునా’, ‘ఒహ్..అలాగా’ అంటూంటే అబ్బో చాలా స్పోర్టీవ్   అనుకున్నాను.  తాడూ బొంగరం లేని బెమ్మీసే కదా అని మా పార్ధుగాడి మీద ఉన్నవీలేనివీ కాస్తంత పోపు, మసాలా జోడించి చెప్పాను..అది నేను చేసిన రెండో తప్పు. వాడైనా సిట్యుయేషను అర్దం చేసుకోవాలిగా..భూమి పుట్టినపుడు పుట్టాడు యెదవ, ఏం లాభం... రమణగాడిలా పెట్టింది తిని మధ్యమధ్యలో పళ్ళికిలించి ఊరుకోవచ్చుగా నేనేదో వాడిని నెగెటివ్ లైట్ లో చూపిస్తున్నట్టు ఫీలయిపోయి ‘మీకు తెలుసా నందినీ  ఫ్రెషర్స్ పార్టీలో వీడు ఏం చేశాడో’ అంటూ ఫ్రెషర్స్‌-డే రోజు మా సీనియర్ అర్చనకు కొన్న రోజెస్‌ను తనకు ఎలా ఇచ్చిందీ పక్క తరగతిలో కీర్తన  కోసం జంక్షన్లో  రోజూ ఎలా పడిగాపులు కాచేది అదీ ఇదీ వాగేసాడు. వాడు చెప్తున్నంతసేపూ నా వైపు చూసి నవ్వుతూ ’OffO..’ అంటుంటే తను ఇవన్నీ బాగానే క్యాజువల్గానే తీసుకుంటుందిగా అనుకున్నాను. వాళ్ళుకు ’బై’ చెబుతూ తను చూసిన చూపులు.... నేను పదీపదిహేను మర్డర్లు చేసిన సీరియల్ కిల్లర్ అని తెలిసినా అలా చూసేది కాదేమో :(

ఆఁ... ఆడవాళ్ల కోపతాపాలు నీటి మీద రాతలని ఎవరో చెప్పింది గుర్తు తెచ్చుకొని రేపుదయం కల్లా అంతా సెట్ అవుద్దనే ఆశతో ఆ రోజు ముగిసింది. తరువాత రోజు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. బ్రష్ చేసుకున్నాక మా ఇంట్లో కాఫీటీ లను పోలిన ద్రావకాలేవో ఉంటాయి... వీలును బట్టీ తనో నేనో చేస్తాము.  నిన్న మాత్రం తనొక్కర్తే  సోఫాలో కూర్చొని TV99*2/3 లో ‘ఎలకల్ని చంపడమెలా-దేశ ఆర్ధిక వ్యవస్థ పై ప్రభావం’ ప్రోగ్రాం చూస్తు కూర్చుంది,  కాఫీ పెట్టలేదా అంటే నోరు విప్పకుండా తను తాగుతున్న కప్పు చూపించింది. అర లీటరు పాలతో కప్పు కాఫి చేసుకోవచ్చని జీవితం లో మొదటిసారి తెలిసింది. కాఫీ కోసం భార్యభర్తలు గొడవపడ్డారు అనే టాక్ రావడం ఇష్టం లేక టెబుల్ మీద టిఫిన్‌బాక్సు తీసుకొని సైలెంట్‌గా ఆఫీసుకెళ్ళిపోయా. లంచ్ లో దాన్ని తెరిచాక తెలిసింది... అది శుక్రవారం రోజున ఇంటికి తీసుకొచ్చిన బాక్సని! మేడం గారి అలకలో కనీసం క్లీనింగ్ కు కూడా అది నోచుకోలేదని. గతి లేక మా ఆఫీసోడు పెట్టే మీల్స్ అనబడే గ్రాసాన్ని తినేసి ఆ రోజున నెట్టుకొచ్చా. నిన్న రాతిరి, ఇవాళ ఉదయాన్న కూడా పరిస్థితిలో మార్పు లేదు అదే సోఫా, అదే ఫోజు. రెండు రోజులు గడిచాకయినా తన అలక తగ్గుతుందేమో,  రోజూకంటే కొంచెం తొందరగానే వెళ్ళి నష్టనివారణ చర్యలు తీసుకుందామని బయల్దేరబోతుంటే పట్టుకున్నాడు డామేజరుడు. నాకు ఏదన్నా ఇంపార్టెంట్ పనిబడ్డపుడే వీడికి కొంపలంటుకుంటాయి అదేం ఖర్మో! ఎదురుచూస్తూ ఉంటుందేమో అనవసరంగా,రావడానికి ఆలస్యమౌతుందని మెసేజ్ పెట్టా... ఇందాకే చెప్పాగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేయమని సమాధానం. మెసేజ్ లోనే ఘాటుదనం తెలిసింది.

ఈడ్చుకుంటూ ఇంటికొస్తే ఊహించుకున్నట్టుగానే చేతిలో రిమోట్‍తో తను సోఫాలో సెటిలయింది.. రెండురోజులుగా గడ్డి తింటున్నందుకు ఆకలి ఎక్కువయింది సరాసరి కిచెన్‌లోకి ఎంటరయ్యే సరికి ఖాళీ గిన్నెల దర్శనమయింది... నాకు ఆవేశం ఎక్కువయింది. అయినా ఈ ఆడవాళ్లు ఇదేదో తమ దగ్గరున్న బ్రహ్మాస్త్రం అనుకుంటారు... వంట చెయ్యకపోతే భర్త అనేవాడు గిలగిల కొట్టుకుంటూ కాళ్ళబేరానికి వస్తాడని. ఆ అస్త్రాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించుకొని "వంట చెయ్యకపోతే బ్రతిమాలుతామో, బుజ్జగిస్తామనో అనుకుంటున్నారేమో.. మా ఫుడ్డు మేమే చేసుకోగలం. తినడమే కాదు, చేయడమూ వచ్చ"ని తనకు వినపడేలా ప్రకటించేసి ఫ్రిజ్ తెరిస్తే లేత లేత వంకాయలు కనపడ్డాయి. అర్దరాత్రయినా ఫరవాలేదు good old bachelor days కు వెళ్ళిపోయి  బ్రహ్మాండంగా కూరొండేసేయాలని ఫిక్సయ్యా. "అమ్మగారికి తెలుసో లేదో... చదువుకునే రోజుల్లో మా రూంలో ఏడాదిపాటు వంట అనే కార్యక్రామనికి నేనే supervisorను... అప్పటికే అయిదేళ్ళుగా వంట చేస్తున్నవాడు,  ఏడేళ్ళుగా వంట చేస్తున్నవాళ్లు ఉన్నా ఏది ఎలా చేయాలో నేనే చెప్పేవాడిని. అలా నాకు పన్నేండేళ్ళ అనుభవం. ముక్కలో చెప్పాలంటే వంట అనే క్రియ‌కు నేనే కర్త."నని తనకు వినిపించాలనే గట్టిగా చెప్పా.
"అది తినడం వాళ్ల ఖర్మ అయుంటుంది" 
ఎవరో సౌండ్ చేసినట్టు అనిపిస్తే కిచెన్‌లో నుండి చుశా...  రిమోట్ చేతిలో పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంది. నంగనాచి.
అయినా ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలను పట్టించుకుంటే పనవదు కాబట్టి యుధ్ధంలో అడుగుపెట్టిన సైనికుడిలా వంకాయలను నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా కోసేసి రాళ్లుప్పు నీళ్లలో కడిగాను-రమణగాడు చెప్పేవాడు వంకాయలు వండే ముందు ఉప్పు నీళ్లలో వేయాలట. ఆ కడగటం అయ్యాక గిన్నెలో నూనె పోసి దాంట్లోకి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి స్టౌ వెలిగించా. కూరగాయ ముక్కలు వేసే ముందు పోపు రెడీ అవ్వాలని కూడా చెప్పేవాడు..అరనిముషం వెయిట్ చేశాక ఆ వంకాయ ముక్కలు ఇరవైనాలుగు వేసేసి కారం ఒక నాలుగు చెంచాలు వేసా. ఫైనల్‌గా వచ్చే కూరను తల్చుకుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరినయి.. ఇన్నిరోజులయినా బ్యాచిలర్ డేస్‌లో వంటకు సంబంధించిన వివరాలు గుర్తున్నందుకు డెడ్‌లైన్ కన్నా ముందే డెలివరీ అవబోతున్న ప్రాజెక్టు మేనేజర్‌లా గర్వపడ్డాను. కిచెన్ లో న్యూక్లియర్ experiment ఏమైనా చేస్తున్నానా అని హాల్ లో అటూ ఇటూ పచార్లు కొడుతూ తొంగి చూస్తున్న మేడం గారిని చూసి నలభీముడిలా గరిటధారణం చేసి "అసలు నా లాంటి భర్త గురించి, వంకాయ గురించీ  పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా ,

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే
స్కూల్లో ఉన్నపుడు తెలుగు సబ్జెక్టులో ఉండేదీ పద్యం. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదూ తెలిసుండదు. ఎవరో కందం గారు రాసారంట. ఈమెతో పాటు ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం గారు  రాసినవి ఉండేవి కాని ఇది మాత్రం  బాఘా గుర్తుంది. పద్యం అర్దమేంటో తెలుసా..వంకాయ వంటి కూర, శంకరుడిలాంటి దేవుడు రాముడి వంటి రాజు, సీత వంటి భార్య లేరట. సిసలైన వంకాయ కూర ఎలా ఉంటుందో కాసేపట్లో చూద్దువుగాని కాని పద్యం మళ్ళీ చూడు.. కూరల్లో వంకాయ రాజు అంటే మగవాడు, శంకరుడు మగదేవుడు.. ఒకేలైన్ లో రాజు, విలన్సూ ఎలా ఉండాలో చెప్పినా రాముడూ, రావణుడూ ఇద్దరూ మగాళ్లే. వీళ్ళందరి మధ్యా ఒక స్త్రీని, సీతమ్మను ఎందుకు పెట్టారు? అసలు పొంతనలేదు. ఆ లైన్ లో నా పేరు పెట్టి సహృదయుడగు భర్తామణియున్ అని రాయాల్సింది. ఆవిడకు ఆ యతులూ, గణాలేవో తెలిసుండవ్.. పైగా ఆమె కూడా ఆడదే కదా పొగడ్తలన్నీ మగవాళ్ళకే ఎందుకని సీతమ్మను కూర్చోబెట్టార"ని చెప్తూంటే  కురుక్షేత్రంలో భగవద్గీత వింటున్న అర్జునుడిలా వింతగా నా వైపు చూస్తూ నిలబడింది... క్షణం తరువాత ఓస్ ఇంతేనా అన్నట్టు ఒక నవ్వు విసిరేసి మళ్ళీ టీవీలో మొహం పెట్టేసింది. స్టవ్ మీద కూర సంగతి గుర్తొచ్చి గిన్నె మీద మూత తీస్తే కూర మహబాగా వండిపోతుంది. ఆఖర్లో ఉప్పు వేయాలని గుర్తొచ్చి ఉప్పు డబ్బా కోసం వెతికాను.. కనపడపోయేసరికి మేడంవారిని అడిగితే ఇందాకటి గీతోపదేశపు ప్రభావంతో ’ఉప్పూ...’ అనేసి మళ్ళా తేరుకొని ఊరుకుంది. ఠాట్ డోస్ ఇంకా సరిపోలేదేమో మళ్ళీ గీతోపదేశం చేద్దాం ముందు కూర సంగతి చూద్దామని షెల్ఫులన్నీ వెతికాను..ఎక్కడో మూలన చిన్న డబ్బాలో కనిపించింది. ‘ఉప్పూ కారం ఒకే దగ్గర పెట్టాలని కూడా తెలీదు.. ఎక్కడో మసాలల దగ్గరా పెట్టేది’ అనేసి స్పూనందుకున్నా. రూం లో ఉన్న రోజుల్లో ఉప్పు కాస్త crystals లాగా వచ్చేది.. ఇదేంటో పొడిపొడిగా ఉంది..గట్టిగా ఉంటే తినేటపుడు ఇబ్బందిగా ఉంటుందని పిండిలాగా చేస్తున్నారేమో అనుకొని ఒక మూడు స్పూన్లు వేసేసా. ఇక అయిపోయింది.. ఒక ఐదు నిమషాలయితే కర్రీ రెడీ... ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం పెట్టేసి, కుక్కర్ లో మాత్రం నా అంత బాగా అన్నమెవరూ చేయలేరు అది పక్కా, మొహం కడుక్కోడానికి వెళ్ళా. వెళ్తూ వెళ్తూ తనవైపు చూసి ’ఇప్పుడేం చేసుకుంటావో చేస్కో’ అన్నట్టు విజయగర్వంతో ఒక చూపు చూసి వెళ్ళా.

మొహం కడుక్కొని వచ్చేసరికి అన్నమైపోయింది, ప్లేట్లో కూర వడ్డించుకుందామని చూస్తే గిన్నె ఖాళీ!! కూర నచ్చేసి ఈ అయిదు పది నిమిషాల గ్యాప్ లో తనే మొత్తం తినేసిందా అని అనుమాన పడుతుంటే సింక్ దగ్గర చెత్తబుట్టలో కనిపించింది. గేట్లు ఎత్తేసిన డామ్ లా కోపం కట్టలుతెంచుకొని తాడోపేడో తేల్చుకుందామని హాల్లోకి వెళ్ళి నోరు విప్పేలోపు "ఇంట్లో ఉప్పు ఎప్పుడో అయిపోయింది. పన్నెండేళ్ళ అనుభవం ఉన్న సూపర్‌వైజర్ ఉప్పుకీ బేకింగ్ సోడాకి తేడా తెల్సుకోలేక చెంచాలు చెంచాలు వేసారు. అది తినుంటే ఆ కర్మ ఎలా ఉండేదో. పాపం" అంటూ పాత సినిమాల్లో హీరోయిన్లా జాలిగా చూసింది. కడుపులో ఆకలి వయొలెన్సూ, ఇంట్లో తన సైలెన్సూ తట్టుకోలేక "ఇక చాలు నందూ...ఆ  పార్దుగాడు చెప్పినదంతా మర్చిపో.. అప్పట్లో అలా చేసానుగాని అదంతా పెద్ద దండగ, ఆ జిడ్డు మొహాల కోసం టైమ్ వేస్టు చేసుకోవడం దండగని చాలా ఎర్లీగానే వదిలేసా. సెటైర్లేస్తున్నాని కోపంతో పార్దుగాడు ఏదేదో వాగేసాడు వాడికుంది నా చేతిలో. మనమధ్య.." అని కంప్లీట్ చేస్తుండగానే మధ్యలో అందుకొని " ఆ కథలు నమ్మి కాదుగాని.. ఎవరికోసమో మోకాళ్ళ పై నించున్న మా ఆయన వాళ్ళావిడ కోసం ఇప్పటిదాకా అలా చేయలేదేంటా అని కొంచెం కోపం. ఇప్పటికైనా తెలిసింది. సంతోఓఓషం" తలమీద చిన్నగా మొట్టికాయ వేస్తూ చెప్పింది . ఏమన్నదో అర్దం కాక కాసేపు బుర్ర గోక్కన్నా, తేరుకున్నాక నన్ను నేను చూసుకుంటే హాలివుడ్ సిిసిమాల్లో హీరోయిన్ కు ప్రపోజ్ చేసేటపుడు హీరో మోకాళ్ళపై నిలబడ్డా.. నా చేయి తన గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతుంది. ఏదైనా కావలనుకుంటే ప్లానులూ, స్కెచ్చులూ వేసుకోవాలిగాని అవసరమైనదాని కోసం మనం ఆటోమెటిగ్గా ట్యూన్ అయిపోతాం. ఆహా ఎంత మంచి అబ్జర్వేషనూ...నొట్ చేసుకొనేందుకు ’సాంబా’ లాంటోడు లేడు కదా! కాని ఇప్పుడు పాయింట్ అది కాదు... నందూ... ఆహా, నందూ ఎంత మంచిది అప్పుడెపుడో ఏదో చేశానని కాక తనతో అంత రొమాంటిగ్గా ఉండట్లేదని సాఫ్ట్‌గా తెలిసేలా చేసింది.

నువ్వింత మంచిదానివని తెలిసుంటే రోజూ ఇలాగే నిలబడి నీకొక రోజా పువ్వు ఇచ్చేవాడిని నందూ..ఇప్పటికైనా ఆలస్యమైపోలేదు, ఇప్పుడే వెళ్ళి పువ్వు కాదు పూల బొకెట్ పట్టుకొస్తా నువ్వు రెడీ అవ్వు బయటకెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామన్నా.  "ఏం వద్దు...కర్రీ పాయింట్ కు ఫోన్ చేసి గుత్తొంకాయ కూర ఆర్డర్ చేసాను ఇందాకే.. మీ ప్రపోజల్ ఏదో ఇక్కడే చేయండి. ఇంకోమాట.. కందమూ, ఉత్పలమాల అంటే రచయిత్రిల పేర్లు కాదు పద్యాలలో అవొక రకం" అంది కొంటెగా నవ్వుతూ. కాని నాకు  కందం గారు మళ్లీ గుర్తొచ్చారు.
                                      

వంకాయ వంటి కూరయ
సుగుణవతి నందిని వంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే


అని ఉండాలి.... ఆ యతులూ, గణాలేవో సరిగా పడక వేరేలాగా రాసారు :) 

11 వ్యాఖ్యలు.. :

బులుసు సుబ్రహ్మణ్యం said...

అదరహో.

Anonymous said...

గుత్తివంకాయ కూరా... మానవ సంబంధాలూ అద్దిరిపోయాయి....

..nagarjuna.. said...

ధన్యవాదాలు గురూజీ, ఫణిగారు :)

శిశిర said...

:) ఊ.. ఊ..

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వంతే, వంకాయ కూరలో బేకింగ్ సోడా కేకంతే.ఎక్కడికో వెళ్ళిపోయానంతే.మా రెండో అక్క పెళ్ళిలో ఇలాగే వంకాయ కూరలో ఉప్పుకి బదులు ఇలాగే వేస్తే దెబ్బకి బెడిసిన వ్యవహారం ఇప్పటికీ సర్దుమణగలేదు తెలుసా?

రాజ్ కుమార్ said...

సూఊఊఊఊఊఊఊపర్....

Unknown said...

బావుంది Radhika (nani)

మురళి said...

చా...లా బావుందండీ.. చాలా సహజంగా ఉంది.. ఎక్కడా విసుగనిపించక పోగా చివరికంటా ఆసక్తిగా చదివించింది.. ముగింపు సింప్లీ సుపర్బ్.. హాస్యం పుట్టించడం కోసమని ప్రత్యేకించి ప్రయత్నం చెయ్యకుండానే కిసుక్కున నవ్వించారు చాలా చోట్ల.. తరచూ రాస్తూ ఉండండి..

శశి కళ said...

nice :))))

..nagarjuna.. said...

శిశిరగారు, రాజ్, పప్పుగారు, మురళిగారు, శశికళగారు, రాధికగారు ... మీ అందరికీ థాంక్స్ :) :)

TEJA..... said...

చాల బాగ రాసారు..ఆద్బుతః
వంకాయ వంటి కూరయు... ee line evaru raasaru..interesting ga undi

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis