వీకెండు ముచ్చట్లు....

అటెన్షన్ ప్లీజ్, రియల్ వరల్డ్ నుండి బ్లాగ్ వరల్డ్,  ఫ్లయిట్ నెంబర్ RB5512 మరి కొద్దిసేపట్లో ల్యాండ్ అవబోతుంది.....

హలో హలో హలో.... బాగున్నారా అందరూ. Very glad to see you all :)
అరె ఏందిది!  నా రాకను పురస్కరించుకొని స్వాగత హారతులిచ్చి, గజమాలలు వేసి, గజారోహణం చేయించి పురవీధులలో ఊరేగిస్తారనుకుంటే  ఇంత తక్కువ జనాలా!? వీకెండును అంతబాగా ఎంజాయ్ చేస్తున్నారా. అబ్బోస్ మీకొక్కరికేనేంది  మాకూవుంది వీకెండు, మేము చేశాం ఎంజాయ్‌మెంటు. ఇగో ఈ పోస్టు నిండా ఆ సంగతుల్ స్మృతుల్ నింపేస్తాను చదివి ఆనందిద్దురుగాని..


ఉపాద్ఘాతము
అనగా అనగా అనగా... ఒక నెలరోజుల క్రితం హైదరాబాద్ నగరమందు ఉండెడి ఇద్దరు  ఘోటక బ్రహ్మచారులకు సాటి గుంటూరు వైద్య బ్రహ్మచారి తన అమృతహస్తములతో చేసే వంటలను  రుచిచుడ మనసైనది. పరస్పరం చర్చించుకున్నమీదట ఓ మంచి శుక్రవారం ( ఈ పదం యొక్క పుట్టుపూర్వోత్తరాల కోసం 'డైరీ'ని, ఇది ఎంత మంచిదో తెల్సుకునేందుకు 'పాకవేదాన్ని' తిరగేయండి)  గుంటూరు బయలుదేరవలెనని , ఈ కార్యాచరణకు వ్యతిరేకంగా హరిహరాదులు ఏకమైనను ప్రతిఘటించి వాటిని విఘటించి (అర్ధం వెతకొద్దు, మాఆఆంచి ఫ్లో లో వచ్చేసింది) వెళ్ళవలెనని అనుకుంటిరి. ప్రయాణానికి రెండు రోజులనగా ఎర్పాట్లలో నిమగ్నమైన పెద బ్రహ్మీకి  చిన బ్రహ్మీ నుండి కాల్ వచ్చినది. ఏమిటి నాయనా అని అడగ్గానే అవతలి వైపునుండి ఒకటే ఏడుపు.



"మా మేనేజరుడు సెలవు ఇవ్వననీ, పాలుగారే పసివాడినని కూడా చూడకుండా నాతో వెట్టిచాకిరి చేయించుచున్నాడు బాబోయ్. నేను రాలేను వాఆఆఆఆఆఆఆఆఆ"
"ఒస్ అంతేనా, ఈ చరాచర సృష్టిలో ఏ మేనేజరుడు అడిగిన వెంటనే సెలవు ఇస్తాడుగనక మీవాడిని గూర్చి అంతలా దుఃఖించడానికి. నువ్వే గట్టిగా ప్రయత్నం చేయ్యాలి. కాదు కూడదు అంటే ఏదో జబ్బు చేసింది టాబ్లెట్లు కొనడానికి గుంటూరు వెళ్ళాలి అని చెప్పు. అదియునూ కుదరదంటే చెప్పాపెట్టకుండా వచ్చెయ్, తిరిగొచ్చాక కారణం అడిగితే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పు, చెయ్యడానికి నేను కట్టుకట్టడానికి డాట్రు ఎంతోకొంత సహాయం చేస్తాం" అని ఉపాయం చెప్పాడు పెద బ్రహ్మీ. భయంవల్ల అనుకుంటా అంత చెప్పినా పాపం అతను ధైర్యం చేయలేకపోయాడు. సరే ఇతగాడు రాలేడు కదా తోడుగా మురళీధరుడిని వెంటబెట్టుకు వెళదాం అని యోచించి అతడిని సంప్రదించాడు, చివరకు అతను కూడా 'నామాలు' పెట్టడంతో విధి బలీయమైనది,ఈమారు తనకొక్కడికే అమృతపాన యోగమున్నది కాబోలని తలంచి బయలుదేరెను.


అధ్యాయము
తెల్లవారుఝామున గుంటూరులో బస్సు దిగగానే కౌటిల్య ఫోన్ చేశాడు, "వందేళ్లు డాట్రు. ఇప్పుడే బస్సు దిగాను నీకు ఫోన్ చేద్దామనుకునే లోపు నువ్వే చేశావ్. ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా రావాల"ని అడిగా.
" నీ ఎదురుగా, చుట్టుపక్కలా ఏదైనా విగ్రహం ఉందా" - అవతలి వైపునుండి ప్రశ్న
"ఆ ఉంది"
"అయితే కొంచెం బాడి రైట్ టర్నింగ్ ఇచ్చుకొని తిన్నగా ఓ అరకిలోమీటర్ వచ్చెయ్... ఈసారి  మూడు విగ్రహాలుంటాయ్. వాటిని దాటుకుంటూ పదడుగులు వేస్తే రామాలయం పక్కన ఇంకొక విగ్రహంలా నేను ఉంటాను"
ఈ విగ్రహాల భాషేంటో అర్ధం కాక కొత్త ఊర్లో తెలీనోళ్లతో ప్రశ్నలు ప్రయోగాలు ఎందకని ఇచ్చిన డైరెక్షన్స్ ను యాక్షన్ లో పెట్టా. గుడి దగ్గరరికి చేరుకోగానే డాట్రు హనుమంతుడిలా వచ్చి తన రూంకు తీసుకొనిపోయాడు. ఎప్పుడు చూసినా వంటలూ పుస్తకాలని అంటువుంటాడు లంకంత కొంప ఉంటుందనుకున్నా. అబ్బే సింగిల్ రూము! book rack మాత్రం ఉంది  "ఇదెంటిది, త్రిబుల్ కిచెన్ + బెడ్‌రూం+హాల్ ఊహించుకున్నాను. నిత్యం రుబ్బురోళ్ల చప్పుడుతో, పెనం మీద ఐటెమ్స్ ఘుమఘుమలతో అలరారుతుందనుకుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. ఇది నీ రూమేనా"ని అడిగితే హిహ్హిహ్హి అని నవ్వేసి, వంట చేసుకుంటే ఇదే కిచెను, చేసింది తింటె ఇదే డైనింగ్ రూము, చదువుకుంటుంటే ఇదే హాల్, పడుకుంటే ఇదే బెడ్‌రూము అని బ్రహ్మీఙ్ఞాన ఉపదేశం చేసి తను స్నానం పూజ కానిచ్చేలోపు కంప్యూటర్‌లో మొహం పెట్టి నెట్టింగో కుర్చిలో దేహం పెట్టి రీడింగో చేసుకొమ్మని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

స్నానాలవీ కానిచ్చాక ఆ రోజు అమరావతి వెళ్ళాలని అనుకున్నాం. బ్రేక్‍ఫాస్ట్ చేద్దామని "పద కౌటిల్యా..అలా దారిలో ఎక్కడైనా దోశలో ఇడ్లీలో తిందామ"న్నా. శంకరాభరణంలో శంకర శాస్ర్తిలా "చారీ..." అని కౌటిల్య అనేసరికి కొంచెం భయపడ్డా. మా ఊరికి వచ్చి అందునా నా ఇంటికొచ్చి ఎక్కడో బయట తింటానంటావా. వండిపెడదామని సరుకులన్నీ తీసుకొచ్చా.అలా కూర్చొని ఉండు వేడి వేడిగా దోశలు వేస్తానని చెప్పి కూర్చొబెట్టాడు. గుంటూరు మిర్చి ఘాటు తగులుతుందేమో అనుకున్నా..... పోయినసారి వేణు శ్రీకాంత్ గారు వచ్చినపుడు చాలా వాడేసాడంట నాకు కొన్నే మిగిలాయి happy. కౌటిల్య ప్లేట్లో దోశలు వేస్తుంటే వాటిని తింటూ జనాలను ఉడికించడానికి ప్లస్సులో పోస్టులు వేసా. తినడం ముగించి బయలుదేరబోతుండగా శేఖర్ ఫోన్ చేశాడు పది నిముషాల్లో వస్తానని. సరే ముగ్గురం కలిసి బయల్దేరదాం అనుకొని ఓ గంటసేపు వెయిట్‌ చేశాం.గంట దాటాక పదినిముషాలకు శేఖర్ వచ్చాడు. బ్లాగు ఫొటోలో చూసి నాలాగే యువబ్రహ్మీ అనుకున్నా....అమితాబ్ బచ్చన్ హైటుతో ప్రసన్నవదనంతో ఉన్న పెద్ద (అలియాస్ ముదురు) బ్రహ్మీనే!! రావడం రావడమే 'ఎక్కడ ఎక్కడ వంట సామాన్లెక్కడ' అనడగడం మొదలెట్టాడు. ఇతగాడి గురించే కాబోలు డాట్రు ఆ సామాన్లన్నీ మంచం కిందకు సర్దేసాడు ;)
ఈ బాబు గురించి రెండు ముక్కలు చెప్పాలి. చూడడానికి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడిలా కనపడతాడుగాని సైలెంట్ గా పంచులు వేస్తాడు. ఎవడ్రా అన్నాడు అని మనం చుట్టుపక్కల చూస్తే ఇలా అమాయకమైన ఫేస్ ఒకటి కనిపిస్తుంది


ఛ... ఇలాంటి  ఉత్తముడినా అనుమానించింది అనుకునేలోపే ఇంకో పంచ్ పడుతుంది. గుంటూర్ లో ఉన్న మూడు రోజులు పాపం డాట్రు, శేఖర్ పంచ్‌లకు బలైపోయాడు sad  పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఇక లంచ్ చేసి బయల్దేరదామని లంచ్ కోసం వండడం మొదలు పెట్టాడు డాట్రు. ఏసీ లో కూర్చోబెట్టి పొయ్యి దగ్గర తను కష్టపడుతుంటే గుండె తరుక్కుపోయింది. పోని మేమేన్నా సాయం చేయమా అని శేఖర్ అడిగాడు. "బాబు ఈ ముక్క బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నపుడె అడిగా... ఉహూ, ఇల్లే, నహీ అంటున్నాడు. అథిది మర్యాదంట. అంతగా సాయం చేయాలనుంటే కమ్మగా మజ్జిగ చేసి ఇస్తాడు. తాగి పెడదాం" అన్నా. ఉత్తినే ఫార్మాలిటి కోసం అడిగా చారి. నిజంగా చేస్తామా ఏంటి అన్నట్టు ఏదో వినపడితే తిరిగి చూసా. చెప్పాను కదా.. పైన పెట్టిన ఫేస్ కనిపించింది. 
ఏమాటకామాటే డాట్రు పప్పు చేశాడూ, వేడివేడి అన్నంలో వాళ్లింట్లో చేసిన నెయ్యి వేసుకొని తింటే అనిపించింది... ఆహా నభూతో నభవిష్యతి. ఈ కాలపు ఆడ స్త్రీలేడిస్ కు వంట నేర్పగల ఏకైక వ్యక్తి మా డాట్రే  అంటే అతిశయోక్తి కాదు (హమ్మయ్య తాంబూలాలిచ్చేశా ఇక....  winking) సుష్టుగా తిన్నాక ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నామని గ్రహించి అమరావతి వద్దు ఆదమరచి నిద్రపోదాం అని డిసైడ్ చేశాం. రాత్రికి వేణుగారు టైటానిక్ సినిమాకు టికెట్లు బుక్ చేశారు. నడి సముద్రంలో, గాలివానలో టైటానిక్ మునిగిపోవడం చూస్తూ మధ్యమధ్యలో జోకులేసుకుంటూ సినిమా ముగించాం. సమయంలేక వేణు గారితో ఎక్కవ మాట్లాడలేకపోయా.

ఆ తరువాతి రోజు ఉదయమే లేచి నేను డాట్రు అమరావతి వెళ్లి అమరేశ్వరుని దర్శనం చేసుకున్నాము. గుడి దగ్గర కృష్ణానదిని చుస్తే చాలా బాధేసింది. నీళ్లన్నీ ఎండిపోయి పిల్ల కాలవలాగా కళావిహీనంగా ఉంది, ఒక రకంగా హైదరాబాద్‌లో మూసి లాగా ఉంది. గుడినుండి ఆర్కియాలజి మ్యూజియం, పక్కన ఉన్న పార్క్ వెళ్ళాము. డెవలప్‌మెంట్ హైదరాబాలోనే కాదు అమరావతిలో కూడా ఉంది అని పార్క్ లో ఓ జంటను చూసాక తెలిసింది. సాయంత్రం శేఖర్ తో కలిసి విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. వెళ్ళిన మూడు చోట్లా కౌటిల్య చక్కగా స్తోత్రాలు చదువుతుంటే గుడికి వచ్చినవాళ్ళు, పూజారులు మమ్మల్ని ఒక విధమైన గౌరవంతో చూసారు, రద్దీగా ఉన్నా వేళ్లెందుకు మాకు దారినిచ్చారు. కౌటిల్య వల్ల దుర్గమ్మను చాలా దగ్గరగా సుమారు అరగంటపాటు దర్శించుకునే అవకాశం కలిగింది . ఆ తరువాతి రోజు ఉదయం మంగళగిరి వెళ్ళాము.
మంగళగిరి కొండ ఒక అగ్నిపర్వతమంట....అది బద్దలవకుండా ఉండేందుకు కొండమీద కొలువున్న నరసింహస్వామి నోట్లో బెల్లం నీరు పోస్తారు. అగ్నిపర్వతం బద్దలవడం అనే ఓ క్లిష్టమయిన సమస్యను  నిత్యం నీరు పోయడం ద్వారా తీర్చడమనే ఆలోచన ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది. వైఙ్ఞానికంగా అదొక అద్బుతం. కాని నిత్యం నీరు ఎవరు పోయాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక్కడే భక్తి అనే అంశాన్ని చేర్చి ప్రజలే ఆ పని చేసేలా మలిచిన మన పూర్వీకులను మెచ్చుకోకుండా ఉండలేకపోయా.

వెంకటగిరి నుండి గుంటూరు తిరుగుప్రయాణమయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాక 'బ్లాగు పుస్తకం' పరిచయ సభ కోసం, నేను అటునుంచి అటు ఇంటికి వెళ్ళడం కోసం మళ్ళీ విజయవాడ వెళ్ళాం. పుస్తక పరిచయ సభకు వెళ్ళే ముందు విజయవాడలో పుస్తకాల షాపింగ్ చేశాం, సుజాతగారు రెహ్మాను.. వీళ్లందరిని తీసుకొనొస్తే మాకు కొనుక్కొడానికి ఇంకేమి మిగలవని డాట్రు ప్లాను :) మేము వేళ్లేసరికి సభ ప్రారంభమయింది. 'ఆది బ్లాగర్' చావా కిరణ్ గారు (ఇలా అనాలి అని కౌటిల్య చెప్పాడుమరి, కారణాలు తెలియవు winking ఎప్పటిలాగే నవ్వుతూ సభ ఏర్పాట్లు చేస్తున్నారు.  నేను శేఖర్ బుద్దిమంతుల్లా ఆఖరు వరుసలో కూర్చున్నాము. మేము ఇంత బుద్దిగా ఉన్నా కూడా రెహ్మాన్‌కు నచ్చలేదేమో సుజాతగారితో ఏదో చెప్పి మా ఇద్దరితో పుస్తకం ఆవిష్కరింపచేశాడు . అంటే మొత్తంగా మాతోనే కాదు 'షాడో' మధుబాబుగారి లాంటి పెద్దవారు చేశాక కూడా కొన్ని మిగిలిపోతే ఫొటొలో నిండుగా కనపడడానికి ఫిల్లర్స్ లా అన్నమాట ;)
అయినా రచయితల ఆదరం చూస్తే ముచ్చటేస్తుంది. మొన్న హైదరాబాలో సభ  చేసినపుడు వెళితే పుస్తకం బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడేమో ఆవిష్కరణ చేయమన్నారు, రేప్పొద్దున్న పుస్తకం రాస్తూ నాకు అంకితం ఇచ్చేస్తారేమో అని అనిపిస్తుంది వీళ్ల అభిమానం చూస్తే. నాలాంటి పెద్దలను గౌరవిస్తుంటే కాదనలేకపోతున్నాను కూడానూ big grin సభకు విజయవాడ, ఆ చుట్టుపక్క బ్లాగర్లు చాలామంది వస్తారు వారందరిని కలవచ్చు అనుకున్నాను, ప్చ్, 'తెలుగుకళ' పద్మకళగారు ఒక్కరే వచ్చారు.

సభ అయ్యాక మరోసారి పుస్తకాల షాపింగ్ చేసుకొని శేఖర్‌కు సెండాఫ్ ఇచ్చి, కిరణ్ గారితో చిన్న మిర్చిబజ్జీ పార్టి చేసుకొని ఆయన/రచయతలు ఇచ్చిన డిన్నర్ స్వీకరించి బస్ స్టేషన్ చేరుకున్నా. సరిగ్గా అదే సమయానికి మూర్తి అక్కడే ఉన్నాడని తెలిసింది. మేము వచ్చాక తెలిసిందేంటంటె తను అంతకుముందే బయలుదేరాల్సిందని, కలిసి వెళ్ళొచ్చని తన టికెట్ కాన్సిల్ చేయించుకున్నాడట. ఏమిటో ఈ బ్లాగానుబంధాలు. అంతకుముందెన్నడూ  ప్రత్యక్ష పరిచయం లేకపోయినా కేవలం బ్లాగ్/ప్లస్సు పరిచయం ఉన్నందుకు వాళ్లను కలవాలనుకోవడమూ, కలిసాక ఆనందపడటమూ, మొదటిసారి కలిసినా ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్లలాగా మాట్లాడేసుకోవడమూ.. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. తన 'పల్లీ పొట్లం' గురించి మాట్లాడుకుంటూ ఇంత చక్కని ఙ్ఞాపకాలను అందించిన  కౌటిల్యకు, వేళ్లేంతవరకు అక్కడే ఉన్న రహ్మానుకు వీడ్కోలు చెప్పేసి హైదరాబాద్ బయలుదేరాము.


PS: నువ్వు ఎక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టు బహులేటుగా శేఖర్ కోరిక మేరకు రాసిన ఈ పోస్ట్ అంతకు ముందు మాట ఇచ్చిన ప్రకారం చాణక్యకు అంకితం.


స్వీటు ద్వేషం

టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ స్వీట్ నథింగ్స్ గురించి చెప్పే పోస్ట్ అనుకుంటే మీరు పాలకోవాలో కాలేసినట్టే. మిఠాయులపై నిలువెల్లా సెగలు కక్కుతున్న వేడిలో హాట్ హాట్ పోస్టిది.
"పుత్రా పురుషోత్తమా, ఏమి నాయనా ఈ అకాల క్రోధమేమి, ఈ అకారణ వైరి ఏమి " అని మీకు అనుమానం ఆవేదన కలగవచ్చు అందులో తప్పులేదు. మీరు మిఠాయిలకు దాసులైపోయారు మరి. చిన్నప్పటినుండి అలా మిస్‌గైడ్ చేసారు మిమ్మల్ని. లేకపోతే ఏంటండీ ఏదో పిండిలోనో, పదార్ధంలోనో ఇంత లేకపోతే ఇం........త నెయ్యి వేసి (ఇదిగో ఇక్కడే నాక్కాలేది. ఎవరన్నా వేడివేడి అన్నంలోనో కూరలోనో నెయ్యి వేసుకుంటారు చల్లటివాటిపై వేసుకొని తింటారా !? అహా తింటారాంట. కాని అదేంటొ అర్ధం కాదు ice cold నేతి మిఠాయిలంటే చాలు లొట్టలెయ్యాలంట. వెయ్యకపోతే ఒప్పుకోరంట !) ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కలిపేసి ముద్దచేసి డబ్బాల్లో పెట్టి అమ్మడం అమాయకుల్లా కొనడం. అసలు వేయించిన తినుబండారాలకు ఉండే రుచిలో సగమన్నా ఉంటుందాండీ స్వీట్స్‌కు. మసాల చల్లిన మిర్చీ బజ్జీకు గాని, శనగపప్పు వడలకుగాని, ఉప్పు పచ్చిమర్చి సమేత ఆలు సమోసాలుకు గాని ,   కనీసం అప్పడాలకు సరితూగుతాయాండీ మిఠాయిలు. ఎక్కడా నో మ్యాచ్.


ఈ నిష్టూరమైన సత్యం నాకు చిన్నప్పటినుండి తెలియబట్టి మిఠాయిలకు ఏడంగా ఉండేవాణ్ణి. కాని ఈ సమాజం ఊరుకోదే ఏదో విధంగా లొంగదీసుకోవాలని చూస్తుంది. ఆ కుట్రలో భాగంగానే నా జీవితంలోకి ప్రవేశించింది మైసూర్ పాక్. చిన్నప్పుడు మా ఇంటిదగ్గర్లో ఓ కిరాణా షాపుండేది. ఈ సదరు మైసూర్ పాక్ లు అమ్మేవాడు. పావలాకొకటి. ఇహ మా ఇంట్లో జనం ఎగబడి కొనుక్కునేవాళ్లు. ఓసారలాగే మా అమ్మ ఆ డబ్బా పాక్ కొని తినమని కొంచెం నా చేతికిచ్చింది. దాన్ని బాహ్య స్వరూపాన్ని రకరకాలుగా విశ్లేషించి ఆ కొంచెం లో కుంచెం నోట్లో వేసుకున్నా. ఎబ్బే అస్సలు బాగనిపించలా. అదేమాట అమ్మతో చెబితే 'వద్దంటే మానెయ్, ఇటిచ్చేయ్' అని లాగేసుకుంది, కనీసం నన్ను అభినందించకుండానే! ఇహ అప్పట్లో చుట్టాలింటికి వేళ్ళామో నాకు చచ్చే చావు. వాళ్లేమో మరేమీ దొరకనట్టు ఈ మైసూర్ పాక్ నే పెడతారు. ముందు గొయ్యి వెనక నుయ్యి నా పరిస్థితి. తింటే నాకు పడదు, తినకపోతే వాళ్లకు పడదు.

ఇలా మైసూర్ పాక్ తోనే వేగలేక ఏడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన పుల్లారెడ్డి మిఠాయిలు రంగప్రవేశం చేసాయి జీవితంలోకి. అప్పట్లో దీపావళికి దసరాకి నాన్న పనిచేసేదగ్గర పుల్లారెడ్డీ స్వీట్సో, దద్దూస్ స్వీట్స్ ఇచ్చేవారు. ఓ డబ్బా మొత్తం అన్నమాట అందులో అన్ని రకాలు ఉంటాయ్ లడ్డూలు, కోవాలు, కాజాలు వగైరా వగైరా. ఐతే అందులో మేము 'రబ్బరు స్వీట్' అని పిలుచుకునే ఓ పదార్ధముండేది. పేరుకు తగట్టే దాన్ని తినాలంటే అలా ఓ పావుగంట నములుతూనే ఉండాలి. చూసారా ఎంత అన్యాయమో మిఠాయిలు అని చెప్పి ఇలాంటివి పెడతారా తప్పు కదూ.నేనైతే పడేద్దాం అన్నంతపని చేసేవాణ్ణి. ఇదే మాట నాన్నతో చెబితే 'ఛస్, నువ్వు తినకపోతే ఊకో' అని తిట్టేసేవారు. ఠాట్ ఈ మిఠాయిలతో చస్తే దోస్తీ కుదరదు అని తేలిపోయింది.
నా జీవితంలోని ఇంకో మాయదారి మిఠాయి లడ్డూ. అసలీ లడ్డూని ఎవడు కనిపెట్టాడోగాని వాడు దొరకాలి తొక్కుడులడ్డూ చేసినట్టు తొక్కిపడేస్తా. అరే! లడ్డూ ఇష్టం లేదురా మొర్రో అంటే వినరే. పైగా నేనసలు మనిషినేకాదన్నట్టు, ఫ్రెష్‌గా పంచమహా పాతకాలు చేసినవాడిలా చూస్తారు. బంధువులింటికి వెళ్లినపుడు ఆ పాక్‌ తోపాటు ఈ లడ్డూలు కూడా ఉండేవి. వాళ్లు పెడితే నే వద్దనేవాడిని, వాళ్లదోలా చూస్తే మా అమ్మ వచ్చి 'ఏందొనమ్మ ఏం తినడీపిలగాడు. ఎట్ల జెయ్యాల్నో ఏందో!' అనేది. సెంటీ డవిలాగులు. తరువాత ఇలాగే కొనసాగితే వియ్యాలవారి దగ్గ్రర కయ్యం ఐపోతుందేమోనని అప్పుడపుడూ లడ్డూపారాయణం జరిగేది. ప్రతి అమ్మాయికీ లడ్డూలాంటి భర్త కావాలట! ఆ పోలికేంటో నాకర్ధంకాదు.  వారి కోరికను మన్నించి తిరపతి లడ్డూ మాత్రమే అని ప్రకటించేశా- మావాళ్లు శాంతించారు.  పాపం నా బాధను చూసి ఆ తిరపతి వెంకన్న కూడా ఈ మధ్య లడ్డూ తినడం మానేశాడనుకోండి- అందుకే మునుపటంత బాగుండట్లా-అది వేరే సంగతి.

అసలీ స్వీట్స్  షేపులు కూడా సరిగా ఉండవ్. కావాలంటే ఆ జిలేబిని చూడండి. పైగా గోడమీద పోస్టర్ చూసి చొంగ కార్చుకునేవాడిలా దాన్లోంచి రసం. హైదరాబాద్లో ఉన్నన్నాళ్లు నా సంగతి తెలుసుకాబట్టి ఈ జిలేబీలను తిన్నా తినకున్నా ఏమనేవారుకాదు. ఎప్పుడైతే ఖరగ్‌పూర్ కొచ్చామో, హమ్మనాయ్నోయ్, మొదలయ్యాయి కష్టాలు. క్యాంపస్ లో  Tech-market అనుండేది - చిన్నసైజు షాపింగ్ ఏరియా అన్నమాట. దాంట్లో కొన్ని స్విట్-హాట్ బండ్లు. బజ్జీలు జిలేబీలు చేస్తారు. ఎపుడైనా ఫ్రెండ్స్ తో కలిసి అటువైపు వెళితే మరేం దొరకనట్టు జిలేబీలంటూ లొట్టలేసుకుంటు వెళ్ళెవాళ్లు. పక్కనే వంకాయ్ బజ్జీలనీ, ఆలూ వడలనీ ఎన్నున్నా పట్టించుకోరు. నేనేమో 'నాకొద్దు, ఇష్టంలేదు' అనంటే ముష్టివాడికన్నా హీనంగా చూసేవాళ్లు. అదేదో సినిమాలో వెంకీ చెప్పినట్టు ఆ చూపులో లక్ష బూతులెతుక్కోవచ్చు. కొన్నిరోజులు ప్రతిఘటించి, నీరసించి ఆపైన పాక్షికంగా తెల్లజెండా ఎగరేసా. జిలేబీ వేడిగా ఉంటేనే తింటా అది కూడా మాక్జిమమ్ ఒకటి అని. అప్పటికిగాని నా మీద సెటైర్లు ఆగేవి కావు.
కాని నేనూరుకుంటానా, సిక్కిం ట్రిప్ వెళ్ళినపుడు పరిచయమైందో అద్భుత హాట్ వంటకం. పేరు మోమో. చుసారా పేర్లోనో ఎంతటి టేస్టుందో. వేడి వేడి మోమోను సాస్‌లోనో, వాళ్లిచ్చే పచ్చడితోనో తింటె ఉంటది నా సామిరంగా.....అబ్బో కెవ్వు కేక. కాని ఈ స్వీటు ప్రేమికులకు ఇది నచ్చలేదు. హెందుకు నచ్చుతుంది వొళ్లంతా స్వీటు షుగరు పట్టిందిగా. అప్పుడు వాళ్లన్నారు 'నోనో- మోమో' అని. ఈసారి వాళ్లను వింత చూపు చూడటం నా వంతైంది.

పైగా ఈ స్వీటు బాగోతం ఇప్పుడు బజ్జులకెక్కింది. అబ్జర్వ్ చేస్తూనేవున్నా వారం రోజులనుండి ఒకటే తీపి పోస్టులు. వెన్న కాచిన నెయ్యితో చేసిన మిఠాయిలంట. ఇంటినుంది తెప్పించుకున్న మిఠాయిలంట.... ఠాఠ్! అసలీ పెపెంచకంలో మిఠాయి అనేదే లేకుండా చెయ్యాలి ముందు. అంతవరకూ నే శాంతించ.

ఎంత స్వీటు ద్వేషినైనా నేను మడిసినే, నాకు కళాపోసణుంది, నేనూ జన జీవనస్రవంతిలో భాగమే. పాలకోవాలన్నా, రస్‌మలై అన్నా, గులాబ్ జామ్ అన్నా నాకూ పేమే. అవి తప్ప మిగతా మిఠాయిలన్నీ రూపుమాపాలని ఉక్కు సంకల్పం. రండి నాతో చేయి కలపండి

భగవంతుడికి మోక్షం వుంటుందా ?

ముందుగా టపా శీర్షికకు అంతగా సంబంధంలేని ఓ విషయం మాట్లాడుకుందాం. సృష్టిరచన జరగకముందు, వివిధ మతాలనూ తత్వాలనూబట్టి, శూన్యమో దేవుడో ఉండేది (భగవంతుడికి లింగం లేదు గనక ఉండేది అంటే సమంజసమేనని అనుకుంటున్నా). దేవుడు ఆజ్ఞాపించగానే శూన్యంలోని శక్తి మార్పుచెంది ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చరాచర జగత్తుగా రూపుదాల్చింది. కొంచెం లోతుగా చూస్తే శక్తి మొదట పదార్ధంగా మారి ఆపైన పరమాణువుగా, అణువుగా, మూలకంగా... ఈ క్రమానుసారంగా ప్రాణిగా రూపాంతరం చెందింది. ప్రాణికి ఉండే 'బుద్ది' కారణంగా అది ఆలోచించగలదు. భౌతిక శాస్త్ర నియమం ప్రకారం దేన్నీకూడా ఏమీలేని శూన్యం నుండి సృష్టించలేము. శక్తిని సృష్టించలేము దాన్ని కేవలం ఒక స్వరూపం నుండి మరొక స్వరూపంలోకి మాత్రమే మార్చగలం. అంటే బుద్ది కూడా శక్తి స్వరూపమే అయ్యుండాలి అయితే నిర్గుణమైన శక్తి క్రమపద్దతిలో 'బుద్ది'గా మారిన తరువాత దానికి ఏదో ఒక గుణం చేకూరడం ఆశ్చర్యకరం. ఇప్పుడు మళ్లీ బుద్ది ఉన్న ప్రాణి దగ్గరికి వద్దాం. ప్రాణుల్లో వాటివాటి పరిమాణక్రమాన్ని అనుసరించి, అంటే ప్రాణుల్లో ఉత్కృష్టమైనవి మోక్షన్ని కోరుకుంటాయట. వాటి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షానికి మోక్షానికి మధ్య ఆత్మ/ప్రాణి సాగించే యాత్రే జనన మరణాలు అని అంటువుంటారు. మార్పుంటూలేని, స్వఛ్చమైన, నిర్మలమైన ఆ మోక్షం ఏమై వుండవచ్చు ? సృష్టిరచన జరిగేముందు ఉన్న శక్తి కావచ్చునా ? సృష్టిరచన ఉద్దేశ్యం మరొక సృష్టి అవసరంలేని శక్తి సహిత శూన్యంలోకి వెళ్లడమా ?

ఇక టపా శీర్షిక గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి హైందవ ధర్మంలో, బౌద్ధంలో మోక్షమనే జనన-మరణరహిత స్థితి ఉంటుంది. దేవుడి ఇఛ్చనుబట్టి, ప్రాణి పూర్వకర్మలనుబట్టి మోక్షస్థితి పొందటమా లేక మరోసారి జన్మనెత్తడమా నిర్ణయించబడుతుందట.  ఇస్లాం, క్రైస్తవంలో ఇటువంటిది లేదనుకుంటా. ఆ మతాల్లో దేవుడు ప్రాణులని సృష్టిస్తాడు సుకర్మలద్వారా ధర్మాచరణ చేసిన ప్రాణులకు ఉర్ద్వలోకాల్లో సుఖసంతోషాలను ఇస్తాడు. ఐతే ఈ అన్నీ ధర్మాలలో, మతాలలో దేవుడు నిరంతరం సృష్టిరచన చేస్తూనే ఉంటాడు. హైందవ ధర్మం తీసుకుంటే కొన్ని మహాయుగాల తరువాత ప్రళయంలో సృష్టి అంతా లయమౌతుంది ఆ తరువాత కొత్త సృష్టి మొదలౌతుంది(ట). మిగతా మతాలలో దేవుడనేవాడు ప్రాణులను సృష్టించడం నిరంతరం చేస్తూనే ఉంటాడనుకుంటున్నా. ఐతే సర్వజ్ఞుడైన దేవుడికి ప్రాణిని సృష్టించాల్సిన అవసరం ఏముంది ? తను తప్ప మరెవరూలేనపుడు ఎవరికి ఏం తెలియజేద్దామని సృష్టిని చేసాడు ? పైన చెప్పుకున్నట్టు దేవుడు నిరంతరం సృష్టిరచన చేయడానికి బద్దుడైతే అతను మోక్షప్రదాత ఎలా కాగలడు ? 
If He knows all and every thing why then there is a creation ?

If He is not free Himself, how can he free others ?

ShareThis