భగవంతుడికి మోక్షం వుంటుందా ?

ముందుగా టపా శీర్షికకు అంతగా సంబంధంలేని ఓ విషయం మాట్లాడుకుందాం. సృష్టిరచన జరగకముందు, వివిధ మతాలనూ తత్వాలనూబట్టి, శూన్యమో దేవుడో ఉండేది (భగవంతుడికి లింగం లేదు గనక ఉండేది అంటే సమంజసమేనని అనుకుంటున్నా). దేవుడు ఆజ్ఞాపించగానే శూన్యంలోని శక్తి మార్పుచెంది ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చరాచర జగత్తుగా రూపుదాల్చింది. కొంచెం లోతుగా చూస్తే శక్తి మొదట పదార్ధంగా మారి ఆపైన పరమాణువుగా, అణువుగా, మూలకంగా... ఈ క్రమానుసారంగా ప్రాణిగా రూపాంతరం చెందింది. ప్రాణికి ఉండే 'బుద్ది' కారణంగా అది ఆలోచించగలదు. భౌతిక శాస్త్ర నియమం ప్రకారం దేన్నీకూడా ఏమీలేని శూన్యం నుండి సృష్టించలేము. శక్తిని సృష్టించలేము దాన్ని కేవలం ఒక స్వరూపం నుండి మరొక స్వరూపంలోకి మాత్రమే మార్చగలం. అంటే బుద్ది కూడా శక్తి స్వరూపమే అయ్యుండాలి అయితే నిర్గుణమైన శక్తి క్రమపద్దతిలో 'బుద్ది'గా మారిన తరువాత దానికి ఏదో ఒక గుణం చేకూరడం ఆశ్చర్యకరం. ఇప్పుడు మళ్లీ బుద్ది ఉన్న ప్రాణి దగ్గరికి వద్దాం. ప్రాణుల్లో వాటివాటి పరిమాణక్రమాన్ని అనుసరించి, అంటే ప్రాణుల్లో ఉత్కృష్టమైనవి మోక్షన్ని కోరుకుంటాయట. వాటి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షానికి మోక్షానికి మధ్య ఆత్మ/ప్రాణి సాగించే యాత్రే జనన మరణాలు అని అంటువుంటారు. మార్పుంటూలేని, స్వఛ్చమైన, నిర్మలమైన ఆ మోక్షం ఏమై వుండవచ్చు ? సృష్టిరచన జరిగేముందు ఉన్న శక్తి కావచ్చునా ? సృష్టిరచన ఉద్దేశ్యం మరొక సృష్టి అవసరంలేని శక్తి సహిత శూన్యంలోకి వెళ్లడమా ?

ఇక టపా శీర్షిక గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి హైందవ ధర్మంలో, బౌద్ధంలో మోక్షమనే జనన-మరణరహిత స్థితి ఉంటుంది. దేవుడి ఇఛ్చనుబట్టి, ప్రాణి పూర్వకర్మలనుబట్టి మోక్షస్థితి పొందటమా లేక మరోసారి జన్మనెత్తడమా నిర్ణయించబడుతుందట.  ఇస్లాం, క్రైస్తవంలో ఇటువంటిది లేదనుకుంటా. ఆ మతాల్లో దేవుడు ప్రాణులని సృష్టిస్తాడు సుకర్మలద్వారా ధర్మాచరణ చేసిన ప్రాణులకు ఉర్ద్వలోకాల్లో సుఖసంతోషాలను ఇస్తాడు. ఐతే ఈ అన్నీ ధర్మాలలో, మతాలలో దేవుడు నిరంతరం సృష్టిరచన చేస్తూనే ఉంటాడు. హైందవ ధర్మం తీసుకుంటే కొన్ని మహాయుగాల తరువాత ప్రళయంలో సృష్టి అంతా లయమౌతుంది ఆ తరువాత కొత్త సృష్టి మొదలౌతుంది(ట). మిగతా మతాలలో దేవుడనేవాడు ప్రాణులను సృష్టించడం నిరంతరం చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. ఐతే సర్వజ్ఞుడైన దేవుడికి ప్రాణిని సృష్టించాల్సిన అవసరం ఏముంది ? తను తప్ప మరెవరూలేనపుడు ఎవరికి ఏం తెలియజేద్దామని సృష్టిని చేసాడు ? పైన చెప్పుకున్నట్టు దేవుడు నిరంతరం సృష్టిరచన చేయడానికి బద్దుడైతే అతను మోక్షప్రదాత ఎలా కాగలడు ? 
If He knows all and every thing why then there is a creation ?

If He is not free Himself, how can he free others ?

బుక్కు, రెండొ బుక్కు, మూడొ బుక్కు

RK Narayan - భారతీయ ఆంగ్ల సాహితీ లోకంలో ఈ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. 'మాల్గుడి' అనే అధ్బుత కాల్పనిక లోకాన్ని ఆవిష్కరించిన ఘనుడు ఆయన. చిన్నపుడు దూరదర్శన్ లో మాల్గుడి కథలు ప్రసారమయేవి, కాలక్షేపానికి బానే అనిపించేవిగాని ఓ పట్టాన అర్ధమయ్యేవికావు. కొంచెం పెద్దాయ్యాక పాఠ్యపుస్తకాల్లో ఆయన రచనలు కొన్ని ఉండేవి. చిన్న చిన్న కథలు అవి. నేటివిటి ఉన్నా అంతగా ఆకట్టుకోలేదు. ఇంజనీరింగ్ వచ్చాక స్నేహితుడొకడి దగ్గర ఆయన రాసిన The English Teacher ఉంటే తెచ్చుకొని చదవటం మొదలుపెట్టా. అప్పటికి మా-టివి లో మాల్గుడి కథలు పునః ప్రసారమౌతుండేవి కాని ఆ డబ్బింగ్ వినలేక వదిలేసా. నవల చదవటం మొదలు పెట్టానోలేదో ఆ శైలి నన్ను కట్టి పడేసింది. అరే! చాలా సాధారణమైన పరిసరాల వర్ణన, ఆర్భాటం లేని మనస్థత్వలతో పెద్ద మాయలు చేసాడు. చెప్పాలంటే ఆయన రచనల్లో  జలపాతాలో, పూలతోటలో కాకుండా మామూలువి అనుకునే ఓ టేబుల్, ఓ పెన్ను, ఓ చెంబు, దేవుడి గూట్లో అగర్బత్తి లాంటివే ఎక్కువుంటాయి. అవే కథలో రమణీయతకు సహాయం చేస్తాయి. మాల్గుడి ప్రస్తావన తీసుకువస్తే పాఠకుడు ఎలాంటి పరిస్థితిలో  ఉన్నా  తనూ ఆ ఊర్లో భాగమైపోవాల్సిందే. అన్ని కథలు ఆ మాల్గుడిలోనే జరుగుతాయ్, ఆ ఊరితో ఏదో సంబంధం ఉంటుంది, అయినా ఎన్నిసార్లు ఆవూరి ప్రస్తావన వచ్చినా విసుగనిపించదు పైపెచ్చు 'ఈ సారి ఊర్లో ఏం జరగబోతుందో !' అనే కుతూహలం కలుగుతుంది.అలా ఆయనకు పెద్ద పంఖానైపోయి మొన్నీమధ్య ( అంటే ఓ ఏడెనిమిది నెలల ముందు) Waiting for the Mahatma పుస్తకం కొన్నా. కాలేజిలో ఉండంగా వారానికో పేజీ చొప్పున చదివీ చదవలేక పక్కనపడేసా. ఇంటికొస్తూ టైంపాస్ కోసమని రైల్లో చదవటం మొదలుపెడితే ఇంటికొచ్చేసరికి పూర్తయింది :).   ఇప్పటివరకు నే చదివిన నారయణ్ గారి పుస్తకాల్లో ది బెస్ట్.  భారతి-శ్రీరాం-మాహాత్ముడి చుట్టూ కథ నడుస్తుంది. శ్రీరాం  చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ పెంపకంలో పెరుగుతాడు. మైనారిటీ తీరాక శ్రీరాం పేరిట  బ్యాంకులో ఉన్న డబ్బును తనకే అప్పజెబుతుంది నానమ్మ. అసలే కుర్రోడు పైగా  బ్యాంకు బ్యాలెన్సువుంది కనుక పనీపాట లేకుండా  అవసరంవున్నా లేకపోయినా డబ్బు ఖర్చు చేస్తూ దర్జగా బతికేస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఒక రోజు బజారులో శ్రీరాంకు భారతి  కనపడుతుంది, ఆ ఆమ్మాయి అందానికి ముగ్ధుడైపోతాడు. ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే స్వాతంత్ర్యోద్యమ భాగంలో గాంధీగారి గ్రామసభ ఏర్పాట్లు చూసుకునే సభ్యురాలు అని తెలుసుకుంటాడు. ఇంటిదగ్గర నానమ్మ సంగతి మర్చిపోయి భారతిని వెతుక్కుంటూ వెళతాడు. చివరికి భారతిని కలుసుకొని ఆమెపట్ల తన ఇష్టం గురించి చెప్పి ఆమే స్పందన కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ తరువాత భారతి ఏం చెప్పింది, దానికి శ్రీరాం ఏం చేశాడు అసలు వీళ్లిద్దరి కథకు మహాత్ముడికి సంబంధం ఏంటొ తెలియాలంటే- పుస్తకం కొనండి, చదవండి happy
  కథ చాలావరకు శ్రీరాం చుట్టు తిరుగుతుంది. భారతి కోసం తనేం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎటువంటి పరిస్థుతులను ఎదుర్కున్నాడు అని.  ఐతే నన్ను ఆకట్టుకున్న పాత్ర భారతి, తను ప్రత్యక్షంగా లేనపుడు శ్రీరాం ఆలోచనల్లో భారతి.She's one with a firm attitude and the way she conducts herself, guides Sriram is just wonderful. మిగతా ఆకర్షణగా నారాయణ్ గారి హ్యూమరసం, మాల్గుడి ఉండనే ఉన్నాయి.
(Photo collected form Penguinbooksindia.com )

ఇక ఇప్పుడు మీకు రాంబాబును పరిచయం చేయాలి. ఎవడు, ఎవరయ్యా ఈ రాంబాబు అంటారా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. రాంబాబు ఈజ్ ఎ సీనియర్‌మోస్ట్ వెటరన్ బడ్డింగ్ పార్ట్‌టైమ్ జర్నలిస్ట్-జాయింట్ ఎడిటర్ (ఆల్మోస్ట్ ఎడిటర్ ) ఆఫ్ సుజనమిత్ర -థి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ప్రోగ్రెసివ్ తెలుగు డైలి పబ్లిష్డ్ ఫ్రం చింతల్‌బస్తీ. చూసారా పరిచయం చేయడానికే ఇంత శ్రమ పడాల్సొచ్చిందంటే ఆయనెంత గొప్పవాడో మీరే ఊహించుకోండి. రాంబాబుకు ఆసక్తి కలిగించని అంశంలేదు సంగీతం, సాహిత్యం, సైకో అనాలసిస్సు, రాజకీయం,  మరదలుని అప్పుడప్పుడు పక్కింటమ్మాయిని ప్రేమించడం...అబ్బో ఒకటేమిటి ఏది ఎదురైతే దాంట్లోకి ప్రవేశం చేయాలనుకుంటాడు. అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తి డైరీ రాయడం. ఆ ఆసక్తి పాఠకులకు టన్నులకొద్దీ హాస్యాన్ని పంచే దివ్యౌషదం. రాంబాబు డైరి కనుక చదువుతున్నారు అంటే జంధ్యాలగారి సినిమాలు back-to-back చూసినట్టే. అతని మేధోసంపత్తిని ఉదహరించే కొన్ని ఆలోచనలు మీకోసం,

౧) ఇంగ్లీష్ అంత దరిద్రపుగొట్టు భాష మరోటి ఉండదు.  తెలుగులో గాడిదా అంటే ఆ పదాన్ని ఎప్పుడు ఎక్కడ వాడినా దానర్ధం గాడిదే.  కాని అదేంటో ఇంగ్లీష్‌లో animal=పశువు , husband= భర్త,minister= మంత్రి కాని animal husbandry minister= పశుభర్తృత్వశాఖా మంత్రి అంటె తప్పంటారు, Non-Political = అరాజకీయం అంటే తప్పంటారు. స్టుపిడ్ !

౨) అలాగే క్రికెట్టంత దరిద్రపుగొట్టు ఆట మరోటిలేదు. ఎప్పుడూ బ్యాట్స్‌మెనే ఔటౌతారంట. యే ఆ బౌలర్లు, ఫీల్డర్లు ఔటావచ్చుగా, పైగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ మీదకు పదకొండు మంది దాడి చేస్తుంటారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఖండించాలి.

౩)ఎన్నికలపుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎన్నికల అనంతరం దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెసు, భా.జ.పా కలిసిపోవాలి. లేకపోతే ఒకరిమీద మరొకరు సోదాలు చేసుకుంటూ సమయం డబ్బూ రెండూ వృథా.

౪)చార్లీ  చాప్లిన్ కు అసలు నటనే రాదు రాజ్ కపూర్‌ను అనుకరించటం తప్ప. అది కూడా రాజ్ కపూర్ పుట్టకముందే అతణ్ణి అనుకరిస్తూ నటిస్తాడు.

ఇలాంటి మహత్తరమైన ఆలోచనలతోపాటు మీకు నర్మగర్భాలంకారం, అన్యాపదేశాలంకారం లాంటి సరికొత్త భాషా ప్రయోగాలు కూడా తెలియాలనుకుంటే రాంబాబు ను పలకరించాల్సిందే. నండూరి పార్థసారధిగారు మూడు భాగాల్లో అందించిన  హాస్యపు విందు భోజనం రాంబాబు డైరి.







అతలుకైతే ఈ టపాలో ముచ్చటగా ఏ ఫ్పదో డెబ్బైయ్యో సంగతులు చెప్పేద్దామనుకున్నా. కాని ముచ్చటగా ఎప్పుడూ మూడే ఉండాలంట. అలాగైతేనే కుదురుతుందని కొత్త మేష్టారు చెప్పారు. అందుకని మూడు మాత్రమే చెప్పుకుందాం.
మరి మూడనగానే మీకేం గుర్తొచ్చింది ?
గాంధీగారి మూడు కోతులు.
మరి కోతులెక్కడ ఉంటాయి?
కొమ్మలమీద.
చూసారా చెప్పాలనుకున్న పుస్తకం పేరు మీతో ఎలా చెప్పించానో 'కోతి కొమ్మచ్చి' అని.
%#$(*$@)(*
వద్దు మీరు నా ప్రతిభా పాటవాలను మెచ్చుకోకండి, నే తట్టుకోలేను. big grin

తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రుడైన పిడుగు బుడుగును సృష్టించిన రమణ, బాపుతో కలిసి ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమాలు తీసిన రమణ, రాత-గీత  ద్వయంగా నిలచిన స్నేహంలోని రమణ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్ట విషయాలు చెప్పుకోవచ్చు ఆ మహానుభావుడి గురించి. ఆయన ఆత్మ-బాపుకథ  కోతికొమ్మచ్చి, చాలా  కుంచెం ఆలస్యంగా దొరకబుచ్చుకున్నా. మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో ఆయనను గురించి ఆయనకు పరిచయంవున్నవాళ్ల గురించి నిర్భయంగా చెబుతుంటే ఒకోసారి 'వావ్ నిజంగానా' అనిపిస్తుంది ఒకోసారి 'వార్ని! ఇలాటి కతలు కూడా ఉన్నయ్యా' అనిపిస్తుంది. ఔను మరి 'ఇది రాయాలి, ఇలానే రాయాలి' అని అనుకోకుండా మనసుకు ఏది గుర్తుకువస్తే అది రాస్తే, నిజాలు రాస్తే అలానేవుంటుంది. ముందైతే కోతికొమ్మచ్చిలో మొదటిభాగం మాత్రమే కొన్నా, చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపించడంతో ఏకబిగిన అలా చదువుతూఊఊ వెళ్లిపోయా, రెండురోజుల్లో అయిపోయింది. హమ్మయ్య, వావ్ నేనేనా ఇలా చదివేసింది అని అనుకుంటుండగా అనిపించింది రోగం తెచ్చే మందైనా, రోగం కుదిర్చే మందైనా కుంచెం కుంచెం సేవించాలి తరించాలి అని. ఆ పద్దతిలో మిగతా రెందు భాగాలు ఆడుతూ పాడుతూ ముగించా. మొత్తంగా చూస్తే కోతి కొమ్మచ్చి లో మొదటి భాగం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎందుకూ అని అడిగితే అందులో రమణ బాల్యంవుంది, బాపుతో మొగ్గతొడిగిన స్నేహంవుంది, చెన్నై నగరంలో పడిన సాపాటు పాట్లు ఉన్నాయ్, ఆ పాట్లలో పాడుకున్న పాటలున్నయ్, పాత్రికేయుడిగా అనుభవాలు ఉన్నాయ్, ఒక స్థాయికొచ్చాక తాను వెలిగించిన సిగరొత్తుల పొగరెట్ కథలు అవి ఇచ్చిన వగరు రుచి వుంది. పుస్తకం చదివేముందు ముందు చదివిన వెనకమాటలో చెప్పినట్టు దరిద్రాన్ని ఇంత రొమాంటిక్‌గా కూడా చూడవచ్చా !? అనే ఆశ్చర్యం కలుగుతుంది.

రెండు మూడు భాగాల్లో బాపుతో కలిసి మొదలుపెట్టిన సినిమా ప్రస్థానం వుంది. రెండవ భాగం అయ్యాక ముడొభాగం చదివేందుకు కొంచెం బాధ కలిగింది, చెప్పవలసిన విషయాలు చెప్పకుండానే వెళ్లిపోయాడా పెద్దమనిషి,  ఆయన లేరనే విషయం గుర్తొచ్చేది.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన తొలినాళ్లలో రమణ కథలు,వ్యాసాలు గట్రా రాసుకొని, బాపుతో బొమ్మలు గీయించుకొని పత్రిక కార్యాలయాలకు వెళ్లేవాడట అవి చూసి ఇడ్లీ కంటే పచ్చడి బావుంది అనేవారట. అచ్చం అలానే పుస్తకంలో కొన్ని చోట్ల రమణ రాసిందానికన్నా బాపు వేసిన బొమ్మలు ఆకట్టుకుంటాయ్. మొదటి భాగంలో రమణ అమ్మగారు పచారికొట్టువాడి కాంట్రాక్టు పోయినందుకు భయపడలేదు అని చెప్పడానికి బాపు వేసిన బొమ్మ భలేగా అనిపించింది. అరే అంతపెద్ద కష్టాన్ని ఆయన సింపుల్‌గా చెప్పడమేంటి ఈయన అంతకంటే సింపుల్‌గా నవ్వొచ్చేట్టు వేయడమేంటి అనిపిస్తుంది. అంతగా అర్ధం చేసుకున్నారా ఒకరినొకరు అనుకునేంతలోపే బాపుతో కూడా లడాయిలు వేసుకున్నా, ఆయనతో కూడా బడాయికిపోయా అని ఒప్పేసుకుంటాడు.

ఇంకొన్నేళ్లు బ్రతికివుంటే మరిన్ని కొమ్మలు ఎక్కి మరింత సంబరం కలిగించేవారు రమణ.
పుస్తకంలో రమణ అంటాడు, రాముడు తనపై చాలా ప్రేమను కురిపించాడని. రామాయణం రాయించుకునే పనిలో తనకు పుణ్యం ఇచ్చి, సంపూర్ణ రామాయణం తీయించి, ఆపై  ఈ-టివీ భాగవతం లో మరోసారి కరుణించాడని. విధి విలాసమో ఏమో ఈసారి మరోసారి రాముడి కథను తెరకెక్కిస్తుంటే ఆ రాముడే తనదగ్గరకు  పిలిపించుకున్నాడు.

తెలుగుబాట

మొన్నటి ఆదివారం రోజున e-తెలుగు వారు 'తెలుగు భాషాదినోత్సవం' సందర్భంగా తెలుగుబాటను నిర్వహించారు. కార్యక్రమం జరిగేది హైదరాబాదులోనే కాబట్టి నేను కూడా పొలోమంటూ వెళ్లాను. అప్పటికి చాలా రోజులనుండి బ్లాగులలో, బజ్జుల్లో, ఫేస్‌బుక్, ఆర్కుట్‌లో కార్యక్రమం గురించి ప్రచారం జరుగుతూ వచ్చింది. కార్యక్రమం ఉదయం 9:00 నుండి మొదలౌతుంది అని తెలుసు, కాని ఇండియన్ టైము ప్రకారం ఓ ఇరవై నిముషాలు ఆలస్యంగా వెళ్లాను :D. అప్పటికి e-తెలుగు సభ్యులు కరపత్రాలు, బ్యానర్లు సిద్దం చేస్తున్నారు. చేరుకోగానే లినక్స్ ప్రేమికులు రెహ్మాను, ప్రవీణ్ ఇళ్ళ పలకరించారు. ఓ స్టిక్కర్ లాంటిది అతికించేసి ఓ పెద్దాయనకు నన్ను అప్పగించేసి రెహ్మాన్ చక్కా వెళ్లిపోయాడు, తన పనిలో నిమగ్నమైపోతూ, అందరిని సమన్వయపరుస్తూ. 'హలో', ' హాయ్', 'గురూ గారు మీరా!!' అనుకున్నాక ఆ పెద్దాయన అంచేత నే చెప్పోచేదేంటంటే అబ్భాయ్ ఇంద ఈ బ్యానర్‌ను ఓ చేత్తో పట్టుకో ఇంకో చివరను నే పట్టుకుంటా అన్నారు. అలగే అనేసి అక్కడికి వచ్చిన రిపోర్టర్లకు సామూహికంగా ఫొజులిచ్చి నడక మొదలుపెట్టాం. 

దారివెంట తెలుగు గురించి నినాదాలు చేస్కుంటూ నడిచాం ఆదివారం కాబట్టి నడక మార్గంలో జన సందోహం ఎక్కువగా లేదు. ఇలాగైతే ప్రయోజనం ఉండదనుకొని సిటిబస్సులు ఎదురవగానే కొంచెం స్వరం పెంచి గట్టిగా అరవడం మొదలుపెట్టా, పాపం మిగతావారు అది 'యువరక్తం', 'ఉత్తేజం' అని అనుకున్నారేమో !! ఐతే మా అందరికంటే చురుగ్గా నడక ఆసాంతం ఓ పెద్దాయన ముందుండి నినాదాలు చేయించారు. ఆయన 'యువభారతి' అనే సాంస్కృతిక సంఘం సభ్యులట. మిగతావారందరం సగం దూరం అయ్యేసరికి డీలా పడిపోతే ఆయన మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. నడక ముగిసిన తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో సభను నిర్వహించారు. సభలో మాట్లాడిన వక్తలపేర్లు ఒకరిద్దరివి తప్ప గుర్తులేదు. అందులో ప్రస్తావించిన విషయాలు స్థూలంగా...
౧)తెలుగు  భాష మనుగడ సాగించాలి అంటే ఆ పనికి ప్రజలే పూనుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వాలను, పాశ్చాత్య పోకడలను నిందించడమో సరికాదు.
౨) భాష వాడుకలో ఉండాలి అంటే ప్రభుత్వాలు, ప్రసార సాధనాల బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండింటికి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది.
ఈ రెండూ కాస్త పరస్పర విరుద్దంగా అనిపించినా సబబుగానే తోచింది.

సభ ముగిసిన తరువాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పెద్దలు పూలమాలలు తొడిగారు. మాలాటి కుర్రవెధవలం ఒకరితో ఒకరం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, ఫొటోలకు ఫోజులిచ్చుకున్నాం. ఇప్పటిదాకా బ్లాగు/బజ్ ద్వారా మాత్రమే తెలిసిన బ్లాగర్లు తెలుగుబాట ద్వారా ప్రత్యక్షంగా కలిసారు. చాలా ఆనందం కలిగింది.









కోతికొమ్మచ్చి:

మొన్నొకరోజు ఓ దగ్గర వెయిట్‌చేస్తూ కూర్చున్నా. నా వెనక ఇద్దరు అమ్మాయిలు,అప్పటివరకు ఒకరికి ఒకరు పరిచయంలేదు, మాట్లాడుకుంటున్నారు.  అబ్బో, ఇంగ్లీష్ లో దడదడలాడించేస్తున్నారు 
" Yeah, Hyd is such a beautiful city. I very much wish to settle here........ etc etc"
"We stay in XYZ area, actually we are going out on a holiday trip this sunday to ABC..."
"so it is gonna be a funday trip :) "
"WoW ! how beautiful "
etc etc

ఇంతలో రెండో అమ్మాయ్ ఫోన్ మోగింది, తను లిఫ్ట్ చేసి " ఆ నాన్నా, పని ఇంకా అవలేదు. మరోగంటసేపు పట్టోచ్చు....."అనేసి పెట్టేసింది. ఓహో అమ్మి తెలుగే! అని మనసులో అనుకుని వారి మాటలు అలాగే వింటున్నా. 
ఇంతలో మొదటి అమ్మాయి ఫోన్ మోగింది, ఆమె లిఫ్ట్ చేసి " ఆ... నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఓ హండ్రెడ్ వెయ్యమను...." అంది. వార్ని ఇద్దరు అమ్మిలు తెలుగేనా అని ఆశ్చర్యపోవడం నావంతైంది.

జై తెలుగు!  జైజై తెలుగమ్మాయిల్స్ !

ShareThis